అలనాటి అపురూపాలు-15

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి  వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

జేన్ సీబెర్గ్ జీవితంపై ఎఫ్.బి.ఐ ఎందుకు కత్తి కట్టింది?

నటీనటుల మరణాలు అభిమానులను బాధిస్తాయి. శోక సంతాపంలో ముంచుతాయి. ఒకవేళ సహజ మరణం కాకపోతే, విషాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. గూఢచారివర్గాలు మానసికంగా వేధించి, ఒక నటి బలవన్మరణానికి కారణమైతే ఆమె ఘోష ఎవరికి చెప్పుకోవాలి?

దాదాపు 40 ఏళ్ళ క్రితం 1979 ఆగస్టు చివర్లో సుప్రసిద్ధ నటి జీన్ సీబెర్గ్ మరణం చాలా దారుణమైన, అసహ్యమైన స్థితిలో సంభవించింది. ఫ్రెంచ్ పోలీసులు గుర్తించడానికి పది రోజుల ముందు ఈ అమెరికన్ నటి శవం పారిస్‌లోని ఒక వీధిలోని ఒక కారులో కుళ్ళిపోతూ ఉంది. శవం పక్కన ఒక బార్బిట్యురేట్స్ సీసా, సూసైడ్ నోట్ దొరికాయి. పత్రికల్లో ప్రకటించినట్టుగా, ఆమె శరీరం ‘ఎండకి మాడిపోయింది’, శరీరం నుంచి ‘భరించలేనంత దుర్వాసన’ వస్తోంది. ఈ నటే, తన తొలిరోజులలో తోటి నటీనటులచే ‘ఊహించలేనంత తాజాదనం’ అని ప్రశంసలు పొందింది. సీబెర్గ్‌కి పారిస్ నగరం అంటే చాలా ఇష్టం. ప్రతీ సినీ అభిమాని జీన్-లూక్ గొడార్డ్ తీసిన ‘బ్రీత్‌లెస్’ (1960) అనే సినిమాలో ఆమె నటనని ఇష్టపడకుండా ఉండలేరు. ఆ సినిమాలో ఆమె తెల్లటి ‘న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్’ టి-షర్ట్ ధరించి దినపత్రికలు అమ్ముతూ, తన సహనటుడు జీన్-పాల్ బెల్మోండోతో కలిసి నగర వీధుల్లో తిరుగుతూ ఆనందిస్తుంది. యుద్ధానంతర పరిస్థితులలో హాలీవుడ్‍లోని తోటి నటీమణులతో పోలిస్తే, సీబెర్గ్‌ది వింతైన, విరుద్ధమైన కెరీర్ అనే చెప్పాలి.

‘సీబెర్గ్’ అనే కొత్త సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తున్న కిర్‌స్టెన్ స్టెవార్ట్ వానిటీ ఫెయిర్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “ఆమెని అపార్థం చేసుకున్నారు. సెలబ్రిటీలపై హీరో-వర్షిప్ ఉండాలనేం లేదు, వాళ్ళు మనం చూసే మనుషులంతే. వాస్తవం ఏంటంటే జనాలు ఆమెను చూసి, ఆమెలో లేని లక్షణాలను ఊహించుకుని అతిగా అభిమానం పెంచుకున్నారు. ఈ వాస్తవమే తుదకు ఆమె పతనానికి కారణమైంది” అని చెప్పింది. ‘ట్విలైట్’ వంటి హాలీవుడ్ సినిమాలలోనూ, స్వతంత్ర్య ఫ్రెంచ్ ఆర్ట్ సినిమాలలోనూ నటిస్తున్న స్టెవార్ట్ – సీబెర్గ్ పాత్రను పోషించడానికి సరైన నటి.

‘బ్రీత్‌లెస్’ సినిమా హిట్ కావడంతో, ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమాలకి సీబెర్గ్ ప్రధానాకర్షణగా మారింది. ‘బ్రీత్‌లెస్’ ఒక ప్రయోగాత్మక చిత్రం. భారీ బడ్జెట్‌లనూ, సాధారణ టెక్నిక్‌లనూ విడిచిపెట్టి – ముతకదనంతో చిత్రీకరించిన సినిమా. సీబెర్గ్ సొంత ఊరు అమెరికాలోని మార్షల్‌టౌన్‌ నగరంలో ఆ సినిమాని ఆదరించకపోయినా, ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఫ్రెంచ్, ఇంగ్లీషు సినిమాలలో నటించడం ద్వారా ఆమె సుప్రసిద్ధమైంది. ఎందరెందరో కొత్త దర్శకులతో పని చేసింది. లైఫ్, వోగ్ వంటి మేగజైన్‍ల కవర్ పేజీలపై కనిపించింది. రచయిత, రాయబారి అయిన రోమెయిన్ గారీని ఆమె ద్వితీయ వివాహం చేసుకుంది. తన భర్తతో కలిసి వైట్ హౌస్‌లో కెన్నెడీ కుటుంబీకులకు వినోదం పంచింది. ఫ్రాన్స్‌లో యువతులు తమ కేశాలను మెలి తిప్పుకుంటూ సీబెర్గ్ ను అనుకరించేవారు

నటి కాకముందు సీబెర్గ్ ఉద్యమకారిణి. 14 ఏళ్ళ వయసులో 1952లో NAACPలో చేరింది. అన్ని ఉద్యమాలలోనూ పాల్గొంది. పెద్దయ్యాకా, ‘బ్లాక్ పాంథర్స్’ వంటి సంస్థలతో సహా ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చింది. ఎలిజబెత్ టేలర్, మార్లన్ బ్రాండో, ఇంకా ఇతర హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఇలానే విరాళాలు ఇచ్చేవారు. “ప్రపంచాన్ని ఓ మెరుగైన స్థలంగా మార్చేందుకు ఇది అవసరమని తను భావించింది” అని సీబెర్గ్ మిత్రుడు రబ్బి సోల్ సెర్బర్ చెప్పారు. “ప్రజలకి ఇబ్బంది కలుగుతోంది అని చెప్తే చాలు” అన్నారు. ‘బ్లాక్ పాంథర్స్’ పిల్లలకి అందించే ఉచిత ఉపాహారం కార్యక్రమంతో సీబెర్గ్ ఆ సంస్థ పట్ల ఆకర్షితురాలయ్యింది. అయితే ఆ సంస్థతో సంబంధం పెట్టుకోడం వల్ల 1969 ప్రారంభం నుంచి ప్రభుత్వ గూఢచారి వర్గాలు ఆమెపై కన్నేసి ఉంచాయి. ‘బ్లాక్ పాంథర్స్’ నేత ఎలాయిన్ బ్రౌన్‌తో ఫోన్‍లో మాట్లాడడం వల్ల సీబెర్గ్ ఎఫ్.బి.ఐ.వారి దృష్టికెక్కింది.  ఆమెని ఒక్కర్తినే కాకుండా, ఎఫ్.బి.ఐ. అందరినీ లక్ష్యంగా చేసుకుంది. కానీ తొలి  దెబ్బ సీబెర్గ్‌కే తగిలింది. గారీతో కలిగిన రెండవ బిడ్డని అప్పుడు కడుపులో మోస్తోందామె. ఆ బిడ్డకి తండ్రి గారీ కాదనీ, ఓ బ్లాక్ పాంథర్ అనీ ఎఫ్.బి.ఐ. లాస్ ఏంజెలిస్ టైమ్స్‌కి ఉప్పందించింది. ఈ తప్పుడు సమాచారాన్ని ఆ పత్రిక మే 1970లో ఒకరోజు ‘బ్లైండ్ ఐటమ్’ పేరిట ప్రచురించింది. ఇదే వార్తని సీబెర్గ్ పేరు పెట్టి తిరిగి ఆగస్టు నెలలో న్యూస్‌వీక్‌లో ప్రచురించింది. సీబెర్గ్ క్రుంగిపోయింది. నెలలు నిండకుండానే బిడ్డకి జన్మనిచ్చింది. ‘నీనా హార్ట్ గారీ’ అని పేరు పెట్టిన ఆ శిశువు రెండు రోజుల తర్వాత మరణించింది. ఆ శిశువుని మార్షల్‌టౌన్‌లో శ్మశానంలో పూడ్చిపెడుతున్నప్పుడు ఆమె సక్రమ సంతానమే అని నిర్ధారించి పితృత్వ వివాదానికి ముగింపు పలికారు. సీబెర్గ్ సోదరి మేరీ ఆన్ సీబెర్గ్ మాట్లాడుతూ, “శ్మశానం నుంచి తను మా దగ్గరకు వచ్చింది. ఎంతో నిస్పృహలో ఉంది, క్రుంగిపోయింది. ఇటువంటి పుకార్ల ద్వారా జీవితాలను ఇలా కూడా నాశనం చేయచ్చా అని నమ్మలేని స్థితిలో ఉంది” అని చెప్పింది.

తరువాతి తొమ్మిదేళ్ళు సీబెర్గ్ నటన కొనసాగించినా, హాలీవుడ్‌కి మాత్రం తిరిగి రాలేదు. రచనల వైపు మొగ్గు చూపింది. ఒక షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించింది. కానీ ఆమె పతనావస్థ మాత్రం కొనసాగింది. 1979 ఆగస్టు చివర్లో కనబడకుండా పోయింది. తొమ్మిది రోజుల తర్వాత, తన పారిస్ నివాసానికి మూడు బ్లాకుల దూరంలో తన కారు వెనుకసీటులో ఒక దుప్పటిలో చుట్టిన ఆమె శవాన్ని కనుగొన్నారు. ఆమెది ఆత్మహత్యగా ప్రకటించారు, కానీ విరుద్ధమైన సాక్ష్యాలు కుటుంబంపైనా, మిత్రులపైనా అనుమానాలు రేకెత్తించాయి. సీబెర్గ్ అంత్యక్రియలు పూర్తయిన కొద్దిరోజులకే, ఎఫ్.బి.ఐ. ఆమెపై చేసిన దుష్ప్రచారం వివరాలు, ఇంకా చేపట్టిన ఇతర చర్యలు వెల్లడయ్యాయి. సీబెర్గ్‌ని అనుమానించారు. అనుసరించారు. ఆమెపై నిఘా ఉంచారు. ఆమె ఫోన్‍లను టాప్ చేశారు, ఉత్తరాలను చదివారు. చివరికి పరోక్షంగా ఆమె పతనానికి కారణమయ్యారు.

సీబెర్గ్ బయోపిక్ ట్రైలర్:

బ్రీత్‍లెస్ సినిమా సన్నివేశం యూట్యూబ్‌లో:

1981 ప్రత్యేక నివేదిక – జేన్ సీబెర్గ్:


దిలీప్ కుమార్ తొలి ప్రేమ- అత్యద్భుతమయిన నటి కామినీ కౌశల్:

అవిభక్త భారతదేశంలోని పంజాబ్‌లోని లాహోర్‌లో (ఇప్పటి పంజాబ్, పాకిస్థాన్) 16 జనవరి 1927 నాడు  కామినీ కౌశల్ జన్మించింది.. ఆమె అసలు పేరు ఉమా కశ్యప్.   ఆమెకి ఇద్దరు అన్నయ్యలు, ముగ్గురు అక్కయ్యలు. ఆమె తండ్రి ప్రొఫెసర్ శివరామ్ కశ్యప్ లాహోర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఆయన హిమాలయ ప్రాంతానికి చెందిన బ్రయోఫైటాలో నిపుణులు. ఆయనని ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ బ్రయోలజీ (నాచుజాతిమొక్కల శాస్త్రం)’ అని వ్యవహరిస్తారు. వారి భవనం చుట్టూ పెద్ద పెద్ద యూకలిప్టస్ చెట్లు, ఇతర ఫలవృక్షాలు ఉండేవి. 26 నవంబరు 1934 నాడు తనకి ఏడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయినప్పటికీ ఆయన రూపం ఆమె కళ్ళల్లో, మనసులో స్పష్టంగా నిలిచిపోయింది. నాన్నంటే ఆమెకు రామాయణం గుర్తుకువస్తుంది. చలికాలంలో ఆయన ముఖాన్ని ఒంటె చర్మంతో చేసిన ‘ఆబా’ అనే ముసుగుతో కప్పుకునేవారట. అప్పుడు ఆమె కుర్చీలో కూర్చున్న తన తండ్రి ఒడిలోకి చేరి, ఆయన రామాయణం చదువుతూంటే వినేవారట. అది పసిపిల్లలు మాత్రమే అనుభవించగలిగే గొప్ప అనుభూతి అని అంటారావిడ.

లాహోర్ లోని కిన్నాయిర్డ్ కాలేజ్‍లో చదువుతున్నప్పుడు మిగతా టీనేజర్లగా ఉండేవారు కాదామె. సరదాగా గడపడానికి ఆమెకి సమయం ఉండేది కాదు. ఎవరిమీదా ఇష్టం లేదు. స్విమ్మింగ్, రైడింగ్, స్కేటింగ్, రేడియో నాటకాలతోనూ తీరికలేకుండా ఉండేవారు. అప్పట్లో రేడియోలో ఒక నాటకానికి పది రూపాయలు ఇచ్చేవారట. కథలు కూడా రాసేవారు. ఒకసారి ఆమె సైక్లింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుంటే, ఒక అబ్బాయి, “నేనూ నీతో రానా?” అని అడిగితే? “ఎందుకట?” అని వ్యంగ్యంగా అడిగారట. అవన్నీ ఎంతో అమాయకమైన, కల్లాకపటం లేని రోజులని అంటారు.

“అయితే విధి మరోలా తలచింది. స్వాతంత్ర్యం కోసం పోరాటం ఉధృతమైంది. ఉద్యమాలు మొదలయ్యాయి. తిరుగుబాటు వాతావరణం తలెత్తింది. అప్పటి నుంచి మా కథ అంతా స్వాతంత్ర్యపోరాటమూ, దేశ విభజనే!” అంటారీ తొంబైమూడేళ్ళ వృద్ధవనిత. ఆమె స్వరం మాత్రం వయసుని తెలియనివ్వదు. తొలి రోజుల్లోనే రేడియో ఆర్టిస్టుగా రాణించడానికి కారణం తనకి పదరూపభేదం తెలియడమేనని అన్నారు. రేడియోలో ఆమె స్వరం విన్న దర్శకనిర్మాత చేతన్ ఆనంద్, ‘నీచా నగర్’ (1946) సినిమాలో ప్రధాన పాత్ర ఇచ్చారు. కానీ సినిమాలో హీరోయిన్‌గా అయ్యే ముందే ఆమె జీవితం మలుపు తిరిగింది. తను ఎంతగానో అభిమానించే అక్కయ్య ఉష కారు ప్రమాదంలో మరణించడంతో, ఆమె బిడ్డలు – కుమ్‌కుమ్, కవితలను చూసుకునేందుకు గాను తమ బావగారు బి.ఎస్. సూద్ (బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో చీఫ్ ఇంజనీర్)ని పెళ్ళి చేసుకున్నారు. అక్కయ్య అంటే కామినీకి ఎంతో అభిమానం. రెండు, మూడేళ్ళ వయస్సున్న అక్కయ్య పిల్లలకి తల్లి లోటు ఉంటుందని గ్రహించారు. అందుకనే తనది ‘త్యాగం’ అని భావింఛక, ఆ సమస్యకి అది పరిష్కారంగా తలచారు. కాకపోతే, అంత పెద్ద బాధ్యతని తాను నిర్వర్తించగలనా అని సందేహించారు. పైగా ఆమె భర్త సంస్కారి, మంచిమనిషి. ఈ దంపతులకు రాహుల్, విదుర్, శ్రావణ్ అనే ముగ్గురు కుమారులు జన్మించారు.

ఇక, ఆమె తొలి చిత్రం ‘నీచా నగర్’ విషయానికొస్తే దర్శకుడు చేతన్ ఆనంద్‌కి (దేవ్ ఆనంద్ పెద్ద అన్నయ్య) ఇంతకు ముందు సినిమా అనుభవం లేదు. అయితే గొప్ప గొప్ప సినిమాలు చూసిన అనుభవం, ఐపిటిఎ (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్)కి చెందిన మిత్రులతో కాస్తో కూస్తో రంగస్థల అనుభవం ఉంది. వాళ్ళల్లో కొందరిని ముఖ్యంగా ఔత్సాహికులను – తన భార్య ఉమనూ, లాహోర్‌లో ఉమ్మడి స్నేహితురాలైన ఉమా కశ్యప్‌నూ కూడగట్టారు. కామినీ, ఉమలది ఒకే కాలేజ్. చేతన్ ఆమె సోదరుడి ద్వారా కామినీని సంప్రదించారు. తన భార్య పేరూ, ఈమె పేరు ఉమ కావడంతో, తికమకకి గురికాకుండా ఉండడం కోసం ఉమ కాశ్యప్ పేరుని కామినీ కౌశల్‌గా మార్చి, తన సినిమాలో ప్రధాన పాత్ర ఇచ్చారు. తన పిల్లలు కుమ్‌కుమ్, కవితల పేరిట తన తెర పేరు కూడా ఆంగ్ల అక్షరం ‘కె’ తో ప్రారంభమవ్వాలని ఆమె కోరుకున్నారు. ఈ విధంగా ‘కామినీ కౌశల్’ అనే నటి జన్మించింది. కేన్స్ ఫెస్టివల్‌కి వెళ్ళిన తొలి భారతీయ చిత్రం ‘నీచా నగర్’.

‘నీచా నగర్’ తరువాత, ఆమె తిరిగి లాహోర్ వెళ్ళిపోయారు.  ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. షూటింగ్‌ల కోసం లాహోర్ నుంచీ వచ్చేవారు. 1947లో హఠాత్తుగా జరిగిన వివాహంతో ఆమె భర్తతో కల్సి బొంబాయిలో నివాసం ఏర్పర్చుకున్నారు. పెళ్ళయ్యాకా కూడా హిందీ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన తొలి హీరోయిన్ అయ్యారామె. హిందీ సినిమాలో గ్రాడ్యుయేట్ అయిన (బిఎ ఇంగ్లీషులో) తొలి హీరోయిన్ కూడా ఆమే. బొంబాయిలోని శ్రీ రాజేశ్వరి భరతనాట్య కళామందిర్ లో సుప్రసిద్ధ నట్టువాంగం ఆచార్యులు టి. కె. మహాలింగం పిళ్ళయ్ శిష్యరికం చేసి భరతనాట్యం నేర్చుకున్నారు. 1948 నుంచి, ఆ కాలంలోని ప్రముఖ హీరోలు… అశోక్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి వారి సరసన హీరోయిన్‌గా నటించారు.

రాజ్‍కపూర్ సరసన హీరోయిన్‍గా రెండు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఒకటి ఆయన సొంత నిర్మాణ సంస్థ నిర్మించే ‘ఆగ్’, ఇంకొకటి 1947లో గజానన్ జాగీర్దార్ దర్శకత్వం వహించిన ‘జైల్ యాత్ర’. “రాజ్ ఎప్పుడూ హుషారుగా ఉండేవారు, నవ్విస్తూ ఉండేవారు. ‘నేను దేశీ సారాయిని, నువ్వు చిన్న పాపాయివి’ అనేవారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కామినీ. “తన మనవడు రణ్‌బీర్ కపూర్ వలె జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించారు రాజ్. తన మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకోవాలనుకున్నారు” చెబుతూ నవ్వారామె. “నేను నర్గిస్‌తో స్నేహంగానే ఉండేదాన్ని. ఐతే, నేను సౌత్ బాంబేలో ఉండడం, ఆమె నగర శివార్లలో ఉండడం వల్ల తరచూ కలుసుకోలేకపోయేవాళ్ళం” అన్నారు. తన తోటి నటీనటులతో ఎవరితోనూ తనకి గొడవలు లేవని చెప్పారు. “నాది చొచ్చుకుపోయే స్వభావం కాదు, పైగా నేనెప్పుడు ముక్కుసూటిగానే వ్యవహరించాను. గొడవల కోసం నాకు తీరిక లేదు” అన్నారు.

అశోక్‍ కుమార్‌తో కామినీ – పూనమ్ (1952, ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమే), నైట్ క్లబ్ (1958), పూరబ్ అవుర్ పశ్చిమ్ (1970) – లతో సహా ఎన్నో సినిమాలలో నటించారు. నిజానికి తెరపై ప్రేమ కలాపాలు సాగించడానికి చాలా రోజుల ముందే కామినీ అశోక్‍కుమార్‌ని కలిసారు, ఆయనని ఆటపట్టించడానికి సాహసించారు కూడా. యుద్ధ నిధి కోసం కాలేజీలో ప్రదర్శన నిర్వహించగా, అశోక్ కుమార్, లీలా చిట్నిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారట. ప్రదర్శన పూర్తయ్యాకా, ఆమె స్నేహితురాళ్ళతో కలిసి ఆయనకి కలిసారట. కొంత తమాషా చేయాలని అనిపించిందట. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే, వెనుక నుంచి ఆయన జుట్టు పీకారట కామినీ. ఆయన వెనుదిరిగి చూశారట. తనకేం తెలీదన్నట్టు చూసి, ఓ చిరునవ్వు నవ్వారట. ఆయన అటు తిరగగానే, మళ్ళీ జుట్టు పీకారట. ఆయనెంతో దిగ్భ్రమచెందారట. ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఆయనకీ విషయం చెప్పారట కామినీ.

కామినీ దేవ్ ఆనంద్‌తో కలిసి జిద్దీ (1948), షైర్ (1954) లలో నటించారు. పని విషయంలో ఆయన చాలా గంభీరంగా ఉండేవారనీ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారని చెప్పారు. సురయ్యాతో ఆయన విఫలప్రేమకి కామినీ సాక్షి. తను వ్రాసిన ఉత్తరాలను దేవ్ ఆనంద్‌కి అందజేయమని సురయ్యా కామినీని కోరారట. వాళ్ళిద్దరి కోసం బాధపడ్డారామె. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా ప్రయోజనం లేకపోయిందని సురయ్యా అత్త ఆమె వెంబడే ఉండేదని చెప్పారు. పైగా దేవ్ దూకుడు మనిషి కాదు, స్థిరంగా నిల్చుని నేను ఆమెను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పలేకపోయారని అంటారు.

ఒక హీరోయిన్‌కి లతామంగేష్కర్ తొలిసారి పాడడం కామినీ కౌశల్‌కే. అది 1948లో వచ్చిన ‘జిద్దీ’ సినిమాకి. కామినీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “లత నాకు తొలిసారిగా జిద్దీ సినిమాకి పాడారు. ఒక హీరోయిన్‌కి ఆమె పాడడం అదే మొదటిసారి. అప్పటివరకు ఆమె సహాయక పాత్రధారులకు పాడారు. కానీ మ్యూజిక్ రికార్డులలో ఆమె పేరు లేదు. బదులుగా ఆశా అని పేరు ఉంది. ఆ సినిమాలో (జిద్దీ) నా పేరు ఆశా. అందుకని ఆ పాట నేను పాడానని అందరూ అనుకున్నారు” అన్నారు కామినీ. కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ తమ తొలి యుగళ గీతాన్ని 1948లో ‘జిద్దీ’ సినిమాకి రికార్డు చేశారు. ఆ పాట “యే కౌన్ ఆయా రే”.

ప్రధాన కథానాయికగా ఆమె 1946 నుంచి 1963 వరకు పరాస్ (1949), నమూనా, జంఝర్, ఆబ్రూ, నైట్ క్లబ్, జైలర్, బడే సర్కార్, బడా భాయి, పూనమ్, నైట్ క్లబ్ వంటి సినిమాలో నటించారు. కామినీ నిర్మాతగా మారి మాట్నీ ఐడల్ అశోక్ కుమార్‌తో పూనమ్, నైట్ క్లబ్ సినిమాలు నిర్మించారు. ‘చాలీస్ బాబా ఏక్ చోర్’ (1954) చిత్రంలో హాస్య పాత్రనూ, ఆస్, ఆన్శూ, జైలర్ సినిమాలలో ట్రాజెడీ పాత్రలు పోషించారు. సోహ్రాబ్ మోడీ దర్శకత్వం వహించిన ‘జైలర్’ (1958) చిత్రంలో మోడీ భార్యగా ఒళ్ళు జలదరింపజేసే నటన కనబరిచారు కామినీ. తన నియంతృత్వ ధోరణితో భార్యని అక్రమ సంబంధం పెట్టుకునేలా చేస్తాడా భర్త ఈ సినిమాలో. ప్రేమ్‍చంద్ నవల ‘గోదాన్’‌ని అదే పేరుతో సినిమాగా తీద్దామనుకున్న త్రిలోక్ జెట్లీ – కామినీ రెండోసారి గర్భంతో ఉన్న కారణంగా సినీ నిర్మాణాన్ని వాయిదా వేశారు, ఎందుకంటే ఆమె స్వరంలోని మృదుత్వాన్ని ఆయన కోరుకున్నారు. హీరోయిన్‌గా కామినీ మొదటి సినిమాకీ (నీచా నగర్, 1948), చివరి సినిమాకీ (గోదాన్,1963) పండిట్ రవిశంకర్ సంగీతం అందించడం విశేషం.

శరత్ నవల ఆధారంగా బిమల్ రాయ్ రూపొందించిన ‘బిరాజ్ బహు’ (1964) కామినీకి ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. భర్త అంటే భక్తివిశ్వాసాలున్న భార్యగా ఆమె నటన ఆమెకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించింది. “బిమల్ రాయ్ ఒక సున్నితమైన దర్శకుడు. ఆయనతో ఒకసారి భావాలు కలిస్తే, రిహార్సల్స్ లేకుండానే నటించవచ్చు” అన్నారామె. ఈ సినిమా షూటింగ్‍లో ఆమె ఎన్నో సార్లు భావోద్వేగాలకి లోనయ్యారు. ఆ సినిమాలో ఆమె పాత్రకు ఆ పవిత్రత ఉండేది. సినిమాలో భర్త పాత్ర (అభి భట్టాచార్య) తనని ఎన్నడూ మోసగత్తె అనుకోడని భార్య భావిస్తుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఈ సినిమా ‘గోల్డెన్ పామ్’ అవార్డు గెలుచుకుంది.

ఆమె జీవితంలో మరో అధ్యాయం – తెర మీద, తెర వెనుక – దిలీప్‍ కుమార్‌తో ప్రేమాయణం! దిలీప్‍తో ఆమె షహీద్ (1947), నదీయా కే పార్ (1948), షబ్నమ్ (1948), ఆర్జూ (1950) – చిత్రాలలో నటించారు. ఆయనకేమో తన పాత్రని చెక్కడం ఇష్టం, ఆమెకేమో స్వాభావికంగా ఉండడం ఇష్టం. జోక్స్ వేయడం ఆమెకిష్టం. “నువ్వు బాగా అల్లరి చేస్తావు” అని ఆయన అనేవారట. తాము కలిసి నటిస్తున్నప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడనయ్యానని దిలీప్ కుమార్ తన జీవితచరిత్రలో రాశారు. అయితే అప్పటికే ఇద్దరు పిల్లలున్న తన బావగారిని పెళ్ళి చేసుకుని ఉండడం వల్ల, ఆ పిల్లల  బాధ్యత తన మీద ఉండడం వల్ల దిలీప్ ప్రేమని తిరస్కరించారు కామినీ. ఆమె తన తొలి ప్రేమ అని దిలీప్ అన్నారు. దీని గురించి కామినీ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, “మేమిద్దరం బాధపడ్డాం. ఒకరితో ఒకరం మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా ఇద్దరి మధ్య గొప్ప సామరస్యం ఉండేది. కానీ ఏం చేయను? అదే జీవితం. హఠాత్తుగా నా వాళ్ళని వదిలేసి, ‘ఇక చాలు, నేను వెళ్తున్నాను’ అని అనలేను. పైగా పిల్లల బాధ్యత ఉంది. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే మా అక్కకి మొహం ఎలా చూపించను? నా భర్త మంచిమనిషి, ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడతారు” అన్నారు. తరువాత నటుడు ప్రాణ్ గారి అంత్యక్రియల తర్వాత నాల్గవ రోజున దిలీప్ కుమార్‌ని కలవడం జరిగింది. దిలీప్ భార్య సైరాభాను ఆయనని క్రిందకి తీసుకొచ్చారు. కామినీ కుర్చీ పక్కనే ఆయనకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. కానీ ఆయన ఆమెను గుర్తు పట్టలేదు. ఆమె గుండె బద్దలయింది. తనకేసి ఆయన అలా శూన్యంగా చూడడం ఆమె తట్టుకోలేకపోయారు. ఒకరినొకరు చూసుకున్నా, పాపం ఆయన ఎవరినీ గుర్తు పట్టడంలేదు. విచారంతో అక్కడి నుండి వెళ్ళిపోయారామె.

ఆమె కెరీర్ విషయానికి వస్తే, కుటుంబాన్ని నడపడానికి ఆమె విరామం తీసుకున్నారు. తరువాత మనోజ్ కుమార్ ఆమెని సహాయక పాత్రలు పోషించడానికి ఒప్పించారు. ‘షహీద్’ (1965) అనే తన చిత్రంలో తనకి తల్లిగా నటించమని మనోజ్ కుమార్ ఆమెని ఒత్తిడి చేశారు. అతని ముందు తాను చాలా చిన్నగా ఉంటానని కామినీ నిరసన తెలిపారట. కాని గొప్ప సినిమా తీశారని ఆమె అన్నారు. తర్వాత కూడా ఆయన సినిమాలు – ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపడా ఔర్ మకాన్ వంటి తదితర సినిమాలలో నటించారు. సహాయక పాత్రలకి మరలడం కామినీకి సహజంగా జరిగిపోయింది. ఆమెకి అద్దం ఉండాల్సిన అవసరమే లేదు. అద్దంలోకి చూడకుండానే ఓ సీన్ చేయగలిగి ఉండేవారు. ఆమె ఎన్నడూ పొగ త్రాగలేదు, మద్యం ముట్టలేదు. తద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలిగారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె ఎన్నడూ రచ్చ చేయలేదు. ద్వితీయాగమనంలో ఆమె ఉపహార్, ఆద్మీ ఔర్ ఇన్‌సాన్, గుమ్రాహ్, చోరీ చోరీ వంటి సినిమాలలోనూ, షారూఖ్ ఖాన్ సినిమా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోనూ నటించారు.

నేషనల్ ఛానెల్ దూరదర్శన్‍లో ఆమె చేసిన ఒక పప్పెట్ షో ఆమెకెంతో పేరు తెచ్చింది. మూడేళ్ళ పాటు (1989 – 1991) వరకు నడిచిన ఈ ప్రదర్శన హిందీలో పిల్లల సీరియల్స్‌లో మొదటిది. ఆమె బాల రచయిత్రిగా మారారు. ఆమె వ్రాసిన బాలల కథలు పిల్లల మేగజైన ‘పరాగ్’లో ప్రచురితమయ్యేవి. ఇందులో బంటీ, ఛోటాభాయ్, మోటాభాయ్ అనే పేర్లతో తన కొడుకు, మరో బంధువుల అబ్బాయి అల్లరి చేష్టల గురించి వ్రాసేవారు. దూరదర్శన్‍లో ‘చాంద్ సితారే’ అనే సీరియల్‍లో నటించారు. 1986లో ఆమె ‘మేరీ పరీ’ అనే యానిమేషన్ ఫిల్మ్ తీశారు.

సుప్రసిద్ధ బ్రిటీష్ టీవీ సీరియల్ ‘ది జ్యుయెల్ ఇన్ ది క్రౌన్’ (1984)లో ఆమె ‘ఆంట్ షాలినీ’ పాత్ర పోషించారు. స్టార్ ప్లస్‍లో ప్రసారమైన సుప్రసిద్ధ ధారావాహిక ‘షన్నో కీ షాదీ’లో కామినీ నటించారు. షన్నో నాయనమ్మ ‘బేబే’గా కామినీ, షన్నోగా దివ్యాదత్తా నటించారు. శ్రీ అధికారి బ్రదర్స్ వారి టీవీ సీరియల్ (డిడి నేషనల్‍లో) ‘వక్త్ కీ రఫ్తార్’లో నటించారు.

“నేను, సరోజా దేవి, భానుమతి రామకృష్ణ, షావుకారు జానకి, మాలా సిన్హా, మౌసమీ ఛటర్జీ, పద్మినీ, షర్మీలా టాగోర్ వంటి కొందరు ఇతర భారతీయ హీరోయిన్లు మాత్రమే చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుని, పెళ్ళయ్యాకా కూడా సినిమాల్లో రాణించాం, మా వైవాహిక జీవితాలను బాగా గడిపాం” అన్నారు కామినీ ఓ ఇంటర్వ్యూలో.

కామినీ కౌశల్ కు  ఇప్పుడు 93 ఏళ్ళు. 1946 నుంచి సినిమాలలో నటిస్తున్నారు. అంటే నటిగా 74 ఏళ్ళు – అద్భుతం కదూ! అశోక్ కుమార్ కెరీర్ 61 ఏళ్ళు, దేవ్ ఆనంద్ కెరీర్ 65 ఏళ్ళు సాగాయి. ఇటీవల విడుదలయిన ‘కబీర్ సింగ్’ సినిమాలో షాహీద్ కపూర్‌కి బామ్మగా నటించారు.

అదృష్టవశాత్తు, కామినీ కౌశల్  సినీ జ్ఞాపకాలన్నీ భవిషత్తు తరాల కోసం ఒకచోట చేర్చబడ్డాయి. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్, అర్ట్స్ అండ్ సైన్స్’ వారి సహకారంతో ‘ది ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (ఎఫ్.హెచ్.ఎఫ్) వారి ఓరల్ హిస్టరీస్ ఇనీషియేటివ్’ కార్యక్రమం క్రింద ఇంటర్వ్యూ చేయబడిన తొలి నటి కామినీగారే. ఎఫ్.హెచ్.ఎఫ్. వ్యవస్థాపక డైరక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఆమె బయోడేటాలో వందలాది సినిమాలు, పలు టీవీ సీరియల్స్ ఉండి ఉండవచ్చు. కానీ, ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైనది తోలుబొమ్మలాట. వాస్తవానికి ఆమె తనకి పదేళ్ళ వయసులోనే ఒక తోలుబొమ్మలాటని ప్రదర్శించారు. ఆమె స్వంత నిర్మాణ సంస్థ ‘గుడియా ఘర్ ప్రొడక్షన్స్’ రూపొందించిన చాంద్ సితారే, చాట్ పానీ, చందమామ సీరియల్స్‌లో తోలుబొమ్మలు ఉన్నాయి. ‘పప్పెట్ షో’ అంటే ఆమెకెంతో ఇష్టం. అన్ని తోలుబొమ్మలకి తన గాత్రం అందించేవారు. తాను చేయాలనుకున్నది చేయడంలో ఎంతో స్వేచ్ఛని అనుభవించారు. ఆమె తోలుబొమ్మలలో మంచివి, చెడ్డవీ, క్రూరమైనవి ఉండేవి. “తోలుబొమ్మలకి ఆత్మ ఉంటుంది” అంటారామె వెండి కిరీటం కన్నా అధికంగా మెరిసే కళ్ళతో.

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here