Site icon Sanchika

అలనాటి అపురూపాలు- 189

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బహుముఖ ప్రజ్ఞాశాలి టి.ఆర్. రాజకుమారి కుటుంబ నేపథ్యం, సినీ కెరీర్

మద్రాసుకు వలస వచ్చిన ప్రసిద్ధ దేవదాసి – తంజావూరు భవాని. అయితే ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో కొంత కాలం తర్వాత ఆమె తంజావూరుకు తిరిగి వెళ్ళారు.  తంజావూరులోని చివరి ఆస్థాన నర్తకీమణులలో ఒకరైన కుచలాంబళ్ అనే భవాని కుమార్తె.

కుచలాంబాళ్‌కు చాలా మంది స్వంత, పెంపుడు కూతుర్లు ఉన్నారు. వాళ్ళల్లో రంగనాయకి, సరస్వతి, దమయంతి, ధనలక్ష్మి ముఖ్యులు. చివరి ఇద్దరు తంజావూరు రాజభవనంలో నృత్యం చేసి, అక్కడే నివసించారు.

దమయంతి కూతురు కుచలకుమారిని మద్రాసు తీసుకెళ్లి నటిగా తీర్చిదిద్దారు.

కుచలాంబళ్ మరో కూతురు ధనలక్ష్మికి కూడా సినిమాల్లో నటించే అవకాశం వచ్చి మద్రాసు వెళ్లిపోయారు. ఆమె చివరికి కృష్ణ పిక్చర్స్ యజమాని, నిర్మాతగా మారిన వ్యాపారవేత్త అయిన ఎస్. లేచుమన చెట్టియార్‌ను (లీనా చెట్టియార్ అని పిలుస్తారు) వివాహం చేసుకున్నారు.

ధనలక్ష్మి మద్రాసు వచ్చినప్పుడు ఆమెతో పాటు రంగనాయకి కుమార్తె రాజాయి కూడా వచ్చారు. ప్రముఖ దర్శకుడు కె.సుబ్రహ్మణ్యం ద్వారా సినిమాల్లో నటించేందుకు రాజాయికి అవకాశం వచ్చింది. టి.ఆర్. రాజకుమారి అనే పేరుతో ఆమె నటిగా బాగా ప్రాచుర్యం పొందారు.

1970, 1980 దశకాలలో భారతీయ చలనచిత్రాలలో వ్యాంప్‌లు, క్యాబరే డాన్సర్‌ల పాత్రలకు ప్రసిద్ధి చెందిన నటీమణులు జయమాలిని, జ్యోతిలక్ష్మి – ధనలక్ష్మి కుమార్తెలు. ప్రముఖ చిత్రనిర్మాత టి.ఆర్.రామన్న నటి టి.ఆర్. రాజకుమారి గారి తమ్ముడు. ఆయన ఇ.వి. సరోజను ద్వితీయ వివాహం చేసుకున్నారు. పీఏ పెరియనాయగి కూడా అదే వంశానికి చెందిన వారే. సాయి, సుబ్బులక్ష్మి, పంబరం సోదరీమణులు – ఎస్.పి.ఎల్ ధనలక్ష్మికి బంధువులవుతారు.

టి.ఆర్. రాజకుమారి – తొలి డ్రీమ్ గర్ల్:

టి.ఆర్. రాజకుమారి ప్రభావం ఎలా ఉండేదంటే – ఎన్నో కుటుంబాలలో ఆమె ఉత్సాహం కలిగించేవారు. ఓ కుటుంబంలో ఓ పెద్దాయన రాజకుమారి గారి ‘చంద్రలేఖ’ సినిమాని 50 సార్లకి పైగా చూస్తే, ఆయనకేదో అయ్యిందని పూజలు చేయించి, తాయొత్తులు కట్టించారట. ఆవిడే తొలి డ్రీమ్ గర్ల్. కానీ ఆమె ఆకర్షణ కేవలం అందం కాదు.

ఆమె ప్రసిద్ధికెక్కిన వంశానికి చెందినవారు. శ్రీ బి.ఎమ్. సుందరం జరిపిన ‘మారాబు తండా మణిక్కంగళ్’ అనే ఒక గొప్ప సర్వే ద్వారా వీరి వంశానికి మూలవ్యక్తిగా – ‘తంజావూరు చతుష్టయం’ అని పేరుపొందిన నలుగురిలో ఒకరైన శివానందం కుమారుడు సభాపతి నట్టువానార్ శిష్యురాలైన తంజావూరు భవానిని గుర్తించారు.

భవాని కూతురు కుచలాంబాళ్ మహాదేవ నట్టువానార్ దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఆమె 14 మంది పిల్లలలో ఒకరైన తంజావూరు రంగనాయకి, కొంతకాలం నృత్యాన్ని వృత్తిగా కొనసాగించి, ఆ తర్వాత హరికథను ఎంచుకున్నారు. ఆమె కుమార్తె టి.ఆర్. రాజయి. ఆమె వెండితెర పేరు టి.ఆర్. రాజకుమారి.

‘తిరై ఇసై అలైగల్‌’ అనే పుస్తకంలో శ్రీ వామనన్ రాజకుమారి మే 5, 1922 న జన్మించారని రాయగా, శ్రీ సుందరం ఆమె 1920లో జన్మించిందని పేర్కొన్నారు. తమ గొప్ప సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా, రాజకుమారి నృత్యంలో శిక్షణ పొందారు. ఆమె చక్కగా పాడేవారు, వీణ అద్భుతంగా వాయించేవారు. అన్నింటికంటే మించి, తెరపై చూపించినట్లుగా, ఆమె అనంతమైన దయ, విశేషమైన ఆకర్షణ కలిగిన మహిళ.

మొదటి చిత్రం:

మొదటి సినిమా ‘కుమార కులోత్తుంగన్’ (1938)లో డెక్కన్ సినీటోన్ వారు అవకాశం ఇచ్చారు. అయితే కె. సుబ్రహ్మణ్యం గారి ‘కచ దేవయాని’ (1941) ఆమె కీర్తిని తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రాజకుమారి నటించడాన్ని ఒక్క సుబ్రహ్మణ్యం గారు తప్ప మిగతా అందరూ వ్యతిరేకించారట. అరంతై నారాయణన్ (తమిళ సినిమావిన్ కథై) వెల్లడించిన ప్రకారం, ఆమెను కెమెరా టెస్ట్‌కు సిద్ధం చేసిన మేకప్‌మ్యాన్ దర్శకుడికి పిచ్చెక్కిందని అన్నాడట. సినిమా విడుదలై జనవరి 9, 1941న గైటీ థియేటర్‌లో ప్రదర్శించినప్పుడు వారి అంచనాలు సమర్థనీయమేనని అనిపించాయి. సినిమా ఫ్లాప్‌ అనిపించింది, కానీ నాల్గవ రోజు నుంచి ప్రేక్షకాదరణ విశేషంగా పెరిగి ఆరు వారాల పాటు హౌస్‍ఫుల్‍గా నడిచింది. ఇందుకు ప్రధాన కారణం – రాజకుమారి. విమర్శకులు ఆమెను ఓ ఆలయ శిల్పంలా, దంతపు బొమ్మలా, మయూరిలా, కోకిలగా అభివర్ణించారు. ఆమె డ్రీమ్ గర్ల్ అయ్యారు.

అయితే డ్రీమ్ గర్ల్ అనే సంబోధిస్తుంటే, ఆమె కేవలం గ్లామరస్‌ నటి అని భావిస్తే అది పొరపాటు. రాజకుమారి ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ మూడు గొప్ప పాత్రలు ఆమె కెరీర్‌ని నిర్వచించాయి. మొదటిది చంద్రలేఖ (1948) సినిమాలోని పాత్ర. ఈ సినిమా ఘనతలో వాసన్‌ గారికీ భాగముంది. ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా, జిప్సీగా, అన్నింటికీ మించి డ్రమ్స్‌పై నృత్యం చేసిన రాజకుమారిని ఎవరు మర్చిపోగలరు? కానీ అంతకంటే చాలా ఎక్కువగా – ‘చంద్రలేఖ’ ఆలోచనాపరురాలు. ఎన్నో విధాలుగా రాజకుమారి ఆ పాత్రకు ప్రాణం పోశారు. రెండవది 1944లో విడుదలైన ‘హరిదాస్‌’ చిత్రంలో నాయకుడిని ఆకర్షించే కుతంత్రాల వేశ్య ‘రంభ’ పాత్ర. ఈ సినిమాలో ఎం.కె.త్యాగరాజ భాగవతార్ పాడిన ‘మన్మథ లీలయై వెన్రార్ ఉందో’ అనే పాట ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాట మధ్యలో ఆయన ఆపేక్షగా ‘రంభా’ అని పిలవడం, దానికి బదులుగా ఆమె కాస్త లోతైన స్వరంలో, ‘స్వామీ..’ అనడం అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఆమెది వేశ్య రంభ పాత్ర, హరిదాస్ భార్య (ఎన్.సి. వసంతకోకిలమ్ నటించారు) లాగా ఉదాత్త పాత్ర కాదు. రాజకుమారి నటించిన చిత్రాలలో ఇది రెండవ అత్యంత ముఖ్యమైన పాత్రగా నిలిచింది. మూడవది, ‘మనోహర’ (1954) చిత్రంలో ‘వసంతసేన’ పాత్ర. సినిమా అంతా శివాజీదే అయినా, రాజకుమారి ధిక్కారపు చూపులు, పదునైన వ్యాఖ్యలు లేకుంటే ఆయన కోపమంతా వృథా అయిపోయేది. దుష్ట వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించిన పాత్ర ఇది. అండర్‌ప్లే చేయడం ద్వారా నటనని నిలకడగా చేశారామె. ఆమె కేవలం ఒక్క చూపుతో, మౌనంతో, పెదవి వంపుతో – శివాజీ, కన్నాంబలకు ధీటుగా రాణించారు రాజకుమారి. ఈ సినిమా విజయం తరువాత, రాజకుమారి ‘తంగపడుమై’ (1959)లో వ్యాంప్‌గా నటించడంలో ఆశ్చర్యం లేదు.

అయితే ఆమె మూస పాత్రలను ఎంచుకోకుండా జాగ్రత్తపడ్డారు. ‘గులేబకావళి’ (1955)లో ఆమె పాత్ర మంచి వినోదాన్ని అందిస్తుంది – మోసగత్తె నుండి నిరాడంబరమైన భార్యగా మారుతుంది. ఈ సినిమాలో పి. లీల పాడిన ‘విల్లెందుం వీరరెళ్లం..’ అనే పాటకి రాజకుమారి అభినయం అత్యుత్తమంగా ఉంటుంది. తన తండ్రి అంధత్వాన్ని తొలగించే రహస్య పుష్పాన్ని ఎలా కనుగొనాలో హీరో ఎంజీఆర్‌కి చూపించే ఆలోచనాత్మక మహిళ పాత్ర ఆమెది.

అయితే బహుశా ‘అంబు’ (1953) సినిమాని ఆమె కెరీర్‍లో ఉత్తమ చిత్రంగా పరిగణించవచ్చు. ఈ సినిమాలో ఆమె శివాజీ, పద్మినిలతో కలిసి నటించారు. తండ్రి మరణానంతరం జన్మించిన సంతానానికి తల్లిగా, అవమానాలని సహిస్తున్న యువ వితంతువుగా, ఆమె తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. కుటుంబాన్ని ఏకం చేసే స్త్రీగా మెప్పించారు.

రాజకుమారి కేవలం నటి మాత్రమే కాదు, ఆమె సినిమాలు నిర్మించారు. టి.నగర్‌లో రాజకుమారి అనే థియేటర్‌ను నిర్వహించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆమె స్వాతంత్ర్యానంతర కాలంలో సెల్ఫ్-మేడ్ ఉమన్, విజయవంతమైన ప్రొఫెషనల్, భారతీయ స్త్రీత్వానికి ఆదర్శం.

వెండితెరపై ప్రసిద్ధి చెందిన రాజకుమారి, ‘కృష్ణ భక్తి’ (1948)లో ఆమె పోషించిన పాత్ర వలె, సినీ రంగం నుంచి విరమించుకున్నాకా, భక్తిమార్గం పట్టారు. 20 సెప్టెంబర్, 1999నాడు ఆమె స్వర్గస్థులయ్యారు.

***

టి.ఆర్. రాజకుమారి అభినయించిన పాటలు యూట్యూబ్‍లో:

https://www.youtube.com/watch?v=Y9LUC18P2E8...

https://www.youtube.com/watch?v=xLASLzQhOqQ

Exit mobile version