Site icon Sanchika

అలనాటి అపురూపాలు-18

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఓ అభిమానిగా జయలలిత:

సినిమా తారలకు లెక్కలేనంతమంది అభిమానులుంటారు. కానీ సినీ తారలు కూడా ఇతర కళాకారులకో/క్రీడాకారులకో అభిమానులుగా ఉండడం కద్దు. ఇందుకు ప్రముఖ తార జయలలిత ఉదాహరణ. 1973లో ఆమే స్వయంగా చెప్పిన వివరాలు ఇవి:

క్రికెటర్:

“చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే పిచ్చి. మద్రాసులో జరిగే మ్యాచ్‌లకు మా పిన్ని (ఆమె తల్లి సంధ్య చెల్లెలు విద్య)తో కలిసి వెళ్ళేదాన్ని. మ్యాచ్ ముగిసాకా, మేం వెళ్ళి క్రికెటర్ల ఆటోగ్రాఫులు తీసుకునేవాళ్ళం. ఏదైనా కారణం చేత మ్యాచ్‍కి వెళ్ళలేకపోయినట్లయితే, రేడియోలో కామెంటరీ వినేవాళ్ళం. ‘అది మగపిల్లల ఆట అని, నీకెందుకు అంత ఆసక్తి అని’ మా అన్నయ్య ఏడిపించేవాడు. ఒక రోజు నేనో పుస్తకం చదివి, క్రికెట్ ఆటని మొదట ఆడింది మహిళలే అని తెలుసుకున్నాను. రాచ కుటుంబపు మహిళలు – వంగి ఉన్న ‘విల్లో’ చెట్ల కొమ్మలతో బంతిని కొడుతూ ఆడారట. క్రికెట్ బ్యాట్‍లు విల్లో చెట్టు చెక్క నుంచే తయారు చేస్తారని మీకు తెలుసు (మహిళలు క్రికెట్‍ని కనిపెట్టారన్న జయలలిత అభిప్రాయాన్ని ధ్రువపరిచే ఆధారాలు నాకు తెలియవు. ఈ సమాచారం కోసం వెతికాను, కానీ దొరకలేదు. తెలిసినవారు చెబితే సంతోషిస్తాను).

ఇకపోతే, నా అభిమాన క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ. మాకు ఇంటికి ఓ క్రీడా పత్రిక – కాలక్షేపం పత్రిక వచ్చేది. అది ఇప్పుడు ప్రచురితం అవడం లేదు. పత్రిక వచ్చిన రెండు గంటలలోపు అందులోని బొమ్మలు కత్తిరింపుకు గురయ్యేవి, మాయమయ్యేవి. నాకు తిట్లు పడేవి, కాని నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను క్రికెటర్ల ఆల్బమ్ తయారుచేశాను. బడిలోని ఆడపిల్లలందరికీ పటౌడీ అంటే వెర్రి ఆరాధన. ప్రతి ఒక్కరూ, ‘నువ్వో పిచ్చిదానివి, పటౌడీ నన్నే పెళ్ళి చేసుకుంటాడు’ అనేవారు తోటి ఆడపిల్లలతో. ఆయన సినీ నటి షర్మిలా టాగోర్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని ఓ రోజు మాకు తెలిసింది. అంతే, ఆయన ఓ మూగ ప్రేమికుడిగా మా హృదయాలలో నిలిచిపోయాడు.”

గాయని:

“ఓ రోజున ఓ పెళ్ళికి హాజరయ్యేందుకు రాజేశ్వరి కళ్యాణ మండపానికి వెళ్ళాను. ఆహ్వానితుల మధ్యన కూర్చున్నాను. కాసేపయ్యాక, ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. నా వెనుక ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కూర్చుని ఉన్నారు. ‘ఓ మై గాడ్!’ అనుకుని, అంతసేపు ఆవిడని చూడనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. లేచి వెళ్ళి ఆమెకి నమస్కరించి ‘నేను జయలలితని’ అన్నాను. “నువ్వు చెప్పకపోతే, నాకు తెలియదా ఏంటి?” అన్నారు ఎం.ఎస్. నాకెంతో సంతోషమేసింది. ఆవిడనికి నేను గొప్ప అభిమానిని అని చెప్పాను. శ్రీ కృష్ణ గాన సభలో ఆవిడ కచేరీకి హాజరయ్యాను. వేదికపైకి వెళ్ళి ఆవిడ సంగీతం అంటే నాకెంత ఇష్టమో చెప్పాలనుకున్నాను, కానీ నా అభిమానులు నన్ను చుట్టుముట్టేసి, అక్కడి వాతావరణాన్ని పాడుచేస్తారమోనని భయమేసింది. అందుకని అక్కడినుంచి వెళ్ళిపోయాను.”

చిట్టిబాబు గారి వీణా నాదం కూడా నాకు చాలా ఇష్టం. వేద నిలయం గృహప్రవేశం రోజున వారి వీణా నాద కచేరీ ఏర్పాటు చేశాం.”

నటీనటులు:

హిందీ నటుడు దిలీప్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఇంకా ఆయన రూపలావణ్యం…  నాకు బాగా ఇష్టం. ఒక రోజు  బొంబాయి వెళ్ళేందుకు విమానాశ్రయం రిసెప్షన్ వద్ద నిలబడి ఉండగా – విజయ బ్యానర్ వారి బి రాధాకృష్ణ, దిలీప్ కుమార్ నాకేసి వస్తూ కనిపించారు. రాధాకృష్ణ నన్ను దిలీప్ కుమార్‌కి పరిచయం చేశారు. ఆయన నవ్వుతూ పలకరించి, ఎన్.టి.ఆర్ తో కలిసి నటించిన తెలుగు సినిమా ‘కథానాయకుడు’ లో నా నటన బాగుందని అభినందించారు (ఈ సినిమాని తమిళంలో ఎంజిఆర్ హీరోగా ‘నామ్ నాడు’ అనే పేరుతో రీమేక్ చేశారు). ఆయనతో కలిసి హిందీ సినిమాలలో నటించాలన్న అభిలాష వ్యక్తం చేశాను. అంగీకార పూర్వకంగా ఆయన తల ఊపారు. కొన్ని రోజుల తర్వాత ‘దాస్తాన్’ అనే సినిమాలో ఆయనతో నటించేందుకు పిలుపు వచ్చింది. కాని ఆ సినిమాలో నేను నటించకూడదని మా శ్రేయోభిలాషులు మా అమ్మకి చెప్పారు. ఆ సినిమా అప్పుడెప్పుడో తీసిన ‘ఆఫ్సానా’ అనే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. అందులో నా పాత్ర గురించి కనుక్కుంటే – వ్యాంప్ పాత్ర అని తెలిసింది. అటువంటి పాత్రలలో నేను నటిస్తే, నా అభిమానులు ఒప్పుకోరు.  అందుకని అయిష్టంగానే ఆ ఆఫర్‍ని తిరస్కరించాం. తరువాత ఆ పాత్రని నటి ‘బిందు’ పోషించారు. నేనెంతో నిరాశ చెందాను. మన అన్ని కోరికలు ఒకే జన్మలో తీరవని సర్దుకుపోయాను.

నా అభిమాన నటి సోఫియా లోరెన్. దిలీప్ కుమార్‌ని కలుసుకున్నట్టే ఆమెని కలుసుకోవాలని ఎంతో కోరుకున్నాను.

పుస్తకాలు:

“నేను విస్తృతంగా చదువుతాను. హరాల్డ్ రాబిన్స్ వ్రాసిన ఏ నవలా చదవకుండా ఉండను.”

ఇవీ జయలలిత తన అభిమాన విషయాల గురించి స్వయంగా వెల్లడించిన వివరాలు.


ఒక గొప్ప పాట – అటువంటివే మరికొన్ని పాటల చరిత్ర:

పాకీజా (1972) – నర్గిస్, సాహిబ్‌జాన్ అనే ఇద్దరు స్త్రీల కథ (రెండు పాత్రలూ మీనా కుమారి పోషించారు). తమ స్వప్నాలు కోరికలకీ, ద్వంద్వ ముఖాలున్న సమాజపు నీతి నియమాలకీ మధ్య చిక్కుకుపోతారా ఇద్దరూ. సాహిబ్‌జాన్ పాకీజాగా మారే క్రమంలో ఎదుర్కున్న అడ్డంకులు, కష్టాలు చూపుతుందీ చిత్రం. నృత్యాలు, పాటలతో సాగే ఓ నర్తకి కథ ఇది. ఒక్కో పాట ఆమె వ్యక్తీకరించిన ఒక భావానికి నమూనా. అది రైల్లో వచ్చే వ్యక్తి కోసం నిరంతరం చూసే ఎదురుచూపులైనా కావచ్చు, లేదా సమాజాన్ని ఎదిరించి తన ప్రియుడిని కోరుకోవడం కావచ్చు లేదా అతనితో కలిసి దిగంతంలోకి అదృశ్యమైపోవడమైనా కావచ్చు. ఈ పాటలు కేవలం ముజ్రాలు కావు. అవి సున్నితమైన సంగీతపు చట్రంలో, ఒక మహిళ భావ వ్యక్తీకరణకు ఆకృతులు. ఓ మహిళ చిత్రంపైన పలికే రాగాలు ఎన్నో మీకు తెలుసా? పలు భావాలు, వ్యక్తీకరణలు ఉన్న రాగాలు… వీటన్నింటిని ‘పాకీజా’గా ప్రదర్శించారు మీనా కుమారి. తన నిశ్చలతతో ఆవిడ మంత్రముగ్ధుల్ని చేశారు. ఆమె కెమెరాకేసి చూసిన ఓ చూపు, ఆమె ఏం చెప్పదలచుకున్నారో ప్రేక్షకులకి వివరించేది. భావ వ్యక్తీకరణకు సంభాషణలు అక్కర్లేని అతి కొద్ది మంది వెండి తెర కథానాయికల్లో ఆమె ఒకరు. ఆ పని ఆమె కళ్ళే చేసేవి. ఇందుకు గొప్ప ఉదాహరణ రైలు వెళ్ళే సన్నివేశం. లేదా ‘ఇన్హీ లోగోం నే ఇన్హీ లోగోం నే ఇన్హీ లోగోం నే లేలీ  దుపట్టా మేరా’  అనే పాట పాడుతున్నప్పుడు ఆమె భావాలు చూడాలి. ఆమె కళ్ళు ఇలా అంటాయి: – ‘మీకు నిజం తెలియాలా? రండి ఈ కథ నేనే చెబుతాను’. సరిగ్గా ఈ పాట దాని గురించే. సమాజం తనకేమిచ్చిందో ఆమె చెబుతారు. ఆమె నర్తకిగా మారేలా చేసింది సమాజమే. ఇక్కడ ఆమె తన దుపట్టా గురించి మాత్రమే మాట్లాడడం లేదు. తన ఆత్మ,శరీరం గురించి మాట్లాడుతున్నారు. ‘హమారీ నా మానో బజాజ్వా సే పూఛో జిస్నే అష్రఫీ గజ్ దీనా దుపట్టా మేరా…’ బట్టల వ్యాపారిని (సమాజంలోని వ్యాపారులను) అడగండి, తమ డబ్బుల సంచులు నింపుకోడానికి నన్ను సమాజానికి అమ్మేశారు. ‘హమారీ నా మానో రంగెరజ్వా సే పూఛో జిస్నే గులాబీ రంగ్ దీనా దుపట్టా మేరా…’ బట్టలకి అద్దకం వేసేవారిని (రంగుల కలల్ని చూపి మోసం చేసినవారిని) అడుగు – నా కలలని ధ్వంసం చేసి, తన కలలకి అనుగుణంగా నా దుపట్టాకి గులాబీ రంగు వేసిందెవరని! ‘హమారీ నా మానో సిపాహియోం సే పూఛో జిస్నే బజారియా మె ఛీనా దుపట్టా మేరా…’ రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేస్తే? కాపాడవలసిన వాళ్ళే నాశనం చేస్తే ఏం చేయాలో అడుగు? అధికారం ఉండి దుర్వినియోగం చేశారు. ఈ పరిస్థితి ఈనాటికీ వర్తిస్తుంది. ఇది వందల ఏళ్ళుగా వస్తోంది.

అయితే ‘పాకీజా’ సినిమాలో ప్రదర్శింపబడే కంటే ముందుగానే ఈ పాట/ఠుమ్రీ/ముజ్రా అనేక సంవత్సరాలుగా జనబాహుళ్యంలో ఉంది. ఈ పాట లాంటివే (గీతంలోనూ, సంగీతంలోనూ) ఒకేలా ఉండే మరికొన్ని పాటలను చూద్దాం. ఈ ఠుమ్రీకి మూలం అమీర్ ఖుస్రో వ్రాసిన పాట అని పెద్దలు అంటారు. ‘ఛాప్ తిలక్ సబ్ ఛీనీ’ అనే పాటకీ ఈ పాటకీ ఉన్న పోలిక (రెండూ యమన్ రాగంతో కట్టినవే) చూస్తే అవుననే అనిపిస్తుంది.

‘ఛాప్ తిలక్ సబ్ ఛీనీ’ పాటలోని ఒక వాక్యాన్ని, ‘ఇన్హీ లోగోం నే’ పాటలోని ఒక వ్యాక్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి పాడితే, అవి రెండూ ఒకే ఛందంలో ఉన్నాయని తెలుస్తుంది. యమన్ రాగం సృష్టికర్త అమీర్ ఖుస్రో అని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఖచ్చితంగా నిర్ధారించలేము. ఇక ఈ ఠుమ్రీ విషయానికి వస్తే, గీతం ఎవరు రాసారానేదాంట్లో పలువురు గీతకారుల పేర్లు వినిపిస్తాయి. అటువంటి పాటలు నేను ఇక్కడ కొన్ని అందిస్తున్నాను. ఈ గొప్ప పాట లాంటివే మరికొన్ని పాటలను ఆస్వాదిద్దాం.

అత్యంత పురాతనమైన వెర్షన్ 1921 నాటిది. లక్నోలో నర్తకి అఖ్తారీ జాన్ పాడినది.

ఇలాంటి పాటని ‘అఛూత్ కన్య’ (1936) సినిమాలో సునీతాదేవీ, ముంతాజ్ అలీ పాడారు. వినడానికి ‘ఇన్హీ లోగోం నే’ పాటలానే ఉన్నా, గీత రచన మాత్రం వేరు, ఈ పాటని జె.ఎస్. కశ్యప్ రాశారు.

‘హిమ్మత్’ (1941) సినిమాలో షంషాద్ బేగం పాడిన ఈ పాట జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. పండిట్ గోబిందరామ్ సంగీతం సమకూర్చగా, అజీజ్ కశ్మీరీ గీత రచన చేశారు.

‘ఆబ్రూ’ (1943) సినిమాలో – హిమ్మత్ సినిమాలో షంషాద్ బేగం పాడిన పాటకి పారడీ పాట పెట్టారు. యాకూబ్ పాడారు.

‘సర్తాజ్’ (1950) సినిమాలో షంషాద్ బేగం, లతా మంగేష్కర్ పాడిన యుగళగీతాన్ని శ్యామా, మున్నావర్ సుల్తానాపై చిత్రీకరించారంటారు. గీత రచన మజ్రూహ్ సుల్తాన్‌పురి, సంగీతం హుస్న్‌లాల్ భగత్రం.

‘పాకీజా’ సినిమా చిత్రీకరణ 1956లో మొదలైంది. తెలుపు నలుపు రంగుల్లో కూడా మీనా కుమారి ఎంతో అందంగా ఉన్నారు. ఈ క్లిప్ చూడండి.

ఈ ట్యూన్‌కి నౌటంకీ వెర్షన్‌ ‘బేటీ’ (1969) సినిమాలో ఉంది. షకీల్ బదాయూని గీత రచన, సోనిక్ ఓమి స్వరకర్త. ఆశా భోస్లే, ఉషా మంగేష్కర్ పాడారు.

ఇక ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిన అసలు పాటను ఇక్కడ చూడవచ్చు:

Exit mobile version