[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
తల్లి పాత్రలకి గుర్తింపు తెచ్చిన సులోచనా లాట్కర్:
కేవలం నటన మీద ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించేవారు కొందరయితే, నటన మీద ఆసక్తితో పాటు – కుటుంబ పోషణ కోసం, జీవిక కోసం సినిమాల్లో ప్రవేశించి – తన ప్రతిభని చాటినవారు మరికొందరు. అలాంటి వారిలో సులోచనా లాట్కర్ ఒకరు. మరాఠీ, హిందీ సినిమాలలో కథానాయిక నుంచి తల్లి పాత్రల దాకా పలు విభిన్నమైన పాత్రలు పోషించారు.
సులోచనా లాట్కర్ 1943లో సినీరంగంలో ప్రవేశించారు. 1946 నుంది 1961 వరకూ మరాఠీ సినిమాలలో కథానాయికగా నటించారు. ‘ససుర్‍వాస్’ (1946), ‘వాహినిచ్య బంగ్ద్యా’ (1953), ‘మీత్ భక్తర్’ (1949), ‘సంగ్తే ఐక్య’ (1959), ‘లక్ష్మీ అలీ ఘర’ (1965), ‘మోతీ మాన్సే’ (1949), ‘జీవచ సఖా’ (1948), ‘పతివ్రతా’ (1959), ‘సుకాచే సోబ్తీ’ (1958), ‘భౌబీజ్’ (1955), ‘ఆకాశగంగ’ (1959), ‘ధక్తీ జావో’ (1958) వంటివి ముఖ్యమైనవి. మరాఠీ, హిందీ భాషలలో సులోచన దాదాపు 300 సినిమాల్లో నటించారు. సునీల్ దత్, దేవ్ ఆనంద్, రాజేష్ ఖన్నాలకు తల్లిగా నటించడం తనకిష్టమని సులోచన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సులోచనా లాట్కర్ గారికి 1999లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆధునిక మరాఠీ చలనచిత్ర వ్యవస్థాపకులలో ఒకరిగా పరిగణించే బాబూరావ్ పెయింటర్ జయంతి సందర్భంగా స్థాపించబడిన ‘అఖిల భారతీయ మరాఠీ చిత్రపట్ మహమండల్’ వారు ప్రదానం చేసే ‘చిత్రభూషణ్’ పురస్కారం సులోచనా లాట్కర్‍కు 2003లో లభించింది. 2004లో సులోచనా లాట్కర్ గారికి ‘ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్‍మెంట్’ అవార్డు లభించింది. 2009లో మహారాష్ట్ర ప్రభుత్వం వారి ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు లభించింది. పూణే లోని కొత్రూడ్ లోని బాడ్మింటన్ అకాడెమీకి భారత ప్రభుత్వం ‘సులోచనా లాట్కర్ బాడ్మింటన్ అకాడెమీ’ అని పేరు పెట్టింది.
సులోచన అప్పటి బెల్గాం జిల్లాలోని ఖాదక్‍లాట్ గ్రామంలో 30 జూలై 1928 నాడు జన్మించారు. ఆమెకి తనకంటే పదేళ్ళు పెద్ద అయిన అన్నయ్య ఉన్నారు. వీరి తండ్రి కొల్హాపూర్‍లో పోలీసు అధికారిగా పనిచేసేవారు. చిన్నతనంలోనే వివాహమై, భర్తని కోల్పోయిన మేనత్త కూడా వీరితోనే ఉండేవారు. ఆ రోజుల్లో ఇంటిపేర్లు ఆ కుటుంబం నివసించిన లేదా పనిచేసే ఊర్ల పేరిట ఉండేవి. అందుకని వీరి కుటుంబపు ఇంటిపేరు ఆ గ్రామం పేరు మీద ‘లాట్కర్’ అయింది. సులోచన అసలు పేరు నాగబాయి. కానీ అందరూ ముద్దుగా ‘రంగూ’ అని పిలిచేవారు. సొంతూరిలోనే సులోచన ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అయితే ఆమెకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. వీధి నాటకాలు, నాటకాలు, సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. కళాకారుల ప్రదర్శనని తిలకించడానికి స్థానికంగా జరిగే జాతరలకు ఆవిడ తప్పనిసరిగా హాజరయ్యేవారు.
ప్లేగ్ వ్యాధి కారణంగా సులోచన తల్లిదండ్రులను కోల్పోయారు. అన్నిటినీ ఊర్లోనే విడిచిపెట్టి – మేనత్త తోనూ, అన్నయ్య తోనూ – తన తండ్రి స్నేహితుడి ఇంట ఆశ్రయం పొందారు. తండ్రి గారి స్నేహితులైన బినదేకర్ గారు పట్నంలో ప్రసిద్ధ న్యాయవాది, పుర ప్రముఖులందరికీ బాగా సన్నిహితులు.
ఒకరోజు ప్రముఖ సినీనిర్మాత, ప్రఫుల్ల పిక్చర్స్ యజమాని మాస్టర్ వినాయక్ – బినదేకర్ గారింటికి వచ్చారు. సులోచనా లాట్కర్ కుటుంబ పరిస్థితిని విని చలించిపోయి, సులోచనకి ప్రఫుల్ల పిక్చర్స్ సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. సులోచన గారికి లతా మంగేష్కర్ పరిచయమైనది ప్రఫుల్ల పిక్చర్స్ ఆఫీసులోనే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒకటే కావడంతో, వారి మధ్య స్నేహం బలపడింది. ప్రఫుల్ల పిక్చర్స్ సంస్థ బొంబాయికి తరలివెళ్ళడంతో, సులోచన జయప్రభ స్టూడియోలో నెలకి 30 రూపాలయల జీతానికి ఉద్యోగంలో చేరారు. ప్రఫుల్ల పిక్చర్స్ వారి ‘చిముకుల సంసార్’ అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు. అయితే బాల్జీ పెంధార్కర్ గారి వద్ద తాను చాలా అంశాలు నేర్చుకున్నానని సులోచన చెప్పారు. ఆయన పర్యవేక్షణలోనే తౌ గుర్రపు స్వారీ, లాఠీ ఉపయోగిండటం, కత్తి విన్యాసాలు నేర్చుకున్నానని తెలిపారు. సులోచన ‘మహారథి కర్ణ’ (1944), ‘వాల్మీకి’ (1946) అనే హిందీ సినిమాలలో నటించారు. మాస్టర్ విఠల్ సరసన ‘ససుర్‍వాస్’ (1946) అనే మరాఠీ సినిమాలో కథానాయికగా నటించారు. తన ప్రతిభకు కారణం తను గౌరవంగా ‘బాబా’ అని పిలుచుకునే తన గురువు బాల్జీ పెంధార్కర్ గారేనని అనేవారు సులోచన. ఆ రోజుల్లో చిత్రీకరణకు ముందు నెలల తరబడి నటీనటులంతా, మేకప్ తోనూ, నగలు ధరించి, కాస్ట్యూమ్స్‌లలో రిహార్సల్స్ చేసేవారని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు సులోచన. సినిమాకి సంబంధించిన అన్ని అంశాలనూ బడి పిల్లలకి నేర్పినట్టుగా నేర్పేవారని చెప్పారు.
వెండితెర కోసం నాగబాయి పేరును ‘సులోచన’గా మార్చింది బాల్జీ పెంధార్కర్ గారు. సులోచన తనకి 15 ఏళ్ళ వయసులో భూస్వామ్య కుటుంబానికి చెందిన ఆబాసాహెబ్ చవాన్‍ని వివాహం చేసుకున్నారు. పెళ్ళి తరువాత కూడా ఆమె జయప్రభ స్టూడియోలో పని చేశారు. కాలక్రమంలో జయప్రభ స్టూడియో మూతపడగా, ఈ నటి పూనే నుంచి కొల్హాపూర్‍కు మారారు. పూనేలో ఉండగా మంగళ్ పిక్చర్స్ వారి ‘జీవచ సఖా’ (1948) అనే మరాఠీ చిత్రంలో నాయికగా నటించారు. ఇది పెద్ద హిట్ అయింది. దాంతో సులోచన మరాఠీ సినీరంగంలో బిజీ అయ్యారు. ‘స్త్రీ జన్మ్ తుజీ కహానీ’ (1952) సూపర్ హిట్ అయింది. దాంతో సులోచన రంజిత్ మూవీటోన్ అధినేత సర్దార్ చందూలాల్ షా దృష్టిలో పడ్డారు. ‘స్త్రీ జన్మ్ తుజీ కహానీ’ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఫలితంగా సులోచన పూనే నుండి బొంబాయికి మకాం మార్చారు. ఈ సినిమాని హిందీలో ‘ఔరత్ తేరీ యహీ కహానీ’ (1954) అనే పేరుతో తీశారు. సులోచన కథానాయక కాగా, భరత్ భూషణ్ హీరోగా నటించారు.
తర్వాత సులోచన హిందీ సినిమాలో వరుసగా నటించారు. ‘మహాత్మా కబీర్’ (1954), ‘సజ్‍నీ’ (1956), ముక్తి (1960), ‘సతీ అనసూయ’ (1956) వంటి సినిమాలు ఆమెను ఓ స్టార్‍ని చేశాయి. కాలం మారి పౌరాణికాల మీద ప్రేక్షకుల ఆసక్తి తగ్గి సాంఘిక చిత్రాలకు ఆదరణ పెరిగింది. అయితే సులోచన సాంఘిక చిత్రాలలో నాయికగా అంతగా కుదురుకోలేకపోయారు. ఆర్. కె. ఫిల్మ్స్ వారి ‘అబ్ దిల్లీ దూర్ నహీఁ’ (1957) చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ, సులోచన గారికి అది ఉపయోగపడలేదు. ఈ సినిమాలో మాస్టర్ రోమి సరసన నటించారు సులోచన. ‘చున్ చున్ కరాతీ ఆయ్ చిడియా’, ‘యే చమన్ హమారా అప్నా హై’ – వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.
తనకి 30 ఏళ్ళ వయసులో తల్లి పాత్రలు ఇవ్వడం ప్రారంభమైందని సులోచన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బిమల్ రాయ్ గారి ‘సుజాత’ (1959) చిత్రంలో తల్లి పాత్రకి సులోచనని అడిగారట. మొదట సందేహించినా, బిమల్ రాయ్ గారి సినిమా కాబట్టి, తిరస్కరించలేక – దుర్గా ఖోటే, లలితా పవార్‌ల సలహా తీసుకుని, ఒప్పుకున్నారట. అప్పట్నించి రెండు దశాబ్దాల పాటు సులోచన సహాయక పాత్రలలో నటించారు.
‘దిల్ దేకే దేఖో’ (1959), ‘ఆయీ మిలన్ కీ బేలా’ (1964), ‘ఆయే దిన్ బహార్ కే’ (1966), ‘నయీ రోశ్నీ’ (1967), ‘సంఘర్ష్’ (1968), ‘దునియా’ (1968), ‘ఆద్మీ’ (1968), ‘కటీ పతంగ్’ (1970), ‘జానీ మేరా నామ్’ (1970), ‘కసౌటీ’ (1974), ‘కోరా కాగజ్’ (1974), ‘ప్రేమ్ నగర్’ (1974), ‘సన్యాసి’ (1975), ‘గంగా కీ సౌగంధ్’ (1978), ‘ముకద్దర్ కా సికందర్’ (1978), ‘అంధా కానూన్’ (1983), ‘క్రాంతి’ (1981) – చిత్రాలలో ఆమె గొప్ప నటనని కనబరిచారు.
సమాజానికి ఎంతో సేవ చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ తదితరుల పాత్రలు పోషించాలని సులోచనకి కోరిక ఉండేది. “సినిమాలకి కథే కీలకం. అందుకనే కథలపై శ్రద్ధ పెట్టాలి” అనేవారు.
ఆర్థరైటిస్ వ్యాధి సోకడంతో, తన ఖాళీ సమయాన్నంతా ఆవిడ సినిమాలు చూస్తూనే గడిపేవారు. సంజయ్ లీలా భన్సాలీ గారి ‘బాజీరావ్ మస్తానీ’ చూశాకా, తానేం కోల్పోతున్నానో అర్థమైందనీ, మళ్ళీ జన్మంటూ ఉంటే నటిగానే ఉంటాలని కోరుకుంటానని అన్నారు.
94 ఏళ్ల వయసులో సులోచన లాట్కర్ 4 జూన్ 2023 న ముంబయిలో మరణించారు.
***
‘సుజాత’ సినిమాలోని ‘నన్హి కలీ సోనే చలీ’ పాట యూట్యూబ్‍లో: