అలనాటి అపురూపాలు- 166

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బహుముఖ ప్రజ్ఞాశాలి – మహారాష్ట్ర దిగ్గజం – బాబూరావు పెయింటర్:

మహారాష్ట్ర దిగ్గజంగా ప్రసిద్ధి చెందిన బాబూరావు పెయింటర్ అసలు పేరు బాబూరావు కృష్ణారావు మేస్త్రీ. ఈయన 1890లో మహారాష్ట్ర లోని కోల్హాపూర్‍లో జన్మించారు. ఆయన చిత్రనిర్మాత. పెయింటింగ్, శిల్పకళ, ఫోటోగ్రఫీ రంగాలలో నిపుణులు.

అద్భుతమైన చిత్రలేఖన నైపుణ్యానికి చిహ్నంగా ఆయన పేరు చివర పెయింటర్ అని చేర్చి గౌరవిస్తారు. ‘కళా మహర్షి’ అనే బిరుదు గలిగిన బాబూరావు గొప్ప సినీ నిర్మాత, అద్భుతమైన చిత్రాకారులు, విశిష్ట శిల్పి, నిపుణుడైన డిజైనర్. ఆయన చనిపోయి సుమారు 70 ఏళ్ళు అవుతున్నా, కోల్హాపూర్ లోని ఆయన స్టూడియోని నేటికీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. స్టూడియోలో తగినన్ని పరికరాలు, అత్యంత ఆధునికమైన, ప్రగతిపూర్వక వసతులున్నాయి. దేశంలో మరి ఏ ఇతర చిత్రకారుడికి ఇటువంటి స్టూడియో లేదని చెప్పవచ్చు.

తన సమకాలికులైన యూరోపియన్ చిత్రకారుల స్టూడియోలను చూసి ఆకర్షితులై, తాను కూడా ఎప్పటికైనా అటువంటి లేదా అంతకు మించిన స్టూడియో ఏర్పాటు చేసుకోవాలని తలచారు బాబూరావు. ఆయన కల సాకారం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. తన వయసు 50లలో ఉండగా, బాబూరావు తన స్వంత ఇంటిని – తనకు కావలసిన పద్ధతిలో నిర్మించుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్థుల భవనంగా ఇంటిని కట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‍లో ఆయన శిల్పాల స్టూడియో, వంటగది ఉండేలా, మొదటి అంతస్తులో కుటుంబం నివాసం ఉండేలా, రెండవ అంతస్తులో మరింత విశాలమైన స్టూడియో ఉండేలా రూపొంచించారు.

ఆ రోజులలో – ఒక పెద్ద సైజు కాన్వాసు మీద చిత్రించాలంటే, ఒక పరంజా ఉండాలి లేదా చిత్రకారుడు కాన్వాసుని నేలపై పరిచి బొమ్మని గీయాల్సి ఉండేది. అయితే స్థలాభావం వల్ల ఈ రెండవ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. ఈ కష్టమైన ప్రకియని దూరం చేసేలా, బాబూరావు రెండవ అంతస్తులోని తన స్టూడియోలో – కూర్చుని – కాన్వాస్ పై భాగంలో చిత్రించగలిగేలా అమరిక చేసుకున్నారు. ఆ సమయంలో మిగతా కాన్వాసు పైకప్పు (సీలింగ్)కు ఉన్న పుల్లీకి వేలాడుతూ ఉండేది. ఈ పుల్లీ సహాయంతోనే ఆయన కాన్వాసును తనకు కావల్సిన ఎత్తులో అమర్చుకోగలిగేవారు.

బాబూరావు గారు తన ప్రజ్ఞని ప్రదర్శించని రంగం అంటూ లేదు. ఈయన వడ్రంగంలోనూ అత్యంత నైపుణ్యం ప్రదర్శించారు. తను ఉపయోగించే ఈసెల్ (చిత్రపటాన్ని నిలిపి ఉంచే చెక్క స్టాండు)ను ఆయనే స్వయంగా తయారు చేసుకుని, తనకి వీలుగా – కాన్వాస్‍ని ముట్టుకోకుండానే – సర్దుకునేవారు. రెండు క్లచ్ లను తయారు చేసుకున్నారు. ఒకటి కాన్వాస్‍ని నిలువుగా పైకి లేపుతుంది, మరొకటి దాన్ని క్రిందకి తెస్తుంది. ఆయిల్ కలర్స్‌ని, బ్రష్ లని దాచి ఉంచేందుకు ఒక ప్రత్యేకమైన బల్లని కూడా ఆయన స్వయంగా తయారుచేసుకున్నారు. అవసరం లేనప్పుడు పైన కప్పి ఉంచేలా ఒక రెక్క (flap)ని అమర్చారు. పైగా ఈ టేబుల్ పోర్టబుల్. దానికి చక్రాలు ఉండేవి, స్టూడియాలో ఎక్కడికి కావలిస్తే, అక్కడికి సులువుగా తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండేది.

20వ శతాబ్దిలో కళారంగంలో నాణ్యతకి పేరుగాంచిన ఈయన ప్రతి చిన్న విషయంపైనా శ్రద్ధ పెట్టేవారు. మొత్తం స్టూడియోలో వుడెన్ ఫ్లోరింగ్ ఉండేంది. స్టూడియోలో సహజ కాంతి తగినంతగా ప్రసరించేది. సహజ కాంతి వీలైనంత ఎక్కువగా రావడానికి వీలుగా ఆయన తన స్టూడియోలో ఉత్తరపు గోడలకి కిటికీలు ఉండేలా చూశారు, మంగుళూరు పెంకుల పై కప్పులో అద్దపు కిటికీ (skylight) అమర్చారు. అవసరమైనప్పుడు తీవ్రమైన సూర్యకాంతిని తగ్గించేలా ఒక తెర ఉండేది.

ఇది 20వ శతాబ్దపు తొలి రోజుల నాటి విశేషం. బాబూరావు గారిలా ఏ ఇతర కళాకారుడు తన పరికరాలను డిజైన్ చేసుకోలేదు. 21వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఇదే నిజం.

కొల్హాపూర్‍కి ‘కళాపూర్’ అనే పర్యాయ పదాన్ని కల్పించిన గొప్ప కళాకారులలో బాబూరావు ఒకరు. ఈ స్టూడియోలో బాబూరావు వేలాది చిత్రాలను చిత్రించారు. ఈ చిత్రాలలో కొన్ని ఘనంగా సంపన్నుల ఇళ్ళ గోడలని ఆక్రమించాయి, మరొకొన్ని మ్యూజియంలోని గోడలని అలంకరించాయి, మరికొన్ని ఆర్ట్ కలెక్టర్స్ సేకరణలో చేరాయి.

బాబూరావు గారి కెరీర్ తొలి రోజులు:

1915లో ఆనందరావు మరణంతో, బాబూరావు, ఆయన బృందం ‘మహారాష్ట్ర సినిమా’ని వీడారు. కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సి రావడంతో నాటకాల తెరలకు రంగులు వేసే పని చేశారు. ఆనందరావు విపరీతంగా ఖర్చు చేసే వ్యక్తి కావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. బాబూరావు గారి పొదుపరి, సరళమైన జీవనశైలి గలవారు. ఎన్నో సార్లు ఆకలితో ఉండాల్సి వచ్చింది ఆయన బృందానికి. అదృష్టవశాత్తు 1916లో గంధర్వ కంపెనీ వారి పని దొరికి బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉండగా ఆయన ఎన్నో సినిమాలను చూశారు. 1917 నాటికి ఈ పనిలో సంపాదించి, దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో తాను సొంతంగా సినిమా తీయాలనే ఆలోచన చేశారు. 1917 నవంబరు నెలలో శ్రీపత్ కాకడే వారి ఇంటి మిద్దె పైన తాను సినిమా కంపెనీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు బాబూరావు. 1 డిసెంబరు నాడు – పాలెస్ థియేటర్‍ వేదిక మీద ఆనందరావు గారి ఫోటో ఉంచి, శ్రీపత్ కాకడే, దామ్లే, ఫత్తేలాల్, పంత్ ధర్మాధికారి, బాబా గజ్‌బార్, డి. మేస్త్రీ, మరో నలుగురైదుగురి సమక్షంలో ‘మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీ’ ప్రారంభమైంది.

‘మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీ’ తొలి అడ్మినిస్ట్రేటర్ అయిన బాబూరావు పెంధార్కర్ మాత్రం ఈ సంస్థ 1919లో ప్రారంభమైనట్టు చెప్పారు. ఈ సంస్థ తీసిన సినిమాల్లో నటించి, ఆపై కెమెరామాన్‌గా పని చేసిన కేశవరావు ధైబార్ మాత్రం ఈ సంస్థ 1 డిసెంబరు 1918 నాడు ప్రారంభమైందని అన్నారు. 1918 నాటికి తన దగ్గర ఉన్న చిన్న విలియమ్సన్ కెమెరాతో ఎన్నో ప్రయత్నాలు చేసిన బాబూరావు, బొంబాయిలో జరుగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలను చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే అందుకు కావల్సినంత ధనం ఆయన వద్ద లేకపోయింది. వినాయకరావు ఘోర్పాడె – తన మేనకోడలు, గాయని, ఉస్తాద్ అల్లాదియాఖాన్ శిష్యురాలైన తనీబాయి కగాల్కర్‍కి చెప్పగా, ఆవిడ బాబూరావు గారికి ఆర్థిక సాయం చేశారు. ‘మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీ’ ప్రారంభించడానికి ఆవిడ బాబూరావు గారికి పదివేల రూపాయలు సహాయం చేశారు. ఈ సంస్థ తొలుత పాలెస్ థియేటర్‍‍లో ప్రారభమైనా, తదుపరి కాలంలో శివాజీ థియేటర్స్‌కి మారింది.

‘సైరంధ్రి’ సినిమా మొదలయ్యే సమయానికి – సినీ నిర్మాణంపై దాదాసాహెబ్ ఫాల్కేకి ఉన్నంత అవగాహన – బాబూరావుకి లేదు. కెమెరాను, ముడి ఫిల్మ్‌ను లండన్ నుంచి తెప్పించారు. షూటింగ్ నుంచి ఎడిటింగ్ వరకూ అన్నీ స్వయంగా తానే నిర్వహించారు. 1919లో ‘సైరంధ్రి’ సినిమా సిద్ధమయింది. 7 ఫిబ్రవరి 1920 నాడు ఈ సినిమాని పూనే లోని ఆర్యన్ సినిమా హాలులో ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాని చూసిన లోకమాన్య తిలక్, బాబూరావుని ‘సినిమా కేసరి’ అని అన్నారు.

‘సైరంధ్రి’ చిత్రానికి ‘పరసేవా ఆద్మీకీ కిత్నా లాచార్ బనా దేతీ హై’ అన్న ఉపశీర్షిక ఉంది. ఈ పేరు చూడగానే జనాలు చప్పట్లు కొట్టారు. దాంతో, సినిమా విజయవంతం అవుతుందని బాబూరావు నమ్మారు. సినిమాలో భీముడు కీచకుడి తల తీసేసే దృశ్యం వచ్చినప్పుడు ప్రేక్షకులలో కొందరు భయంతో గట్టిగా కేకలు వేశారట. ‘జలియన్ వాలా బాగ్’ ఘటనపై ఓ సినిమా తీయమని, అది తన రచనల కన్నా ఎక్కువగా ప్రజలకి చేరుతుందని తిలక్ బాబూరావుకి సూచించారు. సినిమా ప్రజలలో కలిగించే అవగాహనను తిలక్ ముందుగానే ఊహించారు.

ఈ సినిమాలో నటించిన నటీమణులలో ఒకరైన అనసూయా బాయి మాట్లాడుతూ – థియేటర్లలో ఈ సినిమా అయ్యాకా ‘గుడ్ నైట్’ అనే ఒక షో-రీల్ (10 అడుగుల నిడివి) ప్రదర్శించేవారనీ, అందులో గజ్రాభాయ్ అనే ఆవిడ నటించారని, భారతీయ వెండితెరపై కనిపించిన తొలి మహిళ ఆవిడేనని అన్నారు. ఆ తరువాత గులాబ్ బాయి అనే ఆవిడ, ఆ తరువాత తను అని చెప్పారు. భారతీయ వెండితెరపై కన్పించిన తొలి విద్యావంతురాలైన మహిళని తానేనని అన్నారు.

ఫిల్మోగ్రఫీ:

చిత్రలేఖనాన్ని ఆయన సొంతంగా నేర్చుకున్నారు, శిల్పకళని అకడమిక్ ఆర్ట్ స్కూల్‌లో అభ్యసించారు.

1910-1916 నడుమ పశ్చిమ భారతదేశంలో స్టేజ్ బ్యాక్‍గ్రౌండ్ అలంకరణలకి, సంగీత నాటక బృందాల వారికి, గుజరాత్ పార్శీ థియేటర్ వారికి తెరలు అందించటంలో బాబూరావు, ఆయన కజిన్ ఆనందరావు పెయింటర్ ప్రసిద్ధి చెందారు. ‘రాజా హరిశ్చంద్ర’ అనే సినిమాని చూశాకా, బాబూరావు సినిమాల పట్ల ఆకర్షితులయ్యారు. ఒక మూవీ ప్రొజెక్టర్‍ను కొని, ఎగ్జిబిటర్‍గా మారారు.

బాబూరావు తన శ్రేయోభిలాషులతో కల్సి ‘మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీ’ని కోల్హాపూరులో ప్రారంభించారు. ఆయన మొదటి సినిమా ‘సైరంధ్రి’ శ్రీ ఖాదిల్‍కర్ రచించిన ‘కీచక వధ’ అనే నాటకం ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో భీముడు కీచకుడిని చంపే దృశ్యాలలో చాలా భాగాలని సెన్సారు వారు తొలగించారు. అయినప్పటికీ, ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించింది, విమర్శకుల మెప్పును పొందింది.

‘సైరంధ్రి’ – 1920:

కోల్హాపూర్ లోని ‘మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీ’ బ్యానర్‍పై బాబూరావు పెయింటర్ తీసిన పౌరాణిక చిత్రం ‘సైరంధ్రి’. ‘కీచక వధ’ అనే మరాఠీ నాటకం ఆధారంగా దర్శకులు బాబూరావు పెయింటర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దీన్ని నిషేధించేవరకూ ఈ సినిమా హౌస్‍ఫుల్ షోలతో ప్రదర్శితమైంది. సెన్సార్ వారి కత్తెరలకు బలైన మొదటి సినిమా బహుశా ఇదేనేమో. రాజా రవివర్మ గీసిన దేవీదేవతల చిత్రాలను చూసి బాబూరావు పెయింటర్ ప్రేరణ పొందారు.

బొంబాయిలోని మెజెస్టిక్ సినిమా హాలులో – 1918 నాటి జాతీయ కాంగ్రెస్ సమావేశాల రీలుతో పాటుగా ‘సైరంధ్రి’ చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పట్లో దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ బ్రిటీష్ వారితో పోరాడుతోంది.

ఈ పౌరాణిక చిత్రం మహాభారతంలోని ఒక ఘట్టాన్ని చెబుతుంది. 12 ఏళ్ళు వనవాసం పూర్తి చేసి, 13వ ఏట అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు విరాట రాజు కొలువులో ఉంటారు. రాణి గారి అంతఃపురంలో సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిపై రాణి సుధేష్ణ సోదరుడు కీచకుడు మోజు పడి సైరంధ్రిని బలవంతం చేయబోగా, భీముడు అతన్ని తరిమి తరిమి తల నరుకుతాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి యైన బాబూరావు పెయింటర్ ఒక సంస్థ లాంటి వారు. దర్శకత్వంతో పాటుగా సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలలోనూ పని చేశారు. సెట్ రూపకల్పన, కెమెరా పని, పోస్టర్ల రూపకల్పన అన్నీ స్వయంగా నిర్వహించేవారు. అయితే టాకీ సినిమాల ప్రవేశంతో ఆయనకి సినిమా నిర్మాణం మీద ఆసక్తి క్షీణించింది, ఎందుకంటే మూకీ సినిమా కల్పించే దృశ్య ప్రభావం – టాకీ సినిమాల వల్ల లభించదని ఆయన భావించారు. 1931లో తన స్టూడియోని మూసేశారు. అయితే స్నేహితుల కోరిక మేరకు 1953 వరకు ఆయన సినిమాలకు దర్శకత్వం వహించారు.

సైరంధ్రి, సవాకారీ పాష్, కల్యాణ ఖజానా, సింహగఢ్, సతీ పద్మిని, శ్రీ కృష్ణ అవతార్, భక్త ప్రహ్లాద్, నేతాజీ ఫాల్కర్ వంటి చిత్రాలను అందించారు బాబూరావు. కోల్హాపూరులోని షాలిని సినీటోన్ సంస్థ కోసం ‘ఉష’ అనే టాకీ సినిమాకి దర్శకత్వం వహించారు బాబూరావు. అది ఆయన తొలి టాకీ చిత్రం. రుక్మీణీ స్వయంవర్ (సవాకారీ పాష్ చిత్రానికి రీమేక్), ప్రతిభ, విశ్వామిత్ర, మహజమ్ (1953) ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు.

16 జనవరి 1954 నాడు బాబూరావు ఈ లోకాన్ని వీడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here