Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 186

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మరువలేని గాయకుడు, స్వరకర్త ఎస్. డి. బాతిష్

ఎస్. డి. బాతిష్‍గా గుర్తింపు పొందిన శివ్ దయాళ్ బాతిష్ 21 డిసెంబరు, 1914న పాటియాలాలో జన్మించారు. చిరుప్రాయం నుంచే ఆయన తన ప్రతిభని ప్రదర్శించారు. ఒక కథనం ప్రకారం, ఆయన ఏడేళ్ల వయస్సులో ఓ ప్రదర్శనలో, ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా కాశ్మీర్ మహారాజు హరి సింగ్ వంటి వారి నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇలా పలువురి నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం రావడంతో నటనని వృత్తిగా చేసుకోవాలని బొంబాయికి వెళ్ళారు. ఆయన ప్రయత్నం విజయవంతం కాకపోవడంతో, పాటియాలాకి తిరిగివచ్చి పండిట్ చందన్ రామ్ చరణ్‌ వద్ద సంగీతం అభ్యసించారు.

బాతిష్ గారి లయ, జ్ఞాపకశక్తిని గుర్తించిన గురువుగారు, ఆయనకి ‘రసిక్’ అని మారుపేరు పెట్టారు, తరువాతి కాలంలో తాను కాలిఫోర్నియాలో రూపొందించిన కొన్ని స్వరాలకు కర్తగా ఆ మారుపేరుగా ఉపయోగించారు బాతిష్. 1936 నాటికి, ఆయన ఆల్ ఇండియా రేడియోలో కళాకారుడిగా ప్రసిద్ధులయ్యారు, మాస్టర్ రమేష్‌ పేరుతో EMI లేబుల్ కోసం రికార్డింగ్‍లు చేశారు. ప్రముఖ గాయకులు, ముఖ్యంగా KL సైగల్ పాడిన పాటలకు స్వరాలు కూర్చినప్పుడు ఆయన ఈ పేరు వాడారు.

ఆయనకి అదృష్టం కలిసొచ్చింది. ఆకాశవాణిలో ఆయన గానం లాహోర్‌ లోని పంజాబీ చిత్ర పరిశ్రమలో నిష్ణాతుడైన సంగీత విద్వాంసులు పండిట్ అమర్‌నాథ్ గారి బంధువు దృష్టిని ఆకర్షించింది. అమర్‌నాథ్ గారు తాను సంగీతం అందిస్తున్న ‘గవాండి’ (1942) అనే సినిమా కోసం ‘పగ్డీ సంభాల్ జట్టా’ అనే పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట హిట్ అయింది, బాతీష్‌ గారికి పేరు తెచ్చింది. కానీ, ఈ అనుభవం ఆయనకి తీపిచేదుల కలయిగా మారింది. తరచుగా టేక్‌లు తీసుకోవడం, రిఫ్లెక్టర్‌లుగా ఉపయోగించే అద్దాల నుండి వచ్చే తీవ్రమైన కాంతి ఇబ్బంది పెట్టడంతో ఆయన సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు.

అమర్‌నాథ్ గారి సహాయకుడిగా, సంగీత దర్శకత్వం లోని వివిధ అంశాలను – గాయకులతో రిహార్సల్ చేయడం, వాయిద్యాలను సింక్రనైజ్ చేయడం, ఆర్కెస్ట్రాతో పని చేయడం వంటివి నేర్చుకున్నారు బాతిష్. ఈ అభ్యాసాలు ఆయనకి మరో అవకాశాన్ని అందించాయి. మరాఠీ రచయిత, చలనచిత్ర ప్రముఖుడు కేశవ్ ప్రహ్లాద్ ఆత్రే (ఆచార్య ఆత్రే) ‘పాయాచి దాసి’ చిత్రానికి సంగీతం అందించడానికి బాతిష్ గారిని బొంబాయికి ఆహ్వానించారు. కానీ, చివరికి ఆ అవకాశం అన్నాసాహెబ్ మైంకర్‌కి దక్కింది.

1947లో దేశ విభజన జరిగింది, అదే ఏడాది అమర్‌నాథ్ గారు మరణించారు. బాతీష్ మళ్ళీ బొంబాయికి వెళ్లారు, ఈసారి నటుడిగా కాకుండా – గాయకుడిగా మరియు స్వరకర్తగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఆనాటి ప్రముఖ సంగీత దర్శకులు ఆయనతో తమ సినిమాలకి పాడించారు – ‘లాడ్లీ’ లో అనిల్ బిస్వాస్, ‘సావన్ భాదో’, ‘హమారీ మంజిల్’, ‘సూరజ్‌ముఖి’ చిత్రాలలో హుస్న్‌లాల్-భాగత్‍రామ్, ‘కుందన్’ లో గులాం మొహమ్మద్; ‘బర్సాత్ కీ రాత్’, ‘తక్సల్’ చిత్రాలలో రోషన్, ‘అడా’, ‘రైల్వే ప్లాట్‌ఫారమ్’ లలో మదన్ మోహన్ అవకాశాలిచ్చారు. తానే సంగీతాన్ని అందించిన ‘బేతాబ్’, ‘బహు బేటీ’ వంటి చిత్రాలలో గీతా దత్‌తో కలిసి బాతిష్ కొన్ని చక్కని పాటలు పాడారు.

‘శాస్త్రీయ సంగీతం, పంజాబీ జానపద, ప్రసిద్ధ శైలుల సమ్మేళనం’గా వర్ణించబడిన శైలి కలిగిన బాతీష్ – ‘హార్ జీత్’, ‘టిప్పు సుల్తాన్’, ‘తూఫాన్‌’ లతో సహా 16 చిత్రాలకు సంగీతం అందించారు. నిర్మల్ కుమార్ పేరుతో రెండు చిత్రాలకు స్వరాలందించారు – ఆయనకి అదృష్టం కలిసి రావాలని లతా మంగేష్కర్ ఆ పేరుని పెట్టారని బాతిష్ కుమారుడు అశ్విన్ చెప్పారు.

అయితే, త్వరలోనే హిందీ చలనచిత్ర ప్రపంచం పోకడలతో విసుగు చెందారాయన. తన కుటుంబాన్ని పోషించడానికి స్థిరమైన ఆదాయం అవసరం, కానీ చెల్లింపులు అస్తవ్యస్తమయ్యాయి,  ఆలస్యమయ్యాయి. దీనితో విసిగిపోయిన బాతీష్, తమ మనోవేదనలను, డిమాండ్లను తెలియజేయడానికి ఒక వేదికను ఏర్పరచడానికి కళాకారుల యూనియన్‌ను స్థాపించడానికి కొంతకాలం పనిచేశారు.

బాతిష్ కెరీర్‌కు ఇంగ్లండ్ కొత్త దిశానిర్దేశం చేసింది. ‘మ్యూజియాసియా’ అనే సంగీత మాసపత్రికను స్థాపించారు, దాని కోసం క్రమం తప్పకుండా రచనలు చేశారు, విద్యార్థులకు భారతీయ సంగీతాన్ని నేర్పారు. పండుగలప్పుడు, భారతీయ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇచ్చారు. 1969లో, ‘ది గురు’ సినిమాలో పాత్ర కోసం నటుడు మైఖేల్ యార్క్‌కి సితార్‍లో ప్రాథమిక పాఠాలు నేర్పారు. జార్జ్ హారిసన్ ఉదంతం ఆధారంగా మర్చంట్-ఐవరీ సంస్థ రూపొందించిన ఈ సినిమా – భారతదేశంలో గురువు కోసం ఓ సంగీత విద్వాంసుడు చేసే అన్వేషణను ప్రదర్శించింది. ఉత్పల్ దత్, సయీద్ జాఫ్రీ, అపర్ణా సేన్ తదితరులు నటించారు.

సితార్, తబలా, విచిత్ర వీణలో ప్రావీణ్యం కలిగిన బహు-వాయిద్యకారుడైన బాతీష్ – బ్రిటన్ అంతటా సంగీత ఉత్సవాల్లో క్రమం తప్పకుండా పాల్గొనేవారు. వీటిలో ఒకటైన కార్డిఫ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో వారి ప్రదర్శన బ్రిటీష్ పార్లమెంటేరియన్, ఉద్యమ కార్యకర్త ఫెన్నర్ బ్రోక్‌వేని ఆకట్టుకుంది. ఆ దేశంలో శాశ్వత నివాస హోదాను పొందడంలో బ్రాక్‌వే సహాయపడ్దారని బాతిష్ కుమారుడు అశ్విన్ తెలిపారు. కొంతకాలం తర్వాత, బాతిష్ కుటుంబం బొంబాయి నుండి వచ్చేసి బ్రిటన్‍లో ఆయనతో చేరారు. ఇది తన తల్లి శాంతా దేవి ఆచరణాత్మకత, తన తండ్రి సంగీత స్వప్నాలను సాకారం చేసిన నిర్ణయం అని అశ్విన్ అన్నారు.

శాంతా దేవి కూడా, బాతిష్ లానే, తన కెరీర్ ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్‌గా ఉన్నారు. బ్రిటన్ ప్రయాణానికై విమాన టిక్కెట్ల కోసం డబ్బు సేకరించడానికి, ఆ కుటుంబం బొంబాయిలోని శాంతాక్రజ్ పరిసరాల్లో ఉన్న భూమిని విక్రయించింది – ఇప్పుడు దాని విలువ కొన్ని కోట్లు ఉండచ్చని అశ్విన్ చెప్పారు. వీరి కొత్త ఇల్లు లండన్ వెస్ట్ హాంప్‌స్టెడ్‌లోని నివాస ప్రాంతమైన బిర్చింగ్టన్ రోడ్‌లో ఉంది.

కొన్ని వారాల తర్వాత, బీటిల్స్ ఆల్బమ్ రూపకల్పనలో సాయం చేయడానికై నలుగురు భారతీయ సంగీత విద్వాంసులను సిద్ధం చేయమని సాథే గారి నుంచి ఫోన్ వచ్చిందని అశ్విన్ తెలిపారు. ఆ చతుష్టయంలో – సాథే (తబలా), దివాన్ మోతీహార్ (సితార్‌), ఖాసిమ్ (వేణువు) ఇతర సభ్యులు.

ఆ సంగీత సమావేశాల సమయంలో జార్జ్ హారిసన్‌తో బాతిష్‌కు ఏర్పడిన అనుబంధం అంతటితో ముగియలేదు. నెలరోజుల తర్వాత, హారిసన్ భార్య Patti Boyd కు దిల్‍రుబా అనే తీగ వాయిద్యాన్ని నేర్పడానికి బాతిష్ ఒప్పందం చేసుకున్నారు. తర్వాత అది బీటిల్స్ -సార్జంట్‌ పెప్పర్స్ లోన్లీ హార్ట్స్ క్లబ్ బ్యాండ్ ఆల్బమ్ (1967) లో ప్రదర్శించబడింది. 1970లో, బాతిష్ కుటుంబం కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌కు తరలివెళ్లింది. ఇలా వలస వెళ్ళడం హఠాత్తుగా జరగలేదు. అప్పట్లో బాతిష్ శాంటా క్రూజ్ విశ్వవిద్యాలయంలో స్వల్పకాలిక కోర్సును బోధిస్తున్నారు, అక్కడ అతని సహోద్యోగి, గణిత శాస్త్రజ్ఞుడు రాల్ఫ్ అబ్రహం – బాతిష్ వద్ద తబలా పాఠాలు నేర్చుకున్నారు. కుటుంబాన్ని అమెరికాకి తరలించమని అబ్రహం బాతిష్‌కి సూచించగా, వారు అంగీకరించారు. ఒక కుటుంబంగా, తాము musicians వలె ‘move-icians’ అని అశ్విన్ చమత్కరించారు.

అమెరికాకి వెళ్లడం అనేది, ఇంగ్లాండ్‌కు వెళ్లడం లానే కుటుంబ నిర్ణయం. శాంతా దేవి చొరవతో  శాంటా క్రజ్ లోని మిషన్ స్ట్రీట్‌లో ‘బాతిష్ ఇండియా హౌస్’ (మొదట దీన్ని శ్రీ కృష్ణ కేఫ్ అని పిలిచేవారు) అనే రెస్టారెంట్ స్థాపించారు. అక్కడ భారతీయ ఆహారాన్ని అందిస్తూ, బాతిష్ కుటుంబ సభ్యులు సంగీతం వినిపించేవారు. “నేను ఆహారం వడ్డించేవాడిని, సంగీతాన్ని వినిపించడాని వేదికపైకి దూకేవాడిని” అని బాతిష్ కుమారుడు అశ్విన్ గుర్తుచేసుకున్నారు, తన తండ్రి వలె సితార్, తబలాతో సహా అనేక వాయిద్యాలను వాయించేవారు అశ్విన్.

ఈ రెస్టారెంట్ వార్తలు తరచుగా స్థానిక పత్రిక, ‘ది శాంటా క్రూజ్ సెంటినెల్‌’లో వచ్చేవి. రెస్టారెంట్ 1985 వరకు నడిచింది. అదే సమయంలో ఎస్. డి. బాతిష్ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్’ను ప్రారంభించారు. హిందుస్తానీ (రాగోపీడియా కాంపెండియా) మరియు కర్ణాటక సంగీత వ్యవస్థల గురించి తెలిసిన అన్ని వివరాలను క్రోడీకరించి, ఉల్లేఖించి, వ్రాతపూర్వకంగా అందించాలనే ఆయన కోరిక – ఫైళ్లను రికార్డ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి, పంపుకోడాని వీలు కల్పించే తొలి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అయిన గోఫర్‌ను అశ్విన్ కనిపెట్టడంతో సాకారమైంది. బర్కిలీ విశ్వవిద్యాలయం లైబ్రరీకి తరచుగా వెళ్ళి అక్కడ భారతీయ సంగీతంపై, ముఖ్యంగా కర్ణాటక సంప్రదాయంపై అతి తక్కువ పుస్తకాలున్నాయని గ్రహించిన తర్వాత ఈ  ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగింది. ప్రతి రాగాన్ని వివరించడానికి బతీష్‌కు కల్గిన ప్రేరణ – కేవలం సంగీత అభిమానులకే కాదు, ఆంగ్లంలో మాత్రమే పరిచయం ఉన్న వారి విద్యార్థులకు కూడా ఒక వరం అయింది.

వీరి కుటుంబం 1976లో ‘బాతిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌’ని స్థాపించింది. అలీ అక్బర్ ఖాన్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, మ్యూజిక్ సర్కిల్ తర్వాత కాలిఫోర్నియాలో ఇది మూడవది. ‘మ్యూజిక్ సర్కిల్’ని పండిట్ రవిశంకర్‌కి మిత్రులైన హరిహరరావు స్థాపించారు.

రికార్డింగ్ స్టూడియో నిర్వహించడమే కాకుండా, బాతిష్ ఇన్‌స్టిట్యూట్ అనేక వందల బాతిష్ కంపోజిషన్‌లతో (హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వారి రాగ లక్షణ గీతం) పాటు, కర్ణాటక సంప్రదాయంలోని 72 మేళకర్తల ఆధారంగా ఉత్పన్నమైన రాగాల తరగతులు, పాఠ్యాలను అందిస్తూనే ఉంది. బాతిష్ తన కుమారుడు అశ్విన్, కుమార్తె మీనాతో క్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇచ్చారు. మనవడు కేశవ్, మనవరాలు మోహిని సంగీతకారులుగా ఎదగడానికి కళ్ళారా చూశారు.

బాతిష్ తన 94వ పుట్టినరోజుకి కొన్ని రోజులు ముందు 2006లో మరణించారు. తన సంగీతంతో ప్రేక్షకులను అలరించినందుకు, బాతిష్ గారి 85వ పుట్టినరోజున, శాంటా క్రజ్ నగరం వారిని ‘సజీవ సంగీత నిధి’గా (living musical treasure) పేర్కొంటూ వారి జీవితంపై ఫోటో ఎగ్బిబిషన్ నిర్వహించి సత్కరించింది.

***

బాతిష్ గారి సంగీతం వీడియోలు కొన్ని యూ-ట్యూబ్‍లో:

https://www.youtube.com/watch?v=KuFUGWkyabo

https://www.youtube.com/watch?v=CNewjRj0_qY

https://www.youtube.com/watch?v=2PX_UbSXeg0

https://www.youtube.com/watch?v=lgklBdphZY0

https://www.youtube.com/watch?v=kEhhstg6pyM

Exit mobile version