[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
బల్‍రాజ్ సహ్నీ – వెంటాడిన విషాదాలు:
హిందీ చలనచిత్ర సీమలో విశిష్ట నటుడిగా గుర్తింపు పొందిన బల్‌రాజ్ సహ్ని 1 మే 1913 నాడు నేటి పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించారు. ఆయన అసలు పేరు యుధిష్ఠిర్ సహ్ని. సాహిత్యంలో డబుల్ ఎం.ఎ. చేసిన ఆయన తమ ప్రొఫెసర్ జస్వంత్ రాయ్ కుమార్తె దయమంతిని 1936లో వివాహం చేసుకున్నారు.
1937-38 నడుమ వారు కశ్మీరులోని మారుమూల ప్రాంతాలలో, నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్‍లో పర్యటించారు. తరువాత వారు బెంగాల్‍లో రవీంద్రుని శాంతినికేతన్‍లో ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆ కాలంలోనే దమయంతి మొదటి సారి గర్భవతి అయ్యారు (కుమారుడు పరీక్షిత్ సహ్నీ). నాలుగేళ్ల తరువాత ఈ దంపతులకు కుమార్తె షబ్నం జన్మించారు.
బల్‌రాజ్ లండన్‍లో బిబిసి వారి హిందీ విభాగంలో చేరారు. రష్యన్ సినిమాల వల్ల ప్రభావితమై ఈ దంపతులు మార్క్సిజం పై ఆసక్తి పెంచుకున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కాంక్షించారు. వీరిద్దరూ 1943లో భారతదేశానికి తిరిగి వచ్చి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఎ)లో చేరారు. ‘దీవార్’ అనే నాటకంలో కనబరిచిన ప్రదర్శనకు దమయంతి గారికి మంచి పేరొచ్చింది, ఆవిడో గొప్ప స్టార్ అయిపోయారు. మొదట దీన్ని తాను వ్యతిరేకించానని ఆయన తన ఆత్మకథ (మేరీ ఫిల్మీ ఆత్మకథ)లో ప్రస్తావించారు. బల్‍రాజ్ కూడా 1946లో సినీ రంగంలోకి ప్రవేశించి, ఇన్సాఫ్, ధర్తీ కే లాల్, నీచా నగర్, దూర్ చలేఁ (దమయంతిగారితో నటించిన చివరి చిత్రం) వంటి సినిమాలో నటించారు.
సిపిఐ సభ్యురాలైన దమయంతి పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. మురికివాడలలో పని చేస్తూ, స్థానికులతో కలిసి భోజనం చేసేవారు. దురదృష్టవశాత్తు, ఆమెకు ‘అమీబిక్ డీసెంట్రీ’ అనే వ్యాధి సోకింది. దీని కోసం ఇచ్చిన మందులు ఆమె గుండెపై ప్రతికూల ప్రభావం చూపాయి. 1947లో చనిపోయినప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. ఈ హఠాత్పరిణామం వల్ల గుండె చెదిరిన బల్‍రాజ్ తలను బాదుకుంటూ రోదించారు. భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు తనని తాను నిందించుకున్నారు. అప్పటికి పరీక్షిత్ వయసు 8 ఏళ్ళు.
చాలా ఏళ్ళ తరువాత, ఔలాద్ (1954) సినిమా షూటింగ్‍లో ఓ సన్నివేశంలో నటించడం ద్వారా తన మనోవేదనని తొలగించుకున్నారు బల్‌రాజ్. ఆ సన్నివేశంలో బల్‌రాజ్ తన యజమాని ఇంటి గేటుని పట్టుకుని తన బిడ్దను వదిలేయమని ప్రార్థించాల్సి ఉంటుంది. షాట్ ఓకే అయింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజుకి షూటింగ్ ముగించి బయల్దేరారు. కానీ ఎందుకో అసంతృప్తిగా ఉన్న బల్‌రాజ్ వెనక్కి వచ్చి దర్శకులు మోహన్ సెగల్ గారితో ఆ సీన్‍ని రీ-టేక్ చేద్దామని చెప్పారు. సెట్ లో లైట్లు వెలిగాయి. బల్‌రాజ్ ఆ సీన్ మళ్ళీ చేశారు. అయితే ఈసారి ఎవరూ చప్పట్లు కొట్టలేదు, ఎందుకంటే వారంతా ఏడుస్తున్నారు. వారిని ఆ సన్నివేశం అంతలా కదిలించింది. తర్వాతి కాలంలో బల్‌రాజ్ – “నేను ఆ షాట్‌ని ఫీల్ అవ్వాలని అనుకున్నాను. మీ అమ్మ చనిపోయినప్పుడు నా భావనలు ఎలా ఉండేవో, వాటిని ప్రదర్శించాలనుకున్నాను” అని కుమారుడు పరీక్షిత్‍తో చెప్పారు.
అస్తిత్వ ఆరాటం:
1951లో బల్‍రాజ్ ‘చందోక్’ అనే రచయిత్రిని పెళ్ళి చేసుకున్నారు. వారికి పుట్టిన కుమార్తెకు ‘సనోబర్’ అని పేరు పెట్టారు. తన రెండవ నివాసమైన కశ్మీరులోని దేవదారు వృక్షాలను గుర్తు చేసుకునేలా ఆమెకు ఆ పేరు పెట్టారు. ‘Balraj And Bhisham Sahni: Brothers In Political Theatre’ అనే పుస్తకం రాసిన ఆయన సోదరి కల్పనా సహ్ని ఒక సంఘటనని గుర్తు చేశారు. ఓరోజు ఉదయం బల్‍రాజ్ శ్రీనగర్‍లోని తమ ఇంటికి వెళ్ళి గుమ్మం ముందు నిలుచుని వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చారట (అప్పటికే సినిమాల్లో ప్రసిద్ధి పొందిన నటుడాయన). ఈ ఘటనని వాళ్ళింటి ముసలి తోటమాలి గమనించారట. అక్కడికి బల్‌రాజ్ ఎందుకు వెళ్లారో స్పష్టంగా తెలియకపోయినా, బహుశా తన మూలాలను అన్వేషిస్తూ వెళ్ళుంటారని భావించారు.
తనకి 42 ఏళ్ళ వయసులో ఆయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అదే సమయంలో సిపిఐ కోసమూ పని చేశారు. ఓసారి జైలుకు కూడా వెళ్ళారు. 1950 దశకంలో ఆయన నటించిన సీమ, సోనే కీ చిడియా, లాజవంతి, ఘర్ సంసార్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. బిమల్ రాయ్ దర్శకత్వంలో నటించిన ‘దో బీఘా జమీన్’ (1953) చెప్పుకోవాల్సిన చిత్రం. ఇందులో బల్‌రాజ్ రిక్షా నడిపే వ్యక్తిగా మారిన రైతుగా నటించారు. మార్క్సిస్ట్ ఆదర్శాలు మెండుగా ఉన్న బల్‌రాజ్ అణగారిన రిక్షావోడి పాత్రకి ప్రాణం పోశారు. ఈ పాత్ర కోసం ఆయన మండుటెండలో చెప్పులు లేకుండా రిక్షా లాగడం సాధన చేశారు. పాదాలు ఎండకి కాలి బొబ్బలు వచ్చేవి.
ఆయన కెరీర్‍లో మరో ఘనమైన చిత్రం ‘కాబూలీవాలా’ (1961). ఈ సినిమాలో మాతృభూమికై తపించే పఠాన్ పాత్రలో ఒదిగిపోయార్ బల్‍రాజ్. తన జన్మస్థలమైన పాకిస్తాన్ లోని రావల్పిండి పట్ల ఆయన కున్న ప్రేమని ఈ పాత్ర ద్వారా వ్యక్తం చేశారని అంటారు. సోదరి వేదవతి మరణించడంతో ఆమె పిల్లల బాధ్యతలు స్వీకరించారు సోదరులు బల్‌రాజ్, భీష్మ్ సహ్నీలు. బల్‌రాజ్‍కి తన సొంత కుటుంబంతో పాటు సమాజమన్నా మక్కువ ఎక్కవ. అసలు సిసలైన మానవతావాదైన ఆయన – ఎక్కడ మత కలహాలు సంభవించినా – అది భివాండీ అయినా బంగ్లాదేశ్ అయినా – అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలిచేవారు. ఈస్ట్ పాకిస్తాన్‍కి విముక్తి కల్పించేందుకు 1971లో అప్పటి ప్రధాని పాకిస్తాన్‍పై ప్రకటించిన యుద్ధాన్ని సమర్థించినందుకు పార్టీ బల్‍రాజ్‍ను నిందించి ఆయనను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ఒక తీర్మానం వెలువరించింది. ఫలితంగా ఆయనెంతో నిరాశకు లోనయ్యారు.
కుమారుడితో అభిప్రాయభేదాలు:
బల్‍రాజ్ గారికి తన కుమారుడు, నటుడు పరీక్షిత్‍తో ఉన్న అభిప్రాయభేదాలు అందరికీ తెలిసినవే. బాల్యంలో పరీక్షిత్ తన తండ్రికి దూరంగా, మాతామహుల ఇంట, మేనమామ వద్ద, ఆ పిమ్మట బోర్డింగ్ స్కూల్లోనూ ఉన్నారు. “యవ్వనంలో ఉన్నప్పుడు మీలో తిరుగుబాటుతనం అధికంగా ఉంటుంది. నన్ను కుటుంబానికి దూరంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. అందుకని చాలా ఏళ్ళపాటు నాన్నని నిందించాను. కానీ సినిమాల్లో చేరేముందు నేను చదువులో రాణించాలన్నది ఆయన కోరిక” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పరీక్షిత్.
పశ్చాత్తపం చెందిన బల్‍రాజ్ తనని ఓ స్నేహితుడిలా పరిగణించమని కుమారుడిని కోరారు. “కానీ నేను పట్టించుకోలేదు. ఆయనతో ప్రేమగా మసలుకోలేకపోయాను” చెప్పారు పరీక్షిత్. తరువాతి కాలంలో తన తండ్రితో అనుబంధంలో ఉన్న ఉద్రిక్తతలను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా పరీక్షిత్ ‘The Non-Conformist: Memories Of My Father Balraj Sahni’ అనే పుస్తకం రాశారు. “నాన్న జీవితంలో ఆఖరి రెండు సంవత్సరాలలో నేను ఆయనకి బాగా దగ్గరయ్యాను. నాకెన్నో పశ్చాత్తాపాలు ఉండేవి. నేను మంచి కొడుకును కాలేకపోయాను. మా మధ్య తండ్రీ కొడుకుల సంబంధాన్ని నిలిపి ఉంచేందుకు నాన్న ఎంతో ప్రయత్నించారు. కానీ మా మధ్య పెద్ద అగాధం ఉండేది. నాకీరోజు తెలుస్తోంది, ఆయన నన్నెంత ప్రేమించేవారో. ఆ ఋణాన్ని తీర్చుకోలేను” అని ఫిల్మ్‌ఫేర్ పత్రికకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పరీక్షిత్. “సినీ పరిశ్రమలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మా కుటుంబానికి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. కీర్తికీ ఓ వెల ఉంటుంది” అన్నారాయన.
కుమార్తె షబ్నమ్ మరణం:
1970ల తొలినాళ్ళలో బల్‌రాజ్ కుమార్తె షబ్నమ్ – వివాహం విచ్ఛిన్నమై – తండ్రితో కలిసి ఉండేందుకు వచ్చారు. మానసికంగా క్రుంగిపోయిన ఆమె తాను ఎవరికీ అవసరం లేనిదానినని భావించేవారు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఫలితంగా బ్రెయిన్ హెమర్రేజ్‍కి గురయి 1972లో కన్నుమూశారు. “షబ్నమ్‍కి అప్పుడు 26-27 ఏళ్ళు ఉంటాయేమో.. అదే వయసులో మా అమ్మ కూడా చనిపోయింది. షబ్నమ్ అచ్చుగుద్దినట్టు అమ్మలానే ఉండేది. చెల్లి మరణంతో నాన్న క్రుంగిపోయారు, ఆ వేదన నుంచి కోలుకోలేదు” చెప్పారు పరీక్షిత్. “నా పరిస్థితి ఇంకా దారుణం. తను నా చేతుల్లోనే చనిపోయింది. నేను తాగడం మొదలుపెట్టాను, ట్రాంక్విలైజర్స్ వాడాల్సి వచ్చింది” చెప్పారు పరీక్షిత్.
ఈ కాలంలోనే బల్‍రాజ్ ఎం.ఎస్. సత్యూ తీస్తున ‘గరమ్‌హవా’ (1974) చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాలో అణగారిన ముస్లింల వేదనను ప్రదర్శించే సలీమ్ మీర్జా అనే పాత్ర పోషించారు బల్‍రాజ్. స్వాతంత్ర్యానంతరం పాకిస్తాన్ వదిలి భారత్ వచ్చిన శరణార్థిలా తన భావోద్వేగాలను ప్రదర్శించారు. ఆ సినిమాలో ఆయన కూతురు పాత్రధారి (గీతా కక్) ఆత్మహత్య చేసుకుంటుంది. “ఈ సన్నివేశంలో నటించేటప్పుడు నాన్నకి షబ్నమ్ మరణం గుర్తుకురావడం ఎంతో దుర్భరమైంది” చెప్పారు పరీక్షిత్.
ఆ సినిమా లోని సలీమ్ మీర్జా పాత్ర – బల్‍రాజ వ్యక్తిగత జీవితపు వేదనకి దగ్గరగా ఉంది. అంతకు కొన్ని రోజుల ముందే ఆయన తన కుమార్తెను విషాదకర పరిస్థితులలో కోల్పోయారు. “ఆ సినిమాలో సలీమ్ మీర్జా తన కూతురిని పోగొట్టుకున్న దుఃఖం – ఆయన జీవితపు తాజా వేదనని ప్రతిఫలించింది. ఆ విషాదం నుంచి ఆయన కోలుకోలేకపోయారు. అదే వేదనని తెరపై మళ్ళీ ప్రదర్శించాల్సి రావడం మరింత బాధాకరం” అని ఓ పత్రికలో రాశారు బల్‍రాజ్ బంధువు హర్షి ఆనంద్.
13 ఏప్రిల్ 1973 నాడు బల్‍రాజ్ గుండెపోటుతో మరణించారు. అంతకు ముందు రోజే ‘గరమ్‌హవా’ చిత్రానికి తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా చివరిలో వచ్చే ‘ఇన్‍సాన్ కబ్ తక్ అకేలా జీ సక్తా హై’ అనే వాక్యం ఆయన పలికినదే. “ఆ మాటలే నాన్న చివరి మాటలు” చెప్పారు పరీక్షిత్. బల్‍రాజ్ నటించిన గొప్ప చిత్రంగా పలువురు భావించే ‘గరమ్‌హవా’ సినిమాను ఆయన చూడలేకపోయారు.
చివరి దశలో ఆయన సినిమాలు బాగా తగ్గించుకుని, రచనలపై దృష్టి సారించాలనుకున్నారు. పంజాబ్‍లో ఓ ఇల్లు కూడా కొనుక్కున్నారు. కానీ తన 60వ పుట్టినరోజుకి ఒక నెల ముందు 13 ఏప్రిల్ నాడు పంజాబ్‍కి బయల్దేరారు. కానీ చేరుకోలేకపోయారు. ఆయన స్వప్నం సాకారం కాలేదు.
“స్నేహితులు, బంధువులు, కొందరు ప్రముఖులు కాకుండా – జాలర్లు, హోటల్ సర్వర్లు, వీధిబాలలు వచ్చి బల్‌రాజ్‍ను చివరిసారిగా చూసుకున్నారు. జాలర్లు రాత్రంతా ఆయన శవానికి కాపలాగా ఉన్నారు. తాము సమ్మె చేసినప్పుడు తమకు అండగా ఉన్నందుకు హోటల్ సర్వర్లు కూడా ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు” అని బల్‌రాజ్ తమ్ముడు, ప్రసిద్ధ రచయిత భీష్మ్ సహ్నీ తన పుస్తకం ‘Balraj, My Brother’ లో రాశారు.
బల్‍రాజ్ కోరిక మేరకు ఆయన భౌతిక కాయంపై పూలదండలు ఉంచలేదు. పురోహితులను పిలిపించి మంత్రాలను చదివించలేదు. మార్క్సిస్ట్ కాబట్టి తన విగత శరీరంపై ఎర్రజెండాని కప్పమని కోరారాయన. జీవితాంతం భావోద్వేగాల భారాన్ని మోసిన ఆయన, తనతో పాటు తన విశ్వాసాన్ని వెంట తీసుకెళ్ళాలనుకున్నారు.
***
ఆయన సినిమాల్లోని కొన్ని పాటలు:
https://www.youtube.com/watch?v=P5rxDMwU4HM
https://www.youtube.com/watch?v=e2D-kjOMNF0
నటి కామిని కౌశల విఫల ప్రేమ:
ప్రముఖ నటి కామినీ కౌశల్ ప్రసిద్ధ నటుడు దిలీప్ కుమార్‍ని ప్రేమించారు. కానీ తన అక్కయ్య ఉష కారు ప్రమాదంలో మరణించడంతో, ‘ప్రేమ’ కన్నా ‘కర్తవ్యాని’కి ప్రాధాన్యతనిచ్చి – కుటుంబ సభ్యుల కోరిక మేరకు – అక్క బిడ్డలను చూసుకునేందుకు గాను తమ బావగారు బి.ఎస్. సూద్ (బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో చీఫ్ ఇంజనీర్)ని పెళ్ళి చేసుకున్నారు. “అక్క అంటే నాకెంతో అభిమానం. తల్లి లేని లోటు వల్ల రెండు మూడేళ్ళ వయసున్న అక్క పిల్లలు – కుమ్‌కుమ్, కవిత – ఇబ్బంది పడకూడదనుకున్నాను” చెప్పారామె. 1948లో ఈ వివాహం జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. తనది ‘త్యాగం’ అని భావింఛక, ఆ సమస్యకి అది పరిష్కారంగా తలచారామె. కాకపోతే, అంత పెద్ద బాధ్యతని తాను నిర్వర్తించగలనా అని సందేహించారు.
కామినీ కౌశల్ వివాహం చేసుకోవడం దిలీప్ కుమార్‍ని బాగా బాధించిందని ఇస్మత్ చుగ్తాయ్ తెలిపారు. దిలీప్ కుమార్‍తో ప్రేమాయణం కొనసాగిస్తే – కామినీ సోదరుడు తుపాకీతో సెట్‌కి వచ్చి – చంపేస్తానని బెదిరించాడన్న వార్తని దర్శకులు పి.ఎన్.అరోరా బహిర్గతం చేశారు. ఆమె సోదరుడి సైన్యంలో పని చేసేవాడనీ, అతను దిలీప్ కుమార్‍ని కూడా చంపేస్తానని అన్నాడని అరోరా తెలిపారు. ఈ ఎడబాటే దిలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్‍గా మారేందుకు కారణమయిందని అంటారు. తొలి ప్రేమ వైఫల్యపు బాధని అణచుకుని దాన్ని తెర మీద పాత్రలలో ప్రదర్శించారు దిలీప్ అని అంటారు. చాలా ఏళ్ళ తరువాత – వీరిద్దరి విఫల ప్రేమ మీద బి.ఆర్. చోప్రా ఓ సినిమా తీస్తానని అంటే, దిలీప్ కుమార్ వద్దని చెప్పారట.
“జీవితం అంటే మార్పు. మార్పు లేకపోతే అది జీవితమే కాదు” అని ఒకసారి అన్నారు కామినీ. అవును, వారి జీవితాలు మారిపోయాయి. గతాన్ని మరిచి ఇద్దరు ముందుకు సాగిపోయారు. హిందీ చలన చిత్ర చరిత్రలో దిలీప్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. కామినీ కూడా సినీరంగంపై తనదైన ముద్ర వేశారు. హిందీ సినీ చరిత్రలో వీళ్ళిద్దరికీ కొన్ని ఉమ్మడి పేజీలు ఉండడం అసాధారణం కాదు.
తన జీవితం చివరి దశలో దిలీప్ కుమార్ జ్ఞాపకశక్తిని పోగొట్టుకున్నారు. తనని ఆయన గుర్తించకపోతే, గుండె బద్దలవుతుందని – కామినీ గారు ఎన్నడూ ఆయనని కలవలేదట! ఎంతటి విషాదం!