Site icon Sanchika

అలనాటి అపురూపాలు-141

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

గాయని, నటి, సూపర్‌స్టార్ – నూర్జహాన్:

ఆమె సుందర వదనం ఒకప్పుడు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే నూర్జహాన్ ఆకర్షించే అందానికే గాక, అద్భుతమైన గానానికి కూడా ప్రసిద్ధి. ఆమె ఒకప్పుడు ఎందరినో అలరించారు.

ఉపఖండంలోని ఎన్నో థియేటర్లలో ఆమె సినిమాలు ఆడాయి, తాత్కాలిక థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. ఆమె అందమైన రూపం ఎందరికో ఆమెకి అభిమానులయ్యేలా చేసింది. బాలనటి నుంచి హీరోయిన్ వరకు ఎదిగిన నూర్జహాన్ ఎదుగుదలని చూసిన అభిమానులు ఉన్నారు. ఆమె నటనకీ, గానానికి పరవశులయ్యారు. 20వ శతాబ్దంలో మరేతర గాయకనటులు ఇంతటి అభిమానాన్ని సాధించలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ‘నైటింగేల్ ఆఫ్ పంజాబ్’ అని పిలవబడ్దారామె.

21 సెప్టెంబరు 1926న ఓ ప్రసిద్ధ సంగీతకారుల కుటుంబంలో అల్లా వసాయి పేరుతో నేటి పాకిస్తాన్ లోని కసూర్ పట్టణంలో జన్మించారామె. బాల్యం నుంచే సంగీతం పట్ల అసాధారణ ఆసక్తిని కనబరిచారు. ఏ జానపద పాటని విన్నా, సరిగ్గా అనుకరించి పాడగలిగేవారు. ఆమెలోని ప్రతిభని గుర్తించిన తల్లి – ఆమె అక్కతో కలిసి సంగీతం నేర్చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో కలకత్తా థియేటర్లకీ, నాటక సంస్థలకి, ఫిల్మ్ స్టూడియోలకి, కళాకారులకి, స్క్రిప్ట్ రచయితలకి, గీత రచయితలకీ, తదితరులకి కేంద్రంగా ఉండేది. అప్పటికే – ఆగా హష్ర్ కాశ్మీరీ, కిదర్ శర్మ, కె.ఎల్. సైగల్, కె.డి. మెహ్రా వంటి ఎందరో పంజాబీలు కలకత్తా చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకని 30వ దశకం మధ్యలో నూర్జహాన్ కుటుంబం – అక్కాచెల్లెళ్ళకి అవకాశాల కోసం – కలకత్తా చేరింది. ఒకరోజు రంగస్థలం మీద ఆడి పాడే అవకాశం దొరికింది. అక్కడ అల్లా వసాయి ప్రదర్శన నచ్చిన గులాం హైదర్ – కె.డి. మెహ్రా గారి తొలి పంజాబీ సినిమా ‘షీలా’ అలియాస్ ‘పిండ్ కీ కుధీ’లో బాలనటిగా నూర్జహాన్ అని పేరు పెట్టి అవకాశం ఇచ్చారు. 1935లో విడుదలయిన ఈ చిత్రం మొత్తం పంజాబ్ ప్రాంతమంతా ఘన విజయం సాధించింది. దాంతో పంజాబ్‍లో సినీ పరిశ్రమకి పునాది పడింది. నూర్జహాన్ పాడిన ‘లంగ్ ఆజా పటాన్ చనా’ పాట హిట్ అయింది.  30వ దశకం చివరికి వచ్చేసరికి పలు స్టూడియోలో లాహోర్ కేంద్రంగా పనిచేయడం ప్రారంభించాయి. వీటిలో పంచోలీ ఆర్ట్ పిక్చర్స్ ప్రసిద్ధం. గాయక నటులకు డిమాండు పెరగడంతో ఈ కుటుంబం 1937లో లాహోర్‍కి చేరింది.

అప్పటి ప్రసిద్ధ నిర్మాత దల్‍సుఖ్ ఎం. పంచోలి కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తూ ఉండగా, ఒకసారి బేబీ నూర్జహాన్ పాట విన్నారు. ఆ గానం నచ్చిన ఆయన వెంటనే తను తీస్తున్న పంజాబీ సినిమా ‘గుల్ బకావళి’ (1939)లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. బేబీ నూర్జహాన్ పాడిన ‘షాలా జవానియన్ మానె’ పాట పెద్ద హిట్ అయి ఆమెకు గుర్తింపు తెచ్చింది. దీని తరువాత వరుసగా పంచోలీ నిర్మించిన ‘యామ్లా జాట్’ (1940), ‘చౌదరి’ (1941) సినిమాల్లో నటించి చక్కని పాటలు పాడారు నూర్జహాన్. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన గులాం హైదర్‍కి కూడా గొప్ప పేరు వచ్చింది. ఆయన బేబీ నూర్జహాన్‌ని ఎంతో ప్రోత్సహించారు. 15 ఏళ్ళ వయస్సులో పంచోలీ గారి చారిత్రక ఉర్దూ చిత్రం ‘ఖాన్‌దాన్’ (1942)లో హీరోయిన్ నటించి తన పేరు ముందరి ‘బేబీ’ పదాన్ని తొలగించుకున్నారు నూర్జహాన్. ఈ సినిమా హిట్ కావడంతో నూర్జహాన్ పేరు దేశమంతటా మారుమోగింది.

దీంతో భారతదేశ సినీ పరిశ్రమలో ‘సింగింగ్ సూపర్‍స్టార్’గా ఆమె కెరీర్ మొదలయింది. ఆమె అద్భుతమైన స్వరం, గాయనిగా గొప్ప ప్రతిభ ఎందరో సంగీతదర్శకులను ఆకట్టుకున్నాయి. ఆమె పాటలు గొప్ప హిట్‌లు కావడంతో బొంబాయి నుంచి ఆహ్వానం వచ్చింది. 1943 నాటికి ఆమె బొంబాయి చేరారు. నాలుగేళ్ళ వ్యవధితో తోటివారందరినీ అధిగమించారు. దేశ సరిహద్దులకి ఇరువైపులా ఉన్న పాత తరం ప్రేక్షకులు ఇప్పటికీ – లాల్ హవేలీ, దోస్త్, జీనత్, బడీ మా, గావోం కీ గోరీ, మీర్జా సాహిబా వంటి ఆమె సినిమాలను, పాటలను గుర్తు చేసుకుంటారు.

ఆనాటి నటగాయకుడు సురేంద్ర నాథ్‌తో నటించిన ‘అన్‌మోల్ గఢీ’ (1946), దిలీప్ కుమార్‍తో నటించిన ‘జుగ్ను’ (1947) గొప్ప హిట్ సినిమాలు. ఈ రెండు సినిమాల్లోని పాటలు నేటికీ వినబడుతుంటాయి. అప్పటికింకా పేరు పొందని మహమ్మద్ రఫీతో నూర్జహాన్ ‘జహాన్ బదలా వఫా కా’ అనే యుగళగీతం ఆలపించారు. 1947లో దేశవిభజన జరిగిన సమయంలో ‘జుగ్ను’ దేశమంతటా ఆడుతోంది. అప్పట్లోనే దర్శకనిర్మాత షౌకత్ హుస్సేన్ రిజ్వీని వివాహం చేసుకున్న నూర్జహాన్ బొంబాయి విడిచి లాహోర్ వెళ్ళిపోయారు.

తాను జన్మించిన చోటుకే వెళ్ళదల్చినట్టు నూర్జహాన్ చేసిన ప్రకటన హిందీ చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేకెత్తించింది. దేశ విభజన అనంతరం ఆమె స్వంత ఊరు పాకిస్థాన్‌లో భాగమైంది. నూర్జహాన్ భారత్ వదిలి పాకిస్థాన్ వెళ్ళిపోయారు. అయితే ఆమె పాకిస్థాన్‌కి వెళ్ళిపోయాకా, ఆమె కెరీర్ గురించి సాధారణ భారతీయులకి తెలిసింది తక్కువ. ఇటీవలి కాలం వరకూ కూడా. తాజాగా యూట్యూబ్ ప్రసారం చేసిన ఒక కార్యక్రమం ద్వారా – పాకిస్థాన్‍లో ‘మేడమ్’గా ప్రసిద్ధులైన నూర్జహాన్ గురించి మరిన్ని విషయాలు తెలిసాయి. దీని ద్వారా ఆమె అద్భుతమైన ‘సింగింగ్ కెరీర్’ గురించి తెలిసింది.

పాకిస్థాన్ వెళ్ళిపోయాకా, 1951కి గాని ఆమె మరో సినిమాలో నటించలేకపోయారు. 1947కి ముందు దాకా సినీ నిర్మాణానికి కేంద్రంగా ఉన్న లాహోర్ లోని ప్రధాన స్టూడియోలను – దేశ విభజన గొడవలలో దగ్ధం చేశారు. తన భార్య నూర్జహాన్‍కి ఎన్నో హిట్‍లిచ్చిన దర్శకనిర్మాత షౌకత్ హుస్సేన్ రిజ్వీ – పాత షోరే స్టూడియో‌కి యజమానిగా మారారు. ఉత్తర ప్రదేశ్‍లో తనకి ఉన్న ఒక ఆస్తిని అమ్మి నూర్జహాన్ భర్తకి సహాయం చేశారట. పునర్నిర్మించిన స్టూడియోకి షాహనూర్ అని పేరు పెట్టి – తొలి చిత్రంగా – ఉర్దూ భాషలో – నూర్జహాన్ హీరోయిన్‍గా ‘నగీనా’ అనే చిత్రాన్ని ప్రారంభించారు.

అయితే మరో నిర్మాత, ఆయన భార్య నటి స్వర్ణలతల సలహా మేరకు – పంజాబీ సినిమా అయితే వ్యాపారపరంగా ప్రయోజనం ఉంటుందని భావించడంతో ‘నగీనా’ చిత్రాన్ని ఆపేసి Chan Wey ప్రారంభించారు. అయితే ఆయనకి పంజాబీ భాషపై పట్టు తక్కువ కావడంతో, నూర్జహాన్‌పై అధికంగా ఆధారపడ్డారు. దాంతో ఆమెకు దర్శకురాలి హోదా దక్కింది. Chan Wey బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి నూర్జహాన్‍ను -’జుగ్ను’ సంగీతదర్శకులు ఫెరోజ్ నిజామీని మళ్ళీ కలిపింది. వీరి కలయికలో ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. ‘తేరే ముఖ్‌డే దా కాలా కాలా’ పాట సరిహద్దుకు ఈ వైపు కూడా గొప్ప హిట్ అయింది.

నూర్జహాన్ విజయం తదుపరి ఉర్దూ చిత్రం ‘దుపట్టా’ (1952)తో కూడా కొనసాగింది. దీనికి సంగీతం ఫెరోజ్ నిజామీ అందించారు. సయ్యద్ సిబ్దియన్ ఫాజిల్ దర్శకత్వం వహించిన ‘దుపట్టా’ ఆ రోజుల్లో పాకిస్థాన్‌లో తీసిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరుపొందింది. భారతదేశంలో కూడా విడుదలై మంచి సమీక్షలు పొందింది. దీనిలోని ‘సావరియా, తోహే కోయీ పుకారే’ అనే పాట ఆధారంగా తమిళ సినిమా ‘పరాశక్తి’ (1952) లోని ‘పూనామలై’ అనే పాట రూపొందించారు. ఈ సినిమాలోని మరో హిట్ పాట ‘చాందినీ రాతేం’ ని 1990లలో రీమిక్స్ చేసి విడుదల చేయగా భారతదేశంలోని అన్ని ఛానెళ్ళలోనూ మారుమోగింది.

నూర్జహాన్‌ పాడిన కొన్ని ఉత్తమమైన పాటలన్నీ ఆమె మాతృభాష పంజాబీలోనివే. అతి స్పష్టంగా, తప్పులు దొర్లకుండా, సరైన ఉద్వేగాన్ని ఒలికిస్తూ పాడగలిగే ఆమె సామర్థ్యం, ముఖ్యంగా విషాద గీతాలను పాడడం ఆమెకు మంచి పేరు తెచ్చింది. పంజాబీ చిత్రం ‘పతే ఖాన్’ (1955) ఇందుకు నిదర్శనం.  ఈ సినిమాలోని ‘కల్లీ కల్లీ జాన్ దుఃఖ్’ పాటని విన్నప్పుడల్లా స్వరకర్త ఓ.పి. నయ్యర్‍కు దుఃఖం ముంచుకొచ్చేదట.

1956లో నూర్జహాన్ ఇద్దరు గొప్ప పాకిస్థానీ సంగీత దర్శకులతో మొదటిసారిగా జట్టుకట్టారు. ‘లఖ్త్-ఎ-జిగర్’ చిత్రానికి గాను జి.ఎ. ఛిస్తీ గారితోనూ, ‘ఇంతెజార్’ సినిమాకి గాను ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ గారితోనూ పని చేశారు. ‘లఖ్త్-ఎ-జిగర్’ చిత్రానికి మూలం గీతాబాలీ – బాల్‌రాజ్ సహానీ నటించిన ‘వచన్’ (1955) చిత్రం. ఈ సినిమాలో ‘ఓ ఖ్వాబ్ సుహానా టూఠ్ గయా’, ‘యా హాల్ దేఖ్లా మేరా’, జోలపాట ‘చందా కీ నగరీ సే’ అనే గొప్ప హిట్ పాటలున్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అయితే ‘వచన్’ చిత్రానికి కాపీగా వచ్చిన ‘హమీదా’ అనే చిత్రం హిట్ అయింది.

‘ఇంతెజార్’ చిత్రానికి మసూద్ పర్వేజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నూర్జహాన్ అంధగాయనిగా నటించారు. ఇది అతి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో చక్కని పాటలున్నాయి. ‘చాంద్ హసేఁ దునియా బసే’ అందులో ఒకటి. ‘ఆ భీ జా’, ‘ఓ జానేవాలే రే’, ‘జిస్ దిన్ సే పియా దిల్ లే గయే’ హిట్ అయిన మరికొన్ని పాటలు. ఈ సినిమాకి ఉత్తమ గాయనిగా ఆమెకు రాష్ట్రపతి పురస్కారం లభించింది.

నూర్జహాన్, దర్శకుడు మసూద్ పర్వేజ్ తిరిగి ‘కోయల్’ (1959) చిత్రంతో జతకట్టారు. చిన్నప్పుడు విడిపోయి పెద్దయ్యాక కలిసిన ప్రేమికుల కథ ఇది. నూర్జహాన్ నటిగా సాధించిన ఘన విజయాలలో ఈ చిత్రాన్ని చివరిదిగా పరిగణిస్తారు. ఈ సినిమాలో ఆమె ఓ శాస్త్రీయ సంగీతకళాకారుడి, గాయకుడి కుమార్తెగా గ్లామరస్ పాత్రని పోషించారు. కథ సాధారణమైనదే అయినా, సంగీతం వల్ల సినిమా ఆడింది.

‘ఇంతెజార్’ తరువాత మూడేళ్ళకి మళ్ళీ మసూద్ పర్వేజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు. సెమీ-క్లాసికల్ ట్రాక్ ఉన్న ఈ సినిమాలో నూర్జహన్ గాత్రం, గాన ప్రతిభ తప్ప చెప్పుకోదగ్గవి ఏమీ లేవు.

1959లో నూర్జహాన్ – తనకన్నా తొమ్మిదేళ్ళ చిన్నవాడైన వర్ధమాన దర్శకుడు ఎజాజ్ దుర్రానిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. దుర్రానీ ఇక పై నటించవద్దని కోరినందున నటన ఆపేశారు నూర్జహాన్. గాలిబ్ (1961) నటిగా ఆమె చివరి చిత్రం.

అయితే నటనా మానుకున్నా, పాటలు పాడడం ఆపలేదామె. ‘సల్మా’ (1960) చిత్రంలోని ‘జిందగీ హై కిసికా ఇంతెజార్’ పాట ద్వారా నేపథ్య గాయనిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె పోటీదార్లకు పాటకి 350 రూపాయలు చెల్లిస్తుండగా, నూర్జహాన్‌కు పాటకు 2000 రూపాయలు ముట్టేవి.

ఐతే ‘సల్మా’ నేపథ్యగాయనిగా నూర్జహాన్‌కు తొలి సినిమా కాదు. ‘పతే ఖాన్’ (1955) చిత్రంలో ‘ఓ జానే-ఎ-బహార్’, ‘దో రాహీ రాస్తా భూల్ గయే’  అనే పాటలు రికార్డు చేశారు. తన మాజీ భర్త షౌకత్ రిజ్వి దర్శకత్వంలోని ‘జానే-ఎ-బహార్’ (1958) చిత్రంలో తానే హీరోయిన్‍గా నటించవలసి ఉంది. కానీ ఆయనతో విడిపోయిన కారణంగా నటించలేదు, కానీ రషీద్ ఆత్రే సంగీత దర్శకత్వంలో తాను పాడిన ‘కైసా నసీబ్ లాయీ థీ’, ‘నా ఆంశూ బహే’ పాటలను వాడుకోనిచ్చారు.

నేపథ్యగాయనిగా నూర్జహాన్ తొలి రోజుల్లో రషీద్ ఆత్రే – మెహబూబ్ (1962), మోసేకర్ (1962), ఖైదీ (1962) – వంటి సినిమాలకు కొన్ని గొప్ప బాణీలను స్వరపరిచారు. దర్పణ్, షమీమ్ అరా నటించిన ఖైదీ (1962) ఆత్రే – నూర్జహాన్‍ల జోడీకి గొప్ప విజయాన్ని అందించింది. ఫైజ్ అహ్మద్ కవితనొక దానిని ఈ సినిమాలో ఉపయోగించారు. ఈ కవితకి మౌలిక బాణీని నూర్జహానే కూర్చారనీ, దానికి ముగ్ధులైన ఫైజ్, ఆ కవితని ఆమెకు కానుకగా ఇచ్చారని అంటారు.

వారణాసి నుంచి సింధ్ ప్రాంతానికి వలస వెళ్ళిన ఆసిఫ్ సిద్ధికి అనే ఛార్టర్‍డ్ ఎకౌంటెంట్ ఒక ముషాయిరాలో ఆ కవితని చదవమని ఫైజ్‍ని అడగగా, “భాయ్, ఇప్పుడు ఆ కవిత నాది కాదు, నూర్జహాన్‌ది” అన్నారట. ఈ విషయాన్ని ఆసిఫ్ రాసిన ‘Mani & I: Memoirs of a Banarasi Karachiite’ అనే పుస్తకంలో వెల్లడించారు.

1960లలో నూర్జహాన్ స్వరానికి షమీమ్ అరా నటన బాగా నప్పేది. ఖైదీ సినిమా కాకుండా – నూర్జహాన్ గళం, షమీమ్ అరా నటన – ఆగ్ కా దరియా (1966), లాఖోం మే ఏక్ (1967), సాల్‌గిరా (1969) వంటి చిత్రాలలో చూడవచ్చు.

లాఖోం మే ఏక్ (1967) సినిమా భారత పాకిస్థాన్ దేశాలకు చెందిన ప్రేమికుల కథ. దీనికి స్క్రీన్‍ప్లే మార్క్సిస్ట్ రచయిత, దర్శకనిర్మాత జియా సర్హదీ కూర్చారు. తరువాతి కాలంలో రాజ్‌కపూర్ తీసిన ‘హెన్నా’కి ఇది ప్రేరణ అని అంటారు. ఈ సినిమాకి నిసార్ బాజ్మీ కూర్చిన సంగీతం అదనపు ఆకర్షణ.

భారతదేశంలో బి-గ్రేడ్ సినిమాలు చేస్తున్న నిసార్ బాజ్మీకి సరిహద్దు అవతల మాత్రం చక్కని సినిమాలే దొరికాయి. నూర్జహాన్ – ఆయన బాణీలకి ప్రాణం పోసి – ఆయనను ఎంతో ప్రోత్సహించారు. ‘లాఖోం మే ఏక్’ సినిమాలో ప్రతీ పాట ఆణిముత్యమే. నూర్జహాన్ ఒక భజన్ ‘మన్ మందిర్ కే దేవతా’ పాడారు, దీన్ని రేడియో పాకిస్థాన్ నిషేధించింది.

1970లు వచ్చేసరికి పాకిస్తాన్ ఉర్దూ సినిమాలు తగ్గి పంజాబీ సినిమాల హవా మొదలైంది. నూర్జహాన్‌ తన భర్త ఎజాజ్ దుర్రానీ హీరోగా, నాయికగా ఫిర్‌దౌస్ నటించిన ‘హీర్ రాంఝా’ చిత్రానికి పాడారు. ఈ సినిమాలో ఆమె పాడడం వెనుక ఒక కథ ఉంది అని అంటారు. ఎయ్‌జాజ్ గుల్ రాసిన ‘Mallika-e-Tarannum Noorjehan: The Melody Queen’ అనే పుస్తకంలో వెల్లడించిన ప్రకారం – దుర్రానీ  ఫిర్‌దౌస్‍తో సంబంధం పెట్టుకున్నారట, ఆ విషయం తెలిసి తాను పాడనని అన్నారట నూర్జహాన్. అప్పుడు స్వరకర్త ఖుర్దీద్ అన్వర్ – నూర్జహాన్ పోటీదారు అయిన ‘మాలా’ని పాడడానికి పిలిచారట. కానీ రికార్డింగ్ మొదటిరోజే నూర్జహాన్ వచ్చి పాడేసి వెళ్ళిపోయారట.

1970ల చివర్లో, 1980 ప్రారంభం నుంచి పాకిస్థానీ సినిమాలో పంజాబీ యాక్షన్ సినిమాలదే రాజ్యం అయింది. ఇలాంటి చాలా సినిమాల్లో సుల్తాన్ రాహి, అంజుమన్, ముస్తాఫా ఖురేషీ లాంటి వారు ప్రధానంగా నటించేవారు. రషీద్ ఆత్రే కుమారుడు వజహత్ సంగీతం అందించేవారు. ఈ సినిమాల్లో కూడా నూర్జహాన్ కొన్ని పాటలు పాడారు. అది ఆమె కెరీర్ చరమ దశ ఆరంభంలోని పాటలు. అయినా ఆమె గొంతులోని మార్దవం తగ్గలేదు. ఈ సమయంలో కూడా కొన్ని మంచి బాణీలకి పాడారామె. ఉదాహరణ ‘షేర్ ఖాన్’ (1981) సినిమా.

‘సఖీ బాద్‌షా’ (1996) అనే చిత్రంలో ‘కి దామ్ దా భరోసా యార్’ అనే పంజాబీ పాట పాడడంతో నూర్జహాన్ సినీ గాయనిగా తన కెరీర్ ముగించారు. పాకిస్థాన్‍లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అయితే దేశ విభజన అనంతరం ఆమె పాకిస్థాన్‌కి వెళ్ళిపోవడం వల్ల ఎంతో కోల్పోయారు అని కొందరంటారు. భారతదేశంలో ఉండి ఉంటే మరిన్ని వైవిధ్యభరితమైన పాటలను – తనని తాను ఉర్దూ, పంజాబీలకే పరిమితం కాకుండా – పాడగలిగి ఉండేవారని కొందరి అభిప్రాయం.

అయితే భారతీయ సినీ సంగీతానికి లతా మంగేష్కర్ సేవలందించినట్టే, పాకిస్థాన్ సినీ సంగీతానికి నూర్జహాన్ సేవ చేశారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే సరిహద్దులకి ఇరువైపులా ఆమెకు అభిమానులున్నారనేది కాదనలేని వాస్తవం. పాకిస్థాన్‌కి వెళ్ళిపోయాక, నూర్జహాన్ తిరిగి భారత్ మొదటిసారిగా దర్శించినది 1982లో. భారతీయ సినీ పరిశ్రమ 50 ఏళ్ళ వేడుకలో భాగం పంచుకునేందుకు వచ్చారామె. అయితే నూర్జహాన్ విషయంలో వయసు తప్ప, ఏమీ మారలేదు. ఆమె సంజ్ఞలు, హావభావాలు టీనేజ్ స్టార్ లానే ఉన్నాయి. బొంబాయి లోని తాజ్‍మహల్ హోటల్ లో ఫోటోగ్రాఫర్లతో మాట్లాడుతూ – “నాకు తెలుసు. 35 ఏళ్ళుగా మీ అభిమానం చెక్కుచెదరలేదు. నా మీద ప్రేమాభిమానాలు మారలేదు” అన్నారు.

మన దేశం వచ్చినప్పుడు ఓ రాణికి లభించే స్వాగత సత్కారాలు ఆమెకు లభించాయి. లాహోర్ విమానాశ్రయంలో బయలుదేరినప్పటి నుంచి బొంబాయి సహారా విమానాశ్రయంలో దిగేంత వరకు, ఆపై అమితమైన ఆదరణ చూపారు. 1947లో పాకిస్థాన్ వెళ్ళిపోయిన 35 ఏళ్ళకు ఇదే ఇండియా రావడం! అయినా అభిమానుల ప్రేమ తగ్గలేదు. బాలనటిగా ప్రస్థానం మొదలుపెట్టి హీరోయిన్‍గా, గాయనని ఎదిగిన ఆమెను అపురూపంగా చూసుకున్నారు.

“పాకిస్థాన్‍లో మంచి గాయనీమణులు లేరని కాదు, కానీ నూర్జహాన్‍లో ఓ అద్భుతమైన లక్షణం ఉంది. చక్కని గాత్రంతో పాటు మంచి అభినయం కూడా! అదే ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది” అన్నారు సర్దార్ అఖ్తర్. అయితే ఆమె వైవాహిక జీవితం గురించి, దర్శకులకు దగ్గర కావడం గురించి ఎన్నో రకాల అపవాదులున్నాయి.

నూర్జహాన్ తన కెరీర్‍నే తానే పాడుచేసుకుందని వ్యాఖ్యానించే వారూ ఉన్నారు. “ఇతర గాయనీమణులు ఉన్నారు. కానీ వాళ్ళు బహిరంగంగా వచ్చి పాడేవారు కాదు. అలాంటప్పుడు ఏ నిర్మాత మాత్రం నూర్జహాన్‍ని కాదని కొత్త గాయనిని తీసుకునే సాహసం చేస్తాడు?” అన్నారు నౌషాద్.

నూర్జహాన్‍ మీద ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. లాహోర్ లోని ఒక మతపరమైన పాఠశాల అధ్యక్షుడు ‘దైవదూషణ’ నేరం మీద ఆమె పై డిక్రీ విడుదల చేశాడు. తన మాటలని వక్రీకరించాని చెబుతూ, అందరూ తమ వృత్తినే దైవంగా భావించాలని చెబుతూ ఆ వివాదానికి ముగింపు పలికారామె.

దిలీప్ కుమార్, సైరా బాను, సర్దార్ అఖ్తర్, ఆమె భర్త, దర్శకుడు మెహబూబ్ ఖాన్, ప్రాణ్, లతా మంగేష్కర్ తదితరులంతా నూర్జహాన్ మిత్రులే.

ఇండియాకి వస్తున్నప్పుడు లాహోర్ విమానాశ్రయంలో జరిగిన ఓ వివాదాన్ని – బొంబాయిలో జరిగిన ఓ విలేఖరుల సమావేశంలో ఓ పాత్రికేయుడు ప్రస్తావించగా – నూర్జహాన్ – అక్కడ ఏం జరిగిందో వివరించి, తనకీ ప్రయాణం ఎంత ముఖ్యమో తెలిపి వచ్చాననీ, తర్వాత మీరు ఇంకెన్నడూ నన్ను వెళ్ళనివ్వకపోయినా పర్వాలేదు, ఈ దఫా పంపమని అక్కడి అధికారులను వేడుకున్నానని – కళ్ళలో నీళ్ళతో చెప్పారు. అక్కడున్న పాత్రికేయులంతా చలించిపోయారు.

అలాగే తన వ్యక్తిగత సమావేశాలు, బొంబాయి నగర పర్యటన అన్నీ అత్యంత ఆసక్తికరంగా సాగాయి. చందన్‍వాడి సెమెటరీకి వెళ్ళి, నర్గీస్‍కి, మెహబూబ్ ఖాన్‌ని నివాళులు అర్పించారు. పదిహేను రోజుల పర్యటన అనంతరం భారమైన మనసుతో ఎన్నో అనుభూతులను మోసుకుంటూ తిరిగివెళ్లారు.

1986లో అమెరికా పర్యటన సందర్భంగా నూర్జహాన్ గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆమె కూతురు షాజియా హసన్ వెల్లడించిన ప్రకారం ఆమె చివరి దశలో మూత్రపిండాల వ్యాధితో బాధపడ్డారు. డయాలిసిస్ చేయించాల్సి వచ్చిందని తెలిపారు. 2000 సంవత్సరంలో నూర్జహాన్ అనారోగ్య కారణాల వల్ల కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పటల్‍లో చేరారు. 23 డిసెంబర్ 2000 నాటి రాత్రి (27వ రమదాన్ నాడు) ఆమె హృద్రోగ్రంతో చనిపోయారు. జామియా మస్జిద్ సుల్తాన్ లో ఆమె అంత్యక్రియలకు దాదాపు 40,000 మంది హాజరయ్యారు. ఆమె సమాధి కరాచీ లోని గిజ్రీ శ్మశానంలో ఉంది. అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో లాహోర్‍లో జరిపిస్తామన్నా, ఆమె కుమార్తెలు వద్దని – కరాచీలోనే జరిపించారు. ఆమె మృతి అనంతరం – “గత 53 ఏళ్ళుగా భారత్ – పాకిస్థాన్‌‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నా – సాంస్కృతిక వారసత్వం ఉమ్మడి వారధిగా ఉండేది. నూర్జహాన్ అటువంటి వంతెన వంటివారు. ఇప్పుడది బీటలు వారింది” అన్నారు ప్రముఖ కవి జావేద్ అఖ్తర్.

తాను ఆమెతో యుగళగీతాలు పాడాలని ఆశించేవాడని మహమ్మద్ రఫీ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆశా బోస్లే మాట్లాడుతూ – “నూర్జహాన్ నా అభిమాన గాయనీమణుల్లో ఒకరు. ఆమె గజళ్ళు విన్నప్పుడు అవెంత గొప్పవో అర్థమయ్యేవి. మరో మహమ్మద్ రఫీ, మరో కిషోర్ కుమార్ రానట్టే మరో నూర్జహాన్ రాదు” అని అన్నారు.

మరణం లేని కళాకారులలో నూర్జహాన్ ఒకరు. తన మధురమైన గీతాల ద్వారా ఆమె నేటికీ సజీవంగానే ఉన్నారు.

Exit mobile version