Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 187

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుర స్వరాల చిత్రగుప్త్

చిత్రగుప్త్ పేరుతో ప్రసిద్ధులైన చిత్రగుప్త్ శ్రీవాత్సవ – హిందీ, భోజ్‍పురి చలనచిత్ర పరిశ్రమలలో కీర్తి గడించిన సంగీత దర్శకులు.

ఆయన బీహర్ లోని నాటి సరన్ జిల్లాలోని సావ్రేజీ అనే గ్రామంలో 16 నవంబర్ 1917 నాడు జన్మించారు. ఆయన కుమారులు ఆనంద్, మిళింద్‌లు కూడా బాలీవుడ్‍లో సంగీత దర్శకులు.

చిత్రగుప్త అన్నయ్య బ్రజ్ నందన్ ‘ఆజాద్’ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ‘ఆజాద్’ పాట్నా నుంచి వెలువడే ‘ఇండియన్ నేషన్’ అనే ఆంగ్ల దినపత్రికలోనూ, ‘ఆర్యావర్త’ అనే హిందీ దినపత్రికలోనూ ఘాటైన సంపాదకీయాలు రాసి అరెస్టయి జైలుకి వెళ్ళారు. అన్నగారి కనుసన్నలలో పెరిగిన చిత్రగుప్త్ – ఎకనామిక్స్‌లో మాస్టర్స్, జర్నలిజంలో ఎం.ఎ. చేశారు.

సంగీతంపై ఆసక్తి:

చదువుకి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, అన్నదమ్ములిద్దరూ సంగీతంలోనూ విశేష కృషి చేశారు. అన్నయ్య తబలలో ప్రావీణ్యం సాధించగా, తమ్ముడు వోకల్ పై ఆసక్తి చూపారు. నేపథ్య గాయకుడు కావలన్న తన కోరికని చిత్రగుప్త్ అన్నయ్యకి తెలియనివ్వలేదు. రెండు డిగ్రీలతో పాట్నా యూనివర్సీటికీ చేరి, లెక్చరర్‍ అయ్యారు. అక్కడ ఆయన మిత్రుడు మదన్ సిన్హా [తరువాతి కాలంలో ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ అయ్యారు, వినోద్ ఖన్నా నటించిన ‘ఇంతిహాన్’ (1874) సినిమాకి దర్శకత్వం వహించారు] బొంబాయి వెళ్ళి సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోమని సలహా ఇచ్చారు. చిత్రగుప్త్ సరేనన్నారు. అయితే ఈ నిర్ణయం ఆయన అన్నగారికి నచ్చలేదు.

జర్నలిస్ట్ గిరిజా రాజేంద్రన్ ప్రకారం, “తెలిసిన మనిషంటూ ఒక్కరు కూడా లేకపోయినా చిత్రగుప్త్ బొంబాయి చేరారు. అయినా, ఆయన నితిన్ బోస్ గారిని కలవగలిగారు, సినిమాల్లో కోరస్ గాయకుల్లో ఒకరిగా పాడే అవకాశం దక్కించుకున్నారు. ఒకదాని వెంట మరొకటిగా అవకాశాలు వచ్చాయి. త్వరలోనే చిత్రగుప్త్ – శ్రీ నాథ్ త్రిపాఠీ గారికి సహాయకుడయ్యారు.”

భారతీయ సినీ చరిత్రలో ఎస్. ఎన్. త్రిపాఠీ గారికి విశిష్ట స్థానం ఉంది. ఆయన మౌలికంగా సంగీత దర్శకులు. పలు పౌరాణిక, చారిత్రాత్మక సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, పలు పాత్రలు పోషించారు. నిరుపా రాయ్ నటించిన ‘రూప్‍మతి’ (1957) అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఆయన పాటలు పాడేవారు, సంభాషణలు రాసేవారు. వి.ఎన్. భత్కాండే లక్నోలో స్థాపించిన ‘మారిస్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్’ విద్యార్థి అయిన త్రిపాఠీ సంప్రదాయ సంగీతాన్ని ఇష్టపడేవారు. హిందూస్థానీ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని ఉపయోగించే విషయంలో ఆయనకీ, చిత్రగుప్త్‌కీ అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయినప్పటికీ స్వతంత్ర సంగీత దర్శకుడిగా చిత్రగుప్త్‌కి అవకాశం రావడానికి ఆయన సహకరించారు.

గుర్తింపు:

1946లో వచ్చిన ‘ఫైటింగ్ హీరో’ అనే సినిమా స్వతంత్ర సంగీత దర్శకుడిగా చిత్రగుప్త్‌కి గుర్తింపు తెచ్చింది. దీని తరువాత వరుసగా పలు స్టంట్ సినిమాలకు (కొన్ని సినిమాల్లో ‘ఫియర్‍లెస్ నాడియా’ నటించారు), పౌరాణిక సినిమాలకు, చారిత్రక చిత్రాలకు సంగీతం అందించారు. బ్రజ్ నందన్ ఆజాద్ గారు ఈ సినిమాలు చూశారో లేదో తెలియదు. కాకపోతే తొలి సినిమాలలో ‘చిత్రగుప్త, ఎం.ఎ.’ అని క్రెడిట్ ఇవ్వడం బహుశా వారికి ఊరట కలిగించి ఉండవచ్చు.

ఎస్. ఎన్. త్రిపాఠీ గారి వద్ద పని చేయడం వల్ల పరిశ్రమలోని వారితో చిత్రగుప్త్‌కి పరిచయాలు పెరిగాయి. స్టార్స్ కాని నటులతో లో-బడ్జెట్‍తో తీసే స్టంట్, ఫాంటసీ, పౌరాణిక, చారిత్రక, క్రైమ్ థ్రిల్లర్స్, సాంఘిక చిత్రాలకు సంగీతం అందించే అవకాశాలు లభించాయి.

విభిన్న తరహా చిత్రాలకు తగిన సంగీతాన్ని ఆయన సులువుగా అందించారు. నానాభాయ్ భట్ తీసిన ‘సింద్‍బాద్ ది సెయిలర్’ (1952) చిత్రం కోసం రఫీ-షంషాద్ బేగంలు పాడిన ‘అదా సే ఝూమ్‌తే హుయే’ యుగళ గీతం చిత్రగుప్త్ గారి మొదటి పెద్ద హిట్ పాటగా చెప్పుకోవచ్చు. మరుసటి సంవత్సరం ‘నాగ పంచమి’ (1953) సినిమా కోసం ఆశా భోస్లేతో ‘ఓ నాగ్ కహీ జా బసియో రే’ అనే హిట్ పాటని పాడించారు. ఈ పాట కోసం తొలిసారిగా క్లేవియోలైన్ ఉపయోగించారని అంటారు.

అయితే, వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా ఒకే తరహా సినిమాలకు పని చేయటం వల్ల కొద్దిరోజులకే, తన గురువు త్రిపాఠీ గారిలానే, చిత్రగుప్త్ కూడా మూస సంగీతానికి పరిమితమయ్యారు. అది ఆయన కెరీర్‍పై తీవ్ర ప్రభావం చూపింది. పైగా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకోలేదని విమర్శకులు అంటారు. అయితే 1955లో ఎవిఎం సంస్థ అధినేత ఎ.  వి. మెయ్యప్పన్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘శివ్ భక్త్’ చిత్రగుప్త్ కెరీర్‍లో ముఖ్య పాత్ర వహించింది. నిజానికి ఈ సినిమాకి అంతకు ముందు ఎవిఎం సంస్థకు ‘లడ్కీ’ (1953) అనే హిట్ సినిమా అందించిన ఎస్. డి. బర్మన్ సంగీతం అందించాల్సి ఉంది, కానీ తాను పౌరాణికాలకు స్వరాలు అందివ్వలేనని ఎస్. డి. బర్మన్ చెప్పటంతో, ఆ అవకాశం చిత్రగుప్త్ గారికి దక్కింది. ఓ పెద్ద సంస్థలో వచ్చిన మంచి అవకాశం అది. దర్శకుడి మద్దతు ఉండడంతో, చిత్రగుప్త్ గారు ఈ సినిమా కోసం లతా మంగేష్కర్‍తో పాడించారు. అనంతరం వారి మధ్య చక్కని స్నేహం కలిసి ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశారు. చిత్రగుప్త్ సంగీతంలో లత 240 పాటలు (151 సోలో పాటలు) పాడారని రాజు భరతన్ తెలిపారు. అయితే లత పాడినా, పాడకపోయినా, 1950-60ల నడుమ ఒకదాని తరువాత ఒకటిగా పలు సినిమాలో అత్యంత మధురమైన పాటలను అందించారు చిత్రగుప్త్. అయితే ఆ సినిమాలు చాలా వరకు యావరేజ్ సినిమాలు కావడంతో, ఆయన పాటలు మరుగున పడిపోయాయి.

మళ్ళీ ఎవిఎం చిత్రం ద్వారానే చివరకు చిత్రగుప్త్ గారికి మొదటి పెద్ద కమర్షియల్ హిట్ వచ్చింది. కృష్ణన్-పంజు (తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఫేమ్) దర్శకత్వం వహించిన ‘భాభి’ (1957) ఒక సాధారణ ఫ్యామిలీ మెలోడ్రామా. ఈ సినిమాలో బల్‌రాజ్ సాహ్ని, నందా, జగదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని ప్రతి పాటలో ఏదో ఒక విశేషం ఉంటుంది, అయితే రఫీ పాడిన ‘చల్ ఉడ్ జా రే పంచీ’ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఆయనకి అత్యంత ఇష్టమైన పాటలలో ఒకటిగా మిగిలిపోయింది.

అయితే ‘భాభి’ విజయం తరువాత చిత్రగుప్త్ – హోమీ వాడియా, నానాభాయ్ భట్ వంటి వారికి పని చేయాలి కదా? లెక్కలు చూసుకునే వారెవరైనా ఆ పనే చేస్తారు. కానీ చిత్రగుప్త్ అలా చేయలేదు. “నాకు తొలి విజయాలని అందించిన వాళ్ళని ఎలా కాదనగలను?” అన్నారు.

చిత్రగుప్త్ ఎవిఎం సంస్థతో మరో మూడు సినిమాలు చేసారు: ‘బర్ఖా’ (1959), ‘మై చుప్ రహుంగీ’ (1962),  ‘మై భీ లడ్కీ హూఁ’ (1964). “ఎవిఎం కోసం కోసం కొన్ని అత్యుత్తమ స్వరాలు అందించాను” అని ఆయన 1990లో ఒక విలేఖరితో చెప్పారు, రఫీ సోలో ‘మై కౌన్ హూఁ’ (మై చుప్ రహుంగీ సౌండ్‌ట్రాక్ నుండి ఫస్ట్-రేట్ పాట) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘మై కౌన్ హూఁ’ పాటకు, చిత్రగుప్త్ గారి మరికొన్ని పాటలకు అరేంజర్‍గా ప్యారేలాల్ శర్మ (లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం ఫేమ్) పని చేశారు. సాధారణంగా చిత్రగుప్త్ సినిమాలకు గోవాకు చెందిన జానీ గోమ్స్ అరేంజర్ గా ఉంటారు. కానీ ఆయన పలు జాజ్ బ్యాండ్‍లతో పని చేస్తుండడంతో ప్యారేలాల్‍కి అవకాశం వచ్చింది. చిత్రగుప్త్ గారితో సన్నిహితంగా పనిచేసిన మరో మిత్రుడు దిలీప్ ధోలకియా (1921-2011). ఈయన కూడా చిత్రగుప్త్ వలె కోరస్ గాయకుడిగా వచ్చి, త్రిపాఠీ గారి దగ్గర సహాయకుడిగా చేశారు. చిత్రగుప్త్ స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాకా, దిలీప్ గారు చిత్రగుప్త్ గారికి సహాయకుడిగా వ్యవహరించారు. “1959 నుంచి మాత్రమే మా మావయ్య చిత్రగుప్త్ గారితో పూర్తి సమయం పనిచేయడం ప్రారంభించారు” అని వారి మేనల్లుడు గౌరంగ్ ధోలాకియా చెప్పారు. గాయకుడిగా రాణించాలనుకున్న తన కోరిక పూర్తిగా నెరవేరనప్పటికీ, ‘తారీ ఆంఖ్’ అనే పాటని పాడి గొప్ప పేరు పొందారు. ఆ పాట నేటికి కూడా ఓ అద్భుతమైన గుజరాతీ పాటగా మన్ననలు పొందుతోంది, ఎందరో గాయకులు ఇప్పటికీ పాడుతున్నారు. అజిత్ మర్చంట్ స్వరపరిచిన ఓ గీతానికి ముగ్ధులై, ఆ బాణీని తర్వాత చిత్రగుప్త్ – ‘చందా లోరియాఁ సునాయే’ (నయా సంసార్, 1959) కోసం ఉపయోగించారు.

చిన్నతనంలో, గౌరంగ్ ధోలాకియా అతి తక్కువ రికార్డింగ్‌లకు హాజరయ్యారు. “నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు, మా మావయ్య ‘కిషోర్ కుమార్ గారి గొప్ప పాట రికార్డింగ్ జరుగుతోంది, చూస్తావా?’ అని అడిగారు. నాకు రెండో ఆహ్వానం అవసరం లేదు. ‘పాయల్‌వాలీ దేఖ్నా’ (ఏక్ రాజ్, 1963) రికార్డింగ్ చూడటానికి స్టూడియోకి వెళ్ళిపోయాను” చెప్పారు గౌరంగ్.

“సినిమా పత్రికలు చదవమని లేదా రికార్డింగ్‌లకు హాజరవ్వమని నాన్న మమ్మల్ని ప్రోత్సహించలేదు, కానీ కొన్నిసార్లు ఆయన మా డిమాండ్‌లకు లొంగిపోతారు” అని చిత్రగుప్త్ కుమారుడు మిళింద్ అన్నారు.

‘యే పర్బతోం కే దాయ్రే’ (వాసనా, 1968) రికార్డ్ చేస్తున్నప్పుడు తాను స్టూడియోలో ఉన్నానని మిళింద్ గుర్తు చేసుకున్నారు. “ఆ స్టూడియో రికార్డింగ్‌ల గురించి నాకు ఎక్కువగా గుర్తున్న విషయం ఏమిటంటే, చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు, బ్రాస్ సెక్షన్ చాలా బిగ్గరగా ఉండేది. ఆ వాయిద్యాల శబ్దం నన్ను భయపెట్టింది!” అన్నారు.

ఖార్‌లోని 14వ రోడ్‌లోని తమ ఇంటికి (పూర్వం ఆ ఇంట్లో మదన్ మోహన్ ఉండేవారు) తరచుగా వచ్చే వ్యక్తులతో సుధ శ్రీవాత్సవకి అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. “మహ్మద్ రఫీ ఉదయం పూట వచ్చి పాటలను శ్రద్ధగా రిహార్సల్ చేసేవారు” అన్నారామె. “మంగేష్కర్ సోదరీమణులకు రిహార్సల్స్ అవసరం లేదు, కానీ లతా-జీ తరచుగా వచ్చేవారు” అన్నారు సుధ.

కిషోర్ కుమార్ తన తండ్రిని ‘మహారాజ్’ అని సంబోధించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. “ఆయన తరచుగా మా ఇంటికి వస్తూ, బయట నిలబడి ‘సర్ది కా బుఖార్ బురా/బనియే కా ఉధార్ బురా’ అనే పాట గట్టిగా పాడేవారు.” ఇవి ‘మంచాల’ (1953) కోసం కిషోర్ మరియు చిత్రగుప్తలు సృష్టించిన హాస్య పాటలోని పంక్తులు. ఈ సినిమాకి మరో విశేషం ఉంది. గాయకుడిగా చిత్రగుప్త్ కెరీర్‌లో ఓ అద్భుతమైన పాట పాడారు. ఈ సోలో పాట – ‘భగవాన్ తుజే మై ఖత్’ ఆ కాలంలో పెద్ద విజయాన్ని సాధించింది.

ఎవి మెయ్యప్పన్ తర్వాత చిత్రగుప్త్ కెరీర్‌లో అత్యంత ముఖ్యుడైన నిర్మాత-దర్శకుడు ఫణి మజుందార్ గురించి కూడా సుధకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. “ఆయన అద్భుతమైన వ్యక్తి,” ఆమె అన్నారు. “ఇతర నిర్మాతలు ప్రతి పాటకీ, మరికొన్ని ఆప్షన్స్ అడుగుతారు, కానీ ఫణి-దా తీరు భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి పాట గురించి చర్చించిన తర్వాత, ‘సరే, ఫణి-దా, నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను అని నాన్న చెబితే, ఆయన ‘వద్దు, నాకు ఆప్షన్స్ అక్కరలేదు; మీరు ఉత్తమమని భావించే ఒక ట్యూన్ ఇవ్వండి’ అన్నారు” తెలిపారు సుధ.

‘దిల్ కా దియా’ (ఆకాశ్ దీప్, 1965), ‘జాగ్ దిల్-ఎ-దీవానా’ (ఊంఛే లాగ్, 1965) వంటి ఎవర్‌గ్రీన్ పాటల ద్వారా మాత్రమే కాకుండా – ఈ స్వేచ్ఛ (ఇంకా బాధ్యత), తన తండ్రిలోని ఉత్తమమైన ప్రతిభని బయటపెట్టిందని సుధ విశ్వసిస్తారు. అయితే కిషోర్ కుమార్ గారి అత్యంత ప్రియమైన ‘మై హసూఁ కే ఇస్ పే రోవూఁ’ (విడుదల అవని ‘మా’ అనే సినిమా లోనిది); రఫీ పాడిన తీవ్రంగా కదిలించే ‘ఇత్నీ బడీ దునియా జహాఁ ఇత్నా బడా మేలా’ (తూఫాన్ మే ప్యార్ కహాఁ, 1963) వంటి అంతగా తెలియని గొప్ప పాటలు చిత్రగుప్త్ ప్రతిభకి నిదర్శనాలు.

అశోక్ కుమార్ నటించిన ‘ఇత్నీ బడీ దునియా జహాఁ ఇత్నా బడా మేలా’ పాట గురించి, సుధ గుర్తుచేసుకున్నారు, “అశోక్ కుమార్ గారు వారి భార్య మరణించిన తర్వాత, ఈ పాటతో క్యాసెట్ పంపమని నాన్నకు సందేశం పంపారు.”

మరొక ప్రసిద్ధ పాట, మన్నా డే – ఆశా భోస్లే పాడిన యుగళగీతం ‘జోడీ హమారీ జమేగా కైసే జానీ’ (ఔలాద్, 1968)కి సంబంధించిన సంఘటనను కూడా వివరించారు సుధ. అప్పట్లో ‘పడోసన్‌’ సినిమాకి పనిచేస్తున్న మెహమూద్ గారు, ఆ పాటతో సంతృప్తి చెందలేదని ఆమె తెలిపారు. “నాన్న చాలా బాధపడ్డారు. ఈ పాటలో పాశ్చాత్య సంగీతం, భారతీయ సంగీతం ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల ఈ పాటను రికార్డ్ చేయడానికి చాలా సమయం పట్టింది. అయితే తర్వాత అరుణా ఇరానీ మెహమూద్‌ను కూర్చోబెట్టి మళ్లీ వినమని కోరారు. మెహమూద్ మనసు మార్చుకున్నారు, పాట పెద్ద హిట్‌ అయ్యింది.” చెప్పారు సుధ.

ఈ సమయంలోనే, చిత్రగుప్త్ గారికి సాహిర్ లుధియాన్వీ గారితో కలిసి పనిచేసే అవకాశం ‘వాసనా’ (1968) చిత్రం ద్వారా మొదటిసారిగా దక్కింది. “సాహిర్ సాబ్ ఎవ్వరితోనూ కలుపుగోలుగా ఉండరని అంటారు, కానీ ఆయనా, మా నాన్న ఆ అభిప్రాయం సరికాదని నిరూపించారు” అని సుధ చెప్పారు. వారిద్దరూ ‘సంసార్’ (1971) కోసం మళ్లీ కలిసి పనిచేశారు. “మా నాన్న ఉన్నత విద్యావంతులు. చాలా మంది గీత రచయితలు నాన్నతో సంభాషించడాన్ని ఆనందించేవారు” ఆమె తెలిపారు.

గీత రచయిత శైలేంద్ర వీరికి దగ్గరలోనే నివసించేవారు, చేతిలో సిగరెట్‍తో తరచూ చిత్రగుప్త్ గారి ఇంటికి వచ్చేవారు. “ఆయనా, నాన్నా కలిస్తే, వాళ్ళు భోజ్‍పురీలోనే మాట్లాడుకుంటారు” చెప్పారు సుధ. వీరిద్దరు కలిసి పని చేసింది తక్కువ సినిమాలే అయినా, వాటిల్లో ‘గంగా మైయ్యా తోహే పియారీ చదైబో’ (1963) అనే భోజ్‍పురీ సినిమా ప్రముఖమైనది.

మరో గీత రచయిత, మిత్రుడు ప్రేమ్ ధావన్ కూడా వీరింటికి తరచూ వచ్చేవారు. “వాళ్ళిద్దరూ డ్రైవ్ చేసుకుంటూ ఆరే కాలనీకి వెళ్లి అక్కడ కూర్చుని పాటల రూపకల్పన చేసేవారు”. 60వ దశకం చివరి రోజులు, 70వ దశకం ప్రారంభంలో సంగీత పరిశ్రమలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పాత తరం సంగీత దర్శకులు గతించారు, లేదా వారి ప్రభ క్షీణించింది లేదా చివరి దశలో ఉన్నారు. ఆర్‌డి బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వంటి యువ సంగీత దర్శకుల కాలం వచ్చేసింది. “మీరు మీ స్టైల్‌ మార్చుకోవాలి, బహుశా మీకు కొత్త అరేంజర్‌ అవసరం అని నాన్నతో జనాలు తరచుగా అనేవారు” అని సుధ చెప్పారు. “ఇది నాన్నని బాధించింది” అన్నారామె. కానీ చిత్రగుప్త్ తన విమర్శకులకు గట్టిగా సమాధానం చెప్పారు. ఊంచే లోగ్, ఆకాశ్ దీప్, ఔలాద్, వాసనా వంటి చిత్రాలలో అందించిన హిట్ పాటలతో ఆయన ప్రాభవం పెరిగింది. కానీ 1968లో గుండెపోటు రావడంతో ఆ పనిలో భారీ విఘాతం ఏర్పడింది. ఆయన కోలుకున్నారు – సాజ్ ఔర్ సనమ్ (1971), ఇంతేజార్ (1973), అంగారే (1975) వంటి చిత్రాలలో కొన్ని అద్భుతమైన పాటలను అందించారు, అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 1974లో ఆయనకి పక్షవాతం వచ్చింది. “నాన్న పక్షవాతం నుండి దాదాపు 90% కోలుకున్నారు, కానీ అది కుటుంబానికి చాలా కష్టమైన దశ” అని ఆయన కుమారుడు మిళింద్ చెప్పారు. అప్పట్నించి మిళింద్ తన సోదరుడు ఆనంద్‌తో కలిసి తమ తండ్రితో పాటు రికార్డింగ్‌లకు వెళ్ళడం ప్రారంభించారు. “మేము కారును అమ్ముకోవలసి వచ్చింది. చెంబూరు లోని హోమీ వాడియా స్టూడియోకి వెళ్ళేందుకు మేము మూడు బస్సులు మారాల్సి రావడం నాకింకా గుర్తుంది” చెప్పారు మిళింద్.

అయితే, చిత్రగుప్త్ ప్రభ పూర్తిగా మసకబారలేదు. ‘బాలమ్ పరదేశీయా’ (1979) అపూర్వమైన విజయం సాధించడంతో, ఆయన 80వ దశకంలో పలు భోజ్‌పురి చిత్రాలకు గొప్ప సంగీతం అందించారు. విజయవంతమైన, ఫలవంతమైన స్వరకర్తగా మరో దఫా వెలుగొందారు. ఆయన కొన్ని లో-బడ్జెట్ హిందీ చిత్రాలను కూడా చేసారు, చివరిది ‘ఇన్సాఫ్ కి మంజిల్’ (1988), ఇందులో అలీషా చినాయ్ పాట పాడారు (మిళింద్ వెల్లడించిన వివరాల ప్రకారం, దీనిని లెస్లీ లూయిస్ ప్రోగ్రామ్ చేసారు). చిత్రగుప్త్ – ఫియర్‍లెస్ నాడియా, అమీర్‍బాయి కర్నాటకి వంటి వారితో తన కెరీర్‌ను ప్రారంభించారని తెలుసు, అందువల్ల, స్వరకర్తగా చిత్రగుప్త్ సుదీర్ఘ కెరీర్ అస్థిరమైనది కాదనే భావించాలి.

1988లో, ఆనంద్-మిళింద్ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాకి గొప్ప స్వరాలు అందించి, ఆ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు. “ఆ రాత్రి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చారు, కానీ నాన్నని నిద్రలేపి అవార్డు చూపించారు” అని సుధ చెప్పారు. “నాన్న సంతోషించారు. ఇన్నేళ్లూ నేను సాధించలేనిది, మీరు సాధించారు అన్నారు” చెప్పారామె.

చిత్రగుప్త్ జనవరి 14, 1991న గుండెపోటుతో మరణించారు. అంతకు ముందు ఒక నెల క్రితం, ఆయన మిళింద్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఆ వేడుకకి సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. “నాన్న కళ్లు మెరిసిపోయాయి. ‘చూడు, ఎంత లైన్ ఉందో’ అని నాతో అన్నారు” చెప్పారు సుధ.

తమ తండ్రి చిత్రగుప్త్ గురించి ఆయన కుమారులు ఇలా అన్నారు:

ఆనంద్:

“మా నాన్న, దివంగత చిత్రగుప్త్ – 1950, 60, 70, ఇంకా 80 లలో కూడా ప్రసిద్ధ, విజయవంతమైన సంగీత దర్శకులు. నేను ఆయన జీవితం నుంచి, సంగీతం నుండి చాలా ప్రేరణ పొందాను. సంగీత వాతావరణంలో పెరగడం పెద్ద ఆస్తి. మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, ఆశా భోస్లే, తలత్ మహమూద్, మన్నా డే, గీతా దత్, సుమన్ కళ్యాణ్‌పూర్, ముఖేష్, ఇంకా మహేంద్ర కపూర్ వంటి గొప్ప వ్యక్తులను రిహార్సల్స్ కోసం లేదా కబుర్ల కోసం, ఒక కప్పు టీ తాగడానికో మా ఇంటికి రావడం చూసినందున నన్ను నేను నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను.

హిందీ చలనచిత్ర సంగీతంలో ‘స్వర్ణయుగం’ అని పిలవబడే కాలంలో రాణించిన అనేక ఇతర స్వరకర్తలు, శంకర్-జైకిషన్, ఎస్. డి. బర్మన్, సలీల్ చౌదరి, ఓ.పి. నయ్యర్, సి. రామచంద్ర, రవి, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వంటి వారి నుండి కూడా నేను ప్రేరణ పొందాను. క్లిఫ్ రిచర్డ్ లేదా టామ్ జోన్స్, మెహదీ హసన్ లేదా జగ్జీత్ సింగ్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లేదా ఆంట్రెమాంట్ వంటి ఇతర ప్రపంచ ప్రసిద్ధ కళాకారుల నుంచి ప్రేరణ పొందాను.”

~

మిళింద్:

“హిందీ చలనచిత్ర సంగీతం యొక్క స్వర్ణయుగానికి ప్రధాన స్వరకర్త అయిన మా నాన్న దివంగత చిత్రగుప్త్ నా జీవితంలో అతి పెద్ద ప్రేరణ. స్వరాలు కూర్చడంలో నాకు సహాయపడిన హిందుస్థానీ శాస్త్రీయ రాగాలను ఆయన నాకు నేర్పించారు.”

***

చిత్రగుప్త్ సృజించిన కొన్ని పాటలను ఆస్వాదించండి:

https://www.youtube.com/watch?v=Aw4_gK72pBU

https://www.youtube.com/watch?v=MzQ7KSk8s1I

https://www.youtube.com/watch?v=KGamzMMzX5g

https://www.youtube.com/watch?v=loBc_BPX6AI

https://www.youtube.com/watch?v=Unc6pCWslyU

https://www.youtube.com/watch?v=u1XcCyTkulU

https://www.youtube.com/watch?v=4brcrPWtlH0

https://www.youtube.com/watch?v=dDN2JGO9YWg

https://www.youtube.com/watch?v=9n6hoIp6Quc

Exit mobile version