Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 182

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుర గాయని సుధా మల్హోత్రా:

హిందీ సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సుధా మల్హోత్రా. ఆమె 30 నవంబర్ 1936 న న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె లాహోర్, భోపాల్, ఫిరోజ్‍పూర్‍లలో పెరిగారు. ఎదిగే కొద్దీ తనలో పాటలు పాడగలిగే ప్రతిభ ఉందని గ్రహించారు. స్వాతంత్ర్యానికి పూర్వపు పరిస్థితులలో కుటుంబ సభ్యులు ఓ ఆడపిల్లని పాటలు పాడేందుకు అనుమతిస్తారని ఆశించడం కష్టమే అయినా, ఆమె మాత్రం సంగీత రంగంలో కెరీర్ ఏర్పర్చుకోవాలని పట్టుదల కనబరిచారు. తొలినాటి పాటలను వింటూ, వాటి ద్వారానే పాడడం అభ్యసించారు. అయితే కొద్దికాలానికే, ఆ అభ్యాసం తనకి దీర్ఘకాలంలో ఉపకరించదని ఆమె తెలుసుకున్నారు. అందువల్ల భవిష్యత్తులో సంగీతంలో కెరీర్ ఏర్పర్చుకునేందుకు గాను ఆమె ఆగ్రా యూనివర్శిటీ నుంచి సంగీతంలో గ్రాడ్యుయేషన్ చేశారు. బాల కళాకారిణిగా పాటలు పాడేవారు. భవిష్యత్తులో గాయనిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించేవారు.

1948లో వారి కుటుంబం బొంబాయికి మారింది. అక్కడ ఆమె ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్, పండిట్ లక్ష్మణ్ ప్రసాద్ జైపూర్‍వాలే వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. సినీ నేపథ్యగాయనిగా తొలి అవకాశం ‘ది లాస్ట్ మెసేజ్’ అనే చిత్రం ద్వారా వచ్చింది. ఆ సినిమా కోసం ఆమె ‘చల్ రహా స్వరాజ్ కా ఝగ్డా’ అనే పాటను వినోద్, తదితరులతో కలిసి పాడారు. ఒక పార్టీలో ఆమె పాట విన్న అనిల్ బిస్వాస్ ‘ఆర్జూ’ (1950) సినిమాలో ‘మిల్ గయే నైన్’ అనే పాటని పాడించారు. ఈ పాట ద్వారా ఆమె తన ప్రదర్శన పట్ల గొప్ప భరోసాని కల్పించారు. ‘ఆందోళన్’ (1951) సినిమాలో మన్నా డే, పరుల్ ఘోష్‍తో కలిసి ‘వందేమాతరం’ ఆలపించారు. అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చినది మాత్రం ‘దిల్-ఎ-నాదాన్’ (1953) చిత్రమే. ఆ తరువాత ఆమె – అబ్ దిల్లీ దూర్ నహీ, బాబర్, బర్సాత్ కీ రాత్, ధూల్ కా ఫూల్, దేఖ్ కబీరా రోయా, గర్ల్ ఫ్రెండ్, హీరా మోతీ, మీర్జా గాలీబ్ వంటి సినిమాలలో చక్కని పాటలు పాడారు.

కుటుంబపరమైన కారణాల వల్ల, సాహిర్ లుథియాన్వీతో సంబంధం అంటూ బ్లిట్జ్ పత్రిక ప్రచారం చేసిన వివాదం వల్ల ఆమె ‘దీదీ’ (1959) సినిమా తరువాత సినీరంగానికి దూరమయ్యారు.

ఆమె 155 సినిమాల్లో 264 పాటలు పాడారు. అరుణ్ దాతేతో కలిసి ఎన్నో మరాఠీ పాటలు (భావ్ గీత్) పాడారు. 2013లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మ శ్రీ’ పురస్కారం పొందారు.

***

సాహిర్ – సుధా మల్హోత్రాపై అభిమానం పెంచుకున్న తీరు గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మనీష్ గైక్వాడ్ అనే అభిమాని వెల్లడించిన ఓ కథనం బాగా ప్రచారమైంది.

~

ఒకసారి సాహిర్ ఇంట్లో మెహ్‍ఫిల్ జరుగుతోంది. కవులు, గాయకులు అక్కడ చేరి ఆ వేసవి సాయంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు.

తోటలోని ప్రశాంత వాతావరణంలో హఠాత్తుగా మల్లెమొగ్గల ఘుమఘుమలు వ్యాపించాయి. దీపాల వెలుగుని తగ్గించారు. పానీయాల సందడి, నవ్వుల గలగలలు. ఆకాశం విషాదంగా ఉందా అన్నట్టు ఊదారంగులోకి మారింది.

సుధ ఆలస్యంగా వచ్చారు. ఆమె తలలోని మల్లెలు – నగరంలోని ఓ మూల నుండి సాహిర్ ఇంటికి చేసిన ప్రయాణంలోని వేడికి వాడిపోయాయి. అక్కడికి చేరే సరికి పూల సుగంధం, ఆమె ఉత్సాహం క్షీణించాయి. సాహిర్ ఓ కవిత చదువుతున్నారు. ఆమె చివరి వరుసలో కూర్చుని కవిత ఆఖరి రెండు వాక్యాలు విన్నారు.

‘వహ్ అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో ముమ్కీన్ ఉసే ఏక్ ఖూబ్‍సూరత్ మోడ్ దే కార్ ఛోడ్‍నా అచ్ఛా’ (యోగ్యమైన వీడ్కోలు పలకలేని ప్రణయకథని, రోడ్డు మీది ఓ అందమైన మలుపు వద్ద మనం వదిలేయడం మంచిది).

అతిథులంతా చప్పట్లు కొట్టారు. ఏకాగ్రత చెదిరిన సాహిర్ కళ్ళు చుట్టూ వెతికాయి. కవితని ప్రశంసించకుండా, దూరంగా తననే చూస్తున్న ఆమె కనబడ్డారు. తన వివాహానికి ఆయనని ఆహ్వానించడానికి వచ్చారామె.  ఆమె ఎందుకు వచ్చారో తెల్సిన సాహిర్ తమ మార్గం ఏ మలుపు తీసుకోనుందో అప్పటికే చదివి వినిపించారు.

సుధని పాడమని అడిగితే, గొంతు బాలేదని పాడనన్నారు.

‘నేను వస్తానని మాట ఇవ్వలేను, అయితే నువ్వు నన్ను ఒక్కసారి కూడా పోగొట్టుకోవు’ అన్నారట ఆయన శుభలేఖ తీసుకుంటూ.

ఆయన కవిత చెప్పారనీ, తన ఉద్దేశం కాదని ఆమె భావించారు.

వివాహానికి ఆయన హాజరు కాలేదు. బదులుగా కానుకగా ఓ ఉత్తరం వచ్చింది. మర్నాడు ఉదయం ఆమె దానిని చదివారు. దానిలో ఒక నజ్మ్ వ్రాశారాయన. దాన్ని స్వరపరిచి, ‘దీదీ’ సినిమా కోసం పాడమని కోరారు.

‘దీదీయా’ అనుకున్నారట. నిర్వచించలేని తమ బంధాన్ని ఆయన ఎగతాళి చేస్తున్నారా అనుకున్నారట. ఆమెకి కౌమారంలోనే వేరే అతనితో నిశ్చితార్థం అయినట్లు ఆయనకు తెలుసు. కొద్దిగా దురుసుగా వ్యవహరించినా ఇప్పుడు సోదరి అని ఎందుకు అంటున్నట్టో?

నేపథ్యగాయనిగా ప్రవేశించిన తొలి రోజుల్లోనే ఆమె పట్ల ఆకర్షణ పెంచుకున్నారాయన. ప్రతి రోజు ఉదయాన్నే పలకరించి తన రాసిన కొత్త ఝజల్ గురించో, కొత్త గీతం గురించో లేక కొత్త నజ్మ్ గురించో చెప్పేవారట.

ఒకసారి ఫోన్ చేసి తాను కొత్తగా రాసిన ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’ అనే కవిత వినిపించారట.

ప్రణయ భావంతో కాక ఆరాధనా భావంతో విన్నారట ఆమె. ఈ కవితకి ప్రేరణ తానేనా అని హాస్యంగా అడిగారట. ఆయన సూటిగా జవాబు చెప్పకుండా, ‘మై జాన్‍తా హూఁ తు గైర్ హై మగర్ యూఁ హీ’ (నువ్వు పరాయి అని నాకు తెలుసు, అయినా ఊరికే) అన్నారట.

ఇలాంటి కవితాత్మక శైలికే ఆయనని గౌరవిస్తారామె. దాన్ని హేతుబద్ధం చేయాలని ప్రయత్నించారామె. ఆ ఉత్తరం లోని నజ్మ్ లో – ప్రతిఫలం లేని ప్రేమ పట్ల అత్యున్నతమైన విషాదభావం ఉంది.

ఆరంభ వాక్యాలు:

‘తుమ్ ముఝే భూల్ భీ జావ్ తో యహ్ హక్ హై తుమ్‍కో. మేరీ బాత్ ఔర్ హై, మైనే తో మొహబ్బత్ కీ హై’ (నన్ను మర్చిపోయే హక్కు నీకుంది, కానీ నిన్ను ప్రేమించిన వాడిలా ఒకప్పటిలా ఉండలేను). సాహిర్ మోహపు భావాలని ఆమె పట్టించుకోలేదా?

సాహిర్‍ని ఆమె మోసం చేశారంటూ ఓ సినిమా పత్రిక వారిద్దరి ఫోటోలను ప్రచురించింది. సుధ అత్తమామలు బాగా కలత చెందారట. స్టూడియోలో అడుగుపెట్టడాన్ని నిషేధించారట.

తానేమీ ఆయనకి ప్రోత్సాహం కలిగించేట్టు ప్రవర్తించలేదని ఆమె తనకు తాను నచ్చజెప్పుకున్నారు. తాము కేవలం స్నేహితులమే అని అందరికీ చాటి చెప్పేందుకు, భవిష్యత్తులో కలిసి పని చేస్తామని సూచించేందుకు ఆ నజ్మ్ పాడాలని నిర్ణయించుకున్నారట.

అనుమతి కోసం భర్తని సంప్రదించారు. అది తన కెరీర్‍కి వీడ్కోలు కానుక అని అన్నారు. “ఈ ఒక్క పాటే” అన్నారట ఆయన.

తనని పెళ్ళాడమంటూ కోరుతూ అదృశ్యమయ్యే వ్యక్తిని ఉద్దేశిస్తూ, ఆ పాటని ఆమె ఎంతో వేదనాభరితంగా ఆలపించారామె.

రికార్డింగ్ అయిపోయాకా, సాహిర్ ఆమెని కలిసి “ఈ అద్భుతమైన పాటని మనం ఒకరికొకరం వీడ్కోలు కానుకగా భావిద్దాం” అని అన్నారట. విస్తుపోయినా ఆమె సరేనన్నారు. ఆయనతో వాదించలేదు. పుకార్లకు ఈ పాట మరింత ఆజ్యం పోసింది. తరువాత వారిద్దరూ కలుసుకోలేదు.

ఈ పాటలోని శ్రావ్యత ఆమెని ఆనాటి ప్రముఖ నేపథ్య గాయనిలో ఒకరిగా మార్చింది. ఈ పాట ఆమె గుర్తింపు పాటగా మారింది. తరువాత తన వైవాహిక జీవితాన్ని కొనసాగించేందుకు ఆమె పాటలు పాడటం మానేశారు.

సిగరెట్లు, మద్యం అలవాటున్న సాహిర్ 1980లో గుండెపోటుతో మరణించారు. విఫల ప్రేమే ఆయన మరణానికి కారణమని ఆమె మౌనంగా బాధపడ్డారు. అప్పటికి ఆయనని కలిసి రెండు దశాబ్దాల కాలమయ్యింది. ఆమె కూడా సినిమా పాటలకి దూరమై అంతే కాలమైంది.

1982లో దర్శక నిర్మాత రాజ్ కపూర్ ‘ప్రేమ్ రోగ్’ సినిమా తీస్తూ, అందులో ఒక పాటని పాడమని ఆమెని కోరితే, ఆమె తిరస్కరించారు. “మన సాహిర్ గారికి నివాళి అనుకోండి” అన్నారట రాజ్ కపూర్.

“మావారితో మాట్లాడండి” అన్నారామె.

“ఈ ఒక్క పాటే” అన్నారట ఆయన మరోసారి.

సంతోష్ ఆనంద్ రాసిన ఆ పాటని లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరిచారు.

‘యే ప్యార్ థా యా కుఛ్ ఔర్ థా న తుఝే పతా న ముఝే పతా. యె నిగాహోం కా హీ కసూర్ థా న తేరీ ఖతా న మేరీ ఖతా’ అనే ఈ పాటలోని భావం హృద్యం.

సినిమాలో ఈ పాటని విరహంతో తపిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి నర్తకి పాడే పాట. అతను తను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్తుంటే, లోపలికి వెళ్ళామంటూ ఆమె కోసం పల్లకి తెరని తీస్తాడతను. తన భావాలను వ్యక్తం చేయలేకపోయినందున, వేదనకి లోనవుతాడు.

ఈ పాటని కన్నీళ్ళతో ఆలపిస్తూ, ఆ వేసవి సాయంత్రం సాహిర్ ఇంట్లో జరిగిన సన్నివేశంలో చివరిసారిగా తమ కనులు కలవడాన్ని జ్ఞాపకం చేసుకున్నారట సుధ. ఈ పాటలోని భావమంతా ఆనాడు ఆయన కళ్ళల్లో గోచరించినట్లుంది.

‘ఇది ప్రేమా, మరొకటా నాకు తెలియదు నీకు తెలియదు. బహుశా ఈ దోషం మన కళ్ళది కావచ్చు, నీ తప్పు కాదు నా తప్పు కాదు’

~

సుధా మల్హోత్రా పాడిన కొన్ని చిత్రాలలోని మరపురాని పాటలు:

1. ఆర్జూ (1950) – యవ్వన ప్రాయంలో ఉన్న శశికళ పై చిత్రీకరించిన ఈ పాటకి అనిల్ బిస్వాస్ స్వరకల్పన చేశారు. ఈ పాట సుధా మల్హోత్రా కి మరిన్ని అవకాశాలు వచ్చేందుకు దోహదం చేసింది.

https://www.youtube.com/watch?v=cOlYyEw950Y

2. మీర్జా గాలీబ్ (1954) – గులామ్ మొహమ్మద్ స్వరపరిచిన ఈ ముజ్రా పాట – సినిమాలో షకీల్ బదయూని రాసిన రెండు పాటలలో ఒకటి.

https://www.youtube.com/watch?v=8nA-s8MWaQg

3 . అబ్ దిల్లీ దూర్ నహీ (1957) –  దత్తారామ్ స్వరపరిచిన ఈ పాట శ్రోతల హృదయాలను తాకుతుంది.

https://www.youtube.com/watch?v=riKH9buVP8s

4. చల్తీ కా నామ్ గాడీ (1958) – హాస్యం పండించే సినిమాలోని ఈ పాట పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఎస్. డి. బర్మన్ స్వరపరచగా, సుధ – ఆశా భోస్లేతో కలిసి పాడిన ఈ పాటని కుకూ, హెలెన్‍లపై చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=of0NHpy3t2k

5. దీదీ (1959) – ఇది ముకేష్‍తో కలిసి పాడిన యుగళగీతం, అయితే ఈ పాట సుధా మల్హోత్రాకి ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆమే స్వయంగా ఈ పాటని స్వరపరిచారు.

https://www.youtube.com/watch?v=Zr3Z5D60XnQ

6. హీరా మోతీ (1959) – రోషన్ సంగీతంలో సుధా మల్హోత్రా, సుమన్ కళ్యాణ్‍పూర్ పాడిన ఈ పాటని శుభ కోటే, నిరుపా రాయ్‍లపై చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=vS_dvtK0nGk

7. ధూల్ కా పూల్ (1959) – సాహిర్ లుధియాన్వీ రచించిన ‘కాసే కహూ మై దిల్ కీ బాత్’ అనే పాటని సంగీత దర్శకుడు ఎన్. దత్తా కాఫి రాగంలో స్వరపరిచారు. ఈ పాటకి పూర్ణిమ సితార్ వాయించగా, నాజ్ అద్భుతంగా నర్తించారు. సుధా మల్హోత్రా అద్భుతంగా పాడారు. ఒక్క చోట (lower octave at 3.47-3.50) ‘బాత్’ అని పలికేటప్పుడు ఆమె గొంతు చిన్నగా వణికింది.

https://www.youtube.com/watch?v=lJeaIeNezd0

8. పవన్ పుత్ర హనుమాన్ (1957) – స్వదేశ్ కుమార్ ‘దీపక్’ రాసిన ‘కలియోం మే రామ్ మేరా’ అనే ఈ పాటకి చిత్రగుప్త్ స్వరాలు అందించారు. ఈ పాటకి/ఈ సినిమాకి కొన్ని విశేషాలున్నాయి. అలనాటి ప్రముఖ నటి/గాయని అయిన అమీర్‍బాయ్ కర్నాటకి గారికి సుధా మల్హోత్రా ప్లేబాక్ పాడారు. చిత్రగుప్త్ గారు ఒకప్పుడు సహాయకులుగా పని చేసిన సంగీత దర్శకులు ఎస్. ఎన్. త్రిపాఠీ ఈ సినిమాలో హనుమంతుడిగా నటించారు.

https://www.youtube.com/watch?v=qA2GfsGoRBQ

9. గౌహర్ (1953) – షకీల్ బదయూనీ రచించిన ‘ఆవాజ్ దే రహా హై కోయీ’ అనే పాటకి గులామ్ మొహమ్మద్ బాణీలందించారు. సుధా మల్హోత్రా గారి స్వరం తదుపరి కాలంలో ఆశా భోస్లే స్వరంలా అనిపిస్తుంది. కానీ ఈ పాటలో ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరంలా ధ్వనిస్తుంది. అయినా లతా మంగేష్కర్‍కి సాటి రారెవరూ. ఆశా కూడా తొలినాళ్ళలో తన అక్కలా పాడేందుకు ప్రయత్నించారని అంటారు.

https://www.youtube.com/watch?v=P6_UKktJ_eQ

10. బంసరీ బాలా (1957) – స్వదేశ్ కుమార్ ‘దీపక్’ రాసిన ‘మైతో చందా కీ నగరీ ఆయీ రే’ అనే ఈ పాటకి కమల్ మిత్ర సంగీతం సమకూర్చారు. దల్జీత్, చిత్ర నటించిన ఈ బి-గ్రేడ్ సినిమాలో ఈ పాటని ఓ సైడ్ యాక్ట్రెస్‍పై చిత్రీకరించారు. మాధుర్య ప్రధానమైన పాటకి చక్కగా నృత్యం చేశారా నటి.

https://www.youtube.com/watch?v=bIDiBM3z_dY

Exit mobile version