Site icon Sanchika

అలనాటి అపురూపాలు-155

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సిల్వర్ జుబ్లీల హీరో కరణ్ దీవాన్:

37 ఏళ్ల పాటు కొనసాగిన తన కెరీర్‌లో కరణ్ దీవాన్ వందకు పైగా సినిమాల్లో నటించారు. వీటిలో అత్యధిక సినిమాలు సిల్వర్ జుబ్లీ జరుపుకున్నావే. 75 సినిమాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ నటుడు బి.ఆర్. ఫిల్మ్స్, యశ్‌రాజ్ ఫిల్మ్స్ వంటి సంస్థలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‍గా వ్యవహరించారు. ‘మాయా’ (1966) చిత్రానికి కాస్టింగ్ ఏజంట్‌గా పనిచేశారు.

నేటి పాకిస్తాన్ లోని గుజ్రాన్‌వాలాలో 6 నవంబర్ 1917న జన్మించిన కరణ్ అసలు పేరు కరణ్ చోప్రా. ముగ్గురు సోదరులలో అందరికంటే చిన్న. లాహోర్‍లో కాలేజీలో చదువుతుండగానే విలేఖరిగా పనిచేశారు. ఉర్దూ భాషలో వెలువడే ‘జగల్ లక్ష్మి’ అనే సినిమా పత్రికకి సంపాదకత్వం వహించారు. ఆయన సోదరుడు జైమాని దీవాన్ సినీ నిర్మాత, దర్శకుడు. కరణ్ ఒకసారి లాహోర్‍లో స్థానిక డిస్ట్రిబ్యూటర్ అయిన తారాచంద్ బర్జాత్యాని కలిసారు. అప్పట్లో తారాచంద్ – చందన్‍మాల్ ఇందర్ కుమార్ గారి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో మేనేజరు. తారాచంద్‌తో ఉన్న స్నేహం ద్వారా కరణ్ – కలకత్తా చేరి నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ‘పూరణ్ భగత్’ (1939) అనే పంజాబీ చిత్రంలో పూరణ్ పాత్ర ద్వారా నటుడిగా ఆయన ప్రస్థానం మొదలయింది. ఈ సినిమాకి నిర్మాత రాయ్ సాహెబ్ సుఖ్‍లాల్ కర్ణాణి. దర్శకులు ఆర్. ఎల్. షోరే.

కరణ్ రెండవ సినిమా ‘మేరా మాహి’ (1941). ఇది కూడా పంజాబీ చిత్రమే. రాగిణి, మనోరమ నటించిన ఈ చిత్రానికి శంకర్ మెహతా దర్శకత్వం వహించారు. విశిష్టమైన నటనా ప్రావీణ్యంతో పాటు, అద్భుతమైన గానం ఆయన సొంతం. తన రెండవ సినిమాలో శ్యామ్ సుందర్ సంగీత దర్శకత్వంలో తొలిసారిగా సినిమాకి పాటలు పాడారు కరణ్. ఆయన గాన ప్రతిభకి ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టింది. 1944లో విడుదలైన ‘రత్తన్’ చిత్రంలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో పాడారు. 1939లో మరాఠీ ఒరిజినల్ ‘మానూస్’ లోనూ, హిందీ వెర్షన్ ‘ఆద్మీ’ లోనూ నటించిన నటి – గాయని మంజును కరణ్ వివాహం చేసుకున్నారు. మంజు  ఆరేళ్ళ పాటు సినిమాల్లో నటించారు. మోతీలాల్ గారి ‘చోటీ చోటీ బాతేం’ సినిమా మంజుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ దంపతులకి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు పుత్రులు కలిగారు. ‘రత్తన్’ చిత్రం ఓ రొమాంటిక్ మ్యూజికల్ సినిమా. ఎం. సాదిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కరణ్ సరసన స్వర్ణలత నటించారు. కరణ్, జోహ్రాబాయి అంబాలేవాలి పాడిన ‘సావన్ కే బాదలోం’ అన్న యుగళగీతాన్ని కరణ్, స్వర్ణలత పై చిత్రీకరించారు. ఈ పాట ఈ జోడీకి గుర్తింపు పాటగా నిలిచింది.

కరణ్ లాహోర్‌లో సినీ జర్నలిస్టుగా ఉన్నప్పుడు దేవికా రాణి గారితో పరిచయం కలిగింది. ఆవిడ కరణ్‌ని బొంబాయికి ఆహ్వానించారు. కరణ్ తన తోటి నటీనటులకి ఉర్దూ ఉచ్చారణ నేర్పేవారు. ‘గాలీ’ (1944) ఓ సాంఘిక చిత్రం. ఎన్. ఆర్. దేశాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నానుభాయ్ దేశాయ్ నిర్మించిన ఈ సినిమాకి రామా చౌదరి దర్శకులు. ఈ సినిమాలో కరణ్, మంజు, యాకూబ్ నటించారు. ముస్లింల సామాజిక జీవనంపై చిత్రించిన చిత్రం ‘భాయ్ జాన్’ (1945). విజయవంతమైన ఈ సినిమాలో కరణ్ పక్కన నూర్జహాన్ నటించారు. షానవాజ్, మీనా (షోరే), అనీస్ ఖాతూన్ సహనటులు. ‘యునైటెడ్ ఫిల్మ్స్’ అనే చిన్న నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నాణ్యతకీ, కథాంశానికి పేరుపొందింది. శ్యామ్ సుందర్ సంగీతం అందించారు.

ఇదే సంవత్సరంలో, మరో ముస్లిం సామాజిక కథాంశంతో నూర్జహాన్ ప్రధాన పాత్రలో కరణ్‌తో తీసిన ‘జీనత్’ (1945) గొప్ప హిట్ అయింది. షౌకత్ హుస్సేన్ రిజ్వీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మీర్ సాహెబ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నూర్జహాన్ ఆలపించిన పాటలు జనాదరణ పొందాయి.

నర్గిస్, బేగం పారా, కరణ్ – ప్రధాన పాత్రలలో నటించిన ‘మెహందీ’ 1947లో విడుదలయింది. ఎస్. ఫైజల్ దర్శకత్వం వహించారు. రంజిత్ మూవీటోన్ సంస్థ ప్రహ్లాద్ దత్ దర్శకత్వంలో తీసిన సాంఘిక చిత్రం ‘పియా ఘర్ ఆజా’ (1948). కరణ్ సరసన మీనా కుమారి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అగా జాన్, ఎస్.ఎన్.త్రిపాటి సహనటులు. బులో.సి.రాణి సంగీతం అందించారు. ‘రంజిత్ వారు అందించిన ఈ చిత్రం ఎలాంటి అసభ్యతా, చవకబారుతనం లేకుండా క్లీన్ హిట్ అయింది’ అని ప్రశంసలు పొందింది. హీరోయిన్‍గా మీనా కుమారికి ఇది రెండవ సినిమా. ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.

దేశ విభజన అనంతరం మన దేశంలో తీసిన తొలి పంజాబీ సినిమా ‘చమన్’ (1948). రూప్ షోరే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరణ్ దీవాన్, మీనా షోరే, కుల్దీప్ కౌర్ నటించారు. ఈ చిత్రం గొప్ప హిట్ అయింది. వినోద్ స్వరపరిచిన మెలోడీ పాటలు అందరినీ అలరించాయి.

ఫజ్లి బ్రదర్స్ బ్యానర్ పై ఎస్.ఎఫ్.హస్నైన్ దర్శకత్వంలో 1949లో ‘దునియా’ సినిమా వచ్చింది. సి. రామచంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో కరణ్, సురయ్యా, యాకూబ్, షకీలా నటించారు. ‘లాహోర్’ (1949) – దేశ విభజన ప్రభావం ప్రజలపై ఎలా ఉందో చెప్పే చిత్రం. ఈ సినిమాలో కరణ్ సరసన నర్గిస్ నటించారు. ఈ సినిమాని కరణ్ సోదరుడు జైమాని దీవాన్ నిర్మించారు. 1950లో కరణ్ 6 సినిమాల్లో నటించారు, వీటిలో 3 చిత్రాలకి ఎం. సాదిక్ దర్శకత్వం వహించారు.  వీటిలో ఒకటి ‘అన్‌మోల్ రతన్’ (1950). ఎం. సాదిక్ దర్శకత్వం వహించగా, జైమాని దీవాన్ నిర్మించారు. ఈ సినిమాలో మీనా షోరే, నిర్మల నటించారు. వినోద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో తలత్ మహమూద్ తొలిసారిగా హిందీ పాట పాడారు.

కానీ అనిల్ బిస్వాస్ సంగీతం కూర్చిన ‘ఆర్జూ’ (1950) ముందు విడుడల అవడంతో ఆ సినిమాలో తలత్ పాడిన ‘యే దిల్ ముఝే ఐసీ’ పాట ఆయన తొలి పాటగా పరిగణించబడింది. ఎం. సాదిక్ దర్శకత్వంలో వచ్చిన ‘పర్‌దేశ్’ (1950) సిల్వర్ జుబ్లీ హిట్. ఈ సాంఘిక చిత్రంలో మధుబాల, రెహ్మాన్ నటించారు. గులాం మొహమ్మద్ సంగీతం అందించారు. ఎం. సాదిక్ దర్శకత్వంలో ఆయన స్వంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘సబక్’ (1950). అల్లా రఖా ఖురేషీ సంగీతం అందించిన ఈ చిత్రంలో కరణ్, మున్నావర్ సుల్తానా, శ్యామా నటించారు. వరకట్నం దురాచారం పై తీసిన సినిమా ‘దహేజ్’ (1950). వి. శాంతారం తమ రాజ్‍కమల్ కళామందిర్ బ్యానర్ పై తీసిన సినిమా ఇది. కరణ్, పృథ్వీరజ్ కపూర్, జయశ్రీ నటించారు. వసంత్ దేశాయ్ సంగీతం అందించారు.

కరణ్ దీవాన్ 1951లో ‘బహార్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా నటిగా వైజయంతిమాలకి మొదటి చిత్రం.

కరణ్ ‘మాయా’ (1966) చిత్రానికి కాస్టింగ్ ఏజంట్‌గా పనిచేసి, నటీనటుల ఎంపికలో ఆ సినిమా యూనిట్‍కి సహకరించారు. 1960, 70ల దశకాలలో ఆయన సహాయ నటుడిగా పలు చిత్రాలలో నటించారు. వీటిల్లో అప్నా ఘర్ (1960), షహీద్ (1965), జీనే కీ రాహ్ (1969), నాదాన్ (1971) ముఖ్యమైనవి. సోహన్ లాల్ కన్వర్ గారి ‘ఆత్మారామ్’ (1979) కరణ్ చివరి సినిమా.

కరణ్ దీవాన్ 2 ఆగస్టు 1979న బొంబాయిలో మరణించారు.


హాలీవుడ్‌లో భారతీయులు:

అలనాటి హాలీవుడ్‍ని తలచుకుంటే – లాటిన్ నటీనటుల ప్రాభవం గోచరిస్తుంది. Ramon Novarro, Rudolph Valentino, Dolores del Rio, Maria Felix, Maria Montez (క్వీన్ ఆఫ్ టెక్నికలర్), Carmen Miranda, Cesar Romero, Anthony Quinn, Ricardo Montalban and Rita Hayworth వంటి ప్రసిద్ధుల స్మృతిలోకి వస్తారు. హాలీవుడ్ లోనూ, ప్రజల హృదయలలోనూ లాటిన్ అమెరికా – రొమాన్స్‌కీ, సాహసాలకీ, సంగీతానికి నెలవు. అవే  ఆనాటి హాలీవుడ్ సినిమాల్లో ప్రతిబింబించేవి. అయితే కాలక్రమంలో ఈ దృక్కోణం మారింది, లాటిన్ అమెరికన్లను తోటమాలిగా, వెయిటర్లుగా, పనిమనుషులుగా, భవన నిర్మాణ శ్రామికుల్లా చిత్రీకరించసాగారు. ఆ పాత్రలు కూడా ఆనాటి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేవే అట.

అదే కాలంలో భారతీయులను, రాచరికపు సేవకులుగా భావించేవారు. అనాగరికుల్లా, ఒంటి చుట్టూ బట్ట చుట్టుకునే నడిచేవారిలా చూసేవారు. భారతదేశాన్ని పులులు, ఏనుగుల దేశంగా భావించేవారు. ఇదే భావన ఒక యువ భారతీయ నటుడు నటించిన హలీవుడ్ చిత్రంలో వ్యక్తమైంది. ‘సాబు’ అనే వెండితెర పేరుతో ఓ యువ భారతీయ బాలుడు నటించిన ఆ చిత్రం పేరు ‘Elephant Boy’. సాబుకి తొలుత యు.కె. లో గుర్తింపు వచ్చినా, అనతి కాలంలోనే హాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు. ముస్లిం కుటుంబంలో పుట్టిన సాబు పూర్తి పేరు సేలార్ సాబు. ఆయన తన పేరు చివర ‘దస్తగిర్’ అని చేర్చుకున్నారు.  ఈయన తర్వాత మరో భారతీయుడు/భారతీయురాలు హాలీవుడ్‌లో ప్రవేశించడానికి చాలా సమయం పట్టింది. అప్పట్లో సాబు హాలీవుడ్‍లో బాగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత యు.కె. నుండి ఆంగ్లో ఇండియన్ నటి మెర్లె ఒబెరాన్ హాలీవుడ్‍లో ప్రవేశించి – The Dark Angel –  సినిమాలో తన పాత్రకి అకాడమీ అవార్డు గెల్చుకున్నారు. ఆమె ఛాయ తక్కువైనా, Wuthering Heights, Scarlett Pimpernel, Private Life of Henry VIII, That Uncertain Feeling  వంటి చిత్రాలలో శ్వేతజాతి యువతిగా నటించారు.

Sabu (top), Merle Oberon (bottom, left), Kavi Raz

అయినప్పటికీ వెండితెరపై భారతీయుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది. వారు ఎక్స్‌ట్రాలుగా ఉండి, చిన్నా చితకా పాత్రలలో కనబడేవారు. పైగా వారి యాస పాశ్చాత్యులకు హాస్యాస్పదంగా ఉండేది. 1960ల తొలినాళ్ళలో మరికొందరు ఆంగ్లో-ఇండియన్లు హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అటువంటివారిలో ప్రథములు లీలా నాయుడు. ఆమె తల్లి ఫ్రెంచ్ వనిత, తండ్రి భారతీయుడు. ఆమె చాలా సంవత్సరాల పాటు ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరుగా కొనసాగారు. ఆమె ప్రదర్శనని చూసిన యూనివర్సల్ టెలివిజన్ వారు, ఆమె లోని ప్రతిభని గుర్తించి – భారత్ నుంచి హాలీవుడ్ తీసుకువచ్చి  House Holder  అనే సినిమాలో ఫ్రెంచి వనితగా నటించపజేశారు. అయితే ఆమె తరువాత భారత్ తిరిగివచ్చి తన కెరీర్‌ని కొనసాగించారు.

ఆ పై కమలాదేవి రంగప్రవేశం చేసి The Brass Bottle సినిమాలో Burl Ives, Tony Randell లతో నటించారు. ఆవిడ మరికొన్ని సినిమాలు, టెలివిజన్ షోలు చేసి తన సహనటుడైన Chuck Connors ని వివాహం చేసుకుని సినీరంగం నుంచి నిష్క్రమించారు. భారత్‌లో జన్మించిన బ్రిటీష్ నటి Anna Kashfi (అసలు పేరు Joan O’Callaghan) 1950ల చివర్లో హాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. పారమౌంట్ వారి The Mountain లో నటించారు. అయితే మార్లన్ బ్రాండోని వివాహం చేసుకున్నాకా, కొన్ని వివాదాల్లో చిక్కుకుని నటిగా రాణించలేకపోయారు.

Kamala Devi in an episode of the TV series The Man from U.N.C.L.E, 1965

80వ దశకం మధ్య కాలంలో St. Elsewhere అనే టెలివిజన్ సీరిస్‍లో ఓ భారతీయుడు నటించారు. ఆయన పేరు కవి రాజ్. ఈ సిరీస్‌లో ఆయన ఓ వైద్యుడిగా నటించారు. టీవీ సీరిస్‍లో నటించిన తొలి భారతీయుడు ఆయనే. అప్పట్లో ఈ పాత్రని ఏం చేయాలో నిర్మాతలకి అర్థం కాలేదట, ఎందుకంటే ఆయన శ్వేతజాతి యువతితో రొమాన్స్ చేయలేరు. అందుకని – తదుపరి ఎపిసోడ్లల్లో పాత్ర లేని ఓ భారతీయ యువతితో పెళ్ళయినట్లు చూపించారట.

ఆ తర్వాత మరికొందరు భారతీయులు హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వారిలో పెర్సిస్ ఖంబట్టా ముఖ్యులు. పార్శీ వనిత అయిన ఈమె 1979లో తొలి స్టార్ ట్రెక్ చిత్రంలో లెఫ్టినెంట్ ఇలియా పాత్ర పోషించారు. ఆపై మరిన్ని సినిమాలు, టివీ షోలలో నటించారు. 90లకి వచ్చేసరికి భారతీయులంటే సాంకేతిక నిపుణులుగా, సహకార రంగంలో తమదైన ముద్ర వేసేవారిగా గుర్తింపు వచ్చింది. భారతీయులకు అవకాశాలు లభించడం మొదలయింది. ఈ హాఠత్ మార్పుకి కారణం ఏమిటి? నిజానికిది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు. కాలక్రమంగా నెమ్మదిగా వచ్చిన మార్పు. భారతీయులు తమ స్వభావాన్ని మార్చుకుని షో-రన్నర్స్‌గా, రచయితలుగా, నిర్మాతలుగా రాణించడంతో ఇది సాధ్యమయింది. అమెరికాలో భారతీయులను కీలకంగా భావించసాగారు.

ప్రియాంక చోప్రా, అజీజ్ అన్సారీ, మిండీ కలింగ్, అసిఫ్ మాండ్వీ వంటి వారు నేడు అక్కడ ఇంటింటి పేర్లుగా మారడం వెనుక ఎంతో కృషి ఉంది. స్టాండప్-కమేడియన్స్ నుంచి పూర్తి కాలపు టివీ, సినీ నటులుగా ఎదగడానికి వారు ఎంతగానో శ్రమించారు.

Exit mobile version