సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
స్వయంకృషితో ఎదిగిన డా. ఆచంట లక్ష్మీపతి:
మన సమాజంలో సినిమా రంగంలో రాణించిన వారికి లభించినంత శాశ్వత కీర్తి ఇతర రంగాలలో, ముఖ్యంగా వైజ్ఞానిక రంగాలలో రాణించినవారికి లభించదు. నిజానికి సమాజం గుర్తుంచుకోవాల్సిందీ, ఆదర్శంగా తీసుకోవాల్సిందీ ఇలాంటి ఉత్తమ వ్యక్తులగురించే!!!!. అటువంటి వ్యక్తులు సదా ఆదరణీయులు. డా. ఆచంట లక్ష్మీపతిగారు ఈ కోవలోకే వస్తారు.
అల్లోపతి విధానంలో శిక్షణ పొందినప్పటికీ, ఆయుర్వేదం ప్రాక్టీసు చేసిన డా. లక్ష్మీపతి స్వయంకృషితో ఎదిగారు. ఆయుర్వేద వైద్య విధానంపై ఎన్నో పుస్తకాలు వ్రాసారు. ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా ఆయన ప్రపంచమంతా సుపరిచితులు. జర్మనీ, అమెరికాల నుండి విద్యార్థులు వచ్చి ఆయన వద్ద ఆయుర్వేదం అభ్యసించారు.
ఆచంట లక్ష్మీపతి పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవవరం గ్రామంలో రామయ్య, జానకమ్మ దంపతులకు 3 మార్చ్ 1880 నాడు జన్మించారు. ఆయన తాతగారు సుబ్బారాయుడు సంస్కృత పండితులు, తండ్రి గారిది మామూలు చదువే. వ్యవసాయంతో పాటు వైద్యం అభ్యసించాలని ఆయన కలలు కన్నారు.
ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం లక్ష్మీపతిగారికి హైస్కూల్‍లో గురువు. ఎఫ్.ఎ. పూర్తి చేసాకా, లక్ష్మీపతి – దవులూరి ఉమామహేశ్వర రావు వద్ద గుమాస్తాగా పనిచేశారు. ఉమామహేశ్వర రావు మద్రాసుకు బదిలీకాగా, వారితో పాటు లక్ష్మీపతి వెళ్ళారు. అప్పట్లో బ్రిటీషు వారి పాలనలో ఆంధ్ర మద్రాసు ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. తరువాత 1904లో ఆయన బి.ఎ. డిగ్రీ పూర్తి చేశారు.
ఉమామహేశ్వర రావు సాయంతో ఆయన మెడిసిన్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొంది, 1909లో మెడిసిన్‍లో పట్టా పొందారు. అల్లోపతి వైద్య విధానంలో చదువు పూర్తి చేశాకా ఆపై ఆయన పండిట్ దీవి గోపాలాచార్యులు మార్గదర్శకత్వంలో ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదాన్ని అభ్యసించారు. గోపాలాచార్యులు మద్రాసులో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నడిపేవారు. ‘ధన్వంతరి’ వంటి పలు తెలుగు పత్రికలను, ‘ఆంధ్రా మెడికల్ జర్నల్’ వంటి ఆంగ్ల పత్రికలను ఆయన నిర్వహించేవారు.
లక్ష్మీపతి భారతీయ వైద్యంపై… దర్శనములు, ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వము, ఆయుర్వేద శిక్ష, వనౌషధ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటి పుస్తకాలతో సహా 63 పుస్తకాలు వ్రాశారు. ఆయుర్వేదంపై ఆంగ్లంలో పలు పుస్తకాలు వెలువరించారు.
మొదటి భార్య సీతమ్మ చిన్నతనంలోనే మరణించడంతో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. వారి రెండవ భార్య రుక్మిణమ్మ, తదుపరి కాలంలో స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి (ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్నప్పడు) ఆరోగ్య శాఖ మంత్రిణిగా పనిచేశారు. ఆయుర్వేద వైద్య విధానానికి లక్ష్మీపతి ఎంతగానో సేవలందించారు. ఆల్ ఇండియా ఆయుర్వేద మెడికల్ సొసైటీ అనే సంస్థకీ, ఆంధ్రా ఆయుర్వేద బోర్డ్ అనే సంస్థకీ ఆయన అధ్యక్షులుగా వ్యవహరించారు. మద్రాసులోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనే సంస్థకి కార్యదర్శిగా ఉన్నారు. 6 ఆగస్టు 1962 నాడు ఆయన పరమపదించారు.
వైద్య ఆరోగ్య రంగాలకు ముఖ్యంగా ఆయుర్వేదానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా మద్రాసులోని పలు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టారు. చెన్నై లోని వాలంటరీ హెల్త్ సర్వీసెస్ లోని ‘ఆచంట లక్ష్మిపతి యూనిట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్’, చెన్నై విహెచ్ఎస్ లోని ‘ఆచంట లక్ష్మీపతి న్యూరోలాజికల్ సెంటర్’ మొదలైనవి ఉదాహరణలు.
రుక్మిణీ లక్ష్మీపతి:
అవకాశాలు అందిపుచ్చుకుని ఎంచుకున్న రంగంలో రాణించిన మహిళలలో రుక్మిణీ లక్ష్మీపతి ఒకరు. ఆమె 6 డిసెంబర్ 1892 నాడు మద్రాసులోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వారి తాతగారు ప్రముఖ భూస్వామి రాజా టి. రామారావు. మద్రాసులోకి వుమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి బి.ఎ. పట్టా పొందారామె. తదుపరి డా. ఆచంట లక్ష్మీపతిని వివాహమాడారు.
1923లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1926లో పారిస్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ వుమెన్స్ సఫ్రేజ్ అలియన్స్ కాంగ్రెస్’లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 1930లో వేదారణ్యంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు గాను ఆమెను ఒక సంవత్సరం పాటు జైల్లో పెట్టారు. ఉప్పు సత్యాగ్రహంలో జైలు శిక్ష పడిన మొదటి మహిళ ఈవిడే.
1934లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‍కి జరిగిన ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 1937 ఎన్నికలలో ఆమె మద్రాస్ ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 జూలై 1937 నాడు ఆమె అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‍గా ఎంపికయ్యారు. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో 1 మే 1946 నుంచి 23 మార్చ్ 1947 వరకు మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రజారోగ్య శాఖ మంత్రిణిగా పనిచేశారు. ఆ మంత్రివర్గంలో ఆమె తొలి, ఏకైక మహిళా మంత్రి.
చెన్నైలోని ఎగ్మోర్ లోని మార్షల్ రోడ్‍కి ఆమె పేరు పెట్టారు. ఆమె జ్ఞాపకార్థం, 1997లో ఒక పోస్టేజ్ స్టాంప్ విడుదల చేశారు.
తెలుగు, హిందీ సినీనటుల మధ్య క్రికెట్ మ్యాచ్ 1976:
14 మార్చ్ 1976 ఆదివారం నాడు హైదరాబాద్ లోని లాల్ బహాదూర్ స్టేడియంలో దక్షిణాది, ఉత్తరాది సినీనటుల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఉత్తరాది నటుల జట్టుకు దిలీప్ కుమార్, దక్షిణాది నటుల జట్టుకు ఎన్.టి.ఆర్. నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్‌లో ఉత్తరాది జట్టు గెలిచింది. దక్షిణాది నటులు ఉత్తరాది నటుల బౌలింగ్‌ని తట్టుకోలేక పేక మేడల్లా వికెట్లను కోల్పోయారు, ఎందుకంటే వారిలో చాలామందికి క్రికెట్ ఆడడం అదే మొదటిసారి. “ప్యాడ్స్ కట్టుకునే టైమ్ కూడా ఇవ్వట్లేదు, ఔట్ అంటున్నారు” అని అక్కినేని నాగేశ్వరరావు వాపోతే, “అసలు మనమేంటి ఆడడం ఈ వయసులో, మన పిల్లలు ఆడాలి గాని” అని ఎన్.టి.ఆర్. అన్నారట. అక్కినేని పరిగెత్త లేకపోతే, ఆయనకి బదులుగా శ్రీధర్ పరిగెత్తారట. అక్కినేని రెండు పరుగులు చేయగా, ఎన్.టి.ఆర్.; శోభన్ బాబు సున్నాకే అవుటయ్యారు. తెలుగు నటుల తరఫున రంగనాథ్ అథ్యధికంగా 13 పరుగులు చేశారు. వాణిశ్రీ మూడు పరుగులు చేశారు. సూర్యకాంతం కూడా ఒక పరుగు సాధించారు. జమున, జయచిత్ర, కాంచన, సత్యనారాయణ కూడా చెరో పరుగు సాధించారు. అభిమానుల సందడి మధ్య రాజబాబు ఫీల్డులోకి వచ్చారు. బలంగా బంతిని బాది, తొలి బంతికే ఆయన రన్ అవుట్ అయ్యారు. జయప్రద, జయసుధ, జయచిత్ర, రోజా రమణి వంటి తెలుగు నటీమణులు ఉత్తరాది నటీనటులకు స్నాక్స్ అందించారు. వాణిశ్రీని హెలెన్ అవుట్ చేశారు. శ్రీధర్‍ని నీతూ సింగ్ అవుట్ చేశారు. సినిమాలలో నటించనప్పటికీ, గుమ్మడి తనయుడు జయబాబు ఈ మ్యాచ్‌లో ఆడి 8 మంది హిందీ నటులను అవుట్ చేశారు. గవర్నర్ ఆయనను బెస్ట్ బౌలర్‍గా ప్రకటించారు.
దిలీప్ కుమార్ 38 పరుగులు చేయగా, గవర్నర్ ఆయనను బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించారు. ‘వుయ్ వాంట్ సిక్సర్’ అని ప్రేక్షకులు అరిచినప్పుడల్లా, దిలీప్ కుమార్ సిక్స్ కొట్టి బంతిని స్టేడియం బయటకు పంపారు. 28 పరుగులతో అమితాబ్ రెండో స్థానంలో నిలిచారు. నటీమణులలో బెస్ట్ బౌలర్‌గా జయసుధ ఎంపికయ్యారు. శశికపూర్ చూడకూడదని రిషీ కపూర్ దొంగచాటుగా సిగరెట్ కాల్చారట. బ్యాటింగ్‌కి వెళ్ళమంటే రిషీ కపూర్ భయపడ్డారట. అప్పుడు ‘నీతూ సింగ్ నీతో బాటు ఆడుతుంది’ అని శశి కపూర్ ధైర్యం చెప్పి పంపించారట. నీతూ సింగ్‍ని జయబాబు అవుట్ చేయగా, ఆమె ఫీల్డ్ విడిచి వెడుతుండగా, రిషీ కపూర్ ఆమె చేయి పట్టుకుని తాను కూడా బయటకు నడిచారట. వాళ్ళ స్థానంలో హెలెన్ బ్యాటింగ్‌కి వచ్చారు. అప్పుడు ‘ఖేల్ ఖేల్ మే’ ఆనే పాటని స్టేడియంలో వినిపిస్తే, హెలెన్ నృత్యం చేశారట.
ఆ నాటి మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు దిగువన అందిస్తున్నాము. గవర్నర్ మోహన్‌లాల్ సుఖాడియా అందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఈ మ్యాచ్‌ని ఆంధ్రాబ్యాంక్ స్పాన్సర్ చేసింది. వాణిశ్రీ, రాజబాబు తమ జ్ఞాపికలు అందుకున్నారు. బంతిని బలంగా విసురుతూ, ఎన్.టి.ఆర్. తన చొక్కా చించుకున్నారట ఈ మ్యాచ్‍లో (అన్నగారా మజాకా! మన దేశం చిత్రం షూటింగ్‌లో -నటనలో లీనమై పోయి ఎస్ట్రా నటులను నిజంగా కొట్టడం… నాకు గుర్తుంది). జమున హెలెన్ నుంచీ, ఇంకా అందరు ఉత్తరాది నటీనటుల నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఆమె తన కుమారుడు వంశీతో కలిసి వచ్చారు. రోజా రమణి, జయప్రదలు ఫోటోకి అందంగా నప్పారు. శోభన్ బాబు శశి కపూర్‌తో కనిపించారు… ఈ మొత్తం మ్యాచ్‌ని సురేష్ మూవీస్ వారు చిత్రీకరించి, తమ సినిమా ‘సెక్రటరీ’ ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించారు. ఈ మ్యాచ్‌కి సి. నారాయణ రెడ్డి, అలీ బేగ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.