అలనాటి అపురూపాలు-151

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అలనాటి మేటి చిత్రం ‘సికందర్’:

సోహ్రాబ్ మోడీ దర్శకత్వం వహించిన ‘సికందర్’ చిత్రం 1941లో విడుదలయింది. బ్రిటీష్ వారి పాలనకు చరమగీతం పాడాలన్న పట్టుదలతో భారతీయులు స్వాతంత్ర్య పోరాటం సాగిస్తున్న రోజులవి.. రెండవ ప్రపంచ యుద్ధం రోజులు.. పూర్తిగా జాతీయ భావనలతో నిండిన ఈ సినిమాని తొలుత సెన్సార్ వారు మిలిటరీ ప్రాంతాలలో నిషేధించారు (యుద్ధానికి వెడుతున్న కొడుకుని – వెన్నుపోటు తినకు నాయనా, గుండెల్లో పొడిపొంచుకో అని దీవించి పంపుతుంది ఓ తల్లి).

అయినా ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ కపూర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. పర్షియా భాషలోకి డబ్ అయి మరింత మందికి చేరింది.

బాధాకరమైన విషయమేమిటంటే – సినీరంగానికి విస్తృతంగా సేవ చేసిన సోహ్రాబ్ మోడీ చాలా చిత్రాలు – నేడు అందుబాటులో లేకపోవడం. ఓ గొప్ప దార్శనికుడు, పథగామి, నటుడు అయిన సోహ్రాబ్ – తన మినర్వా మూవీటోన్ సంస్థ ద్వారా – పుకార్, పృథ్వీ వల్లభ్, మీర్జా గాలీబ్, ఝాన్సీ కీ రాణీ, సికందర్ వంటి చారిత్రక సినిమాలను హిందీ చలనచిత్ర రంగానికి అందించారు. భారతీయ సినీ రంగపు తొలినాటి దిగ్గజాలలో ఒకరు.

పార్శీ రంగస్థలంలో పాతుకున్న మోడీ మూలాలు ఆయన విశిష్టమైన సినీ శైలికి, రంగస్థల సౌందర్యానికి మార్గం వేశాయి. అయితే ‘సికందర్’ చిత్రంలో అద్భుతమైన యుద్ధ సన్నివేశాల్లో ప్రదర్శించిన శక్తియుక్తులు – అవుట్ డోర్ షూటింగులలో ఆయనకున్న పట్టును తెలియజేస్తాయి.

ఈ సిమినా కథ ‘క్రీ.పూ.327 సంవత్సరంలో ఒకరోజు.. ఇరాన్ పై గ్రీక్ జండా ఎగురుతున్న సమయం’ అంటూ మొదలవుతుంది. అలెగ్జండర్/సికందర్‍ను గురువు అరిస్టాటిల్ (షకీర్)‍ను ఆరాధించే శక్తివంతమైన పాలకుడిగా, ప్రియురాలు రుఖ్సానా (వనమాల)ను ముఖస్తుతి చేసేవాడిలా చూపిస్తారు. అయినా అతనికి తన విజయాల గురించి, పరాక్రమం గురించి తెలుసు.

అతని నోటి నుంచి వెలువడే ప్రతీ మాట స్వీయప్రేమను చాటుతుంది. అయితే ఆ పాత్ర ధరించిన పృథ్వీరాజ్ కపూర్ తన నటనతో – సికందర్ వైభవాన్ని మానవీయంగా మార్చి – కావాలని అలా ప్రవర్తించేవాడిలా కాకుండా – తాను సర్వోత్తముడిని కానని తెలియని అజ్ఞానంతో అలా ప్రవర్తించేవాడిలా నటించారు. ఆ అజ్ఞానం కూడా పూర్తిగా స్వాభావికమైనది.

40 ఏళ్ళ పృథ్వీరాజ్ గ్రీకు వస్త్రధారణలో శిరస్త్రాణం ధరించి రాచఠీవితో కనిపిస్తారు. ఆయన స్వరంలో అక్బర్ చక్రవర్తి (మొఘల్-ఏ-ఆజామ్) స్వరం లాంటి గాంభీర్యం లేదు. అయినా తన విజయాల పట్ల గర్వభావనని, అధికారాన్ని స్వరంలో వ్యక్తీకరిస్తారు. వారిని చూస్తే – ఆయన కుమారులు – రాజ్, షమ్మీ, శశి – లకు నటనలో ఆ తీవ్రత, ఉద్రేకం, చక్కని రూపం – ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమయిపోతుంది.

ఇరాన్‍ని ఆక్రమించిన సికందర్, ప్రపంచాన్నంతా జయించాలనుకుంటాడు. ఆఫ్ఘనిస్థాన్‍ని జయిస్తాడు. భారత్ వైపు బయలుదేరుతాడు. జీలం నది (భారత్ పాకిస్థాన్ మధ్య ప్రవహించే నది) ఒడ్డున ఆగుతాడు. వాతావరణం అనుకూలించక అతని సైన్యం నదిని దాటలేకపోతుంది.

ఇదిలా ఉంటే, మహారాజు పురుషోత్తముడు (సోహ్రాబ్ మోడీ) భారతదేశానికి విదేశీయుల నుంచి ఎదురవబోయే ముప్పును పసిగట్టి తోటి రాజులను హెచ్చరిస్తాడు. అంతర్గత కలహాలను వదిలి, అందరూ కలిసికట్టుగా ఉండి ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలని కోరతాడు.

అయితే వారిలో కొందరు – ఉదాహరణకి – తక్షశిల రాజు అంభి (కె. ఎన్. సింగ్) – ద్రోహం చేసి శత్రుపక్షంలో సికందర్‍తో చేతులు కలుపుతారు. ఇక ఘోరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. అత్యాశాపరులకీ దేశభక్తులకీ మధ్య జరిగే ఈ పోరులో అందరూ వేచి చూసినది – ఇద్దరు రాజుల – ముఖాముఖీ కోసం!

నిజానికి ఇవి రెండు గొప్ప సన్నివేశాలు! ఒకటి సికందర్ స్వయంగా ఓ ప్రతినిధి వేషంలో వచ్చి పురుషోత్తముడిని కలవడం, చివరికి తానెవరో వెల్లడించడం! రెండు – గెలిచిన సికందర్ ఓడిన పురుషోత్తముడితో – ‘నిన్ను ఎలా గౌరవించాలో చెప్ప’మని అడగినప్పుడు ‘ఒక రాజును ఇంకో రాజు ఎలా గౌరవిస్తాడో అలా గౌరవించమ’ని పురుషోత్తముడు చెప్పడం!

సికందర్ పాత్రలో పృథ్వీరాజ్ కపూర్‍కి కాకుండా మరొకరిని ఊహించుకోలేనప్పటికీ, పురుషోత్తముడు (పోరస్) పాత్రలో సోహ్రాబ్ మోడీ కూడా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. అప్పట్లో స్వతస్సిద్ధ, సహజ నటన ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. తెర మీద సికందర్ సంభాషణలకు అలవాటు పడడానికి కనీసం 10 నిమిషాలు పట్టేది ప్రేక్షకులకి. అలా అలవాటు పడిన వీక్షకులు ఆయన స్వరానికి, రూపానికి అబ్బురపడేవారు.

ఎంతో జాగ్రత్తగా రిహార్సల్స్ చేసిన సంభాషణలతో, జనాకర్షక సెంటిమెంటును పండిస్తూ, ప్రాధాన్యత కోల్పోకుండా గొప్పగా నటించే నటుడిని చూడడం ఓ అద్భుతం. చూడడానికి అది సాధారణంగా అనిపించినా, ఆ పాత్ర పోషణకి ఎంతో ఏకాగ్రత, శక్తి, ఉద్రేకాలు కావాలి, ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఉరవడి నశిస్తుంది. అయితే మోడీ, కపూర్ ఇద్దరూ రంగస్థలం నుంచి వచ్చినవారు కావడంతో – వారి ఝురి – ఆదర్శప్రాయంగా ఉంది.

చదువులో పాఠ్యాంశంగా చరిత్ర చదువుకోని వారి కోసం – సోహ్రాబ్ మోడీ – చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.

సంపన్నమైన ఆర్ట్ డిజైన్‍లను, బాక్‍డ్రాప్ సెట్టింగులను రూసీ. కె. బంకర్ రూపొందించగా, పండిత్ సుదర్శన్ ఖంగుమనే సంభాషణలను అందించారు. ఈ సినిమాకి కథ, పాటలు కూడా పండిత్ సుదర్శన్ గారే అందించడం విశేషం. గీత రచయితే సంభాషణల రచయిత కావడం ‘సికందర్’ సినిమాకి గొప్పగా ఉపకరించింది. ‘ఆగ్ నే పానీ కా నామ్ సున్తే హీ అపనే షోలే భుజా దియే’, ‘బుఢాపా బర్ఫ్ సే భీ ఠండా హై, జవానీ అంగారే సే భీ గరమ్’, ‘హమ్ ఐసీ గలతీయా ఏక్ హజార్ బార్ కర్‍కే ఖైద్ హో గయే ఔర్ ఉస్కే బాద్ హమే ఫిర్ మౌకా మిలే తో హమ్ ఫిర్ ఐసీ గలతీ కర్నే సే బాజ్ నా ఆయేంగే’ వంటి డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి.

ఈ సినిమాకి సంగీతం అందించినది – ఆ కాలంలో సుప్రసిద్ధులైన మీర్ సాహెబ్, రఫీక్ గజ్నవీ (ఈయన సల్మా ఆఘాకి తాతగారు, సల్మా ఆఘా కూతురు సాషా త్వరలో యష్‍రాజ్ ఫిల్మ్స్ వారి ‘ఔరంగజేబ్’ చిత్రం ద్వారా తెర ప్రవేశం చేశారు). కథకి చక్కని నేపథ్య సంగీతం తోడై – సికందర్ సైన్యంలో చెలరేగిన భావోద్వేగాలను అద్భుతంగా అందించింది. కొన్ని రొమాంటిక్ దృశ్యాలకు కూడా (సికందర్ – రుఖ్సానా మధ్య వచ్చే సన్నివేశాలు, పురుషోత్తముడి కుమారుడి సన్నివేశాలకు)  సంగీతం దోహదం చేసింది.

ముఖ్యంగా మూడు పాటలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అవి – మేనకాబాయి ఆలపించిన ‘ఉఠ్ జాగ్ జవానీ ఆతీ హై’; షీలా పాడిన ‘జీతే దేశ్ హమారా’; హెచ్. ఖాన్ మస్తానా పాడిన సైన్యం పాట ‘జిందజీ హై ప్యార్ సే’.

‘సికందర్’ చాలా భారీ చిత్రం. ఆ భారీతనాన్ని గ్రహించాలంటే కోల్హాపూర్‍లోని మైదాన ప్రాంతంలో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలని చూడాలి. కాస్ట్యూమ్‍లలో  – గుర్రాల పైన, ఏనుగుల పైనా, రథాలపైన లేదా కాల్బలంలా ఉన్న వేలాది జూనియర్ ఆర్టిస్టులు ఎన్నో ఆయుధాలు ధరించి కనిపిస్తారు.

ఈ యాక్షన్ దృశ్యాలను తన ప్రతిభతో ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళారు సినీమాటొగ్రాఫర్ వై. డి. సర్‍పోత్‌దార్ (Y D Sarpotdar). లాంగ్ షాట్స్, వైడ్ స్క్రీన్ షాట్స్, లో-యాంగిల్స్, లో-లిట్ కాప్చర్స్ అద్భుతంగా వచ్చాయి సినిమాలో. చరిత్రలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఘనంగా ప్రదర్శించారు.

హైడాస్పెస్ యుద్ధం సందర్భంగా ఓ రోమాంచక దృశ్యం ఉంది. విపతీరమైన వేగంతో  ఓ ఏనుగు కెమెరా వైపు దూసుకొచ్చే సన్నివేశం అది. టెక్నాలజీ రహిత 3డి గా దాన్ని పరిగణించవచ్చు.

ఇంతటి భారీ కాన్వాసులో -వ్యూహ ప్రతివ్యూహాలతో సాగిన ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడం కత్తి మీద సాము వంటిదే. అనేక వరుసల గుర్రాల దండ్లు – ఈటెలు, కత్తులు, డాళ్ళు ధరించిన పదాతిదళం పక్కగా సాగడాన్ని చిత్రీకరించడం ఆషామాషీ కాదు.

బాణాలు ఈటెలు దూసుకురావడం, కాళ్ళతో తొక్కే పశువులు, పడిపోతున్న గుర్రాలు చూశాకా – ఈ సినిమా చిత్రీకరణలో జంతువులేవీ గాయపడలేదని చెప్పడం కష్టం.

అయితే ‘సికందర్’ సినిమాలో అంతా మగవారే కాదు.

కథలో ఆడవారూ ముఖ్యమే. సంబంధ బాంధవ్యాలు, రాజకీయాలు, దేశభక్తి తదితర అంశాలలో హుందాతనాన్ని, పట్టుదలని, సరళతని ప్రదర్శించిన స్త్రీలూ ముఖ్య పాత్ర పోషించారు. అయితే కథ రీత్యా నటుల పాత్రలకు కన్నా నటీమణుల పాత్రలకు కాస్త ప్రాధాన్యత తక్కువనిపించినా – నటనలో నటులకి తీసిపోకుండా నటించారు నటీమణులు.

సికందర్ గురువైన అరిస్టాటిల్‍ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది రుఖ్సానా. ఆమె రహస్యంగా భారతదేశం వచ్చి పురుషోత్తముడిని కలుస్తుంది. అతనికి రాఖీ కట్టి తన భర్తకి ప్రమాదం కలిగించనని మాట తీసుకుంటుంది. సికందర్ సైన్యాన్ని రెచ్చగొట్టి తమ ప్రభువు పైన తిరుగుబాటు చేయమని, 14 ఏళ్ల పాటు చేసిన యుద్ధాలని చాలించి, ఇంటికి వెళ్లమని అడుగుతుంది.

రుఖ్సానాగా మరాఠీ నటి వనమాల అద్భుతంగా నటించారు. చిత్రంలో రుఖ్సానా తన పర్షియన్ మూలాల పట్ల గర్విస్తుంది. గ్రీకు భాషలో తనని సంబోధించడాన్ని ఇష్టపడేది కాదు. తెలివితేటలు, వ్యూహ చతురత కలిగి ప్రేమని శాంతిని ప్రచారం చేస్తుంది.

రత్నగా నటించిన మీనా షోరే కూడా చక్కని ప్రదర్శన చేశారు. అంభి సోదరి రత్నకి దేశమంటే ప్రేమ. విదేశీ రాజుతో చేతులు కలిపిన తన సోదరుడిని మందలిస్తుంది. బయటివాళ్ళ నుంచి దేశాన్ని కాపాడేందుకు పురుషోత్తముడు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది. అలాగే ఈ సినిమాలో పురుషోత్తముడు కూడా తన జీవితంలోని ముఖ్యమైన మహిళల పట్ల – తన భార్య, కూతురు, సోదరి పట్ల – సున్నితంగా మసలుకొన్నట్లు చిత్రీకరించారు. క్లయిమాక్స్‍లో వచ్చే యుద్ధానికి వెళ్ళేముందు పురుషోత్తముడు -వాళ్ళందరినీ వారికి ఏం కావాలో అడిగి, వారి కోరికలు తీరుస్తానని మాట ఇస్తాడు.

ఈ సినిమా యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=WWpvomhpkig

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here