అలనాటి అపురూపాలు- 173

1
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మహమ్మద్ రఫీ – కొన్ని విశేషాలు:

సంగీతాభిమానులందరికీ సుపరిచితులైన మహమ్మద్ రఫీ దేశం గర్వించదగ్గ గాయకులలో ఒకరు. వారి తండ్రి హాజి అలీ మహమ్మద్. వారి ఆరు మంది కొడుకులలో రఫీ రెండవ కుమారుడు. రఫీ కుటుంబం పంజాబ్ లోని అమృత్‍సర్‌కు చెందినది. రఫీ ముద్దు పేరు ఫీకో. రఫీ తొలిసారిగా సినిమాల కోసం పాట పాడినది ‘గుల్ బలోచ్’ అనే పంజాబీ సినిమా (1944)లో. శ్యామ్ సుందర్ ఈ సినిమాకి సంగీత దర్శకులు. ‘గావ్ కీ గోరీ’ (1945) అనే సినిమా ద్వారా రఫీ హిందీ చిత్రసీమకి పరిచయమయ్యారు. ఆయన బొంబాయిలో నివాసం ఏర్పర్చుకున్నప్పుడు భేండీ బజార్ ప్రాంతంలో ఉండేవారు. ట్రాజెడీ కింగ్ కె.ఎల్.సైగల్ నటించిన ‘షాజహాన్’ (1946) చిత్రంలో రఫీ కోరస్ గాయకుడిగా ఉన్నారు. అప్పుడు రఫీకి మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో సురేంద్ర, నూర్జహాన్, సురైయా నటించిన ‘అన్‍మోల్ ఘడీ’ (1946)లో పాడేందుకు అవకాశం లభించింది.

అయితే రఫీకీ సోలో పాటలు లభించినది మాత్రం 1949 నుంచే (దిల్లగీ, దులారీ, చాందినీ రాత్, మీనా బజార్).

రఫీ – కె.ఎల్. సైగల్, జి.ఎం. దురానీ నుంచి ప్రేరణ పొందారు. మహాత్మాగాంధీ హత్యానంతరం – రపీ – హుస్న్‌లాల్ భగత్‌రామ్, రాజేంద్ర కృష్ణన్‍లతో కలిసి ‘సునో సునో ఏ దునియావాలో బాపూజీ కీ అమర్ కహానీ’ అనే పాటని సృజించారు. భారత తొలి ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ తమ ఇంట్లో పాడేందుకు రఫీని ఆహ్వానించారు.

రఫీ ఎందరో సంగీత దర్శకులుతో పని చేశారు (కొందరు అంతగా తెలియనివారితో సహా). వీరిలో నౌషాద్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, రోషన్, సర్దార్ మాలిక్, సపన్ జగ్‍మోహన్, సోనిక్ ఓమ్, ఓ.పి. నయ్యర్, చిత్రగుప్త్, శంకర్ జైకిషన్, కళ్యాణ్‍జీ-ఆనంద్‍జీ, జైదేవ్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ముఖ్యులు.

బాలీవుడ్‍లోని తొలితరం మహిళా సంగీత దర్శకులలో ఒకరైన ఉషా ఖన్నాతో రఫీకి మంచి స్నేహం ఉండేది. ‘దిల్ దేకే దేఖో’ (1959) సినిమా కోసం ఆమె సంగీత దర్శకత్వంలో పాడారు రఫీ. 15 ఏళ్ళ తర్వాత ఆమె సంగీత దర్శకత్వంలోని ‘హవాస్’ సినిమా కోసం (తేరీ గలియోం మే నా ఆయెంగే సనమ్) పాడుతున్నప్పుడు – తను సూచించనదానికీ, రఫీ పాడుతున్న విధానానికి సూక్ష్మమైన భేదం ఉండడంతో, ఆ విషయం ఆయనకి చెప్పడానికి ఆవిడ సంకోచించారట. ఈ విషయం రఫీకి తెలిసి, ఒక సంగీత దర్శకురాలిగా – గాయకుడిని సరిచేసే హక్కు ఆవిడకి ఉంటుదని చెప్పి, ఆవిడ చెప్పినట్టు పాడారట! అదీ ఆయన గొప్పదనం!

కిశోర్ కుమార్, ఉషా ఖన్నా గార్లతో రఫీ

తోటి గాయకులను రఫీ ప్రోత్సహించినంతగా మరేతర గాయకుడు ప్రోత్సహించలేదని చెబుతారు. తాను రఫీ శిష్యుడినని చెప్పుకోడానికి మహేంద్ర కపూర్ గర్వంగా భావించేవారు. ఉషా తిమోతీ, సుమన్ కళ్యాణ్‌పూర్, సుధా మల్హోత్రా వంటి గాయనీమణులు రఫీతో చక్కని పాటలు పాడారు. ఒక్క లతా మంగేషర్క్ గారితోనే ఆయనకి కొన్ని విభేదాలు ఉండేవి. సులక్షణా పండిత్ (ఆంఖోం దేఖీ, 1978; సోనా రే తుఝే కైసే మిలూం); స్వరకర్త శంకర్ శిష్యురాలు శారద తోనూ ఏ సంకోచం లేకుండా పాడారు.

రఫీ-లతలు కలిసి పాడవద్దని నిర్ణయించుకున్నప్పుడు సుమన్ కళ్యాణ్‍పూర్‌కి రఫీతో పాడే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. 1966లో విడుదలైన ‘మమత’ అనే చిత్రంలో ‘రహే నా రహే హమ్ మెహ్కా కరేంగే’ పాటని రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి లతా మంగేష్కర్ పాడినది, మరొకటి రఫీ, సుమన్ కళ్యాణ్‍పూర్‍ల యుగళగీతం. రఫీ-సుమ‍న్‍ల జోడీ అందించిన అనేక అద్భుతమైన పాటలలో 1962లో విడుదలైన ‘మై షాదీ కర్నే చలా’ సినిమాలోని ‘జబ్ సే హమ్ తుమ్ బహారోం మే’ ఒకటి. ఐ.ఎస్. జోహార్, సయీదా ఖాన్ ప్రధాన తారాగణం కాగా – ఫిరోజ్ ఖాన్, తబుస్సమ్, ముంతాజ్, పర్వీన్ చౌదరి ఇతర నటీనటులు. వాడియా బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రానికి రూప్ కె షోరే దర్శకత్వం వహించారు. చిత్రగుప్త్ సంగీతం అందించిన ఈ హాస్య చిత్రం యావరేజ్‍గా నిలిచింది.

1952లో విడుదలైన ‘బైజు బావరా’ – సంగీత దర్శుకుడు నౌషాద్, నటి మీనా కుమారి, నటుడు భరత్ భూషణ్, గాయకుడు రఫీల కెరీర్‍లను స్థిరపరిచింది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్థాన గాయకుడు తాన్‍సేన్‌ని సవాల్ చేసిన బైజూ కథ – గోల్డెన్ జుబిలీ హిట్ అయింది.

నౌషాద్ గారితో రఫీ

నటుడు దేవ్ ఆనంద్ కిషోర్ కుమార్ వైపు మొగ్గు చూపేంతవరకూ ఆయన స్వరం రఫీనే. దురదృష్టవశాత్తు, స్వరకర్త జైదేవ్‍కీ, ఆనంద్ సోదరులకు అంతగా పొసగకపోవడంతో – బాలీవుడ్ ఓ గొప్ప సంగీత దర్శకుడి ప్రతిభకి దూరమైంది. 1961లో విడుదలైన ‘హమ్ దోనోం’ తరువాత జైదేవ్ – ఆనంద్ సోదరుల సినిమాలకి పనిచేయలేదు. ఈ సినిమాలో రఫీ పాడిన ‘అభీ నా జావో ఛోడ్‍కర్’, ‘మై జిందగీ కే సాథ్ నిభాతా చలా గయా’ ఆదరణ పొందాయి.

గురుదత్‍కి రఫీ, హేమంత్ కుమార్‍లు ఇద్దరూ పాడారు. కిషోర్ కుమార్ ప్లే బాక్ కింగ్‌గా దూసుకుపోతున్న కాలంలోనూ రఫీ ఎస్.డి.బర్మన్‍తో సత్సంబంధాలు నెరపారు. బర్మన్ గారు రఫీని విస్మరించక, ‘ఆరాధన’, ‘అభిమాన్’ సినిమాలలో పాడించారు. ఆర్.డి.బర్మన్‍ కిషోర్ కుమార్ వైపు కొంత మొగ్గు చూపినా, 1973లో విడుదలైన ‘యాదోం కీ బారాత్’‍లో రఫీతో పాడించారు. నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, జీనత్ అమన్ కెరీర్‍ నిలదొక్కుకోడంలో సాయపడింది.

ఎస్.డి.బర్మన్ గారితో రఫీ
ఆర్.డి.బర్మన్ గారితో రఫీ

షమ్మీ కపూర్, రఫీ – తెరపైన మాయాజాలం సృష్టించారు. షమ్మీ కోసం పాడేటప్పుడు రఫీ తానే షమ్మీ అయిపోతారు. తన పాటలు రఫీ పాడుతున్నప్పుడు షమ్మీ రికార్డింగ్ స్టూడియోకి వచ్చి వినేవారట.

‘షరారత్’ సినిమాకి గాను కిషోర్ కుమార్‍కి తన స్వరాన్నిచ్చారు రఫీ. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

రఫీ – రాజేంద్రకుమార్, ధర్మేంద్ర, బిస్వజీత్, నవీన్ నిశ్చల్, శశి కపూర్, మనోజ్ కుమార్ వంటి హీరోలకు కూడా పాటలు పాడారు. 1969లో ‘ఆరాధన’ సినిమా విజయంతో, కిషోర్ కుమార్ దూసుకుపోతున్న తరుణంలో, రఫీ పని అయిపోయిందని కొన్ని పత్రికలు రాశాయి. కానీ ఇందుకు భిన్నంగా 1969 తర్వాత కూడా రఫీ కొన్ని అద్భుతమైన పాటలని పాడారు. రాజేశ్ ఖన్నా, తనని కాదని, కిషోర్ కుమార్ వైపు మొగ్గు చూపడం రఫీకి షాక్ వంటిదే అయినా, ఆయన దాన్ని హుందాగా ఆమోదించారు.

1974లో విడుదలైన ‘ఠోకర్’ సినిమాలోని ‘అప్నీ ఆంఖోం మే బస్‍కర్’ ఓ చక్కని ఉదాహరణ. బల్‍దేవ్ ఖోస్లా, శివ్ కుమార్, అల్కా నటించిన ఈ చిత్రం ఓ చిన్న సినిమా. శ్యామ్‍జీ-ఘన్‍శ్యామ్‌జీ ఈ సినిమాకి సంగీతం అందించారు. వినయం గెలిచిన సందర్భం ఇది. తనకు ఓ సూపర్‌స్టార్ వల్ల అవకాశాలు తగ్గుతున్నాయన్న విషయాన్ని రఫీ ఎన్నడూ ఓ అవమానంగా భావించలేదు.

1968లో విడుదలైన ‘నీల్‍కమల్’ చిత్రం (రామ్ మహేశ్వరి దర్శకులు, స్వరకర్త రవి) లోని ‘బాబుల్ కీ దువాయేం లేతీ జా’ పాట రికార్డింగ్ సందర్భంగా రఫీ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. దుఃఖించారు. ఈ పాటకి ఆయనకి జాతీయ అవార్డు లభించడం విశేషం.

లతా మంగేష్కర్‍కీ, మదన్ మోహన్‍కీ మధ్య అనుబంధం అందరికీ తెలిసినదే. లత ఆయనను తన రాఖీ సోదరుడిగా భావిస్తారు. అయితే మదన్ మోహన్‌కి రఫీ అన్నా అంతే అభిమానం. ఆయన సంగీత దర్శకత్వంలో రఫీ ‘తేరీ ఆంఖోం కే శివా’, ‘యే దునియా యే మెహ్‌ఫిల్’, ‘కర్ చలే హమ్ ఫిదా’, ‘మేరీ ఆవాజ్ సునో’, ‘తుమ్ జో మిల్ గయే హో’ వంటి హిట్ పాటలు పాడారు.

మదన్‍ మోహన్ గారితో రఫీ

బాలీవుడ్ లోని మేటి గాయకులు ముగ్గురు – ముకేశ్, కిశోర్ కుమార్, రఫీ – గుండెపోటుతో మరణించడం యాదృచ్ఛికం.

‘రఫీ లేకపోతే ఓ.పి.నయ్యర్ లేడు’ అని ఓ.పి.నయ్యరే ఒకసారి స్వయంగా అన్నారు.

50వ దశకం చివర్లో, 60వ దశకంలో విడుదలైన చాలా సినిమాల్లో (ఆశా పరేఖ్, సాధన, షర్మీలా టాగోర్ వంటి నాయికలు నటించినవి) పాటలు కాశ్మీరులో చిత్రీకరణ జరుపుకునేవి. వీటిలో చాలా సినిమాలకు ఓ.పి.నయ్యర్ సంగీతం అందించారు. ఈ పాటల్లో కథానాయకుడికి స్వరాన్నిచ్చింది రఫీగారే.

ఓ.పి.నయ్యర్ గారితో రఫీ

అయితే వీరిద్దరి మధ్య ‘సావన్ కీ ఘాటా’ సినిమా పాటల రికార్డింగ్ సందర్భంగా మనస్పర్థలు వచ్చాయి. ఒకసారి రఫీ రికార్డింగ్‌కి ఆలస్యంగా రావడాన్ని నయ్యర్ భరించలేకపోయారు. ఆ తరువాత దాదాపు మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసి పని చేయలేదు. అయితే 70వ దశకం ప్రారంభానికి నయ్యర్ ప్రభ క్షీణించింది. పైగా ఆశా భోస్లేతో వివాదం కూడా పరిస్థితిని జటిలం చేసింది.

‘పారస్‍మణి’ (1963), ‘దోస్తీ’ (1964) సినిమాల పాటలను రఫీ తన స్వరంలో అజరామరం చేశారు. ఈ సినిమాల వల్ల స్వరకర్తలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్‍కు ఎంతో పేరు ప్రఖ్యాతులు, మరిన్ని అవకాశాలు వచ్చాయి. వీరిద్దరూ తొలుత మ్యూజిక్ అసిస్టెంట్లుగా, అరేంజర్లుగా కెరీర్ ప్రారంభించారు. కానీ వారి ప్రతిభ వల్ల ఉన్నత స్థాయికి ఎదిగారు. కిషోర్ కుమార్ తన పారితోషికాన్ని ఎలాగైనా వసూలు చేసుకునేవారనీ, రఫీ మాత్రం నిర్మాత ఆర్థిక ఇబ్బందులలో ఉంటే తన పారితోషికంపై పట్టు పట్టేవారు కాదని చెప్తారు.

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ గార్లతో రఫీ

‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ సినిమాలోని ‘హమ్ కో తుమ్ సే హో గయా హై ప్యార్’ పాటను – రఫీ, ముకేశ్, లత కలిసి పాడారు. బహుశా ఈ ముగ్గురు కలిగి పాడిన మొదటి, ఆఖరి పాట ఇదే కావచ్చు.

ఖయ్యాం తో అనుబంధం:

స్వరకర్త ఖయ్యాం గారు అత్యంత నెమ్మదస్థులు. రాశి కన్నా వాసి ముఖ్యమని భావించేవారు. తన ప్రతిభని ప్రదర్శించే ఎన్నో బాణీలను ఆయన అందించారు. రఫీ ఆయనకి వీలైనంత మద్దతునిచ్చారు. ‘శంకర్ హుస్సేన్’ (1977) సినిమాలోని ‘కహీ ఏక్ మాసూమ్ నాజూక్ సీ లడ్‍కీ’ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఖయ్యామ్ గారితో రఫీ

ఖయ్యాం ‘బీబీ’ (1950) అనే సినిమాకి సంగీతం అందించగా, ఆ సినిమా కోసం రఫీ పాడిన ఓ గజల్ సూపర్ హిట్ అయింది. ఖయ్యాం, రఫీ కలిసి పని చేసిన సినిమాలు తక్కువే అయినా – గుండెపోటుతో రఫీ మరణించేవరకూ వారి స్నేహం కొనసాగింది. రఫీ అంకితభావం గొప్పదనీ, ఆయన వినయం ఆయనకి ఆభరణమని ఖయ్యాం అన్నారు.

రఫీ తన మార్కెట్ విలువని పట్టించుకోకుండా కొన్ని చిన్న సినిమాలకి కూడా పాడారు. రఫీ కొన్ని భజనలను పాడాలనుకుని, వాటికి ఖయ్యాంతో బాణీలు కట్టించారు. రఫీ ఎప్పుడూ ఓ విద్యార్థిలా ఉంటూ సంగీతంలోని సూక్ష్మాలను, రాగాలను, మిక్సింగ్‌ని నేర్చుకునేవారు. తెర మీద పాత్రకి తగ్గట్టుగా తన స్వరాన్ని మారుస్తూ పాడడం వల్ల, ఆయన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి.

70వ దశకంలో throat infection వల్ల రఫీ కెరీర్‍లో కొంత స్తబ్ధత ఏర్పడింది. అయినా రఫీ తట్టుకున్నారు. కొన్ని చక్కని గీతాలను పాడారు.

70వ దశకం తొలినాళ్ళలో ప్రజాదరణ పొందిన రఫీ పాటలు కొన్ని:

  1. కాన్ మే ఝుంకా (సావన్ బాధోం, 1969)
  2. తుమ్ ముఝే యూం భులా నా పావోగే (పగ్లా కహీ కా, 1970)
  3. ఝిల్‍మిల్ సితారోం కా (జీవన్ మృత్యు, 1970)
  4. గులాబీ ఆంఖేం (ది ట్రెయిన్, 1970)
  5. యూం హి తుమ్ ముఝ్ సే బాత్ (సచ్ఛా ఝూటా, 1971)
  6. ఇత్నా తో యాద్ హై ముఝే (మెహబూబ్ కీ మెహందీ, 1971)
  7. మేరా మన్ తేరా ప్యాసా (గాంబ్లర్, 1971)
  8. కిత్నా ప్యారా వాదా (కారవాఁ, 1972)
  9. చురా లియా హై తుమ్ నే (యాదోం కీ బారాత్, 1973)
  10. న తు జమీన్ కే లియే (దాస్తాన్, 1972)
  11. సారే షహర్ మే ఆప్సా (బైరాగ్, 1976)
  12. ఆజ్ మౌసమ్ బడా బేయీమాన్ హై (లోఫర్, 1973)

నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘హమ్ కిసీ సే కమ్ నహీ’ (1977) చిత్రంలోని ‘క్యా హువా తేరే వాదా’ పాటకి రఫీ జాతీయ అవార్డు గెల్చుకున్నారు.

1978లో రఫీ లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‍లో ప్రదర్శన ఇచ్చారు. 1980లో వెంబ్లే కాన్ఫరెన్స్ సెంటర్‍లో ప్రదర్శన ఇచ్చారు. 1970 నుంచి తాను చనిపోయేవరకూ రఫీ వివిధ దేశాలు పర్యటిస్తూ అనేక ప్రదర్శనలిచ్చారు.

లత తో వివాదం:

రఫీ కెరీర్ మొత్తం దాదాపు వివాద రహితంగా సాగింది. అయితే రాయల్టీ విషయంలో రేగిన వివాదం సున్నిత మనస్కుడైన రఫీని ఇబ్బంది పెట్టింది. 60వ దశకం తొలినాళ్ళలో – మ్యూజిక్ కంపెనీల నుండి సినీ నిర్మాత పొందే 5% రాయల్టీలో సగ భాగం గాయనీగాయకులకి ఇవ్వాలని లతా మంగేష్కర్ పట్టుబట్టారు. అయితే రఫీ ఆమె వాదనకి మద్దతివ్వలేదు. తన విజయాల పట్ల అణుకువగా ఉండే రఫీ, నేపథ్య గాయకుడు – ఓ పాటని పునఃసృష్టిస్తున్నాడని నమ్మేవారు; ఘనత అంతా గీత రచయితదీ, స్వరకర్తదీ అనేవారు. దీంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. నేను లతో పాడనని ప్రకటించారు రఫీ. తాను కూడా రఫీతో పాడనని అన్నారు లత.

లతా మంగేష్కర్ గారితో రఫీ

లత-రఫీల గొడవ వల్ల తాత్కాలికంగా కొందరు గాయనీమణులకు పేరొచ్చింది. స్వరకర్త సలీల్ చౌదరి ‘మాయా’ (1961) అనే చిత్రం కోసం ‘తస్వీర్ తేరీ దిల్ మే’ అనే పాటని రికార్డు చేస్తుండగా, పాటలోని కొన్ని పంక్తులను రఫీ పాడిన తీరుకి లత అభ్యంతరం చెప్పారట. చౌదరి లత పక్షం వహించడంతో, రఫీకి బాధ కలిగింది. అయితే దాదాపు దశాబ్దం తరువాత రఫీని, లతని కలిపారు స్వరకర్త జైకిషన్. కానీ వారిద్దరి మధ్య ఇదివరకటి స్నేహం లేదు. వారిద్దరి మధ్య ఒకప్పుడు ఉండే వ్యక్తిగత సౌహార్దత శాశ్వతంగా దూరమయింది.

అలాగే తాను మరణించడానికి కొన్నేళ్ళ ముందు – లతా మంగేష్కర్ అత్యధిక పాటలని అంటే 25,000 పాటలని రికార్డు చేశారని – గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రకటించడాన్ని – రఫీ అంగీకరించలేదు. ఈ సంఖ్య ఓ అతిశయోక్తి అని కొందరు సంగీతాభిమానులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో గిన్నిస్ బుక్ వాళ్ళదై పై చేయి అయింది.

తీవ్రమైన గుండెపోటు రావడంతో, 31 జూలై 1980 నాడు రాత్రి 10.25కి రఫీ మృతి చెందారు. ఓం ప్రకాశ్ దర్శకత్వంలో ‘ఆస్‍పాస్’ (1981) చిత్రంలో రఫీ ఆఖరిసారిగా పాడారు. ధర్మేంద్ర, హేమమాలిని, ప్రేమ్ చోప్రా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది.

రఫీ అంత్యక్రియలకు పదివేలమందికి పైగా హజరయ్యారు. రఫీ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ చేయించుకుని ఉంటే మరి కొన్నాళ్ళు జీవించి ఉండేవారేమో. లేదా విపరీతంగా పని చేసే స్వభావమే ఆయనపై ఒత్తిడి పెంచిందా? ఆయన పట గౌరవంగా రెండు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది భారత ప్రభుత్వం.

రఫీ హఠాన్మరణం అనంతరం లతా మంగేష్కర్ ఆయనని ఘనంగా పొగిడారు. ఆయన స్వరస్థాయి మరే గాయకుడికీ లేదని అన్నారు. రఫీ స్వరం దేవుని స్వరం అన్నారు మన్‍మోహన్ దేశాయ్. నేటికీ మహమ్మద్ రఫీకి అధిక సంఖ్యలో అభిమానులున్నారు. ఆయన పాడిన పాటలు వాళ్ళ హృదయాలని కదిలిస్తూనే ఉన్నాయి.

రఫీకి బాడ్మింటన్, క్యారమ్స్ ఆడడం ఇష్టం. గాలిపటాలు ఎగరేయటం మరీ ఇష్టం. ఆయన జీవితమంతా భార్య బిల్క్విస్ బానో ఎంతో మద్దతుగా నిలిచారు. రఫీ హఠాన్మరణం ఆవిడని ఎంతగానో క్రుంగదీసింది.

భారత ప్రభుత్వం తనకి ప్రకటించిన ‘పద్మ శ్రీ’ పురస్కారాన్ని రఫీ హుందాగా స్వీకరించినా; ఆయన ‘పద్మ భూషణ్’ పురస్కారానికి అర్హులని అనేక మంది భావించారు. అలాగే 1967 సంవత్సరాన్ని లతా మంగేష్కర్ రజతోత్సవ సంవత్సరంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం రఫీకి అంతగా నచ్చలేదు.

అప్పట్లో బాలీవుడ్ నేపథ్య గాన రంగాన్ని ఏలుతున్న లతా మంగేష్కర్‍కి అందరూ తలొగ్గితే, ఒక్క రఫీనే ఆవిడని ఎదుర్కున్నారని అంటారు.

అన్వర్, షబ్బీర్ కుమార్, మహమ్మద్ అజీజ్ అనే గాయకులు రఫీలా పాడేందుకు ప్రయత్నించారు. అయితే అన్వర్ గొంతు తన గొంతులా ఉంటుందని రఫీ పేర్కొన్నారు. అతనంటే అసూయ చెందకుండా, రఫీ అన్వర్‍ని ప్రోత్సహించారు.

నేడు మహమ్మద్ రఫీ భారతీయ సినీ సంగీత రంగంలో ఒక దిగ్గజం. కొన్ని పాటలు కేవలం రఫీయే పాడగలరు, ఎందుకంటే మానవత్వంతోనూ, సమతావాదంతోనూ నిండిన ఆయన సహజ స్వభావం ఆ పాటలకి ప్రాణం పోసింది. ఎందరో గాయనీమణులతో కలిసి పాడినా, ఆయనపై ఏ వివాదాలూ లేవు. ఆయన రక్షణ స్వభావం కారణంగా గాయనీమణులు ఆయనని అభిమానించేవారు, ఆయన వారికో గురువు, మెంటార్ లాంటి వారు. ఉషా తిమోతి, సుధా మల్హోత్రా, కమల్ బారోత్, సుమన్ కళ్యాణ్‍పూర్, సులక్షణ పండిత్ వంటి గాయనీమణులు రఫీతో చక్కని స్నేహం కలిగి ఉండేవారు. మహేంద్ర కపూర్ 30 సెప్టెంబర్ 2008న తాను మరణించేవరకూ – రఫీకి గొప్ప శిష్యుడిగా ఉన్నారు.

శంకర్ జైకిషన్ గార్లతో రఫీ

‘పారస్‍మణి’, ‘దోస్తీ’ సినిమాలలో పాటలను పాడినందుకు స్వరకర్తలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్‍ రఫీకి ఎంతగానో ఋణపడి ఉంటారు. ఈ రెండు సినిమాల వల్ల వీరీ జోడీ సినీ సంగీతంలో సంచలనం సృష్టించింది. ‘ఓ జబ్ యాద్ ఆయే’, ‘చాహూంగా మై తుఝే’ – పాటలు సినీ సంగీత ప్రియుల హృదయాలలో నిలిచిపోతాయి. సంగీతం పట్ల ప్రేమ అన్నీ భౌగోళిక పరిమితులను, భాషా పరిమితులను అధిగమిస్తుంది. రఫీ సాధించిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనం.

రఫీ భౌతికంగా మరణించినా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయనను ఇంకా స్మరించుకుంటున్నారంటే, గాయకుడిగా రఫీ గొప్పదనం తెలుస్తుంది. అంతకంటే ముఖ్యం, ఆయన ఓ మంచి మనిషి. అందుకే మనందరికీ ఆయనంటే అంత అభిమానం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here