Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 177

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే:

భారతీయ చలనచిత్ర పితామహుడుగా పేరు గాంచిన దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈయన 30 ఏప్రిల్ 1870 న గోవింద్ సదాశివ్ ఫాల్కే, ద్వారకాబాయి దంపతులకు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ‍లో జన్మించారు.  భారతదేశపు తొలి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’కి రచయిత, నిర్మాత, దర్శకుడూ దాదాసాహెబే. ఆయన తన కెరీర్ మొత్తంలో 95 సినిమాలు, 26 లఘుచిత్రాలు తీశారు. 1937లో ఫాల్కే తన చివరి సినిమా ‘గంగావతరణ్’ తీసి, సినీరంగం నుంచి విరమించుకుని నాసిక్‍లో స్థిరపడ్డారు. భారత ప్రభుత్వం ఈయన పేరిట – భారతీయ చలన చిత్రరంగానికి చేసిన జీవితకాలపు సేవలకు గాను – 1969 నుంచి ప్రతి ఏటా వార్షిక పురస్కారం అందిస్తోంది. ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అందజేస్తారు.

ఫాల్కే గారికి ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. ఫాల్కే తండ్రి సంస్కృత పండితులు. మతపరమైన ఉత్సవాలు నిర్వహించే హిందూ పూజారిగా పనిచేసేవారు. యజ్ఞయాగాదులు నిర్వహించడం, రోగాలకు మందులు ఈయడం తండ్రి నుంచి నేర్చుకున్నారు ఫాల్కే. తన ప్రాథమిక విద్యని త్రయంబకేశ్వర్ లోనే పూర్తిచేశారు ఫాల్కే. తన తండ్రి బొంబాయిలోని విల్సన్ కాలేజీలో సంస్కృతం ప్రొఫెసర్‍గా నియమితులయ్యాకా, ఫాల్కే బొంబాయిలో తన మాధ్యమిక విద్యని పూర్తి చేశారు. సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ లో చేరి చిత్రలేఖనంలో ఒక ఏడాది కోర్సు పూర్తి చేశారు. 1890 నాటికి ఆయన తన అన్నయ్య శివరామ్ పంత్‍ వెంట గుజరాత్ లోని బరోడా చేరి, ఫొటోగ్రాఫర్‍గా పని చేశారు. బరోడాలోని మహరాజా శాయాజీరావ్ యూనివర్శిటీలోని కళాభవన్ నుంచి ఒక కోర్సు చేసి – శిల్పకళ, చిత్రలేఖనం, పెయింటింగ్, ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. ఓ మరాఠీ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బిడ్డ. కానీ 1900లో సంభవించిన ప్లేగు వ్యాధికి భార్యని, బిడ్డని పోగొట్టుకున్నారు.

బరోడాలో ప్రదర్శన ఇస్తున్న మెజీషియన్ కార్ల్ హెర్ట్జ్ ని కలిసారు. ఆయన వద్ద నుంచి మేజిక్ ట్రిక్స్ కొన్ని నేర్చుకుని, తరువాతి కాలంలో వాటిని సినిమాలలో ఉపయోగించారు. 1901లో Professor Kelpha అనే పేరుతో మెజీషియన్‍గా వేదికలపై ప్రదర్శనలిచ్చారు. ఫాల్కే అనే పేరులోని ఆంగ్ల అక్షరాలను అటూ ఇటూ చేసి ఆ పేరు పెట్టుకున్నారు. 1902లో గిరిజా కరందికర్ అనే ఆవిడని ద్వితీయ వివాహం చేసుకున్నారు. పెళ్ళి తరువాత భార్య పేరు మార్చడం అప్పటి ఆచారం. దాని ప్రకారం ఆమె పేరును సరస్వతిగా మార్చారు. 1903లో ఫాల్కే ఫొటోగ్రఫీ వృత్తిని వదిలి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డ్రాఫ్ట్స్‌మాన్‍గా చేరారు. తరువాత ఆర్. జి. భండార్కర్ తో కలిసి లోనావాలాలో ‘ఫాల్కే ఎన్‍గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ వర్క్స్’ పేరిట ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. డ్రామా కంపెనీల కోసం తెరలపై పెయింటింగులు వేసేవారు. ఈ అనుభవం వల్ల నాటక సంస్థలతో పరిచయాలు పెరిగి, నాటకాలపై అవగాహన పెంచుకుని, నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేశారు. చిత్రకారుడు రాజా రవివర్మకి చెందిన ప్రెస్ పనులు ఫాల్కే ప్రింటింగ్ ప్రెస్ ద్వారా జరిగేవి. వ్యాపారం బాగా పుంజుకోవడంతో ప్రెస్‍ని బొంబాయికి మార్చారు. 1908 నాటికి భండార్కర్ స్థానంలో పురుషోత్తం మావ్జీ భాగస్వామి అయ్యారు. ప్రెస్‍కి లక్ష్మీ ఆర్ట్ ప్రింటింగ్ వర్క్స్ అని పేరు మార్చారు. 1909లో తన ప్రింటింగ్ ప్రెస్‍కి కలర్ ప్రింటింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని ఫాల్కే జర్మనీ వెళ్ళారు. కానీ పురుషోత్తం గారితో విభేదాలు తలెత్తాయి. తన వాటా డబ్బు తీసుకోకుండానే ప్రెస్ నుంచి బయటకొచ్చేసారు ఫాల్కే.

తన పెద్ద కొడుకు బాలచంద్రతో కలిసి బొంబాయి లోని అమెరికా ఇండియా పిక్చర్ ప్యాలెస్‍లో ‘అమేజింగ్ యానిమల్స్’ అనే సినిమాకి వెళ్ళారు ఫాల్కే. ఆ సినిమా బాగా నచ్చడంతో, కుటుంబంతో కలిసి – Alice Guy-Blaché దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే సినిమా చూశారు. ఇది ఆయన కెరీర్‍లో ఒక మేలి మలుపు అయింది. ఆ సినిమా విపరీతంగా నచ్చేయడంతో, భారతీయ ప్రేక్షకుల కోసం ఓ సినిమా తీయాలనే కోరిక జనించింది. సినిమా నిర్మాణం గురించి లభ్యమైనవన్నీ చదివారు, చూశారు. యశ్వంత్ నాదకర్ణి వద్ద నుంచి ఋణం తీసుకున్నారు, అబాసాహెబ్ చిట్నిస్ వద్ద పన్నెండువేల రూపాయల విలువైన తన బీమా పాలసీని కుదువబెట్టి మరో ఋణం తీసుకున్నారు. 1912లో ఆయన లండన్ వెళ్ళారు. అక్కడ ‘బైస్కోప్ సినీ వీక్లీ’ ఎడిటర్ కెప్‌బర్న్‌ను కలిశారు. ఆయన ఫాల్కే గారిని వాల్టన్ స్టూడియోకి చెందిన నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అయిన సిసిల్ హెప్‍వర్త్‌కి పరిచయం చేశారు. హెఫ్‍వర్త్ గారు సినీనిర్మాణంపై ఫాల్కే గారికి మరింత అవగాహన కల్పించారు. వారి సలహాను అనుసరించి ఫాల్కే ఒక విలియమ్సన్ కెమెరా, ఒక పెర్ఫోరేటర్, కొన్ని కొడాక్ ఫిల్మ్‌లు కొనుగోలు చేశారు.

స్వదేశానికి తిరిగి వచ్చి ‘ఫాల్కే ఫిల్మ్స్ కంపెనీ’ అనే సంస్థని స్థాపించారు. ఫిల్మ్‌ని పెర్‍ఫొరేట్ చేయడం, డెవలప్ చేయడం తన కుటుంబ సభ్యులకి నేర్పారు. కెమెరా, ప్రొజెక్టరు సరిగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు చుట్టుపక్కల పిల్లలని చిత్రీకరించేవారు. ఒక బఠాణీ చెట్టు ఎదుగుదలను లఘుచిత్రంగా తీయాలనుకున్నారు. ఒక కుండీలో బఠానీగింజని నాటి కెమెరాని దాని ముందు పెంఛి, రోజుకి ఒక ఫ్రేమ్ చొప్పున చిత్రీకరించారు. ‘అంకురాచి వాధ్’ (Growth of a Pea Plant) అనే నిమిషం నిడివి గల లఘుచిత్రాన్ని రూపొందించి – తన సినిమాకి ఆర్థిక సాయం చేయగల కొంతమందికి దాన్ని చూపించారు. సినీ నిర్మాణ సాంకేతికతని మెచ్చిన యశ్వంత్ నాదకర్ణి, నారాయణరావు దేవ్‍హారే – ఫాల్కేగారికి అప్పు ఇచ్చారు. భార్య బంగారు నగలను కుదువ పెట్టి నిధులు సమకూర్చుకున్నారు. అందమైన ముఖాల కోసం చూస్తున్న ఫాల్కే, తదుపరి ప్రకటనలో ‘అనాకారి వ్యక్తులు దరఖాస్తు చేయనక్కరలేదు’ అని రాశారు. దత్తాత్రేయ దామోదర్ దాబ్కేకి రాజా హరిశ్చంద్రుని పాత్ర, అన్నా సాలుంకేకి రాణి తారామతి పాత్రనిచ్చారు. ఫాల్కే గారి కుమారుడు బాలచంద్ర ఫాల్కే రోహితాశ్యుడి పాత్రలో నటించారు. స్క్రిప్ట్, దర్శకత్వం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, ఎడిటింగ్, ఫిల్మ్ ప్రాసెసింగ్ – అన్ని బాధ్యతలూ ఫాల్కే గారే నిర్వహించారు. 40 నిమిషాల నిడివి ఉన్న ‘రాజా హరిశ్చంద్ర’ (1913) అనేది భారతదేశపు పూర్తి స్థాయి తొలి మూకీ చిత్రం.

‘మోహినీ భస్మాసుర్’ (1913) అనే చిత్రం ద్వారా ప్రధాన పాత్రలో మహిళని నటింపజేశారు. ఆ రోజుల్లో మహిళలు నటించడంపై నిషేధం ఉండేది. భారతీయ సినిమాలో డ్యూయెల్ రోల్ పరిచయం చేసింది ఫాల్కే గారే. రామాయణం ఆధారంగా రూపొందించిన ‘లంకా దహన్’ (1917) అనే సినిమాలో అన్నా సాలుంకే – రాముడిగాను, సీత గాను నటించారు. 1917లో పలువురు భాగస్వాములతో కలిసి ఫాల్కే ‘హిందుస్థాన్ ఫిల్మ్ కంపెనీ’ని స్థాపించారు. ఈ సంస్థ తీసిన పౌరాణిక సినిమాలలో ఆయన అనేక స్పెషల్ ఎఫెక్ట్స్‌ని వాడారు.

‘మోహినీ భస్మాసుర్’ (1913), ‘సత్యవాన్ సావిత్రి’ (1914), ‘శ్రీకృష్ణ జన్మ’ (1918), ‘సైర్రంధ్రి’ (1920), ‘శకుంతల’ (1920), ‘రాజర్షి అంబరీష్’ (1922), ‘గురు ద్రోణాచార్య’ (1923), ‘ద్రౌపది వస్త్రాపహరణ్’ (1927), ‘సంత్ మీరాబాయి’ (1929), ‘కబీర్ కమల్’ (1930) – వంటివి ఆయన తీసిన కొన్ని ఉత్తమమైన చిత్రాలు.

‘హిందుస్థాన్ ఫిల్మ్ కంపెనీ’ లోని భాగస్థులతో విభేదాలు రావడంతో, సినీరంగం నుంచి విరమించుకుని, ఉత్తర్ ప్రదేశ్‍లోని వారణాసిలో స్థిరపడాలని తలచారు ఫాల్కే. అక్కడ ఎన్నో నాటకాలు చూసి ప్రేరణ పొంది – సుమారు రెండున్నర నెలలు కష్టపడి – మరాఠీ భాషలో ‘రంగభూమి’ అనే నాటకం రచించారు. వారణాసిలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగినప్పుడు – ఈ నాటకాన్ని జి.ఎస్. ఖపర్దే గారికీ, బాలగంగాధర తిలక్ గారికి చదివి వినిపించారు ఫాల్కే. ‘రంగభూమి’ అనేది ఏడు అంకాల నాటకం. మొదటి నాలుగు అంకాలను ఒక రాత్రి, మరో మూడింటిని మరో రాత్రి ప్రదర్శించేవారు. 1922లో బొంబాయిలోని బలివాలా థియేటర్‍లో దీన్ని ప్రదర్శించారు.

తరువాత హిందూస్థాన్ ఫిల్మ్ కంపెనీలో నెలకి వెయ్యి రూపాయలు జీతంతో ప్రొడక్షన్ చీఫ్ అండ్ టెక్నికల్ అడ్వైజర్‍గా చేరారు. కొన్నాళ్ళకి, హిందూస్థాన్ ఫిల్మ్ కంపెనీ మాజీ భాగస్థుడైన మాయాశంకర్ భట్‍తో కలిసి ‘డైమండ్ ఫిల్మ్ కంపెనీ’ని స్థాపించారు. ఈ కొత్త బేనర్ పై ఫాల్కే తన దర్శకత్వంలో ‘సేతు బంధన్’ అనే సినిమాని ప్రారంభించారు. అయితే నిర్మాణ వ్యయం అధికమై, నిధులు లేక ఒక సంవత్సరం పాటు చిత్రీకరణ ఆపేశారు. మాజీ భాగస్థుడు వామన్ ఆప్టే ఒక షరతు మీద సినిమాకి ఫైనాన్స్ చేయడానికి ముందుకొచ్చారు. అదేంటంటే, సినిమా పూర్తయ్యాకా, ఈ సంస్థని హిందూస్థాన్ ఫిల్మ్ కంపెనీలో విలీనం చేయాలి. ఆ తరువాత మరో రెండేళ్ళకి ‘సేతు బంధన్’ విడుదలైంది. అప్పటికి, ఒప్పందం ప్రకారం ‘డైమండ్ ఫిల్మ్ కంపెనీ’ – హిందూస్థాన్ ఫిల్మ్ కంపెనీలో కలిసిపోయింది.

ఇదే సమయంలో ఫాల్కే ఎదుర్కున్న మరో పెద్ద సమస్య – టాకీ చిత్రాల ఆగమనం. భారతదేశపు తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ (1931) దర్శకుడయిన అర్దేషిర్ ఇరానీ – మూకీ చిత్రం ‘సేతు బంధన్’ (1932)కి కొన్ని శబ్దాలు జోడించమని ఫాల్కే గారికి సలహా ఇచ్చారట.

ఫాల్కే గారి ‘గంగావతరణ్’ (1937) పూర్తవడానికి రెండేళ్ళు పట్టింది. ఎట్టకేలకు రాయల్ ఒపేరా హౌస్‍లో విడుదలయింది. అది ఆయన తొలి టాకీ చిత్రం, దర్శకుడిగా చివరి చిత్రం.

సినిమాల నుంచి పూర్తిగా విరమించుకున్న ఫాల్కే తన జీవితపు చివరి దశను ఒంటరిగా, దుర్భరంగా, అనారోగ్యంతో నాసిక్‍లో గడిపారు. 16 ఫిబ్రవరి 1944 న కన్నుమూశారు ఫాల్కే.

ఫాల్కే జీవితం, భారతదేశపు తొలి సినిమా తీయడానికి ఆయన ఎదుర్కున్న కష్టాలతో – మరాఠీ బయోపిక్ ‘హరిశ్చంద్రాచి ఫాక్టరీ’ (2009) రూపొందింది. ఆ ఏడాది ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అఫీషియల్ ఎంట్రీ అయింది ఈ సినిమా.

Exit mobile version