అలనాటి అపురూపాలు- 169

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ప్రతిభామణి ఋష్యేంద్రమణి:

రంగస్థలం మీద, సినిమాలలోనూ విశేషంగా రాణించిన తొలితరం నటీమణుల్లో ఋష్యేంద్రమణి ఒకరు. ఆవిడ చక్కని గాయని కూడా. నేపథ్య గానం లేని రోజుల్లో తన పాత్రలకు తానే పాటలు పాడుకునేవారు.

ఆంగ్ల నూతన సంవత్సరాది రోజున 1 జనవరి 1917న విజయవాడలో జన్మించిన ఋష్యేంద్రమణి బాల్యం నుంచి సంగీతం, నాట్యంలో ప్రతిభ కనబరిచారు.

తన బాల్యం గురించి, ఇష్టాయిష్టాల గురించి, నాటకాల గురించి, సినిమాల గురించి ఆవిడ ఏం చెప్పారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.

***

“నా కెరీర్ గురించి మాట్లాడే ముందుగా, నేను మా అమ్మ మొగల్రాజు వెంకట రత్నమ్మకి (ఆవిడ, సొంత తల్లి ఎవరో తెలియని ఋష్యేంద్రమణిని పెంచుకున్నారు. అలాగే నర్తకి లక్ష్మీకాంతని కూడా దత్తత తీసుకుని, నాట్యతారగా తీర్చిదిద్దారామె పెంపుడు తల్లిదండ్రులు. ఆ రోజుల్లో ఇది సాధారణమైన విషయం) సాష్టాంగ ప్రణామాలు చేయాలి. అమ్మ నాకు సంగీతపు మాధుర్యాన్ని, నాట్యం లోని ఆనందాన్ని పరిచయం చేసింది. కెరీర్‍ని సీరియస్‍గా తీసుకునేట్టు చూసింది. అమ్మ ప్రసిద్ధ సంగీత విద్వాంసులు జంగం కోటయ్య గారి శిష్యురాలు. 1925లో 8 ఏళ్ళ వయసులో నాతో బెజవాడలో అరంగేట్రం చేయించింది అమ్మ. నాన్న జానకిరామయ్య కూడా అమ్మతో పాటు సంగీతం, నాట్యం, నటనలలో నాకెంతో ప్రోత్సాహమిచ్చారు.

నాకు చిన్నప్పటి నుంచి వీధి నాటకాలన్నా, తోలుబొమ్మలాటలన్నా చాల ఇష్టం. కొమ్మూరి పట్టాభిరామయ్య గారు నాకు శిక్షణనిచ్చి ‘సావిత్రి’ అనే నాటకంలో ‘వాసంతిక’ పాత్రలో నటింపజేశారు. లక్ష్మీవిలాస నాటక సభలో చేరాను, మా బృందం పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ‘సావిత్రి’ నాటకం వేసింది. ఈ నాటకంలో రామ తిలకం గారు సావిత్రి వేషం వేశారు. కపిలవాయి రామనాథశాస్త్రి గారు సత్యవంతుడి పాత్ర ధరించారు. తిలకం గారిది కంచు కంఠం, చాలా దూరం వరకూ కూడా వినిపించేది. వీళ్ళిద్దరి జోడీని స్వర్గంలో దేవతలు వీక్షిస్తుంటారని జనాలు చెప్పుకునేవారు. అప్పట్లో వాసంతికగా నాకు నెలకు 40 రూపాయల జీతం. నేను అప్పట్లో రామ తిలకం గారు పాడే పద్ధతిని అనుకరించేదాన్ని. నాకు 13 ఏళ్ల వయసులో 1930లో అమ్మ చనిపోయింది. తరువాత నేను చేబ్రోలు సరస్వతీ రాధాకృష్ణయ్య గారి నాటక బృందంలో చేరాను.

‘ప్రహ్లాద’ నాటకంలో ప్రహ్లాదుడిగా నటించాను. నేను అమ్మాయినా అబ్బాయినా అని ప్రేక్షకులు చర్చించుకునేవారు. ఆ నాటకంలోని పద్యాలను నేను పాడినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు, వన్స్ మోర్ అని అరిచేవారు. స్టేజి మీదకి కరపత్రాలు విసిరేవారు. ఈలోపు సినిమా వచ్చి నాటకరంగానికి సవాలు విసిరింది. చాలామంది వెండితెర వైపు మళ్ళారు. నలుగురితో నారాయణ అంటూ నేను కూడా సినీరంగంలో ప్రవేశించాను.

నా మొదటి సినిమా కాళీ ఫిల్మ్స్ వారి ‘శ్రీ కృష్ణ తులాభారం’. 1935లో రాజరావు నాయుడు గారు నిర్మించారు ఈ సినిమాని. నాకప్పుడు 18 ఏళ్ళు. దీంట్లో నేను సత్యభామ వేషం వేశాను. గుంటూరు సభా రంజని రుక్మిణి గాను, శ్రీమతి ప్రేమలత రాధ గాను నటించారు. పి. లక్ష్మీస్వామి అక్రూరుడు గాను, తంగిరాల హనుమంతరావు వసుదేవుడిగా, శ్రీమతి కాంతమ్మ దేవకిగా, శ్రీమతి కొండపల్లి సీతారామమ్మ శచీదేవిగా, వసంతకుడిగా గండికోట జోగినాథుడు నటించారు. శ్రీకృష్ణుని పాత్రని జైసింగ్ పోషించారు. కపిలవాయి రామనాథశాస్త్రి గారు నారదుడి వేషం వేశారు (ఆయన చాలా బక్కపలచగా ఉండి ఎముకలు కనిపిస్తుండడంతో, నారద పాత్రకి పొడుగాటి చొక్కా ఉంటుందీ సినిమాలో). నళినిగా లక్ష్మీరాజ్యం, మిత్రవిందగా కాంచనమాల నటించారు. కాంచనమాల అందాన్ని చూసి విస్తుపోయేదాన్ని, ఆమె బహుశా నిర్మాత భార్యయేమో అని అనుకునేదాన్ని.

నాతోనూ, ఇతర నటీనటులతోనూ కాంట్రాక్టుపై సంతకాలు చేయించారు నిర్మాత. ఈ సినిమాని కలకత్తాలో చిత్రీకరించారు. మమ్మల్ని అందరినీ కలకత్తా తీసుకువెళ్ళారు. సినీరంగంలో తెగ డబ్బు సంపాదిస్తామని మేమందరం కలలు గన్నాం. సత్యభామ పాత్రకి గాను నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. అప్పట్లో అది ఒక నటికిచ్చిన పెద్ద మొత్తం. నా మొదటి సీన్‍ని ద్వారకానగరంలోని తోటలా అనిపించే సెట్‍లో తీశారు. అయితే ఈ సెట్‍లో ద్వాపర యుగానికి చెందని క్రోటన్ మొక్కలని పెట్టారు. అయితే తోట అలంకరణ వల్ల, ఈ కొత్త రకం క్రోటన్ మొక్కలు ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. పోంచిబాబు అనే బెంగాలీ నాకు మేకప్‍ మ్యాన్. నా రూపురేఖలు సహజంగా ఉండాలని దర్శకుడు కోరడంతో ఆయన నాకు ఎక్కువ మేకప్ వేయలేదు. ఒకప్పటి నేచురల్ లుక్ నేడు హెవీ మేకప్ అయిపోయింది.

అప్పట్లో నేపథ్య గానం లేదు. పాత్రధారులు తమ పాటలు తామే పాడుకోవాల్సి ఉండేది. పాటలు పాడలేకపోతే అసలు సినిమాల్లో వేషాలకి తీసుకునేనారు కాదు. మేము పాడుతున్నంత సేపు ఆర్కెస్ట్రాలో భాగంగా హార్మోనియం, తబలా, వయోలిన్ వాయిద్యకారులు – దర్శకులు కట్ చెప్పేవరకూ మా వెనుకే ఉండేవారు. దర్శకులు ముఖర్జీ మర్యాదస్తులు. తనకి కావల్సిన విధంగా నటనని రాబట్టుకోవడానికి ఆయన నటీనటులపై అరిచేవారు కాదు. చాలా నెమ్మదిగా మాకు సీన్‍లని వివరించేవారు. మీరూ, కృష్ణ భగవానుడూ చేతిలో చేయి వేసుకుని, ఓ తోటలో విహరిస్తూ, చల్లగాలిని ఆస్వాదిస్తూంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. రంగస్థల అనుభవం ఉన్న కారణంగా నేనీ సీన్‍ తేలికగా చేశాను. దర్శకులు డబుల్ ఓకే అన్నారు. నా నల్లని కేశాలు ఆయనకి ఎంతో ఇష్టం. గండు తుమ్మెదల నలుపుతో పొడవైన కేశాలని ఆయన అంతకుముందు చూడలేదట. సినిమా పూర్తయ్యాకా, ప్రివ్యూ వేశారు. మాలో చాలామంది వెళ్ళారు, కానీ నేను చూడలేదు.  అయితే ఆ సినిమా – సినిమాలా కాకుండా, – నాటకంలా అనిపించడంతో – ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇలా నా మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాకా, నేను తిరిగి నాటకరంగానికి వచ్చేసాను. పసుపులేటి కన్నాంబ గారు, ఆమె భర్త కడారు నాగభూషణం గారు నడిపే రాజరాజేశ్వరీ నాట్యమండలి బృందంలో చేరాను. సుప్రసిద్ధ ‘శారద’ అనే నాటకంలో నేను నారదుడి పాత్ర పోషించాను. నారదుడి వేషం ఓ మహిళ వేయటమా అని జనాలు కాస్త సందేహించారు. కానీ నా గొంతు విని, నా నటన చూసి వారెంతో ఆశ్చర్యపోయారు. నా గాత్రంతో, అభినయంతో నేనే మగవాడినయినా ఓడించగలగని అన్నారు. ఆమె ఓ అద్భుతం అన్నారు. ఆమె ‘ఆడ కపిలవాయి రామనాథశాస్త్రి’ అన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నా దృష్టికి వచ్చాయి. తర్వాత ‘రంగూన్ రౌడీ’ నాటకంలో ప్రభావతి వేషం వేశాను. ఇదిలా ఉంటే, 1941లో నాకు ‘తల్లి ప్రేమ’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను ‘ఆనందమహో’ అనే పాటని కూడా పాడాను. తర్వాత సారధి వారి ‘పత్ని (1942)’ లో నటించాను. ఈ సినిమా నాకెన్నో విషయాలు నేర్పింది. ఈ చిత్రంలో నేను కణ్ణగి పాత్ర ధరించాను, కోవలన్ పాత్రను కోవెలమూడి సూర్యప్రకాశరావు (తర్వాతి కాలంలో సుప్రసిద్ధ దర్శక నిర్మాత) ధరించారు. ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా, నేను సినీరంగంలో నిలదొక్కుకోడానికి దోహదం చేసింది. తర్వాత ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు ధరించాను. నా అభిమాన దర్శకులు కె.వి.రెడ్డి. ఆయనో మేధావి..”

***

ఈ విధంగా ఋష్యేంద్రమణి గారు తాను సినిమాల్లో ఎలా ప్రవేశించిందీ, తొలినాటి అనుభవాలను వెల్లడించారు. ‘చెంచులక్ష్మి’ (1943) సినిమాలో ఆదిలక్ష్మిగా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. 1944లో ‘సీతారామ జననం’లో కౌసల్య గా నటించారు.

తదుపరి మల్లీశ్వరి, విప్రనారాయణ, మాయాబజార్, జగదేకవీరుని కథ, అగ్గిరాముడు, శ్రీ కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. దక్షిణాది భాషల చిత్రాలు, హిందీతో కలుపుకుని ఆమె 150కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె గాన నైపుణ్యానికి మెచ్చిన కార్వేటినగరం రాజావారు ఆమెకి ‘మధుర గాన సరస్వతి’ అనే బిరుదునిచ్చారు.

ఋష్యేంద్రమణి తమ మనవరాలు భవానితో కలిసి 1974లో ‘భూతయ్యన మగ అయ్యు’ అనే కన్నడ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి గాను భవాని గారికి ఉత్తమనటి అవార్డు రాగా, ఋష్యేంద్రమణి గారికి ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.

ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో మరణించారు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు, మనవలు, మునిమనవలు ఉన్నారు.

~

మాయాబజార్‍ సినిమాలో ఋష్యేంద్రమణి గారు పాడిన పద్యం యూట్యూబ్‍లో:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here