Site icon Sanchika

అలనాటి అపురూపాలు-143

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హాస్యంతో అలరించిన రాజేంద్ర నాథ్:

హిందీ సినీ ప్రపంచంలో రాజేంద్ర నాథ్‌గా పరిచితులైన ఆయన పూర్తి పేరు రాజేంద్ర నాథ్ మల్హోత్రా. కొన్ని తరాల ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించి వారిని నవ్వులలో ముంచెత్తిన ఆయనలో గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నేటి తరం వారు కూడా వెండితెర మీద ఆయన హాస్యాన్ని చూసి ఆనందిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నో సినిమాల్లో (ముఖ్యంగా 60, 70 దశకాల్లో) ఆయన ధరించిన పాత్రలు అజరామరంగా నిలిచి, ఓ గొప్ప నిధిగా మిగిలాయి. వారి అన్నయ్య ప్రేమ్ నాథ్ అప్పటికే ప్రసిద్ధ నటులు కావడంతో, రాజేంద్ర నాథ్ అన్నని అనుసరించి బొంబాయి చేరి అన్నయ్య నటించిన ‘Prisoner of Golconda – 1954’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు.

నిజానికి వీరి కుటుంబం నేటి పాకిస్తాన్‌లోని పెషావర్ ప్రాంతానికి చెందినది, కానీ మధ్య ప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో స్థిరపడింది. వీరి తండ్రి ఇన్‍స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పని చేశారు.

రాజేంద్ర నాథ్‌కి తొలుత ‘హమ్ సబ్ చోర్ హైఁ’ (1956) అనే సినిమాలో ఒక చిన్న హాస్య పాత్ర దొరికింది. కానీ ‘దిల్ దేకే దేఖో’ (1959) అనే సినిమాలో పోషించిన పాత్రలో ఆయనకి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయితే 1961లో వచ్చిన ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’ సినిమాలోని పోపట్‌ లాల్ పాత్ర ఆయనని ఎన్నో అవకాశాలను కల్పించిది, ఎన్నో సినిమాలలో ఆ పేరు నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆయన కాస్ట్యూమ్స్ విచిత్రంగా ఉంటాయి. యువ దేవానంద్ రైలు మీద ఎక్కి పాడుతున్న పాట ‘జియా ఓ, జియా ఓ జియా కుఛ్ బోల్ దో’లో రాజేంద్ర నాథ్ విచిత్రంగా కనబడతారు. నైటీ వేసుకుని, ఓ తెల్ల టోపీ పెట్టుకుని, నల్ల కళ్ళద్దాలతో కనిపిస్తారు.

1960లో హిందీ సినిమాలది ‘లైట్-హార్టెడ్ రొమాంటిక్ మ్యూజికల్’ చిత్రాల శకం. ఆ సమయంలో రాజేంద్ర నాథ్ లాంటి నటులకి ఓ నటుడిగా రాణించేందుకు ఎంతో అవకాశం ఉండేది. మహమూద్, జానీవాకర్‍లతో కలిసి రాజేంద్ర నాథ్ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. మహమూద్, జానీవాకర్‍లు వారి వారి శైలిలో గొప్ప హాస్యనటులైనప్పటికీ – రాజేంద్ర నాథ్ వారికి ఏ మాత్రం తీసిపోలేదు. తనదైన టైమింగ్‍తో కామెడీని పండించేవారు. అమాయకుడిగా, మంచివాడిలా, మోసగాడిలా రాణించారు.

ఎక్కువగా ఆయన హీరోల స్నేహితుడిగా, సన్నిహితుడిగా – వారి పాత్రలకి సమాన నిడివి ఉన్న పాత్రలలో నటించారు రాజేంద్ర నాథ్. ‘జాన్వర్’ (1965) సినిమాలో ఆయన హీరో షమ్మీ కపూర్ (సుందర్) మిత్రుడు చింటూగా నటించారు. కశ్మీరులో జరిగే ఇంటర్-కాలేజీలో టోర్నమెంటులో ఆడేందుకు షమ్మీ కపూర్‌తో పాటు వెళ్తారు. ఆయన పోషించిన పాత్రలలో ఇది గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమాలోని ‘లాల్ ఛడీ మైదాన్ ఖడీ’ అనే పాట గుర్తున్నవారందకీ ఈ విషయం విదితమే. ఈ పాటలో రాజేంద్ర నాథ్ ఒక ఎర్రని వాకింగ్ స్టిక్ (లాల్ ఛడీ) పట్టుకుని అమ్మాయిలో నృత్యం చేస్తారు. మొత్తం సినిమాలో ఈ లాల్ ఛడీని పట్టుకునే ఉంటారు. ప్రతీ రాష్ట్రంలోని అమ్మాయిలతోను సంబంధాలు నెరపి, జాతీయ సమైక్యతకు దోహదం చేయాలనుకునే పాత్ర ఆయనది.

‘ఫిర్ వహీ దిల్ లాయా హూఁ’ అనే సినిమాలో ఆయన ‘దీఫూ’ (సినిమాల్లో ఆయన పాత్రల పేర్లు తమాషాగా ఉండేవి) అనే పాత్ర పోషించారు. అందరినీ చిరాకు పెట్టే పాత్ర అది. హీరోయిన్ ఆశా పరేఖ్ అతన్ని వీలైనంత దూరం పెట్టాలనుకుంటుంది. ఆమె మామ ఆమెకీ, దీఫూకీ పెళ్ళి చేయాలనుకుంటాడు. ఈ సినిమాలో రాజేంద్ర నాథ్ – హిందీ వాక్యాల మధ్యలో ఇంగ్లీషు పదాలు వాడడం చక్కని హాస్యాన్ని పండించింది. తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఆ పాత్ర ‘fat mother and funny father’ అని తరచూ అనడం నవ్విస్తుంది. ఆయన చాలా సినిమాల్లో ఒక వాక్యాన్ని హిందీలో పలికి వెంటనే దాన్ని ఆంగ్లంలో చెప్పేవారు. ఉదాహరణకి ‘బతాయియే బతాయియే.. ప్లీజ్ డూ టెల్ మీ’, లేదా ‘మై సమఝ్ సక్తా హూఁ.. ఐ డూ అండర్‌స్టాండ్’ లాంటివి. ఆయన హాస్యంలో క్లిష్టత ఏమీ లేదు. తికమక హావభావాలు, డంబమైన నడక, విచిత్రమైన దుస్తులు, ఆంగ్ల పదాల వాడకం, తరచుగా కనుబొమలు ఎగురవేయడం, ఇంకా అద్భుతమైన కామెడీ టైమింగ్! ఎంతో సరదా అయిన మనిషి. తన ప్రేక్షకులను తన హావభావాలతో నవ్వించిన నటుడు. కుచ్చు టోపీలు, రకరకాల కళ్లద్దాలు, గాగుల్స్, ధరించే చారల లాగులు, చిన్న చిన్న టైలు, బౌలు, తీసుకొచ్చే గొడుగులు ఇవన్నీ రాజేంద్ర నాథ్ ప్రభావాన్ని చూపిస్తాయి.

అయితే, 1960లలో వచ్చిన చాలా సినిమాల్లో ఆయన పొరపాటున బర్త్ డే కేక్ మీద కూర్చోవడం, కుర్చీల్లోంచి పడిపోవడం, సోఫాలోంచి ఉన్నట్టుండి లేవడం, కేక్-ఫైట్స్ (‘మేరే సనమ్’ చిత్రంలో అటువంటి ఆసక్తికరమైన దృశ్యం ఉంది) వంటి దృశ్యాలు ఉండేవి.

1970లో వచ్చిన ‘జీవన్ మృత్యు’ సినిమాలో కథానాయకుడు ధర్మేంద్ర కాలేజీ మిత్రుడిగా నటించారు రాజేంద్ర నాథ్. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో రాజేంద్ర నాథ్ – ఒక రిటైర్డ్ బ్యాంకు మేనేజర్‌నీ, వారి అమ్మాయికి కలుస్తారు. వాళ్ళింట్లో సోఫాలో కూర్చున్నప్పుడు సోఫా స్ప్రింగ్ ఒకటి ఆయన ప్యాంటుకి చిక్కుకుంటుంది. వాళ్ళ సంభాషణ సుదీర్ఘంగా సాగుతుంది. అప్పుడు ఆయన చూపిన హావభావాలు అమూల్యమైనవి. ఆయన ఇక బయల్దేరుతానని పైకి లేచినప్పుడు ఆ స్ప్రింగ్ ఊడివస్తుంది. దానిని ఆ అమ్మాయికి యిచ్చి వందనం చేస్తారు. ఇదంతా అత్యంత సహజంగా ఉంటుంది, ఎక్కడా ఎబ్బెట్టుగా ఉండదు. ఇది చూసి నవ్వుకోదగ్గ దృశ్యం. తెరపైన బఫూన్‍లా, విదూషకుడిగా ఉండే వ్యక్తి నిజ జీవితంలో అత్యంత గంభీరమైన (సీరియస్) మనిషి అంటే నమ్మడం కష్టం.

ఆయన ఎన్నో హిందీ, పంజాబీ, నేపాలీ సినిమాలలో నటించారు కాబట్టి అభిమాన గణమూ ఎక్కువే. ‘ప్యార్ కా మౌసమ్’ (1969) చిత్రంలో ఆర్.డి. బర్మన్ గారితో కలిసి నటించారు రాజేంద్ర నాథ్. బర్మన్ (పంచమ్ దా) గారికి సెక్రటరీ ఝట్‍పట్ సింగ్‌గా రాజేంద్ర నాథ్ నవ్వులు పండించారు. యజమాని చెప్పే ప్రతీ మాటకీ ‘very true, very true’ అని అంటూంటారు.

తన సినిమాల ద్వారా అమూల్యమైన వారసత్వాన్ని మనకి వదిలి వెళ్ళారు రాజేంద్ర నాథ్. గొప్ప సరదా అయిన పాత్రలు ఆయనవి.

***

‘జియా ఓ, జియా ఓ జియా కుఛ్ బోల్ దో’ పాట యూ-ట్యూబ్‌లో:

https://www.youtube.com/watch?v=lEdWe9tqFVE

‘జీవన్ మృత్యు’ సినిమాలోని దృశ్యం

https://www.youtube.com/watch?v=vsmFEKAAQdk


మరువలేని నటి చాంద్‍బీబీ ఖానం ఉస్మానీ:

చాంద్ ఉస్మానీగా పేరుగాంచిన చాంద్‍బీబీ ఖానం ఉస్మానీ 3 జనవరి 1933 నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఒక పస్తూన్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి నేత్రవైద్యులు. ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారామెకు. ఆగ్రాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, బొంబాయిలో అమ్మమ్మ ఇంటికి చేరారు. ఆమె తోబుట్టువులు, తల్లిదండ్రులు హైదరాబాద్‍కు వచ్చి అక్కడ స్థిరపడ్డారు.

1949లో నిర్వహిచిన టాలెంట్ షో ‘కర్దార్-కొల్యోనోస్-తెరెసా కంటెస్ట్’ ద్వారా చాంద్ ఉస్మానీ వెలుగులోకొచ్చారు. ఆమె ఆ పోటీలో రెండవ స్థానంలో నిలిచారు. కేవలం సరదా కోసమే తానా పోటీలో పాల్గొన్నట్టు తర్వాత ఆమె తెలిపారు. అయితే వాళ్ళ అమ్మమ్మకి చాంద్ సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. కానీ త్వరలోనే చాంద్ ఆవిడని ఒప్పించగలిగారు. 1953లో ‘జీవన్ జ్యోతి’ సినిమాలో షమ్మీ కపూర్ సరసన హీరోయిన్‍గా చిత్ర రంగ ప్రవేశం చేశారు. సాంప్రదాయవాదులైన ఆమె తల్లిదండ్రులకు ఆమె పాల్గొన్న పోటీ గురించి తెలియదు. అయితే వారికి తమ కూతురు సినిమాల్లో నటిస్తోందని తెలియగానే వారు విస్మయానికి లోనయ్యారు, దిగులుపడ్డారు, విస్తుపోయారు, అదో భయంకరమైన ప్రమాదమని తలచారు. అయితే ఆమె తల్లీ, అమ్మమ్మ ‘జీవన్ జ్యోతి’ సినిమా చూసి ఆమె నటనను మెచ్చుకున్నారు.

ఆమె ‘బారాతీ’, ‘బాప్ రే బాప్’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ వంటి సినిమాలలోనూ, ఇంకా ఎన్నో చిత్రాల్లో ప్రధాన పాత్రలలోనూ నటించారు. రంగీన్ రాతేఁ, నయా దౌర్, ప్రేమ్ పత్ర్, పెహచాన్ వంటివి ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు. ‘రంగీన్ రాతేఁ’ (1956) సినిమా సమీక్షలో – “చాంద్ ఉస్మానీది అద్భుతమైన ప్రదర్శన; ఆమె పాత్ర కూడా చక్కగా కుదిరింది, ఫలితంగా ఆమె చిత్రానికి జీవం, ఆత్మా అయ్యారు” అని వ్రాశారు. ‘బాప్ రే బాప్’ సినిమాలో ఒక సన్నివేశానికి తెరపై చాంద్ ప్రదర్శించిన సంతోషం ఎంతో కీలకం. ‘ఆమెది ఎంతో హృద్యమైన, పొంగించే నవ్వు’ అని ప్రశంసించింది ది ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.

చాంద్ 1971లో ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందారు. 1970లో వచ్చిన ‘పెహచాన్’ చిత్రంలోని చంపా అనే వ్యభిచారి పాత్రలో ప్రదర్శించిన నటనకు దక్కిందా పురస్కారం. దాదాపు నలభై ఏళ్ళ తరువాత ‘ది హిందూ’లో ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ “చంపా పాత్రలో చాంద్ ఉస్మానీ ఎంతో నిగ్రహం, సమతూకం, హుందాతనం ప్రదర్శించారు. ఉన్నత స్థానాలకు చేర్చగలిగే పాత్ర అది” అని రాశారు. తబస్సం గారికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో – తనకి సుదీర్ఘమైన కెరీర్ లభించినప్పటికీ, ఒక ఏజంట్/మేనేజర్ లేకపోవడం వల్ల – విభిన్నమైన పాత్రలు పొందలేకపోయానని వాపోయారు. ఆమె ధరించిన చాలా పాత్రలు త్యాగాలు చేసే భార్య, తల్లి, ప్రేమిక లేదా సోదరి పాత్రలే. 1986లో తాను రాసిన ‘The Wet-Nurse’ అనే కథలో మహాశ్వేతాదేవి చాంద్ ఉస్మానీని గొప్పగా ప్రస్తావించారు.

చాంద్ ఉస్మానీ దర్శకుడు ముకుల్ దత్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇళ్ళల్లో చెప్పకుండా పారిపోయి బొంబాయి వచ్చి సినిమాల్లో చేరాలనుకునే అమ్మాయిలకు బొంబాయిలోని మాహింలో తన ఇంట్లో  ఆశ్రయం ఇచ్చేవారు చాంద్ ఉస్మానీ.

ఆమె ముంబాయిలో 26 నవంబర్ 1989 నాడు మృతి చెందారు.

ఆమె నటించిన సినిమాల జాబితాను వికీపీడియాలో చూడవచ్చు.

https://en.wikipedia.org/wiki/Chand_Usmani#References

Exit mobile version