Site icon Sanchika

అలనాటి అపురూపాలు-17

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

వాణీ జయరామ్ సుప్రసిద్ధ గాయనిగా ఎదిగిన వైనం:

[dropcap]ఉ[/dropcap]న్నత స్థానాలకు చేరుకున్న వారి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి మెండు. శాస్త్రీయ, సినీ సంగీత రంగంలో సామాన్య స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎదగడం, అందులోను అప్పటికే అక్కడ పాతుకుపోయిన దిగ్గజాలను తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. మొక్కవోని పట్టుదలతో, తదేక దీక్షతో సాధన చేస్తే గాని అందలాలు అందుకోలేరు. సామాన్యుల నుండి అసామాన్యులైన వారి జీవితంలోని గాథలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. దొరైస్వామి కలైవాణి ‘వాణీ జయరామ్’గా ఎదిగిన వైనం చదవండి.

ఇవి ఆవిడతో పాటు తొలినాళ్ళలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాదు బ్రాంచిలో పనిచేసిన ఓ కొలీగ్ జ్ఞాపకాలు. ఆయన మాటల్లోనే… “1967లో దొరైస్వామి కలైవాణి అనే యువతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మద్రాస్ (చెన్నై) బ్రాంచి నుంచి హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్‍కి బదిలీపై వచ్చారు. ఆవిడని మా డిపార్టుమెంటులోనే వేశారు. ఆవిడ తెల్లగా, ఎంతో అందంగా ఉండేవారు, మా అందరికన్నా సీనియర్ కూడా. అందుకని ఆవిడకి మంచి డెస్క్ దొరికింది. ఆవిడ మితభాషి, కానీ మౌనంగా చాలా కష్టపడేవారు. ఆవిడ మాతో ఉన్నప్పుడు మేం మౌనంగా ఉండేవాళ్ళం, దేన్నో వెతుకుతున్నట్టున్న ఆవిడ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు! ఈ విధంగా ఒక నెల గడిచింది. ఒక ఆఫీసర్‌కి ప్రమోషన్‌పై బదిలీ అయింది, ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేశారు. కొంత మంది మహిళా సిబ్బంది పాటలు పాడారు. మా బాస్ కలైవాణి కేసి చూసి ఒక పాట పాడమని అభ్యర్థించారు. ఆమె తలాడించి – తన శ్రావ్యమైన స్వరంతో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ సజనా బరఖా బాహార్ ఆయీ’ అనే పాటను పాడారు. ఈ పాటని ‘ఫరఖ్’ చిత్రంలో సాధనపై చిత్రీకరించారు. మరో అభ్యర్థన రావడంతో, లతా మంగేష్కర్‌దే మరో పాట… దిలీప్ కుమార్, వైజయంతీమాల నటించిన ‘మధుమతి’ సినిమా నుంచి సలీల్ చౌదరి సంగీతం సమకూర్చిన ‘ఆజారే మై తో కబ్ సే ఖడీ ఇస్ పార్’ పాటను ఆలపించారు. ఒక్క క్షణం పాటు మేమంతా విస్తుపోయాం, టేప్‌లో వినిపించే లత స్వరానికి ఈ మాత్రం తీసిపోని గళం ఆమెది. అప్పటి నుంచి ఆఫీసులో ఎప్పుడు ఫంక్షన్ జరిగినా, తాను తమిళనాడుకి చెందినవారైనప్పటికీ కలైవాణి అద్భుతంగా హిందీ పాటలు పాడేవారు. మేం వాకబు చేస్తే తెలిసిందేమంటే ఆవిడ మద్రాస్ (చెన్నై) ఆకాశవాణిలో ఆర్టిస్ట్‌ అని. ఈ విషయం తెలిసి తర్వాతి ఫేర్‌వెల్ ఫంక్షన్స్‌లో పాడేందుకు ఔత్సాహిక గాయనీగాయకులు వెనుకాడేవారు.

ఇటువంటి ఒక కార్యక్రమంలో వేడి వేడి కాఫీలు తాగడం పూర్తయ్యాకా, ఓ పాట పాడమని మా బాస్ అడిగారు. అందరూ కోరస్‍గా అడిగారు. ఆవిడ ఏ పాట ఎంచుకుంటారా అని అందరం ఆసక్తిగా చూస్తుండగా, ఆవిడ “నేను పాడను. ఈసారి ఇంకెవరైనా పాడండి” అన్నారు. మొదటిసారిగా ఆవిడ ‘పాడను’ అన్నారన్న విషయం మేం నమ్మలేకపోయాం. పైగా ఆవిడ చక్కని మర్యాదలకు ప్రతిరూపం. అప్పటి దాకా సంతోషంగా ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా గుబులుగా మారింది. నిశ్శబ్దం రాజ్యమేలింది. కొన్ని నిముషాల తర్వాత మా బాస్ నా చేతిని తాకారు, ఈ సమస్యను పరిష్కరించమన్నట్టుగా చూశారు. నేనేదైనా ఒక మంచి జోక్ చెప్పుంటే సరిపోయేది. ఆయన పర్సనల్ అసిస్టెంట్‌ని అయినందుకు మొదటిసారి నన్ను నేను తిట్టుకున్నాను. అదే ఆఫీసు విషయాలైతే నా బుర్ర పాదరసంలా పనిచేసేది, ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం కనుగొనేవాడిని. కాని ఇది మాత్రం శిరశ్ఛేదానికై వధ్యశిల వద్దకు తీసుకువెళ్ళడంతో సమానం. అయితే ఆ విపరీతమైన పరిస్థితి నుండి బయటపడడానికి, ఆ రోజుల్లో నేను రేడియోలో విన్న ఒకే ఒక పాట సాహిత్యాన్ని గుర్తు చేసుకుని పైకి చదివాను. శశి కపూర్, నందా నటించిన ‘నీంద్ హమారీ క్వాబ్ తుమ్హారీ’ చిత్రానికి కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీతం సమకూర్చగా మహ్మద్ రఫీ పాడిన పాట ‘యూ రూఠో నా హసీనా మేరీ జాన్‌ పే బన్‌జాతీ హై, మేరీ జాన్ పే బన్ జాయేగీ’ అనే పాట అది. కలైవాణి గారికి ఆ పాట తెలుసు. నేను చదువుతుంటే పడీ పడీ నవ్వారు. తర్వాత నాకేసి చూసి, “చూడు. నువ్వు నాకన్నా చిన్నవాడివి. నేను అసహనంగా ఉన్నప్పుడు ఈ పాట పాడడానికి నీకెంత ధైర్యం?” అన్నారు. “సారీ, అండీ. నాకు ఈ ఒక్క పాటే తెలుసు. మీరో విషయం గమనించే ఉంటారు. సాధారణంగా పెళ్ళి చూపులు జరిగేటప్పుడు కాబోయే పెళ్ళికూతురు హార్మోనియం మీద ‘లంబోదర లకుమికర’ అనే పాట పాడుతుంది. ఈ పాటనే ఆమె ఎంతో సాధన చేసి ఎన్నో పెళ్ళి చూపులలో తప్పుల్లేకుండా సునాయాసంగా పాడుతుంది. అలానే నేను…” అన్నాను. ఆవిడ హుందాగా నవ్వేసి రెండు పాటలు పాడి, బోనస్‍గా మరో పాట పాడారు. ఆ సాయంత్రపు వాతావరణం హుషారుగా మారింది.

మర్నాడు ఆవిడ నా డెస్క్ వద్దకు వచ్చి, “నీకు హోమ్ వర్క్ ఇస్తున్నాను. ఉదయం ఏడింటి నుంచి తొమ్మిందింటి వరకు రేడియో సిలోన్‌లో వచ్చే పాత పాటలు, బాగా పాతవి వినాలి. వాటిల్లోంచి నేనేదైనా పాటని ఎంచుకుని పాడితే, అందులో దొర్లే తప్పులను నువ్వు పట్టుకోవాలి” అన్నారు. అంతకుముందు సాయంత్రం బాస్‍కి రక్షణగా నిలిచినందుకు నాకెంతటి శిక్ష విధించారో! ఆ పాటలను శ్రద్ధగా వినడం తప్ప నాకు మరో మార్గం లేకపోయింది. అయితే ఈ పనిలో ఉండడం వల్ల, నా కుటుంబ సభ్యులు నాకు అప్పజెప్పే ఇంటి పనుల నుంచి తప్పించుకోగలిగాను. నేను ఆఫీసులో మధ్యాహ్నం పూట నా డెస్క్ వద్దే భోజనం చేసేవాడిని, ఆ సమయంలో కాన్ఫిడెన్షియల్ పనులు చేసేవాడిని. ఒకరోజు విరామ సమయంలో కలైవాణి వచ్చి నన్ను సమీపంలోని రికార్డు గదిలో తీసుకువెళ్ళారు. నాకు పరీక్ష తప్పదు అని నాలో భయం మొదలైంది. ఆవిడ కొత్త పాటలు కూడా పాడారు. నేనేమీ మాట్లాడకపోతే, సీరియస్ అయి, సరిగ్గా వినమని గద్దించారు. ఆ విధంగా నేను బలవంతపు శ్రోతనయ్యాను. తదుపరి కాలంలో ఆమె స్వరం నామీద ఎంతో గొప్ప ప్రభావం చూపింది. ఒకరోజు ఆవిడ నా దగ్గరకి వచ్చినప్పుడు విచారంగా కనిపించారు. “ఏం జరిగింది మేడమ్?” అని అడిగాను. “నాకు టాన్సిల్స్” అని చెప్పారావిడ. “అయితే ఏంటి?” అన్నాను. “చూడండి, నాక్కూడా కెరోటీస్ టాన్సిల్స్ ఉన్నాయి. చిన్న ఆపరేషన్ చేయించుకోమని ఇ.ఎన్.టి సర్జన్ చెప్పారు” అన్నాను. “ఆపరేషనా?” అన్నారావిడ చిన్నగా కేకపెడుతూ. “నేనెప్పుడూ ఆపరేషన్ చేయించుకోను. నా గొంతు పాడయిపోతుందని నాకు భయం. మందులు ద్వారానే తగ్గించుకుంటాను” అన్నారావిడ. టాన్సిల్స్‌ని తొలగించుకోడానికి ఆపరేషన్ ఒక్కటే మార్గమని నాకు సర్జన్ చెప్పిన విషయం గుర్తు చేసుకుని, మందులపై ఆవిడ నమ్మకానికి అబ్బురపడ్డాను. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఒకరోజు తర్వాత ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభించాను. అంతా సక్రమంగా జరిగిందని చెబితే ఆవిడ సంతోషించారు. కానీ ఆవిడ మందులు తీసుకోవడం కొనసాగించారు, కొన్ని నెలల తర్వాత ఆవిడ టాన్సిల్స్ నయమయ్యాయి.

ఈ ప్రసిద్ధ నేపథ్య గాయనిని పొగడడానికి మాటలు సరిపోవు. కలైవాణి వివాహం చేసుకున్నారు, ఆ తర్వాతి నుంచి ‘వాణీ జయరామ్’గా పేరు పొందారు. తన అభ్యర్థన మేరకు బొంబాయి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. సుప్రసిద్ధ దర్శకుడు హృశీకేశ్ ముఖర్జీ, సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌లు ఒక స్వర పరీక్షలో వాణీ జయరామ్‌ స్వరం హిందీ పాటలకి నప్పుతుందని గుర్తించారు. ఆ విధంగా ఆమెకు జయబాదురీ తొలి సినిమా ‘గుడ్డి’కి పాటలు పాడారు. ఈ సినిమాలో ఆవిడ పాడిన “బోలె రే పపీ హరా”, ఇంకా, “హమ్ కో మన్ కీ శక్తి దేనా” అనే పాటలు బాగా ప్రసిద్ధి చెందాయి, చెరగని ముద్ర వేశాయి. 1975లో ‘గుడ్డి’ని తమిళంలో ‘సినిమా పైత్యం’ పేరుతో రీమేక్ చేశారు. జయచిత్ర కథానాయికగా నటించగా, అప్పటికి ఇంకా ప్రసిద్ధడు కాని కమల్ హాసన్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కూడా వాణీ జయరామ్ పాడారు. ఆ తర్వాత ఆమెకెదురు లేకుండా పోయింది. ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గాన కళలో శిఖరాగ్రానికి చేరారు. ఆ విధంగా ఆమె హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో పాటలు పాడారు. ప్రస్తుతం ఆమె పలు టీవీ ఛానెల్స్‌లో వచ్చే సంగీత కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలలో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఆవిడ చక్కని తెలుగు మాట్లాడుతారు కూడా…


నాట్యమే సర్వస్వమైన నీలా సత్యలింగం:

భారతీయ సంగీత నృత్య సంప్రదాయాలు దేశీయులనే గాక, అనేకమంది విదేశీయులను ఆకర్షించాయి. చాలామంది విదేశీయులు మన దేశానికి వచ్చి, భారతీయ కళలలో ప్రావీణ్యం పొంది, తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళడం మనకు తెలిసిన విషయమే. భారతీయ నృత్యం అభ్యసించి, ఆ కళని అందరికీ నేర్పేందుకు శిక్షకులుగా మారిన వారూ ఉన్నారు. నీలా సత్యలింగం వారిలో ఒకరు.

ఆమె ‘నీలా బాలేంద్ర’ అనే పేరుతో 1938లో సిలోన్‍లోని కొలంబోలో జన్మించారు. ఆమె ఐదేళ్ళ వయసు నుంచే నృత్యం ఆరంభించారు. కొలంబోలోని ‘శాంతి కుమార్ స్కూల్ ఆఫ్ డాన్స్’, ‘కలయ స్కూల్ ఆఫ్ డాన్స్’ నుంచి భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కథక్, కథకళి, మణిపురిలలో శిక్షణ పొందారు. 1954లో ఆల్-సిలోన్ డాన్స్ ఫెస్టివల్‌లో స్వర్ణపతకం సాధించి, రెండవ ఎలిజబెత్ మహారాణి ముందు ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపికయ్యారు. సింహాససనం అధిష్టించిన సందర్భంగా మహారాణి ఆ సమయంలో కామన్‍వెల్త్ దేశాలు పర్యటిస్తూ 1954లో శ్రీలంకలో ఉన్నారు.”ఆ రోజే నేను నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఒక డెంటల్ సర్జన్ అవ్వాలని మా నాన్నగారు కోరుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు” చెప్పారావిడ. 18 ఏళ్ళ వయసులో మద్రాసులో నెలకొన్న సాంస్కృతిక కేంద్రం ‘కళాక్షేత్ర’లో చేరారావిడ. భారతీయ సంప్రదాయాలలోని విలువలను కాపాడేందుకు గాను శ్రీమతి రుక్మిణీదేవి అరండేల్ ఆధ్వర్యంలో స్థాపించబడిన గొప్ప సంస్థ అది. దేశంలోని గొప్ప నృత్య శిక్షణాలయాలలో ఒకటి. ‘పైన పాములు, కింద ఎలుకలు’ తిరిగే ఓ గుడిసెలాంటి ఇంట్లో నివాసం ఉంటూ, రోజూ ఉదయం నాలుగున్నర గంటలకే లేచి సాధన చేస్తూ క్రమ పద్ధతిలో జీవించారు. తన ఐదేళ్ళ కోర్సును ఆమె రెండేళ్ళలోనే పూర్తి చేసి 1957లో భరతనాట్యంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిప్లొమా పొందారు. ఆమె కళాక్షేత్రలో తన కాబోయే భర్త సత్యలింగం సుందరలింగంను కలిసారు. ఆయన అప్పటి శ్రీలంక రాజకీయవేత్త సి. సుందరలింగం కుమారులు. మదరాసు యూనివర్సిటీ నుంచి సంగీతంలో డిగ్రీ (సంగీత శిరోమణి) పొంది, 1955లో కళాక్షేత్ర నుంచి డిప్లొమా ఇన్ మ్యూజిక్ పట్టా పొందారు. అదే అకాడమీలో శాస్త్రీయ సంగీతం సిద్ధాంత పాఠాలు చెప్తూ, మృదంగం, చేతాళము వాయిస్తూ ఉండేవారు. రెండేళ్ళ అనురంజనం తర్వాత, 1956లో వాళ్ళు వివాహం చేసుకున్నారు. శ్రీలంకకి తిరిగివెళ్ళి, కొలంబో శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తమ పిల్లల్ని పెంచుతూ, అక్కడి పాఠశాలల్లో నాట్యం నేర్పించేవారు.

మే 1958లో శ్రీలంకలో సింహళ, తమిళ జాతీయుల మధ్య గొడవలు రేగి అల్లర్లు జరిగాయి. తమని లక్ష్యంగా చేసుకున్నారని సత్యలింగం కుటుంబానికి తెలిసింది, హింసని తప్పించుకున్నారు. 80 మంది సింహళీలు వారి ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఇంటిని, మొత్తం ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు, కొలంబోలో మళ్ళీ నివాసం ఏర్పచుకున్నారు. 1969లో నీలా తిరిగి కళాక్షేత్రకి వచ్చి, శిక్షకురాలిగా శిక్షణ పొందారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ చేశారు. 1972లో డిస్టింక్షన్‍తో పాసయి, కళాక్షేత్రలో నాట్యగురువుగా నియమితులయ్యారు. వారు 1974లో సింగపూర్‍కి వలస వెళ్ళారు.

***

1956లో తీసిన ఈ ఫొటోలో నీలా సత్యలింగం గారిని చూడండి. ఆమె 1950నాటి తమిళ ఆభరణాలు ధరించి ఉన్నారు. జింకీ (జూకా), ముకుతి (ముక్కు పుడక), ఇంకా అడ్డిగై (నెక్లెస్) ధరించి ఉన్నారు. మెడలో అనేక పేటల సెంగిలి (గొలుసు) దానికి పదక్కం (పతకము-లాకెట్) ఉన్నాయి. ఆవిడ ధరించిన గొలుసులో మూడు లాకెట్లు కళాత్మకంగా అమర్చబడ్డాయి, సాధారణంగా ఒకటే లాకెట్ ఉంటుంది.

Exit mobile version