అలనాటి అపురూపాలు-140

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

కృష్ణుడిగా అలరించిన శాహు మోదక్:

పలు హిందీ, మరాఠీ సినిమాలలో నటించిన నటులు శాహు మోదక్. ఆయన తాను పోషించిన పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధులు. ఆయన ప్రధానంగా కృష్ణుడి పాత్రను 29 చిత్రాలలో ధరించారు.

ఆయన 25 ఏప్రిల్ 1918 నాడు అహ్మద్ నగర్ లోని ఓ మరాఠీ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. 11 మే 1993న మృతి చెందారు. వారి గురించి వారి శ్రీమతి ప్రతిభా మోదక్ ఏమంటున్నారో ఆవిడ మాటల్లోనే చదువుదాం.

***

సినిమాల్లోకి ప్రవేశం:

అది 1932. ఆ కాలం ఎలా ఉండేదో మీరు ఊహించవచ్చు. కృష్ణుడి బాల్యంపై భాల్జీ పెండార్కర్ గారు ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆ రోజుల్లో నేపథ్య గాయకులు లేరు. పాడగలిగే నటులనే ఎంచుకునేవారు. 12-13 ఏళ్ళ వయసు ఉండి, బాగా పాడగలిగి, చూడాడానికి ఆకట్టుకునేలా ఉండే పిల్లవాడి కోసం వారు వెతకసాగారు. రంగస్థలం మీద శివాజీ పాత్రలకి ప్రసిద్ధి చెందిన భావురావు దాతర్ – మోదక్ రూపం అచ్చు చిన్నప్పటి కృష్ణుడిలానే ఉంటుందనీ, కాకపోతే వారిది క్రైస్తవ కుటుంబామని నిర్మాతలకి చెప్పారట. అయితే వారి కుటుంబం ఆ పిల్లవాడిని సినిమాల్లోకి పంపుతుందో లేదోనని దాతర్ అనుమానం వ్యక్తం చేశారట, అయినా అడగడంలో తప్పులేదని అన్నారుట. ఓ రోజు నానాసాహెబ్ సర్పోత్‌దార్, భాల్జీ పెండార్కర్, ఇంకా దాదా సాహెబ్ తోర్నే – అహ్మద్‌నగర్ వెళ్ళారు.

మా అత్తమామలు విద్యావంతులు, విశాల హృదయులు. వారు ఆ ముగ్గురితో కూర్చుని చర్చించుకున్నారట. అప్పట్లో మా ఆయన నాలుగో తరగతి చదువుతున్నారట. బడి విరామ సమయంలో ఇంటికి వచ్చిన మావారు అతిథులను చూసి ఆశ్చర్యపోయారుట. మళ్ళీ బడికి వెళ్ళబోతుంటే మావగారు ఆయన్ని ఆగమన్నారట. సర్పోత్‌దార్, భాల్జీ పెండార్కర్, తోర్నే గార్లు – మావారిని ఏదైనా పాడి వినిపించమన్నారట. ఆయన దీనానాథ్ మంగేష్కర్ గారి పాటని పాడారుట. వాళ్ళకది నచ్చి, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. పూర్తిగా అర్థం కాకపోయినా, మావారు ఒప్పుకున్నారట.  ఆ రోజుల్లో సినిమాల్లో పని చేస్తే చెడిపోతారనే అభిప్రాయం వ్యాప్తిలో ఉండేది. అందుకని ఇంట్లో ఆడవాళ్ళు వద్దన్నారట. అయితే వచ్చినవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళని, సాధారణ వ్యక్తులు కారని మా మావగారు చెప్పారట. పిల్లవాడి చదువు పాడవకుండా చూస్తానని ఆయన చెప్పారట. చివరికి అందరూ ఒప్పుకున్నారు. ఆ సినిమా ‘శ్యామ్ సుందర్’ (1932).  ఆ సినిమా సిల్వర్ జుబిలీ జరుపుకున్న మొదటి టాకీగా పేరు తెచ్చుకుంది.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాకా, ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆయన రెండో సినిమా ‘అత్ఘత్‍కేచా రాజా’ (1933). దీనికి హిందీ సినా ‘ఆవారా షాహ్‌జాదా’ (1932) మూలం. ఈ సినిమాలో శాహు దేశంలోనే మొదటిసారిగా ద్విపాత్రభినయం చేసిన నటుడయ్యారు. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్ర వేసిన మొదటి నటుడు కూడా శాహు గారే. ఈ విషయాల గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించరు. అందుకే నేను ఆయన మీద ఓ నలభై నిముషాల డాక్యుమెంటరీ తీస్తున్నాను, దానివల్ల కనీసం తరువాతి తరాల వారైనా ఆయన గురించి తెలుసుకోగలుగుతారు. దానికి సుధీర్ గాడ్గిల్ దర్శకత్వం వహిస్తున్నారు. నేను రాసిన మా వారి జీవితచరిత్రను ఆయన అనువదించారు.

మీరు శాహు గారిని ఎప్పుడు ఎలా కలిసారు?

మాదో ప్రత్యేకమైన కథ. మావారి కథ కంటే ఆసక్తికరమైనది. నేను తొమ్మిదేళ్ళ పాటు జైనమత సన్యాసినిగా ఉన్నాను. అయిదేళ్ళ పాటు జైనమతాన్ని అధ్యయనం చేశాను. అయితే కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. కానీ ఒకసారి అలాంటివాటిల్లోకి వెడితే  బయటకు రావడం కష్టం.

ఒకసారి శాహు గారు మాకు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. చాలామందికి ఆయన నటుడిగానే తెలుసు కానీ, ఆయన స్వామి వివేకానందని తమ గురువుగా భావించేవారు. వివేకానంద పై ఎన్నో ప్రసంగాలు చేశారు. నాకు కూడా స్వామీజీ అంటే అభిమానం. శాహు గారి గొప్ప జ్యోతిష్యులు అని కూడా నాకు తెలిసింది. సన్యాసినులకు ఆశ్రమం బయటకు వెళ్ళడం చాలా కష్టం, అయినా ఎలాగోలా వెళ్ళి ఆయనను కలిశాను. ఆయన దూరం నుంచే నా చేయి చూసి, “అతి త్వరలో మీరు ఈ ఆశ్రమం వదిలేస్తారు” అని చెప్పారు.

ఈ విధంగా మేము ఒకరికొకరం పరిచయం అయ్యాం. తరువాత ఆయనో గొప్ప వ్యక్తి అని అర్థమయింది. పెళ్ళి చేసుకుని ఆధ్యాత్మిక పద్ధతిలో జీవించాలనుకున్నాం. శృంగారం కోసమో, పిల్లల కోసమో, లేదా కుటుంబాన్ని వృద్ధి చేయడం కోసమో పెళ్ళి చేసుకోలేదు. ఆయన నాకన్నా 20 ఏళ్ళు పెద్ద, కానీ ఆయన పాటించే యోగాభ్యాసాల వల్ల, ఆధ్యాత్మికత వల్ల 20 రోజుల కన్నా పెద్దగా కూడా అనిపించలేదు.

ఆయన క్రిస్టియన్. అయినా హిందూ దేవుళ్ళ పాత్రలు పోషించారు. కృష్ణుడి పాత్రను 29 సార్లు పోషించారు.

నిజానికి వారిది కొంకణాస్థ బ్రాహ్మణ కుటుంబం. మావారి ముత్తాత మతం మారారు. మనుషుల మధ్య ఎటువంటి వివక్ష చూపక, అందరిని మానవుల్లా చూసే మతాన్ని స్వీకరించాలనుకున్నారాయన. క్రైస్తవం అలాంటి మతం ఆయన భావించారు. కానీ నిజానికి వారు బ్రాహ్మణులు. భవిష్యత్తులో నేను జొరాస్ట్రియన్ మతానికి మారినా, నేను మార్వాడీలానే కొనసాగుతాను.

కృష్ణుడి పాత్ర అన్నిసార్లు పోషించాకా, ఆయన కృష్ణుడి మార్గం అనుసరించారా?

లేదు, ఆయన ఎవరినీ అనుసరించలేదు. వివేకానందుకుని గురువుగా భావించేవారెవరు ఇతరులను అనుసరిచరు. ఆయన తనని తాను ప్రపంచ పౌరుడిగా భావించుకునేవారు. ప్రస్తుతం నేను అలాగే అనుకుంటాను. జన్మతః నేను మార్వాడీని, జైన మతస్థురాలిని, క్రైస్తవుడిని వివాహం చేసుకున్న దాన్ని. ఇదో వింత మేళవింపులా అనిపిస్తుంది కదూ! అయితే నాకు నేను పెట్టుకునే లేబుల్ ఏంటంటే – నేను మనిషిని, మానవత నా మతం అని. మరేతర లేబుల్ నాకు వద్దు. అందుకే పూణే ప్రజలు నన్ను అమితంగా ఆదరించారు. నేను మొదటిసారిగా పూణే వచ్చినప్పుడు పది వాక్యాలు మరాఠీలో మాట్లాడలేకపోయేదాన్ని. ఇప్పుడు కనీసం గంట సేపు మరాఠీలో ఉపన్యసించగలను. నా మరాఠీ తియ్యగా ఉంటుందని జనాలు అంటారు. అందుకే ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చి పాతికేళ్ళయ్యింది.

పౌరాణిక, భక్తి సినిమాల మధ్య ఆయన ‘మాణూస్’ (1939) అనే సాంఘిక చిత్రంలో నటించారు. అది ఓ బోల్డ్ సబ్జెక్ట్. ఓ పోలీసు ఒక వేశ్యతో ప్రేమలో పడతాడు.

ఈ సినిమాని చార్లీ చాప్లిన్ కూడా చూశారు. ఆయన తన పది ఉత్తమ సినిమాలలో దీనిని ఒకటిగా భావిస్తారు. 1936లో వచ్చిన దేవదాసు సినిమాలో నాయకుడు ప్రేమలో విఫలమై, కృంగిపోయి, తన జీవితాన్ని చాలించాలనుకుంటాడు. దీనికి జవాబుగా వి. శాంతారామ్ ‘మాణుస్’ తీశారు.

ఈ సినిమాలో కూడా ప్రేమలో విఫలమయిన నాయకుడు తాగి, నది ఒడ్డుకు చేరతాడు. అప్పుడు ఒక శ్రేయోభిలాషి అతన్ని వారించి “నీవు మనిషివి. నిన్ను నీ తల్లి తొమ్మిది నెలలు కడుపులో మోసింది. ఆమె గురించి నీకు పట్టింపు లేదా? ఒక ఏడాది ప్రేమ కోసం నీ జీవితాన్ని బలిచేస్తావా? నువ్వు మనిషివి” అంటాడు. అప్పుడు నాయకుడు లేచి “నేను మనిషిని” అంటాడు.

తమ కాలానికి ఈ సబ్జెక్ట్‌ మరీ సాహసోపేతమైనదని అప్పటి ప్రేక్షకులు భావించారా?

అవును, ప్రేక్షకులు అలానే అనుకున్నారు. అయినా బాగా ఆదరించారు. 1942లో వచ్చిన ఆయన మరో సినిమా ‘పహిలి మంగళగౌర్’ ఇంకా సాహసోపేతమైనది. అందులో ఓ ముద్దు దృశ్యం ఉంది. ఈ సినిమాలో ఆయన మరదలిగా లతా మంగేష్కర్ నటించారు. స్నేహ్ ప్రభ ప్రధాన్ హీరోయిన్. అప్పట్లో ఈ జోడీ బాగా పేరు తెచ్చుకుంది.

మా పెళ్లయిన కొన్నేళ్ళకి ఓ సినిమా స్క్రీనింగ్‍కి వెళ్ళాము. ఆ ముద్దు దృశ్యం కెమెరా ట్రిక్ అని, నిజం కాదని స్నేహ్ ప్రభ ప్రధాన్ చెప్పారు. అది జరిగిపోయినదనీ, గతమనీ నేను పెద్దగా పట్టించుకోనని అన్నాను (నవ్వులు). ఆ సినిమాకు ముందు ఆయన సంత్ ధ్యానేశ్వర్ పాత్ర ధరించారు. మహారాష్ట్ర ప్రాంతమంతా ఆ సినిమాని విశేషంగా ఆదరించారు. ఒకసారి మేము నాటకకర్త మామా వరేర్కర్‌తో పాటుగా రైల్లో ప్రయాణిస్తున్నాం. ఉన్నట్టుండి వరేర్కర్ గారు మా వారితో “నువ్వు చంపేశావు” అన్నారు. మావారు విస్తుపోయారు, ఎందుకంటే ఆయనే చీమని కూడా చంపరు. “నువ్వు ధ్యానేశ్వర్‍ని చంపేశావు” అని వివరించారు వరేర్కర్. ‘పహిలి మంగళగౌర్’ చిత్రంలో ముద్దు సీన్‍ చేయడం ద్వారా ధ్యానేశ్వర్‍ని చంపేశారని ఆయన అభిప్రాయం. తాను ఓ నటుడినని నచ్చజెప్పాలని చూశారు శాహు గారు (నవ్వులు).

ఇలాంటిదే ఏదైనా మరో సంఘటన ఉందా?

మేము ఓ సారి ఒక చిన్న విమానంలో కోల్హాపూర్ వెడుతున్నాము.విమానం కుదుపులకి గురయింది. విమానంలో ఓ పోలీస్ ఇన్‍స్పెక్టరూ, ఆయన భార్యా కూడా ఉన్నారు. ఆవిడ చాలా భయపడి పోయి, ఆందోళనికి లోనయ్యింది. అప్పుడాయన “చూడు మనతో పాటు ఎవరున్నారో? ఆయన సంత్ ధ్యానేశ్వర్. పైగా గొప్ప జ్యోతిష్యుడు. విమానం కూలిపోతుందని తెలిస్తే ఆయన అసలు ఎక్కుతారా? అందుకని భయపడకు” అన్నారు. విమానం కిందకి దిగాకా, ఆవిడ మా ఆయనకి నమస్కరించింది.

ఒక ప్రేక్షకురాలిగా ఆయన ఏ సినిమాలలోని పాత్రలు మీకు ఇష్టం?

‘రంగాలయ రాత్రి ఆషా’ (1962) సినిమాలోని పాత్ర నాకు బాగా ఇష్టం. ఆ సినిమాలో ఆయన ఒక నాటకకర్తగా చేశారు. అరుణ్ సర్నాయక్ సహ నటులు. అదో చక్కని చిత్రం. అలాగే ‘మీ తులస్ తుఝ్యా ఆంగణి’ (1955) చిత్రంలో ఆయన పాత్ర నాకు నచ్చుతుంది. ఆయనకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – రామాయణంలో ఒక్క రావణుడి పాత్ర తప్ప – మిగతా ముఖ్యమైన పాత్రలు – రాముడు, లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు, మేఘదూత్, ఇంకా వాల్మీకి, తులసీదాసుల పాత్రలు పోషించారు. ఆయన రూపం రావణుడి పాత్రకి మాత్రం నప్పేది కాదు. అయితే ‘సతీ అహల్య’ అనే సినిమాలో ఆయన ఓ మహిళని బలాత్కరించే పాత్ర పోషించారు. మూడు రీళ్ళు చూడగానే నా తల తిరిగిపోయింది. అలాంటి పాత్ర ఆయన చేయడం మునుపెన్నడూ చూడలేదు. జనాలు కొడతారేమోనని అన్నాను. తెరపై ఆయనను అలా చూడలేకపోయాను. వాస్తవ జీవితంలో ఆయన తన సొంత భార్యని తాకాలన్నా కనీసం నాలుగు సార్లు ఆలోచిస్తారు (నవ్వులు). అయితే ఆ సినిమా అసలు విడుదల కాలేదు.

అది విడుదల కానందుకు మీరు సంతోషించి ఉంటారుగా?

అవును. నిజంగానే సంతోషించాను.

శాహు గారికి జ్యోతిష్యంలో అంతటి ప్రావీణ్యం ఎలా వచ్చింది?

ఆయనకి పదేళ్ళ వయసు ఉండగా, ఆయన జ్యోతిష్యంపై ‘యే హాత్ కీ రేఖాయేఁ క్యా కెహతీ హై’ అనే పుస్తకం చదివారట. ఆ తరువాత బొంబయిలో కులకర్ణి అనే ఆయనను కలిసి ఆయనకి ఫీజు చెల్లించి జ్యోతిష్యం నేర్చుకున్నారు.  ఆ తర్వాతే ఎంతో అధ్యయనం చేశారు. ఒక్కోసారి రోజులో  18 గంటలు అధ్యయనంలోనే ఉండేవారు.

తన కుమారుడు సంజయ్ దత్ తొలి సినిమా ‘రాకీ’ (1981) చూసేవరకు జీవించి ఉండరని నర్గిస్‍కి చెప్పారు. ఆ సినిమా ప్రీమియర్ షోకి నాలుగు రోజులు ముందు ఆమె చనిపోయారు. దానికన్నా ముందు 1979లో ఇందిరా గాంధీ తిరిగి ఎన్నికవుతారని చెప్పారు. గెలిచాకా, ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించినప్పుడు – గాంధీలతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆ అవార్డు వచ్చిందని కొంత మంది అన్నారు, కానీ అది నిజం కాదు. ఆయన తన మరణాన్ని కూడా వెల్లడించారు. 25 ఏప్రిల్ 1993 న 75 వ పుట్టినరోజు జరుపుకున్నాకా, మరో 18 రోజుల్లో తాను ఈ భౌతిక ప్రపంచాన్ని వీడనున్నానని చెప్పారు. అలా చెప్పిన 15 రోజులకి 11 మే న స్వర్గస్థులయ్యారు. ‘దేశంలో కెల్ల గొప్ప వ్యక్తులలో ఒకరిని నువ్వు పెళ్ళి చేసుకుంటావు’ అని టీనా మునిమ్‍తో చెప్పారు (ఆమె అనిల్ అంబానీని వివాహం చేసుకున్నారు).

నిజజీవితంలో ఆయన ఎలా ఉండేవారు?

చాలా ప్రశాంతంగా ఉండేవారు. నెమ్మదిగా మాట్లాడేవారు, అస్సలు చిరాకు పడేవారు కాదు. చాలా క్రమశిక్షణగా ఉండేవారు. శుభ్రతని బాగా విశ్వసించేవారు. శుభ్రతని ఎంత విశ్వసిస్తారనేదానిపైన ఒక పుస్తకమే రాయవచ్చు.  స్టూడియోలలో అన్ని సంవత్సరాలు పని చేసినా అక్కడి టాయ్‌లెట్లు వాడేవారు కాదు. ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్తే, రాత్రి ఎనిమింది గంటలకు ఇంటికి వచ్చాకే టాయ్‍లెట్‍కి వెళ్ళేవారు. కృష్ణుడి వేషంలో పంచె ధరించి ఉండి, మురికిగా ఉండే కమోడ్ ఉపయోగించడం సబబు కాదు అనేవారు. రోజంతా అతి కొద్ది మంచినీరు మాత్రమే తీసుకునేవారు.

ఇంట్లో మీతో సినిమాల గురించి మాట్లాడేవారా?

లేదు, అస్సలు సినిమాల గురించి మాట్లాడేవారు కాదు. మా ఇంటికి వచ్చేవారు కూడా సినిమాల గురించి మాట్లాడేవారు కాదు. ఇంట్లో అంతా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. అందులో ఆయనది లోతైన ప్రజ్ఞ. ఆయనకి మద్యం గాని, సిగరెట్లు గాని, మాంసాహారం గాని అలవాటు లేవు. నిజానికి ఓ మహిళతో కరచాలనం కూడా చేయరు.

ఆయన పేరిట ఇచ్చే మాణూస్ అవార్డుగురించి చెప్పండి.

1994లో మేము ఈ అవార్డు ప్రకటించినప్పుడు – ఆయన గొప్ప పాత్రలు ధరించినప్పటికీ ఆయనకీ ఏ అవార్డు దక్కలేదనీ అంటూ – అలాంటప్పుడు మేము ఈ అవార్డును స్థాపించడమేమిటని మీడియా వాళ్ళు అన్నారు. నేను వాళ్ళకి – “ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. తమకి ఏమీ దక్కకపోతే, వేరే ఎవరికీ దక్కకూడడనుకునే వారు ఒక రకం. మనకెలాగూ రాలేదు, ఎదుటివారి సంతోషం కోసం వారికైనా దక్కాలి అనుకునేవారు మరో రకం.” అని జవాబిచ్చాను.

***

శాహు గారి సినిమాల జాబితాను వికీపీడియాలో చూడవచ్చు.

లింక్:

https://en.wikipedia.org/wiki/Shahu_Modak#Filmography

***

మాణూస్ అవార్డు:

రంగత్ సంగత్ ప్రతిష్ఠాన్ సంస్థ – శాహు మోదక్‌తో పని చేసిన సీనియర్ కళాకారులకు ఈ పురస్కారం అందజేస్తోంది. శాహు ‘మాణూస్’ సినిమాలో పోలీస్ పాత్ర ధరించారు కాబట్టి ఈ పురస్కారాన్ని పోలీస్ కమీషనర్ చేతుల మీదుగా అందజేస్తారు. బేబీ శకుంతల, ఆశా కాలే, సులోచన వంటి వారు ఈ పురస్కారాన్ని పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here