అలనాటి అపురూపాలు- 179

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అద్భుత గాయకుడు ముకేష్ శత జయంతి:

ప్రముఖ ఉర్దూ కవి శ్రీ రఘుపతి సహాయ్ ‘ఫిరాక్’ ఓ అద్భుతమైన కవిత రాశారు – “ముత్‌రిబ్ సే కహో ఇస్ అందాజ్ సే గాయే/హర్ దిల్ కో లగే చోట్-సీ, హర్ ఆంఖ్ భర్ ఆయే” (ప్రతి గుండెకీ వేదన తెలిసేలా, ప్రతి కంటి నుంచి కన్నీరు జారేలా పాడమని గాయకుడికి చెప్పండి)

బహుశా ఈ మాటలు ముకేష్ గారికి బాగా వర్తిస్తాయేమో. ఎందుకంటే ఆయన గళంలో కరుణ, గాంభీర్యం, భక్తి తొణికిసలాడేవి. 22 జూలై 1923 నాడు జన్మించిన ముకేష్ గారిది ఇది శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా – ఏది పాడినా మనసుపెట్టి పాడిన ఈ దయాళువుని – స్మరించుకుందాం.

‘మ్యాన్ విత్ ద గోల్డెన్ వాయిస్’ అని హిందీ చలనచిత్ర పరిశ్రమలో పేరు పొందిన దిగ్గజ గాయకుడు ముకేష్ చంద్ మాధుర్ అలియాస్ జోరావర్ చంద్. శ్రావ్యమైన కంఠస్వరంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల గాత్రం ఆయనది. ముకేష్ దాదాపు 1300 పాటలు పాడారు. అయితే ఈ సంఖ్య – ఆయన సమకాలీనులు పాడిన పాటల కంటే తక్కువే అయినా, ముకేష్ రాశి కంటే వాసికి ప్రాధాన్యతనిచ్చారనేది వాస్తవం. రాజ్ కపూర్, మనోజ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, సునీల్ దత్, దిలీప్ కుమార్‍ల స్వరంగా నిలిచిన గాయకునిగా ముకేష్ ఎంతో ప్రసిద్ధులు.

22 జూలై 1923 నాడు ఢిల్లీలో జన్మించిన ముకేష్‌కి చిన్నప్పటి నుంచి నటన మీద, గానం మీద ఆసక్తి ఎక్కువ. ఆనాటి నటుడు/గాయకుడైన కుందన్‍ లాల్ సైగల్‍కి‍ ముకేష్ వీరాభిమాని. ఆయన బాటలోనే నటుడవ్వాలని అనుకున్నారు, కాని విధి ఆయనను గాయకుడిగా చేసింది.

ముకేష్ గారిది మాధుర్ క్షత్రియ కుటుంబం. తండ్రి జోరావర్ చంద్ ఒక ఇంజనీర్. తల్లి చాంద్రాణి మాధుర్ గృహిణి. పది మంది సంతానంలో ముకేష్ ఆరవ బిడ్డ.  బాల్యం నుంచే పాటల మీద ఇష్టం పెంచుకున్నారు ముకేష్. పదవ తరగతి తరువాత చదువు ఆపేసి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్స్ వర్క్స్‌లో కొంత కాలం పనిచేశారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన స్వరాన్ని పలు రకాలుగా రికార్డు చేసుకుని ప్రయోగాలు చేసి, క్రమంగా తన గాన పటిమని, వాయిద్య నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు.

తన సోదరి వివాహ కార్యక్రమంలో పాట పాడినప్పుడు మొదటిసారిగా దూరపు బంధువు, సినీ నటుడైన మోతీలాల్ దృష్టిలో పడ్డారు ముకేష్. 1940లో మోతిలాల్ ముకేష్‌కి బొంబాయిలో పండిట్ జగన్నాథ్ ప్రసాద్ వద్ద శిక్షణ ఇప్పించారు. కె.ఎల్. సైగల్ వీరాభిమాని కావడంతో ముకేష్ తొలినాళ్లలో తన అభిమాన గాయకుడిని అనుకరించేవారు. అయితే సంగీత దర్శకుడు నౌషాద్ సాయంతో సైగల్ ప్రభావం నుండి బయటపడి తన సొంత శైలిని వృద్ధి చేసుకున్నారు.

గాయకుడిగా ముకేష్ తొలి సినిమా 1941లో వచ్చిన ‘నిర్దోష్’. అందులో ఆయనే హీరో కూడా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. దీని తరువాత ‘దుఃఖ్-సుఖ్’, ‘ఆదాబ్ అర్జ్’ వంటి మరికొన్ని సినిమాలలో నటించారు, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోయాయి. చాలా ఏళ్ళ తరువాత 1953లో మళ్ళీ ‘ఆహ్’ చిత్రంలో నటించారు.

‘నిర్దోష్’ సినిమా తరువాత ఆయన ‘ఉస్ పార్’, ‘మూర్తి’ వంటి సినిమాలలో పాడారు. అయితే గాయకుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చినది ‘పెహ్లీ నజర్’ (1945) చిత్రంలో మోతీలాల్‍పై చిత్రీకరించిన ‘దిల్ జల్తా హై తో జల్నే దో’ అనే పాట. ఈ పాటలో సైగల్‍ని అనుకరించినట్లున్నా, తరువాతి కాలంలో ముకేష్ తన సొంత శైలిని ఏర్పర్చుకున్నాకా, ఆయనకి తిరుగులేకపోయింది.

నౌషాద్, అనిల్ బిస్వాస్‍ల సంగీత దర్శకత్వంలో ముకేష్ గొప్ప పాటలు పాడారు. ‘మేళా’ (1948), ‘అనోఖా ప్యార్’ (1948, జీవన్ సప్నా టూట్ గయా అనే పాట), ‘అందాజ్’ (1949) వంటి సినిమాల్లో ఆయన సొంత శైలిని గమనించవచ్చు. హుషారైన పాటలను, విషాద గీతాలను ఎంతో అద్భుతంగా పాడేవారు. ఎక్కువగా మనోజ్ కుమార్‌కి, రాజ్ కపూర్‍కి పాడారు ముకేష్.

‘ఆవారా హూం’ (‘ఆవారా’, 1951), ‘జానే నా నజర్’ (‘ఆహ్’, 1953), ‘మేరా జూతా హై జాపానీ’ (‘శ్రీ 420’, 1955), ‘యహ్ మేరా దీవానాపన్ హై’ (‘యెహుదీ’, 1958), ‘దిల్ తడప్ తడప్’ (‘మధుమతి’, 1958), ‘కిసీ కీ ముస్కురాహటోం పె హో నిస్సార్’ (‘అనారీ’, 1959), ‘ఆ అబ్ లౌట్ చలేఁ’ (‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’, 1960), ‘దోస్త్ దోస్త్ న రహా’ (‘సంగమ్’, 1964), ‘జానే కహాఁ గయే ఓ దిన్’ (‘మేరా నామ్ జోకర్’ 1970), ‘కహీ దూర్ జబ్ దిన్’ (‘ఆనంద్’, 1970), ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’ (‘కభీ కభీ’,1976) మొదలైన ఆయన పాటలు ఇప్పటికీ శ్రోతలకు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తన కెరీర్‍లో ఆయన పాడిన చివరి సినిమా ‘సత్యం శివం సుందరం’ (1978). ఆయన మరణం తరువాత విడుదలైందా సినిమా.

ముకేష్ – శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఎస్.డి. బర్మన్, కళ్యాణ్‍జీ ఆనంద్‍జీ, సలీల్ చౌదురి, ఉషా ఖన్నా వంటి సంగీత దర్శకులతో పని చేశారు. ‘రజనీగంధ’ (1974) సినిమాలోని ‘కయీ బార్ యూహీ దేఖా హై’ పాటకి జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు గెల్చుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డు గెల్చుకున్నారు.

1946లో సరళ్ అనే గుజరాతీ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ముకేష్. వారికి నితిన్, మనీష్ అనే కుమారులు; రీటా, నళిని, నిమిత్ర అనే కుమార్తెలు ఉన్నారు. అమెరికాలోని డెట్రాయి‍ట్‌లో ఓ కచేరీలో పాల్గొనేందుకు వెళ్ళినప్పుడు గుండెపోటు రాగా, 27 ఆగస్టు 1976 నాడు మృతి చెందారు ముకేష్.

మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్‍, ముకేష్ లను ఆనాటి అద్భుత గాయక త్రయంగా పరిగణిస్తారు. ఆనాటి కాలంలో ఈ ముగ్గురు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు. ముకేష్ తదనంతరం ఎంతో మంది గాయకులు – ఆయన కుమారుడు నితిన్‍తో సహా – ఆయనను అనుకరించినా – వారెవ్వరూ ముకేష్ దరిదాపుల్లోకి రాలేకపోయారు. ముకేష్ చనిపోయి దాదాపు 47 ఏళ్ళవుతున్నా; ఆయన తన మధురమైన పాటలలో సజీవంగా నిలిచారు. ఆయన పాడిన ఎవర్ గ్రీన్ హిట్స్ ఇప్పటికీ అభిమానులని అలరిస్తున్నాయి.

1969లో విడుదలయిన ‘విశ్వాస్’ అనే సినిమా పాటల రికార్డింగ్ జరుగుతుండగా ముకేష్ అస్వస్థులయ్యారు. ‘ఆప్‍‌సే హమ్‍కో బిఛ్‌డే హుయే, ఏక్ జమానా బీత్ గయా’ అనే యుగళ గీతం రికార్డు చేస్తున్నారా సమయంలో. అప్పుడు ముకేష్ – తనకి బదులుగా మనహర్ ఉధాస్ (ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అన్నయ్య) తో ఆ పాటని పాడించమని సంగీత దర్శకులు కళ్యాణ్‍జీ ఆనంద్‍జీలను కోరారట. మనహర్ స్వరం కూడా ముకేష్ స్వరాన్ని పోలి ఉంటుంది. పాట రికార్డింగ్ పూర్తయ్యాకా, “మనహర్‍ స్వరంలో ఈ పాట బావుంది, దాన్నే ఉంచేయండి” అన్నారు ముకేష్.

“ఈ చర్య తో, ఈ పాట నుంచి తనని తాను ఉదారంగా తొలగించుకున్నారు ముకేష్” అని రాశారు సినీ, సంగీత విమర్శకులు ఇక్బాల్ మసూద్ (స్టార్ అండ్ స్టైల్, 1979). ‘ఏక్ ఫనాకార్ కే లియే అచ్ఛా ఇన్‍సాన్ హోనా షరత్-ఎ-అవ్వల్ హై’ (ఒక సృజనాత్మక వ్యక్తి అవ్వాలంటే ముందు మంచి మనిషిగా ఉండడం అనివార్యం) అన్న ఉర్దూ సామెతని నిజం చేశారు ముకేష్. తన సహ గాయకులు రఫీ, కిషోర్, తలత్, ఇంకా మరెందరినో మెచ్చుకునేందుకు ముకేష్ ఎన్నడూ వెనుకాడలేదు.

ముకేష్‌కి ఉన్న ప్రజాదరణ గురించి ఒక ఉదంతం చెప్పుకోవాలి. సుప్రసిద్ధ స్పిన్ బౌలర్ బి.ఎస్. చంద్రశేఖర్ – ముకేష్‌కి వీరాభిమాని. మైదానంలో ఆడుతున్నప్పుడు ముకేష్ పాట వినిపిస్తే, దాన్ని చంద్రశేఖర్ ఆస్వాదిస్తే, ఆట చూస్తున్న ప్రేక్షకులు సందడి చేసేవారు. చంద్రని ఉత్తేజపరచటానికి తాను కొన్నిసార్లు ముకేష్ పాటలని హమ్ చేసేవాడినని సునీల్ గవాస్కర్ ఓ కాలమ్‍లో రాశారు. చంద్ర ద్వారా ముకేష్ పాటల అభిమానం కిర్మాణీకీ, గుండప్ప విశ్వనాథ్‍లకి కూడా అంటుకుంది. క్రికెట్ విలేఖరి స్వర్గీయ రాజన్ బాలా కూడా ముకేష్ పాటలు వింటూ సేద తీరేవారు.

ఎక్కువ మంది అభిమానులు ముకేష్ విషాద గీతాలను ఆదరించడం వల్ల, ఆయన కొన్ని చక్కని రొమాంటిక్ పాటలు పాడిన సంగతి కాస్త మరుగున పడింది. ‘రాత్ నిఖ్రీ హుయీ, జుల్ఫ్ భిఖ్రీ హుయీ’ (‘హమ్ హిందూస్థానీ’, 1960), ‘చాంద్ ఆహేం భరేగా ఫూల్ దిల్ థామ్ లేంగే’ (‘ఫూల్ బనే అంగారే’, 1963), ‘కుఛ్ షేర్ సునాతా హూ మై’ (‘ఏక్ దిల్ సౌ అఫ్‍సానే’, 1963) వంటివి రకరకాల పాటలపై ఆయనకి ఉన్న పట్టుని తెలియజేస్తాయి.

‘అనారీ’ (1959) సినిమాలోని ‘సబ్ కుఛ్ సీఖా హమ్ నే’ పాటకి, ‘పెహచాన్’ (1970) సినిమాలోని ‘సబ్ సే బఢా నాదాన్ వహీ హై’ పాటకి, ‘బేఈమాన్’ (1972) చిత్రంలోని ‘జై బోలో బేఈమాన్ కీ’ పాటకి, ‘కభీ కభీ’ (1976) చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’కి ఆయన ఫిలింఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. ‘రజనీగంధ’ (1974) సినిమాలోని ‘కయీ బార్ యూహీ దేఖా హై’ పాటకి జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు పొందారు. ఆరోగ్యం బాలేకపోవడంతో 1970లలో చాలా తక్కువ పాటలు పాడారు ముకేష్.

అమెరికాలోని డెట్రాయి‍ట్‌ నగరంలో ఓ కచేరీలో పాల్గొనేందుకు వెళ్ళగా, అక్కడ గుండెపోటు రాగా, 27 ఆగస్టు 1976 నాడు మృతి చెందారు ముకేష్. ‘ధరమ్ కరమ్’ (1975) చిత్రం కోసం ఆయన పాడిన ‘ఏక్ దిన్ బిక్ జాయేగా మాటీ కీ మోల్, జగ్ మే రహ్ జాయేంగే ప్యారే తేరే బోల్’ అనే పాట భవిష్యసూచకంగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ క్రితం భౌతికంగా వదిలి వెళ్ళినా, పాటల రూపంలో కోట్లాది అభిమానుల్ని నేటికీ అలరిస్తున్నారు ముకేష్. ఎప్పటికీ వాళ్ళతో ఉంటారు.

పి.బి.షెల్లీ చెప్పిన ‘Music, when soft voices die, vibrates in the memory,’ అనే వాక్యం ముకేష్‍కి యథాతథంగా వర్తిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here