Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 178

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తొలి భారతీయ మహిళా సూపర్ స్టార్ నసీమ్ బాను:

1940వ దశకంలో బాలీవుడ్‍లో కెల్లా అందమైన తారగా పేరుగాంచారు నసీమ్ బాను. ‘బ్యూటీ క్వీన్‍’ అనే బిరుదుపొందిన ఆమె కొన్ని ఏళ్ళ పాటు ప్రేక్షకులని అలరించారు. ఆమె ఎంత అందంగా ఉండేవారంటే, గుచ్చి గుచ్చి చూసేవారి నుంచి తప్పించుకునేందుకు ఆమెని దాచి ఉంచేవారట. సినిమాల్లోకి రావాలని కోరిక ఉన్నా ఆమె తల్లి అంగీకరించకపోవడంతో నసీమ్ నిరాహార దీక్ష చేసి తల్లిని ఒప్పించి, సినిమాల్లోకి ప్రవేశించారు. ఆ విధంగా ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి సినిమాతోనే ఆమె రాత్రికి రాత్రి ఓ పెద్ద స్టార్ అయిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటించాకా, తన కుమార్తె సైరా బాను సినిమాల్లోకి రావడంతో, నసీమ్ నటన విరమించుకున్నారు.

 

నసీమ్ బాను అసలు పేరు రోషన్ అరా బేగం. పాత ఢిల్లీలో 4 జూలై 1916 నాడు జన్మించారు. నసీమ్ బాను తల్లి చమియన్ బాయ్ ప్రసిద్ధ గాయని (ఈవిడని షంషాద్ బేగం అని కూడా పిలుస్తారు కానీ, ఈమె ఆనాటి నేపథ్యగాయని షంషాద్ బేగం కాదు). నసీమ్ బానును ఎంతో గొప్పగా పెంచారు. బడికి ఆమెని పల్లకిలో పంపేవారట.

నసీమ్‍ని డాక్టర్‍ని చేయాలని తలచారు వాళ్ళమ్మ. కానీ నసీమ్‍ మాత్రం నటి సులోచన (రూబీ మేయర్) వలె సినీ తార కావాలని ఆశించారు.

బడిలో చదువున్నప్పుడు ఒకరోజు తల్లితో కలసి ‘సిల్వర్ కింగ్’ అనే సినిమా షూటింగ్‍కి వెళ్లారు నసీమ్. ఆ వాతావరణం, సినిమా చిత్రీకరణ పద్ధతి అన్నీ నసీమ్‌కి బాగా నచ్చేశాయి. అప్పుడే నిర్ణయించుకున్నారట – సినిమాల్లోనే కెరీర్ అని. అదే సమయంలో ఆ సినిమా దర్శకుడి దృష్టి నసీమ్ పై పడింది, తన సినిమాలో నటించేందుకు అవకాశం ఇస్తానని అన్నారు. కానీ చమియన్ బాయ్ గారు – నసీమ్ ఇంకా చిన్నపిల్లేననీ, వద్దన్నారు. నిజానికి నసీమ్ సినీరంగంలోకి ప్రవేశించడం ఆవిడకి ఇష్టం లేదు.

కొన్నాళ్ళకి నటుడు/నిర్మాత షోరబ్ మోడీ తను తీస్తున్న ‘ఖూన్ కా ఖూన్’ చిత్రంలో కథనాయిక పాత్రని నసీమ్‍కి ఇవ్వజూపారు. ఈసారి కూడా చమియన్ బాయ్ తిరస్కరించారు. కానీ నసీమ్ మాత్రం తాను సినీతారని అవ్వాలని గట్టిగా కోరుకున్నారు. నిరాహార దీక్ష చేసి తల్లిని ఒప్పించారు. చివరికి తల్లి ఒప్పుకోవడంతో, ‘ఖూన్ కా ఖూన్’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. నసీమ్‍కి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత అందరు నిర్మాతల తొలి ఎంపిక నసీమ్ అయ్యారు. వరుసగా ఆఫర్లు వస్తుండడంతో, ఆమె చదువుకి స్వస్తి చెప్పారు.

షోరబ్ మోడీ గారి మినర్వా మూవీ టోన్ సంస్థలో ఆమె పలు సినిమాలు చేశారు. వీటిల్లో ‘తలాక్’, ‘మీఠా జెహర్’, ‘బసంతి’ ముఖ్యమైనవి. అయితే ‘పుకార్’ సినిమాలో ‘నూర్జహాన్’ పాత్ర ఆమెకి ఎంతో ప్రజాదరణ కల్పించింది.

ఈ సినిమా తరువాత ఆమెకు ఇతర నిర్మాణ సంస్థల నుండి కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ షోరబ్ మోడీతో ఉన్న కాంట్రాక్టు కారణంగా వాటిని అంగీకరించలేకపోయారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. ఆ తరువాతే ఆమె పలు సి-గ్రేడ్ సినిమాల్లో నటించారని కొందరంటారు.

నసీమ్ బాను తన చిన్ననాటి నేస్తం మియా ఇషాన్-ఉల్-హక్‍ను వివాహం చేసుకున్నారు. వీరికి సైరా బాను అనే కుమార్తె, సుల్తాన్ అహ్మద్ అనే కుమారుడు జన్మించారు. ఆమె భర్త తాజ్ మహల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. ఈ బేనర్‍లో నసీమా భర్తతో కలిసి – ‘ములాకాత్’, ‘చాందినీ రాత్’, ‘అజీబ్ లడ్‍కీ’ అనే సినిమాలు నిర్మించారు.

1947లో దేశ విభజన తరువాత ఆమె భర్త పాకిస్తాన్‍కి వెళ్ళిపోయారు. నసీమ్‍ని కూడా రమ్మన్నా, ఆమె భారత్ లోనే ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఆయన మళ్ళీ భారత్‍కు తిరిగి రాలేదు. ఆయన తనతో పాటు నసీమ్ నటించిన పలు చిత్రాల నెగటివ్స్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆయా సినిమాలను పాకిస్తాన్‍లో ప్రదర్శించారు. అక్కడ కూడా నసీమ్‍కి జనాదరణ ఉండడంతో, అ సినిమాలు అక్కడా బాగా ఆడాయి.

‘అజీబ్ లడ్‍కీ’ సినిమా తరువాత నసీమ్‍ నటిగా విరమించుకున్నారు. నటిగా అదే ఆవిడ చివరి సినిమా. ఎందుకంటే అదే సమయంలో ఆమె కుమార్తె సైరా బాను వెండితెర ప్రవేశం చేయబోతున్నారు. తల్లీ కూతుళ్ళ మధ్య పోలికలు రాకూడదనే ఉద్దేశంతో నసీమ్ నటన విరమించుకున్నారని అంటారు. ఆ తరువాత ఆమె ఫాషన్ డిజైనింగ్‍లోకి ప్రవేశించారు. తన కుమార్తె సినిమాలకు ఎన్నో దుస్తులు రూపొందించారు. సైరా బాను, దిలీప్ కుమార్‍ల వివాహం జరగడంలో నసీమ్ పాత్ర చాలా ఉందని కొందరంటారు.

85 ఏళ్ళ వయసులో 18 జూన్ 2002న నసీమ్ తుది శ్వాస విడిచారు.


నటి శ్రీవిద్య జీవితం, మరణం:

దక్షిణాది భాషల సినిమాలో నటి శ్రీవిద్య సుపరిచితులే. ఆమె క్యాన్సర్‌తో పోరాడి, మరణించడం ఆమె అభిమానులకు ముఖ్యంగా తెలుగు, మలయాళ సినీ అభిమానులకు తీరని లోటు. ‘తూర్పు పడమర’ సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతగానో అభిమానించారు. ఈ సినిమా తరువాత దాసరి నారాయణరావు తీసిన ‘కన్య-కుమారి’తో సహా పలు చిత్రాలలో ఆమె నటించారు. ‘తూర్పు పడమర’ సినిమాలోని టైటిల్ సాంగ్‌నీ, ‘స్వరములు ఏడైనా రాగాలెన్నో’ అనే పాటని మరువగలమా? అలాగే ‘కన్య-కుమారి’ లోని ‘ఓహో చెలీ ఓ నా చెలీ’ అనే పాట కూడా సూపర్ హిట్. ఆకట్టుకునే రూపం, చెరగని చిరునవ్వు, సాటిలేని నటనాపటిమతో శ్రీవిద్య దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె ఏ పబ్లిక్ ఫంక్షన్‍కి వెళ్ళినా ఆమెను చూడడానికి జనం విపరీతంగా వచ్చేవారు.

13 ఏళ్ళ వయసులో ‘తిరువరుత్ సెల్వర్’ అనే సినిమా ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య. ఆ సినిమాలో శివాజీ గణేశన్ హీరో. ఆ తరువాత తన సౌందర్యంతోనూ, నటనా పాటవంతో సినిమాల్లో రాణించారు. దాదాపుగా 900 చిత్రాలలో నటించిన శ్రీవిద్య చివరి సినిమా ‘లండన్’. అందులో హీరో ప్రశాంత్‌కి తల్లిగా నటించారు. తరువాత ఆమె కేరళలోని త్రివేండ్రం వెళ్ళిపోయి, అక్కడి టీవీ సీరియల్స్‌లో నటించారు. కొన్ని మలయాళ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించారు.

ఆమె చివరి సీరియల్‌ ‘అమ్మతంపురత్తి’కి 200 ఎపిసోడ్లు అనుకున్నప్పటికీ, ఆమె అనారోగ్యం కారణంగా 45 ఎపిసోడ్లతో ముగించారు. అప్పటికే ఆమె శరీరంలో క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‍లో ఉంది. కొన్నాళ్ళు కొచ్చి లోని అమృత ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత త్రివేండ్రం లోని అవిట్టం తిరుణాల్ హాస్పటల్‍లో చేరారు.

శ్రీవిద్యది కళాకారుల కుటుంబం. ఆమె తల్లి ఎం.ఎల్. వసంతకుమారి సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసురాలు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గాయని. తండ్రి గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు. శ్రీవిద్యకు వీరిద్దరూ కళలూ అబ్బాయి. వాటిని తన సినిమాల్లో ప్రదర్శించారామె.

‘అపూర్వ రాగంగళ్’, ‘సొల్ల తాన్ నినైక్కిరేన్’, ‘ఇమాయం’ వంటివి తమిళంలో ఆమె ప్రసిద్ధ సినిమాలు. మలయాళంలో ‘ఎడవళియిలే పూచ మింద పూచ’, ‘తీక్కనాల్’, ‘దైవతిండె విక్రిడిగల్’, ‘పంజవాడి పలై’ వంటివి పేరు తెచ్చిన సినిమాలు. కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా రెండు సార్లు పురస్కారం పొందారు. ఆమె నటనా ప్రతిభకి గుర్తింపుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నారు.

పెళ్ళి తరువాత ఆమె వ్యక్తిగత జీవితం అల్లకల్లోలమైంది. ఆమె మద్రాసులోని అన్నామలైపురం ప్రాంతంలో తన స్వంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని తనదంటూ ఆమె భర్త జార్జ్ కోర్టుకెక్కారు. ఎంతో న్యాయపోరాటం తరువాత ఆ ఇంటిని ఆమె దక్కించుకోగలిగారు. ఆ తరువాత ఆయనకి విడాకులిచ్చారు. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మనశ్శాంతి కోసం చెన్నై వదిలి, కేరళ వచ్చేసి, బుల్లి తెరకి దగ్గరయ్యారు. శ్రీవిద్య శిక్షణ పొందిన గాయని, మోహినియాట్టంలో విశేషంగా రాణించిన నర్తకి. బాల్యంలో ఎన్నో వేదిలకపై మోహినియాట్టం ప్రదర్శించారు. తమిళ సినిమా ‘అమరన్’లో ఒక పాట పాడారు.

తన చివరి రోజుల్లలో బంధువులకు, స్నేహితులకు దూరంగా గడిపారు శ్రీవిద్య. ఆమె చివరి రోజుల్లో ఆమె మిత్రుడు, మలయాళం నటుడు గణేశ్; ఆయన తల్లి ఆమెను చూసుకున్నారు. ఆ సమయంలో శ్రీవిద్య తనని చూడడానికి ఎవరినీ అనుమతించలేదు. అయితే, త్రివేండంలోని అవిట్టం తిరుణాల్ హాస్పటల్‍లో ఉండగా, కమల్ హాసన్ వచ్చి చూశారు. ప్రపంచంలోని ఏ పెద్ద హాస్పటల్‍లోనైనా చేర్పిస్తానని అన్నా, ఆమె అంగీకరించలేదట.

53 ఏళ్ళ వయసులో గుండెపోటు, ఇంటర్నల్ బ్లీడింగ్ ఆమె మరణానికి కారణమయ్యాయి. త్రివేండ్రంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. తరువాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆమె చితికి ఆమె సోదరుడు నిప్పంటించారు.

ఆమె మరణం సినీ, టీవీ రంగాలకు తీరని లోటు. ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు.

Exit mobile version