Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 165

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుస్వరాల జోడీ – శంకర్ జైకిషన్:

మంత్రదండం అంటూ ఉండి ఉంటే, అది ఖచ్చితంగా శంకర్ జైకిషన్‍ల వద్ద ఉండి ఉండాలి, ఎందుకంటే ఈ జంట 1950, 60 దశకాలలో దేన్ని పట్టుకున్నా అది బంగారం అయ్యేది. ఆ రోజుల్లో వారు ఆనాటి ప్రముఖ నటీనటుల కంటే అధిక పారితోషికం తీసుకునేవారని చెప్తారు. వాళ్ళు ఓ సినిమాకి పని చేస్తున్నారని తెలిస్తే, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చేవారు. ఈ జోడీని దృష్టిలో ఉంచుకుని సినిమాల ప్రచారం చేసేవారు. ఉత్తమ సంగీత దర్శకులుగా తొమ్మిది సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న ఘనులు. ఆధునిక కాలంలో ఎ. ఆర్. రెహ్మాన్ మాత్రమే వీరిని అధిగమించగలిగారు. సినీ సంగీత రంగంలో దిగ్గజాలైన శంకర్ జైకిషన్‍ల కీర్తి – నేటికీ వెలుగొందుతోందనడంలో అతిశయోక్తి లేదు.

భిన్నమైన ప్రారంభాలు:

శంకర్‌సింగ్ రామ్‌సింగ్ రఘువంశీ 15 అక్టోబర్ 1922 నాడు పంజాబ్‍లో జన్మించారు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు మారింది. యువ శంకర్ శాస్త్రీయ నృత్యంలోనూ, సంగీతంలోనూ ఆసక్తి కనబరిచారు. ఆయన కుస్తీ, నృత్యం నేర్చుకున్నారు. పలు వాయిద్యాలను వాయించటంలో ప్రతిభ కనబరిచారు. ఆలయాలలో తబలా వాయించేవారు. తరువాతి కాలంలో వారి కుటుబం ముంబైకి తరలింది. అక్కడ ఆయన బాబా నాసిర్ ఖాన్ సాహిబ్ వద్ద తబలా వాయించడం నేర్చుకున్నారు. స్వరకర్త ఖవాజా ఖుర్షీద్ అన్వర్ వద్ద శిష్యరికం చేశారు. దిగ్గజ స్వరకర్తల ద్వయం హుస్న్‌లాల్ భగత్‌రామ్‌‍లకు సహాయకుడిగా చేరారు. రంగస్థలం పట్ల ఇష్టంతో, ఆయన పృథ్వీ థియేటర్‌లో చేరి, రాజ్‍ కపూర్‍తో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం ఆత్మీయ స్నేహంగా మారింది.

జైకిషన్ దయాభాయ్ పంచాల్ 4 నవంబర్ 1929 నాడు గుజరాత్‍లోని బన్స్దా పట్టణంలో జన్మించారు. జైకిషన్ సంగీత్ విశారద్ వాడిలాల్జీ వద్ద, ఆ తరువాత ప్రేమ్ శంకర్ నాయక్ వద్ద సంగీతం అభ్యసించారు. నిజానికి జైకిషన్ నటుడవ్వాలని ముంబై వచ్చారట, అక్కడ ఆయన వినాయక్ తాంబే వద్ద శిష్యరికం చేసి హార్మోనియం వాయించడంలో ఎంతో నైపుణ్యం సాధించారు.

అదృష్టంతో దక్కిన అవకాశం:

ప్రముఖ దర్శకులు చంద్రవదన్ భట్ గారి ఆఫీసులో తొలిసారిగా కలిసినప్పుడు – శంకర్, జైకిషన్‍లు – సంగీతం పట్ల తమకి ఉన్న ప్రేమని వారిద్దరు గుర్తించారు. పృథ్వీ థియేటర్‌ వారు హార్మోనియం వాయిద్యకారుల కోసం అన్వేషిస్తుంటే, శంకర్, వారిని జైకిషన్‍ని పరిచయం చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మిత్రలు పృథ్వీ థియేటర్‌ వారి నాటకాలకు సంగీతం అందిస్తూ, కొన్ని సార్లు నటిస్తూ ఉండేవారు. రాజ్ కపూర్ సొంతంగా ఆర్.కె. ఫిల్మ్స్ అనే సంస్థని స్థాపించి – ‘ఆగ్’ (1948) చిత్రం నిర్మిస్తూ – శంకర్ జైకిషన్‍లను – సంగీత దర్శకుడు రామ్ గంగూలీకి సహాయకులుగా తీసుకున్నారు. అయితే రాజ్ కపూర్ తన తదుపరి చిత్రం ‘బర్సాత్’ (1949) చిత్రం కోసం పాటలను సిద్ధం చేస్తుండగా – తమ సినిమా కోసం రూపొందించిన బాణీని రామ్ గంగూలీ మరో నిర్మాతకి అమ్మేయడానికి ప్రయత్నించటంతో ఆగ్రహించిన రాజ్ కపూర్ ఆయనని తొలగించి, శంకర్‍కి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అప్పుడు శంకర్ – తనతో పాటు జైకిషన్‌‌ని కూడా తనకి వర్తించే షరతులతోనే తీసుకోవాలని రాజ్ కపూర్‌ని కోరారు. ఆయన అంగీకరించటంతో వీరిద్దరూ జంట స్వరకర్తలయ్యారు. ‘బర్సాత్’ పాటలు సూపర్ హిట్ అయి, వీరిద్దరూ రాత్రికి రాత్రే ప్రసిద్ధులైపోయారు.

వీరికి అవకాశం ఇచ్చినది రాజ్ కపూరే అయినా, వారి మొత్తం విజయానికి ఘనతని రాజ్ కపూర్‌కి కట్టబెట్టలేం. ఆర్.కె. ఫిల్మ్ సంస్థకి సంబంధించని ఇతర సినిమాలు – దాగ్, బసంత్ బహార్, ఆమ్రపాలి, అస్లీ నక్లీ, ఆర్జూ, దిల్ ఏక్ మందిర్, జంగ్లీ, లవ్ ఇన్ టోక్యో, యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్ – వంటి చిత్రాలకు గొప్ప సంగీతం అందించి వాటి విజయానికి దోహదం చేశారు శంకర్ జైకిషన్‍.

సృజనాత్మక స్వరకర్తలు:

తమ తొలి చిత్రం ‘బర్సాత్’ నుంచే వీరు రిస్క్ చేయటం ప్రారంభించారు. లతా మంగేష్కర్‍ను ప్రధాన గాయనిగా ఎంచుకుని, ఇద్దరు హీరోయిన్‍లు – నిమ్మీ, నర్గిస్ లకు – లతా మంగేష్కర్ తోనే పాడించారు. జియా బేకరార్ హై, హవా మే ఉడ్తా జాయే, ముఝే కిసీ సే ప్యార్ హోగయా వంటి పాటలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ‘బర్సాత్ మే’ అనే పాటతో టైటిల్ సాంగ్స్ ఒరవడిని ప్రారంభించినది ఈ జోడీయే. స్వరకల్పనలో వారిది విశేషమైన పద్ధతి. మొదటగా తమ ఆర్కెస్ట్రా లోని దాదాపు 60 మంది వాయిద్యకారులను సిద్ధం చేస్తారు. తరువాత మొదటి చరణంలో – గాయనీ గాయకులతో పాటు ఒక్కో వాయిద్యకారుడు తమ వాయిద్యాలను వినిపిస్తారు. ఆపై ఇంటర్‍లూడ్. ఆ సమయంలో గాయని/గాయకుడికి స్వల్ప విరామం దొరికి ఊపిరి పీల్చుకోగలుతారు. ఇలా పాటని మొత్తం స్వరపరుస్తారు. వీరు ‘కౌంటర్ మెలోడీ’ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో పాటలోని ప్రధాన మెలోడీకి కౌంటర్‍గా సీక్వెన్స్‌లో నోట్స్ ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో వీరికి రిథమ్ అరేంజర్ సెబాస్టియన్ డిసోజా, ధోలక్ వాయిద్యకారుడు దత్తారామ్ సహకరించారు. ధోలక్ లో ప్రత్యేక లయ కోసం దత్తారం కృషి చేసి ‘Dattaram theka’ అనే లయని సృష్టించారు. ఈ లయని నేటికీ ఉపయోగిస్తున్నారు.

శంకర్ జైకిషన్‍‍లు – అప్పటికే ప్రసిద్ధులైన గాయనీ గాయకులను మాత్రమే కాకుండా – సందర్బానికి తగినట్టుగా – ఇతర గాయనీ గాయకుల చేత కూడా పాడించారు. ఉదాహరణకి – ‘ఆస్ కా పంచీ’ (1960) లోని ‘దిల్ మెరా ఏక్ ఆస్ కా పంచీ’ అనే పాటని సుబీర్ సేన్ చేత పాడించారు. అలాగే ‘దిల్ ఏక్ మందిర్’ (1963) లోని ‘దిల్ ఏక్ మందిర్ హై’ అనే పాటని సుమన్ కళ్యాణ్‌పూర్‍తో పాడించారు. ‘చోరీ చోరీ’ (1956) లోని ‘యే రాత్ భీగీ భీగీ’ అనే పాటని మన్నా డే తోనూ; ‘శ్రీ 420’ (1955) లోని ‘ముడ్ ముడ్ కే నా దేఖ్’ అనే పాటని ఆశా భోస్లేతో, ‘యాహుది’ (1955) లో దిలీప్ కుమార్ కోసం ‘యే మేరా దీవానాపన్ హై’ అనే పాటని ముకేశ్‍తో పాడించటం అన్నీ ఈ కోవకి చెందినవే.

భిన్న శైలులు:

ఈ జోడీది భిన్నమైన వ్యవహార శైలి. జైకిషన్ తళుకుబెళుకులను కోరుకునే వ్యక్తి. ఉత్తమమైన సూట్‍లను ధరించి అందరినీ ఆకర్షించేవారు. తరచూ పార్టీలకు హాజరవుతూ సందడి చేసేవారు. శంకర్ మితభాషి, సందడి తక్కువ చేసేవారు. ఈయనకి రాగ్ భైరవి ఇష్టమైతే, జైకిషన్‌కి రాగ్ శివరంజని ఇష్టం. శంకర్‍కి డాన్స్ మూమెంట్స్ ఉన్న పాటలు ఇష్టం, కాగా జైకిషన్‍కి రొమాంటిక్ పాటలు ఇష్టం. ఈ జోడీ విబిన్న గీతరచయితలతో జట్టు కట్టారు. శంకర్ శైలేంద్ర గీతాలకి, జైకిషన్ హస్రత్ జైపురి గీతాలకి బాణీలందించారు. నేపథ్య సంగీతంలో జైకిషన్‍కి అద్భుతమైన ప్రతిభ ఉంది. వారి తొలి చిత్రంలోనే ఈ ఛాయలు వ్యక్తమయ్యాయి. ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ (1960) లోని ‘ఓ బసంతీ పవన్ పాగల్’ పాట, ‘ఆవారా’ (1951) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇందుకు ఉదాహరణలు. వీరిద్దరి మధ్యా ఇన్ని వైరుధ్యాలున్నప్పటికీ, ఏ పాట శంకర్‍దో, ఏ పాట జైకిషన్‍దో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయేవారు.

విభేదాలు – చీలిక:

విస్తృతంగా పని చేయటం వల్ల, సృజనాత్మక విభేదాలు రావడం వల్లా – వీరిద్దరూ 1960 నుంచి విడివిడిగా బాణీలను అందించసాగారు. కానీ బహిరంగంగా తన బృందాన్ని చీల్చలేదు. అప్పట్లో సిలోన్ రేడియో నుంచి ప్రసారమయ్యే ‘బినాకా గీత్ మాలా’ అనే కార్యక్రమం పాటల ప్రజాదరణకి కొలమానంలా ఉండేది. ఈ కార్యక్రమంలో – ‘సంగం’ చిత్రానికి హస్రత్ రాయగా, జైకిషన్ బాణీ కట్టిన ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్‍కర్’ అనే పాట; ఇదే సినిమాకి శైలేంద్ర రాయగా, శంకర్ స్వరాలందించిన ‘దోస్త్ దోస్త్ నా రహా’ అనే పాటని అధిగమించింది. దాంతో అప్పటికే విభేదాలు ఏరడ్డ వారి స్నేహం బీటలు వారింది. శంకర్ బృందలోని వ్యక్తులు కుట్ర జరిగిందని ఆరోపించారు. శంకర్ లతకి బదులుగా శారదకి ప్రాధాన్యం ఇవ్వటం కూడా విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. జైకిషన్ – ఒక బృందంతో లత తోనూ; శంకర్ మరో బృందంతో ఇతర గాయనీమణులతోనూ విడివిడిగా రికార్డింగులు చేసేవారు. ఆ సమయంలో గీత రచయితలు శైలేంద్ర, హస్రత్ జైపురి – వీరిద్దరి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారు.

క్షీణదశ – మరణం:

12 సెప్టెంబర్ 1971 నాడు లివర్ సిర్రోసిస్ కారణంగా జైకిషన్ మరణించారు. ఆయన మరణం శంకర్‍ని క్రుంగదీసింది. అయినా తమ జోడీ పేరు మీదే పని చేయటం కొనసాగించారు. సంగీత దర్శకుడిగా తనకి వచ్చిన పారితోషికంలో సగం, జైకిషన్ కుటుంబానికి అందజేశారు. జైకిషన్ మరణం తరువాత ఆర్.కె.ఫిల్మ్, మరికొన్ని పెద్ద సంస్థలు శంకర్‍కి దూరమయ్యాయి. క్రమంగా అవకాశాలు క్షీణించాయి. అయినా  శంకర్ మంచి సంగీతాన్నే అందిస్తూ వచ్చారు. ఇందుకు ఉదాహరణ ‘సన్యాసి’ (1975) చిత్రం. లత శంకర్‍తో రాజీపడి ఈ సినిమాకి పాటలు పాడారు. పాటలు సూపర్ హిట్ అయ్యి, శంకర్ జైకిషన్‍ల గత వైభవాన్ని గుర్తు చేశాయి. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆయన చక్కని సంగీతం అందించినా, కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. క్రుంగిపోయిన శంకర్ 26 ఏప్రిల్ 1987 తేదీన తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలకి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే హజరయ్యారు. అంత్యక్రియలు ముగిసాకే, ఆ వార్త సినీరంగం వారికి తెలిసింది.

భారతీయ సినీ సంగీత చరిత్రలోని ఒక అధ్యాయం శాశ్వతంగా తెరమరుగయింది.

Exit mobile version