Site icon Sanchika

అలనాటి అపురూపాలు-142

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఉత్తమ దర్శకనిర్మాత మహబూబ్ ఖాన్:

మహబూబ్ ఖాన్ పూర్తి పేరు మహబూబ్ ఖాన్ రంజాన్ ఖాన్. ఆయన ఒకప్పటి బరోడా సంస్థానంలోని గందేవి తాలూకాలోని బిలిమోరాలో 9 సెప్టెంబరు 1907 నాడు జన్మించారు. తక్కువగా చదువుకున్నా, జీవితంలో విశేషంగా రాణించి, భారతదేశపు గొప్ప దర్శకనిర్మాతలలో ఒకరయ్యారు.

భారతీయ సినీ దర్శకనిర్మాతలలో మహబూబ్ ఖాన్ ఒక దిగ్గజం వంటి వారు. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం ‘మదర్ ఇండియా’ (1957). ఆయన ‘మహబూబ్ ప్రొడక్షన్స్’ పేరిట సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ పిమ్మట బొంబాయిలోని బాంద్రాలో ‘మహబూబ్ స్టూడియోస్’ స్థాపించారు. ఆయన బందిపోటు దొంగల నేపథ్యంలో ‘ఔరత్’ (1940) చిత్రాన్ని, ‘మదర్ ఇండియా’ అనే సాంఘిక చిత్రాన్ని, రొమాంటిక్ చిత్రం ‘అందాజ్’ (1949), సూపర్ హిట్ చిత్రం ‘ఆన్’ (1951), మెలోడ్రామా ‘అమర్’ (1954) – తదితర చిత్రాలను నిర్మించారు. ఆయన రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఫాతిమాకి విడాకులు ఇచ్చి, 1942లో అప్పటి ప్రసిద్ధ నటి సర్దార్ అఖ్తర్‍ (1915-1986)ని పెళ్ళి చేసుకున్నారు.

మహబూబ్ ఖాన్

మహబూబ్ ఖాన్ తొలుత నటుడు అవుదామని పరిశ్రమలో ప్రవేశించారు. జూనియర్ ఆర్టిస్టులలో ఒకరిగా ఉండేవారు. దైవం అంటే భక్తి కలిగిన యువ మహబూబ్ ఖాన్‍ ప్రవర్తన నచ్చి, ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ మేనేజర్ ఆర్.జి. తోర్నే – ఆయనకి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని భావించారు. అప్పటికే మూడేళ్ళుగా పరిశ్రమలో ఉన్నా, మహబూబ్ ఖాన్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ‘షిరీన్ ఖుస్రూ’ అనే సినిమా ఆయన జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చేసింది. ధరమ్‌పూర్ మహారాజా పాలస్ బయట ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇతర జూనియర్లతో పాటుగా గుర్రం ఎక్కి కెమెరా వైపు పరిగెత్తించే సీన్ అది. వాళ్ళలో కెమెరా ముందు ఒకరు గెంతి, గుర్రం మీద ఎక్కి, గుర్రాన్ని పరిగెత్తించే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. మహబూబ్ ఈ దృశ్యాన్ని బాగా చేయగలరని దర్శకులు ఆర్.ఎస్. చౌదరి భావించారు. అయితే ఎంచుకున్న మహరాజా వారి గుర్రాలలో ఒకటి దూకుడుగా ఉంది, చిరాకుగా ఉంది. మీద ఎవరు ఎక్కితా తోసి పడేస్తోంది. మహబూబ్ దాన్ని తెలివిగా అదుపు చేసి, ఎక్కి, చక్కని హావభావాలతో ఆ షాట్ ఓకే అయ్యేలా చేశారట. చాలా ఏళ్ళ తరువాత ఆ సీన్ గురించి ఓ చోట రాస్తూ – ‘అల్లా దయవల్ల, గుర్రం సహకారం వల్ల తనకి తొలి క్లోజప్ వచ్చింద’ని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకి రషెస్ చూసిన అర్దేషిర్ ఇరానీకి ఈ షాట్ బాగా నచ్చి, చేసినది ఎవరని అడిగారట. తమ కుర్రాడే అని తెలిసాకా, ఆ పెద్దాయన మహబూబ్‍‍ని పిలిచి అభినందించి, జీతం 10 రూపాయలు పెంచారట. దీంతో మహబూబ్‍కి తొలి గుర్తింపు లభించింది. మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేసింది.

ఎడమ నుండి కుడికి – రఫీ, గీత రచయిత భరత్ వ్యాస్, నౌషాద్, మహబూబ్ ఖాన్

1931లో అర్దేషిర్ ఇరానీ ‘సాగర్ మూవీటోన్’ అనే సంస్థను చిమన్‌లాల్ బి.దేశాయ్, డా. అంబాలాల్ పటేల్‍ గార్లతో కలిసి ఏర్పాటు చేశారు. ఇది ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీకి అనుబంధ సంస్థ. కొత్త సంస్థలో మహబూబ్ ఖాన్‌కు ‘హెడ్ ఆఫ్ ప్రొడక్షన్స్’ హోదా లభించింది. అదే ఏడాది ఈ సంస్థ తమ తొలి టాకీ సినిమా ‘రొమాంటిక్ ప్రిన్స్’ విడుదల చేసింది. ఈ సినిమాలో మాస్టర్ విఠల్, జుబేదా నాయికానాయకులుగా నటించారు. ప్రఫుల్ల ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహబూబ్‍కి తొలిసారిగా మాట్లాడే పాత్ర లభించింది. జుబేదా తమ్ముడిగా నటించిన ఈ పాత్రలో ఆయన తరచూ విలన్ యాకూబ్ చేతిలో తన్నులు తింటారు. అయితే సాగర్ మూవీటోన్ వారి ‘Vengeance is Mine’ సినిమా ద్వారా మహబూబ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ సబితాదేవికి తండ్రిగా పోషించిన పాత్రలో ఆయన నటనని మెచ్చిన యాజమాన్యం ఆయన జీతం మరో పది రూపాయలు పెంచింది. జద్దన్‌బాయ్, యాకూబ్‍లతో నటించిన ‘నాచ్‌వాలీ’ చిత్రంలో ఆయన నటనని ఆయనని మరింత ముందుకు నడిపింది. అయితే తాను కోరుకున్న ‘హీరో’ పాత్ర దక్కడానికి ఆయన ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

1931లో అర్దేషిర్ ఇరానీ దేశపు తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ తీస్తున్నప్పుడు హీరోగా మొదట అనుకున్నది మహబూబ్ ఖాన్ గారినే. కొన్ని దుస్తులు కూడా కుట్టించారు. కానీ ఉన్నట్టుండి ప్రాధాన్యతలు మారి ఆ పాత్రకు మూకీ సూపర్ స్టార్ మాస్టర్ విఠల్ ఎంపికయ్యారు. ఎంతో బాధ కలిగినా, మహబూబ్ ఖాన్ సంయమనం పాటించారు. సాగర్ మూవీటోన్ వారు తీసిన ‘Lure of the City’లో కూడా ఈ హీరో పాత్ర దక్కినట్టే దక్కి దూరమైంది. ఆ పాత్ర కొత్త నటుడు మోతీలాల్‍కి దక్కింది.

నౌషాద్, దిలీప్ కుమార్, మహబూబ్ ఖాన్, ప్రేమ్‍నాథ్

1931 నుండి 1935 మధ్య హీరో అయ్యేందుకు ఎంతగానో ప్రయత్నించారు మహబూబ్. కానీ అదృష్టం ఆయన వెంట లేదు. అందుకు కారణాలు కూడా ఆయన గ్రహించారు. హీరో కావాలన్న తన చిన్ననాటి కల నెరవేరకపోవచ్చని భావించారు. నటనలో కొనసాగితే, సహాయక పాత్రలు మాత్రమే దక్కుతాయని అనుకున్నారు. అందుకని సమయం వృథా చేయకుండా, కెమెరా వెనక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.  తన మిత్రులు కెమెరామాన్ ఫరేదూన్ ఇరానీ, ఇంకా లాబ్ అసిస్టెంట్ గంగాధర్ నాగ్వేకర్‍ల సహాయంతో – ఒక స్క్రిప్ట్ రూపొందించారు. అది పూర్తి కాగానే, కథ చెప్పేందుకు సాగర్ మూవీటోన్ యజమాని డా. అంబాలాల్ పటేల్ అపాయింట్‍మెంట్ అడిగారు. అయితే అది అంత సులువుగా లభించలేదు, ఎన్నోసార్లు అపాయింట్‍మెంట్ రద్దు అయ్యాకా, చివరగా పటేల్ – మహబూబ్ ఖాన్ స్క్రిప్ట్ విన్నారు. కథాంశం ఆయనకి నచ్చింది, కానీ సినిమాకి తానే దర్శకత్వం వహించాలనే మహబూబ్ కోరికని ఆయన అంగీకరించలేదు. ఇంత భారీ బడ్జెట్ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు ఒక జూనియర్ ఆర్టిస్ట్‌కి, అందునా దర్శకత్వంలో అనుభవం లేని వ్యక్తికి అప్పజెప్పడమా అని సంశయించారాయన. పైగా మహబూబ్‌ అంతకుముందు ఏ దర్శకుడికి సహాయకుడిగా కూడా లేరాయె.

ఆ సమయంలోనే మహబూబ్ ఖాన్ స్నేహితుడు కెమెరామాన్ ఫరేదూన్ ఇరానీ ముందుకొచ్చారు. తన మిత్రుడికి ఒక అవకాశం ఇవ్వమని, సినిమాకి పూర్తి న్యాయం చేస్తాడన్న నమ్మకం తనకుందని పటేల్ గారిని కోరారు. “మహబూబ్‍తో కలిసి నేను మూడు రోజులు షూట్ చేస్తాను. మా ఫుటేజ్ మీకు నచ్చకపోతే ఆపేస్తాము. ఆ నష్టాన్ని కూడా మేమే భరిస్తాం” అన్నారు. కెమెరామాన్‍గా ఫరేదూన్ ఇరానీ సత్తాపై, సినిమాపై ఆయన అవగాహన గురించి ఎవరికీ సందేహం లేదు. చివరికి సాగర్ మూవీటోన్ యజమాని అంగీకరించారు.

దర్శకులు – కె. అసిఫ్, బి.ఆర్. చోప్రా, మహబూబ్ ఖాన్, రాజ్ కపూర్, బిమల్ రాయ్

మహబూబ్, ఇరానీ కలిసి పని చేసి మూడు రోజుల తర్వాత – సాగర్ మూవీటోన్ యాజమాన్యానికి – తాము తీసిన ఫిల్మ్ రషెస్ చూపించారు. వాళ్ళకది అద్భుతంగా నచ్చేసింది. మొదటి ప్రయత్నంలో మహబూబ్ వారిని అమితంగా ఆకట్టుకున్నారు. ఇక అక్కడ్నించి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

1935లో దర్శకుడిగా ఆయన రంగప్రవేశం చేశారు. తొలి సినిమా కాస్ట్యూమ్ డ్రామా అయిన ‘Al Hilal’ (అల్లా తీర్పు). ఇది ఒట్టోమన్ సామ్రాజ్య నేపథ్యంలో తీసిన చిత్రం. సీజర్ నేతృత్వంలోని (పాత్ర పోషణ పాండే) రోమన్ సైన్యం ముస్లిం రాజ్యాలపై దాడి చేస్తుంది. సుల్తాన్ (అసూజీ) కుమారుడు జియాద్ (కుమార్) శత్రుసైన్యానికి చిక్కుతాడు. రోమన్ యువరాణి రహిల్ (ఇందిర) జియాద్‌ ప్రేమలో పడుతుంది. అతన్ని కాపాడవలసిందిగా లైలా (సితారా దేవి) అనే ముస్లిం మహిళను కోరుతుంది. యువరాణి తన రక్తంతో రాసిన ఒక సందేశాన్ని జియాద్‌కు రహస్యంగా అందజేస్తుంది లైలా. జియాద్ తప్పించుకోవడం ఓ గొప్ప దృశ్యం. ఈ సినిమాకి హాలీవుడ్ డైరక్టర్ సిసిల్ బి. డిమిల్లే తీసిన The Sign of the Cross (1932) ఆధారం అని అంటారు. కథక్ నృత్యకారిణిగా ప్రసిద్ధి చెందిన సితారాదేవి ఈ కథలో నాయిక. ఈ సినిమా ముహూర్తం షాట్‍ని ఇంపీరియల్ స్టూడియోలో ఆమె పైనే తీశారు. ఈ సినిమాలో అప్పటి ప్రసిద్ధ నటీనటులు – కుమార్, ఇందిర, యాకూబ్ తదితరులున్నారు. తర్వాతి కాలంలో పెద్ద హీరోయిన్ అయిన సితారా దేవి 1944లో కె. అసిఫ్‍ను పెళ్ళి చేసుకున్నారు.

***

బొంబాయి వచ్చిన తొలిరోజుల్లో మహబూబ్ ఖాన్ పనల్లా ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ (తరువాతి కాలంలో జ్యోతి స్టూడియోస్‍గా మారింది) గేట్ల వద్ద తచ్చాడడమే. ఏ రోజు కా రోజు అక్కడి వాచ్‌మన్ బెహ్‌రామ్ షా తనని లోపలికి పంపుతాడేమోనని ఆశ పడడం. ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేశాకా, ఓ రోజు లోపలికి వెళ్ళే అవకాశం లభించింది. ఆయన పట్టుదలకి మెచ్చిన ఇస్మాయిల్ జీవా గారు – మహబూబ్ ఖాన్‍ని తీసుకువెళ్ళి తమ యజమాని అర్దేషిర్ ఇరానీ ముందు నిలిపారు. మహబూబ్ సంతోషం పట్టలేకపోయారు. ఆయనకి కావల్సింది అదే.

భారీ ఆకారం కలిగిన అర్దేషిర్ ఆ కుర్రాడిని బెదరగొట్టాలని చూశారు. “మీ గ్రామానికి వెళ్ళిపో, ఏదైనా పని చేసుకో. మీ నాన్నతో కలిసి పొలం పని చేసుకో. ఇక్కడ నీ సమయం వృథా చేసుకోవద్దు” అని గట్టిగా చెప్పారు. మహబూబ్ సమాధానం చెప్పేలోపు – దగ్గరిలోని మసీదు నుంచి ప్రార్థన కోసం ఆజాన్ పిలుపు వినిపించింది. “ప్రార్థన చేసుకుని వస్తాను” అని చెప్పి అక్కడ్నించి గార్డ్ కాబిన్ వద్దకు వెళ్ళారు మహబూబ్ ఖాన్. ఆగ్రహానికి లోనవడానికి బదులు, మహబూబ్ ఖాన్ వైఖరి నచ్చిన అర్దేషిర్ – అతన్ని తన కంపెనీలోని జూనియర్ ఆర్టిస్టులలో ఒకరిగా చేర్చుకోమని చెప్పారు.

అది ప్రారంభం. ఎట్టకేలకు మహబూబ్ స్టూడియోలోకి ప్రవేశించగలిగారు. నెలకి 30 రూపాయల జీతంలో ఫిల్మ్ కంపెనీ ఉద్యోగి అయ్యారు. తాను ఓ ‘ఎక్స్‌ట్రా’ అయినప్పటికీ ఆ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు.

ఆయనికి తొలి అవకాశం ‘ఆలీబాబా చాలీస్ చోర్’ అనే సినిమాలో వచ్చింది. అదీ నలభై దొంగలలో ఒకడిగా! అయితే, దురదృష్టవశాత్తు అది ‘కనిపించని’ పాత్ర అయిపోయింది. ఆయన్ని ఓ పెద్ద పీపాలో షాట్ జరుగుతున్నంత సేపూ కూర్చోబెట్టేవారట. తర్వాతి కాలంలో ఈ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆయన నవ్వుకున్నారు. అయితే ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన సులోచనా రాణి, జిల్లూ – తర్వాతి కాలంలో గొప్ప స్టార్‌లయ్యారు. తరువాత మహబూబ్ – దేశ సినీ చరిత్రలో తొలిసారిగా రాత్రి పూట చిత్రీకరించిన మొదటి చిత్రం – ‘మోర్యే పటాన్’ లో భాగమయ్యారు.

నర్గిస్, మహబూబ్ ఖాన్, దిలీప్ కుమార్

తొలి సినిమాలలో మహబూబ్‍కి అన్నీ ఇలాంటి కనిపించని పాత్రలే దక్కాయి! పుండు మీద కారం జల్లినట్టు, మొదటి కొన్ని నెలల పాటు ఆయనకి జీతం ఇవ్వాలని ఎవరికీ తోచలేదు. పొరపాటున ఆయన పేరు మీద ఎంప్లాయీ కార్డు జారీ అవలేదు. అభద్రతాభావంలో ఉన్న మహబూబ్ పైకం అడిగితే, ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఎవరినీ అడగలేదట. చివరికి కడుపు నింపుకోవడం కష్టమై, తన మిత్రుడు ఇస్మాయిల్ జీవా గారితో చెప్పుకుంటే – ఆయన మళ్ళీ అర్దేషిర్ గారి వద్దకు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించారట.

తొలి జోతం అందగానే, అందులోంచి 10 రూపాయలు తండ్రికి పంపారట మహబూబ్ ఖాన్. తన ఊరి మిత్రుడితో కలిసి బాంబే సెంట్రల్ ఏరియాలోని చాల్‍లో ఒక గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి వరకు ఆయా గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్‍లో ఒక బల్లపై పడుకునేవారట. అది కూడా తమ ఊరి మరో మిత్రుడు రైల్వేలో పని చేస్తుండబట్టి వీలు పడిందట. మహబూబ్ ఖాన్‌తో పాటు ‘ఎక్స్‌ట్రా’లుగా నటించిన వారిలో – బిల్లిమోరియా సోదరులు, ఎడ్డీ మరియు దిన్‌‌షా, ఇంకా పృథ్వీరాజ్‌ కపూర్ ఉన్నారట. వారంతా తర్వాతి కాలంలో గొప్ప స్టార్‍లయ్యారు.

***

28 మే 1964 న హార్ట్ ఎటాక్ కారణంగా మహబూబ్ ఖాన్ మృతి చెందారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ తపాలా విభాగం వారు 2007 సెప్టెంబరులో మహబూబ్ స్టూడియోలో జరిగిన వేడుకలో ఒక స్మారక స్టాంపును విడుదల చేశారు.

అభిరుచి కల నటి రూపా వర్మన్:

రూప కెన్యాలోని నైరోబీలో జన్మించారు. అప్పట్లో ఆమె తండ్రి అక్కడ పోలీస్ అధికారిగా పనిచేసేవారు. అయితే ఆమెకు పదేళ్ళ వయసులో చదువు నిమిత్తం వారి కుటుంబం లాహోర్‌కి వచ్చి స్థిరపడింది. 1945లో రూప బి.ఎ. పూర్తి చేసి సైన్యంలో మేజర్‍గా పని చేస్తున్న వర్మను వివాహం చేసుకున్నారు. రూప గృహిణిగా స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అయితే వంట చేయడమంటే రూపకి అయిష్టం. స్తోమత ఉండడంతో ఒక వంటమనిషిని నియమించుకున్నారు.

సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న రూప, కుటుంబం మద్దతుతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆమె మొదటి సినిమా ‘బాజీ’ (1951). ఈ సినిమాలో ఆమె దేవ్ ఆనంద్‍కి సోదరిగా నటించారు.

తదుపరి సినిమా తిత్లీ (ఫర్ లేడీస్ ఓన్లీ), అదే సంవత్సరంలో (1951) విడుదలయింది. ఆ తరువాతి సినిమా ‘మల్లికా సలోమి’ (1953). అదే ఏడాది ‘హరిదర్శన్’ కూడా వచ్చింది. ఆపై ఆమె 1954లో ‘పెహ్లీ ఝలక్’, 1955లో ‘జై మహదేవ్’ తదితర చిత్రాలలో నటించారు.

తన చుట్టూ అందమైన వస్తువులను ఉంచుకోవటం రూపకి ఇష్టం. గొప్ప గొప్ప పెయింటింగ్స్ సేకరించడం ఆమె అభిరుచి. ఆమె బొంబాయి లోని కొలాబా లోని ‘బర్డ్‌వుడ్ హౌస్’‍లో నివాసం ఉండేవారు. అది ఆమె భర్తకి కేటాయించిన సువిశాలమైన బంగళా. అది బాంబే హార్బర్‌కి ఎదురుగా ఉండేది. సినిమా వ్యక్తులకు, కళారంగంలోని వారికి పార్టీలు ఇవ్వడం ఆమెకు అలవాటుగా ఉండేది.

Exit mobile version