అలనాటి అపురూపాలు-156

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ప్రేమికుల రోజున జన్మించిన సినీ దిగ్గజం – ప్రేమకు ప్రతిరూపం – మధుబాల:

వెండితెర మీద ప్రేమ యొక్క అపారమైన శక్తికి ప్రతిరూపంగా నిలిచే తారని ఎంచుకోవాల్సి వస్తే, అలాంటి వారు కొందరే ఉన్నారు, అయినా ప్రతీ ఒక్కరు ఎంచుకునేది మధుబాలనే.

ఎవరు ఏమన్నా, ఫిబ్రవరి 14 న ప్రతీ ఏడాది – ప్రపంచవ్యాప్తంగా అనేకులు ప్రేమ శక్తిని – (వేలంటైన్స్ డే) ప్రేమికుల రోజున వేడుకగా జరుపుకుంటారు. ప్రేమకి అడ్డంకులుగా నిలిచే ఎన్నో సామాజిక ఆటంకాలు ఉన్న మన సమాజంలో కూడా ఈ సాంస్కృతిక దిగుమతి ప్రభావం చూపుతోంది.

వెండితెరపై మెరుపులా మెరిసి, తన సౌందర్యంతోనూ, అద్భుతమైన నటనతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసిన నటి మధుబాల జన్మదినాన్ని ప్రేమికుల రోజునే మనం జరుపుకోవడం యాదృచ్ఛికం.

ఫిబ్రవరి 14 1933న ముంతాజ్ జెహాన్ బేగమ్ దెహ్లావీ గా జన్మించిన మధుబాల – తన కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు – తొమ్మిదేళ్ళ లేత వయసులో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తన తండ్రి అత్తావుల్లా ఖాన్ పర్యవేక్షణలో, సహాయంతో సినీరంగంలో అడుగుపెట్టిన స్టార్‌డమ్ సాధించిన ఆమె కెరీర్‍లో ఆయన పాత్ర ప్రముఖమైనది, వివాదస్పదమైనది.

ఈ యువ నటిలోని ప్రతిభని గుర్తించి, మధుబాల అని వెండితెర పేరు పెట్టినది అలనాటి నటి దేవికా రాణి. హీరోయిన్‍గా తొలి సినిమా 1947లో రాజ్ కపూర్ సరసన నటించిన ‘నీల్ కమల్’. ముంతాజ్ అనే పేరుతో మధుబాల నటించిన చివరి చిత్రం ఇదే.

కేవలం 36 ఏళ్ళ జీవిత కాలంలో ఆమె ఎన్నో అద్భుతమైన చిత్రాలు – మహల్ (1949), అమర్ (1954), మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955), చల్తీ కా నామ్ గాడీ (1958), హౌరా బ్రిడ్జ్ (1958), మొఘల్-ఎ-ఆజామ్ (1960), బర్సాత్ కీ రాత్ (1960) వంటి చిత్రాలలో మరపురాని పాత్రలు పోషించారు.

 

ఇది స్వాతంత్య్రానంతర భారతదేశమని గుర్తుంచుకోవాలి. ఆ రోజులు ఆర్థికంగా, సామాజికంగా కఠినమైనవి. ఆ వాతావరణంలో ఆమె సినిమాలు చెరగని ముద్ర వేశాయి. చాలా సినిమాల్లో పేదరికం, దోపిడి, జటిలమైన కుటుంబ సంబంధాల నేపథ్యంలో అల్లిన కథలలో మధుబాల ప్రేమకథలలో నటించారు. ఈ సమస్యలని ప్రతిబింబించే పాటలు నేటికీ భారతీయుల ఇళ్ళల్లో వినబడుతూంటాయి.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ‘అనార్కలి’ రూపంలో మధుబాల మైనపు శిల్పాన్ని ఆవిష్కరించన సందర్భంగా – “మధుబాల స్వల్పకాలమే జీవించింది, కానీ అంత చిన్న జీవితంలోనే ఎన్నో సాధించింది. ఆ రోజుల్లో స్త్రీలకు నటన యోగ్యమైనది కాదని భావించేవారు. కానీ తన అసమానమైన సౌందర్యంతో, అద్భుత నటనతో, తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పర్చుకుంది. ఆ గుర్తింపుతోనే నేటికీ స్మరించబడుతోంది” అన్నారు మధుబాల సోదరి మాధుర్ బ్రిజ్.

గొప్ప గొప్ప పాత్రలలో రాణించినప్పటికీ, ఆమె చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. బాలీవుడ్ ఐకాన్ దిలీప్ కుమార్‍తో తప్పిన వివాహం (అందుకు ఆమె తండ్రే కారణమని చెప్పుకుంటారు), నటుడు/గాయకుడు కిషోర్ కుమార్‍తో పెళ్ళయ్యాకా, 1954లో హఠాత్తుగా బయటపడిన గుండె జబ్బు (బహుత్ దిన్ హువే – సినిమా షూటింగ్ సందర్భంగా) ఆమె జీవితాన్ని కుదిపివేసాయి.

1960 నాటికి ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. “ఆమె జబ్బు వల్ల ఆమె శరీరంలో అదనపు రక్తం తయారయ్యేది, అది నోటి నుండి, ముక్కు నుండి బయటకు వచ్చేది. డాక్టర్ ఇంటికి వచ్చి, సీసాల కొద్దీ రక్తం బయటకి తీసేవారు. ఆమె ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడింది. ఎప్పుడూ దగ్గుతూ ఉండేది. ప్రతీ నాలుగు లేదా ఐదు గంటలకి ఒకసారి ఆక్సీజన్ ఎక్కించాల్సి వచ్చేది లేదంటే ఆమెకి శ్వాస ఆడేది కాదు. దాదపు తొమ్మిదేళ్ళు మంచానికే పరిమితమైంది, చిక్కి శల్యమైంది” ఫిల్మ్‌ఫేర్‌తో చెప్పారు ఆమె సోదరి.

36వ పుట్టినరోజు జరుపుకున్న కొద్ది రోజులకే, 23 ఫిబ్రవరిన, మధుబాల చనిపోయారు. ఎన్నో జ్ఞాపకాలను వదిలివెళ్ళారు. ఆమె జీవితాన్ని ప్రేమకి చిహ్నంగా మనం వేడుక చేసుకుంటున్నాం.


నిండు హృదయాలు చిత్రం శత దినోత్సవ వేడుక:

నిండు హృదయాలు చిత్రం శత దినోత్సవ వేడుక విజయవాడలోని జైహింద్ టాకీసు ప్రాంగణంలో 25 నవంబర్ 1969 నాడు జరిగింది. ఎన్.టి. రామారావు, సావిత్రి, వాణిశ్రీ, ఛాయాదేవి తదితరులు హాజరయ్యారు. గౌరవనీయ అతిథులు, సుమారు లక్షమంది ప్రేక్షకుల సమక్షంలో ఈ సభ జరిగింది.

ముందుగా శ్రీరంగం గోపాలరత్నం ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.

ఆ పిమ్మట జాస్తి నారాయణ రావు పద్మశ్రీ ఎన్.టి. రామారావుని సత్కరించారు. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు సిరిపురపు కోటేశ్వరరావు ఎన్.టి.ఆర్.ని ప్రశంసించారు. తర్వాత సుంకర కనకారావు మాట్లాడుతూ మే 1970 నాటికి ఎన్.టి.ఆర్. 200 చిత్రాలు పూర్తి చేస్తారని తెలిపారు. తర్వాత ఈ చిత్రానికి పని చేసిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి సావిత్రి షీల్డులు అందజేశారు.

ఎన్.టి. రామారావు మాట్లాడుతూ తాను ఇక్కడివాడినే అయినందున, విజయవాడని తాను ఎన్నడూ అతిథిని కాను అన్నారు. ఏ సినిమా యినా హిట్ అవ్వాలంటే కారణం ‘ప్రజలే’ అన్నారు. ఏ సినిమా ఎంత బాగుందో తెలిపే ప్రమాణం ప్రజలే అని అన్నారు. ఈ చిత్ర విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. తనకు డబ్బు సంపాదన మీద, కీర్తి ప్రతిష్ఠల మీద, సత్కారాల మీద ఆసక్తి పోయిందని చెబుతూ, ఇక నుంచి తాను సంపాదించేదంతా దేశానికి, ప్రజలకి దక్కుతుందని ప్రకటించారు (ఈ మాటలు 1969లోనే చెప్పడం ఆశ్చర్యం).

డా. సి. నారాయణరెడ్డి తన ప్రసంగంలో ‘వీర తెలంగాణ నాది’ అనే కవిత చదివారు. దర్శకులు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ – తనకి స్వేచ్ఛనిచ్చిన నిర్మాతకి, కథానాయకుడికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సంభాషణల రచయిత సముద్రాల జూనియర్ కూడా తనకు స్వేచ్ఛనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

వాణిశ్రీ, చంద్రకళ, ఛాయాదేవి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అల్లు రామలింగయ్య, సత్యనారాయణ – ఈ ఘన విజయానికి కారణమైన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. అల్లు రామలింగయ్య మాట్లాడుతూ శతదినోత్సవ వేడుక జరపకపోయినా, ఏమీ కాదనీ – అయినా ఈ వేడుక నిర్వహించినందుకు నిర్మాతను అభినందించారు. ఆఫీసు బోయ్‌ని కూడా గౌరవించినందుకు నిర్మాతను ప్రశంసించారు. స్వరకర్త టి.వి.రాజు, ఘంటసాల, రేలంగి క్లుప్తంగా ప్రసంగించి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చివరగా జైహింద్ టాకీస్ దోనేపూడి బ్రహ్మేశ్వరరావు వందన సమర్పణ చేశారు. అనంతరం జ్యోతి పిక్చర్స్ యజమాని చిత్ర యూనిట్‌కి స్థానిక ఫిల్మ్ ఛాంబర్ హాల్‍లో టీ పార్టీ ఇచ్చారు.


కుంచె ఆరని చిత్రకారుడు రఘువీర్:

శ్రీ రఘువీర్ ముల్‌గాఁవ్‌కర్ ప్రసిద్ధ చిత్రకారులు. ఆయన శరీరనిర్మాణ శాస్త్ర నిపుణుడు. ఆయన చిత్రాలు వాస్తవికతని ప్రతిబింబిస్తాయి.

దాదాపుగా 30 ఏళ్ళ కాల వ్యవధిలో ఆయన పలు అంశాలు – పురాణాలు, సామాజిక సమస్యలు, ఇంకా వాణిజ్య ప్రకటలనపై సుమారు 7000 చిత్రాలను గీశారు. ‘జై కాజల్’ని ఆయన ప్రముఖంగా ప్రచారం చేశారు.

దేవుళ్ళకి రూపమిచ్చిన చిత్రకారుడిగా ఆయన పేరుగాంచారు. జన్మతః చిత్రకారుడైన రఘువీర్ – చిత్రకారుల కుటుంబంలో జన్మించినప్పటికీ – వారి తండ్రి ఆయనకు ప్రోత్సహించలేదు. శ్రీ త్రిన్దత్ గారు నుంచి పెయింటింగ్, ప్రసిద్ధ చిత్రకారులు ఎస్.ఎం. పండిట్ గారి నుంచి స్ప్రే వర్క్ అభ్యసించారు. రఘువీర్ రోజుకు కనీసం  3 – 4 చిత్రాలను చిత్రించేవారు. కుంచె ఆరని చిత్రకారుడని పేరు పొందారు.

తన ప్రతీ చిత్రంలోనూ ఆయన ఒక దృశ్యాన్ని చిత్రించేందుకు తన ఊహాశక్తినే వినియోగించారు. క్లయింట్ కోరితే తప్ప ఆయన మోడల్‌ని గాని ఫోటోగ్రాఫ్‌లను గాని ఉపయోగించలేదు. ఆయన 1976లో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here