[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
భారతదేశపు షిర్లే టెంపుల్:
బాలనటులుగా సినీ ప్రేక్షకులను అలరించిన బాలనటులెందరో ఉన్నారు. అయితే తొలినాటి బాలనటి, స్టార్ హోదా పొంది, హాలీవుడ్ బాలనటి షిర్లే టెంపుల్‌తో సమానంగా పేరుపొంది ‘భారతదేశపు షిర్లే టెంపుల్’ అనిపించుకున్నది మాత్రం బేబీ సరోజే.
చైల్డ్ సూపర్ స్టార్ అయిన బేబీ సరోజ కేవం మూడే మూడు సినిమాలతో – బాలయోగిని, త్యాగభూమి, కామధేను – అనే మూడు సినిమాలతో అగ్రస్థానానికి వెళ్ళిపోయారు. తమిళ డైరక్టర్ కె. సుబ్రమణ్యం గారి సోదరుడు కె. విశ్వనాథన్, అలమేలుల మొదటి కూతురుగా ఆమె (మొత్తం ఏడుగురు పిల్లలో అందరికంటే పెద్ద) 1931లో జన్మించారు. తమ కూతురుకి సహజంగా అబ్బిన గాన నైపుణ్యాన్ని, నాట్య కౌశలాన్ని చూపి తమ కుమార్తెను సినిమాలలో ప్రవేశపెట్టాల్సిందిగా అలమేలు సుబ్రమణ్యంగారిని కోరితే, ఆయన వరుసగా పై మూడు సినిమాలలో నటింపజేశారు. 1937లో బాలయోగిని సినిమా కోసం ముఖంపై అద్భుతమైన చిరునవ్వుతో, పరికిణీ ధరించి ‘కన్నె పాప’ అనే పాటకి అభినయించిన తీరు ఎందరినో ఆకట్టుకుంది. ఆ తరువాతి సంవత్సరాలలో పుట్టిన ఎందరో పాపలకి సరోజ అనే పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు (మా అమ్మకి కూడా ఆమె పేరే కలిసేలా సరోజిని దేవి అని పేరు పెట్టారు. మా అమ్మమ్మ ఇంట్లో బేబీ సరోజ ఫొటో ఫ్రేమ్ కట్టి ఉండేది. ఆ ఫొటోలో ఆమె ఎంత అందంగా ఉండేవారో.) ఆమె రెండో సినిమా త్యాగభూమి. కథా రచన కల్కి కృష్ణమూర్తి. ఈ సినిమా నుంచి ఆమె గొప్ప నటీనటులతో… పాపనాశనం శివన్ వంటి అలనాటి సూపర్ స్టార్‌లతో నటించారు. 1939 నాటి చిత్రాన్ని సమీక్షిస్తూ, ది హిందూ దినపత్రిక, “నటనా చాతుర్యం ఘనత బేబీ సరోజకే దక్కుతుంది (అప్పటికి బేబీ నుంచి అందమైన బాలికగా మారిపోయారామె). నటన అయినా, నాట్యమైనా ఆమెకి సహజంగా అబ్బాయి. ఆమె నటనలో వ్యక్తీకరణలు బావున్నాయి, నాట్యంలో కదలికలు స్వతస్సిద్ధంగా ఉన్నాయి” అని పేర్కొంది. ‘కృష్ణా నీ బేగనే బారో’ అనే బెంగాలీ గీతానికి తమిళ వెర్షన్ పాటని అలమేలు పాడగా, బేబీ సరోజ నర్తిస్తూ అభినయించారు.
(ఆ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో చూడవచ్చు).
ఈ సినిమాలో బేబీ సరోజ ‘చారు’ అనే పాపగా నటించారు. తన కుక్కపిల్ల జిలీ తో కలిసి సందడి చేశారు. క్లాసుల మధ్యలో తోటి పిల్లలకి తన గాన మాధుర్యం, నాట్య కౌశలం రుచి చూపించారు. వాళ్ళంతా చప్పట్లు చరుస్తూ, పాపని అభినందిస్తే, టీచరు వచ్చి మందలిస్తారు. చిన్నారి చారుగా నటించిన బేబీ సరోజకి తొమ్మిదేళ్ళ వయసుకే జపాన్‌లో ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. ఆమె పోస్టు కార్డు సైజు కలర్ ఫొటోలు అక్కడ ప్రింటయ్యేవట. రెండేళ్ళ తర్వాత ఆమెకి ‘కామధేను’ సినిమాలో అవకాశం వచ్చింది. బొంబాయికి చెందిన నందలాల్ జస్వంత్‌లాల్ ఈ సినిమాకు దర్శకులు. ఆయన తరువాత నాగిన్, అనార్కలి వంటి సినిమాలు తీశారు. సరోజ సినిమాలలోనే కాక ఇతర కళలలోనూ రాణించారు. కారైకూడి సాంబశివ అయ్యర్ గారి వద్ద వీణ నేర్చుకున్నారు. బొంబాయికి వెళ్ళిన తర్వాత అక్కడ జపనీస్ పుష్పకళ ఇకెబానా నేర్చుకున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఎస్. రాజం వద్ద పెయింటింగ్‍లో శిక్షణ పొందారు.
***
తన అక్కయ్య సినీ ప్రస్థానం గురించి, ఆమె సినిమాలు ప్రజలకు ఎలా గుర్తుండిపోయాయో సరోజ సోదరి లక్ష్మీ విశ్వనాథన్ ఇలా చెప్పారు:
“మా కుటుంబ పెద్దలు తమిళ సినిమా మార్గదర్శకులు. వారి నోట సినిమాల కబుర్లు వింటూ పెరిగాను. మా కుటుంబం నిర్మాణం, దర్శకత్వం, నటన రంగాలలో ఉంది!
కలకత్తాలో సాంకేతిక నిపుణులు విరివిగా ఉండడంతో మా పెద్దలు షూటింగుల కోసం చాలా దూరం ప్రయాణించేవాళ్ళు. మూడు సినిమాలు ఒరిజినల్ కథలు కావడం వల్లా అందరూ చాలా నిమగ్నమై పనిచేశారు. ఆ సినిమాలను చూసిన వారు, తమిళ సినిమా చరిత్రని గ్రంథస్థం చేసేవారు ఈనాటికి కూడా వాటిని గుర్తుపెట్టుకుంటారు. ఈ మూడు సినిమాలలో మొదటిది – బాలయోగిని,1937లో వచ్చింది. సంఘ సంస్కరణ కథాంశం. ఈ సినిమాకి రచన, దర్శకత్వం మా పెదనాన్నగారు కె. సుబ్రహ్మణ్యం. ఈ సినిమా మా అక్కయ్య సరోజని చైల్డ్ స్టార్ చేసింది. తన బొమ్మని నిద్రపుచ్చుతూ, ‘కన్నె పాప’ అనే పాటకి అక్కయ్య అభినయించింది. ఈ పాటకి మూలం ఒక బెంగాలీ పాట. ఈ పాటతో అక్కయ్య అందరికీ ప్రియమైన బేబీ సరోజ అయిపోయింది. అక్కకి, అమ్మానాన్నలకి సంబంధించి అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అదే సమయంలో హాలీవుడ్‍లో షిర్లే టెంపుల్ పేరు తెచ్చుకుంది. విశాలమైన నవ్వుతో, తనదైన ప్రతిభతో మనదేశపు షిర్లే టెంపుల్ కూడా ప్రేక్షకులని ముగ్ధుల్ని చేసి ప్రఖ్యాతి గాంచింది. ఆ ఏడాది, అటు తర్వాత పుట్టిన పిల్లలందరికీ సరోజ అనే పేర్లు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. సరోజలా కనిపించే బొమ్మలను తయారు చేసి, నవరాత్రి సందర్భంగా ప్రతీ ఇంటా బొమ్మల కొలువులో వుంచేవారు. చెట్టినాడులో పాత వస్తువుల అమ్మకందార్ల వద్ద కొన్ని బొమ్మలు ఇప్పటికీ దొరకవచ్చేమో! బాలయోగిని విజయం సాధించడంతో, సరోజకి మరో అవకాశం వచ్చింది. ఈసారి కథ సమకూర్చింది… ఆనాటి తమిళ సాహిత్యంలో దూసుకువస్తున్న కల్కి కృష్ణమూర్తి. ఆయన నవల త్యాగభూమి తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’లో సీరియల్‍గా వచ్చింది. ఆ సమయంలోని ఆ నవలని సినిమాగా తీశారు. ఈ సినిమా స్టిల్స్‌ని వారం వారం పత్రికలో వేసేవారు. పాఠకులు, సినీప్రియులు అంతా సినిమా ఎప్పుడు విడుదలవుతుందాని ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ కాలనికి ఈ కథ విప్లవాత్మకమైనది. కుల రాజకీయాలు, సామాజిక అసమానతలు, స్త్రీ హక్కులు, జంతు సంక్షేమం, సామ్రాజ్యవాద సాంస్కృతిక విభజన, స్వాతంత్ర్య పోరాటం, ఇంకా గాంధీ తత్త్వం అన్నీ ఉన్నాయా స్క్రిప్టులో. బేబీ సరోజ చిన్నారి సూపర్ స్టార్. సినిమాకి సంగీతం అందించడమే కాకుండా పాపనాశనం శివన్ ఇందులో నటించారు కూడా. అప్పట్లో సినిమాల్లో భరతనాట్యాన్ని ఎవరూ చూడలేదు. ‘కృష్ణా నీ బేగనే బారో’ అనే బెంగాలీ గీతానికి తమిళ వెర్షన్ పాటని శివన్ వ్రాయగా, మా అమ్మ అలమేలు పాడగా, బేబీ సరోజ నర్తించింది. ఈ పాట కోసం అక్క మైలాపూర్ కపాలీశ్వర ఆలయపు చివరి దేశదాసి గౌరీ అమ్మాల్ వద్ద నాట్యం నేర్చుకుంది. నవ్వుతున్న, నాట్యం చేస్తున్న బేబీ సరోజ కలర్ పోస్ట్ కార్డు ఫొటోలను జపాన్‌లో ప్రింట్ చేసి అభిమానులకు పంచారట. బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించనంతవరకు ఈ సినిమా 22 వారాలు ఆడింది. స్వాతంత్ర్య పోరాటానికి గట్టి మద్దతుగా ఉన్నందున ఈ సినిమాని నిషేధించారు. నిషేధపు ఉత్తర్వులు అందడానికి ముందు గెయిటీ థియేటర్‌లో ఈ సినిమాని 24 గంటలూ ప్రదర్శించారట. తర్వాత నిషేధం ఎత్తివేశాక, కథాంశం, సరోజ నటన పట్ల ఆకర్షితులయి ఈ సినిమాని లక్షలాది మంది చూశారు. ఈ సినిమా కోసం డి.కె. అమ్మాల్ పాడిన దేశభక్తి పాటలు గొప్ప హిట్ అయ్యాయి.
పేరు ప్రఖ్యాతులు రావడంతో, తదుపరి సినిమాకి మా అమ్మానాన్నలే హీరోహీరోయిన్‍లయ్యారు. కామధేను (1941) సినిమాకి పనిచేశారు. బొంబాయికి చెందిన నందలాల్ జస్వంత్‌లాల్ ఈ సినిమాకు దర్శకులు. ఆయనే కెమెరామ్యాన్ కూడా (ఆయన గొప్ప సినీమాటోగ్రాఫర్). ఆయన తరువాత నాగిన్, అనార్కలి వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలు తీశారు. ఆ సినిమాలో మా తల్లిదండ్రులకి తెర పేర్లు – వత్సల్, వత్సల. ఈ సినిమాలోనూ బేబీ సరోజ నటించింది. ఆనాటి సామాజిక పరిస్థితులే ఆ సినిమా కథ. తల్లిదండ్రులు, కూతురు కలిసి నటించిన మొదటి సినిమా అది.
సినీ నిర్మాణం, నటన, స్టార్‌లుగా పేరు ప్రఖ్యాతులు… వీటికి సంబంధించిన సాహసాలన్నీ మా తరం వాళ్ళకి అద్భుతకథల్లా ఉంటాయి. ఉదాహరణలు చెప్పాలంటే ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఓ సారి బేబీ సరోజ ప్రయాణిస్తున్న కారు వర్షపు రాత్రిలో బురదలో కూరుకుపోయింది. కొడైకెనాల్ వెడుతున్నాం అప్పుడు. కారులో చైల్డ్ సూపర్ స్టార్ సరోజ ఉందని తెలుసుకుని, తనని చూడవచ్చని – కొడైకెనాల్ వెడుతున్న ఓ బస్ లోని ప్రయాణీకులంతా మాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కాసేపటికే సరోజ నిద్ర లేచింది. తనని కారు బాయ్‍నెట్ మీద కూర్చోబెట్టారు. బస్ హెడ్‌లైన్సు కారు మీదకి ఫోకస్ చేశారు. జనాలు చప్పట్లు కొట్టారు, కారుని బురదలోంచి బయటకి లాగారు. తర్వత హిల్ స్టేషన్‌కి ప్రయాణమయ్యారు. ఆనాటి తమిళ జానపదాలలో సరోజ స్థానం సంపాదించింది. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందుగా సైన్యంలో చేరిన సిపాయిలు, బేబీ సరోజకు వీడ్కోలు పలుకుతూ ఓ పాటని పాడేవారట (బేబీ సరోజా, నాన్ వారుక్కు పోరెన్, నీ కావలై పడదే). ఈనాటి మార్కెటింగ్ హైప్ కన్నా ఎంతో ఎక్కువగా సినిమా అక్కయ్యకి జనాదరణ కల్పించింది. భారతీయ సినీరంగంలో ఎందరో బాల నటులు ఉండి ఉండవచ్చు. కాని ఎవరికీ… బేబీ సరోజకి వచ్చినట్టుగా ‘షెర్లీ టెంపుల్ ఆఫ్ ఇండియా!’ అని పేరు రాలేదు. సరోజకి నేడు కూడా ఒక్క తమిళనాడులోనే కాకుండా – ఆ మూడు సినిమాలు విడుదలైన – సింగపూర్, మలేసియా వంటి దేశాలలోనూ అభిమానులున్నారు. ప్రజలింకా ఆమెని జ్ఞాపకం ఉంచుకున్నారు. అక్కయ్య ఈనాటికి చిన్నపిల్లలానే నవ్వుతుంది…. తానొక చైల్డ్ సూపర్ స్టార్ నని గుర్తు చేసుకుంటుంది…”
***
88 ఏళ్ళ వయసులో, 14 అక్టోబర్ 2019 నాడు బేబీ సరోజ పరమపదించినప్పుడు ఆమె కుమారుడు ఈ విధంగా అన్నారు – “చిన్నారి స్టార్ నుంచి క్రియేటివ్ టూర్ డి ఫ్రాన్స్ వరకు! బేబీ సరోజ – మా అమ్మ. అమ్మ నాకందించిన వాటికన్నిటికి కృతజ్ఞతలు తెలపాలంటే మాటలు రావడం లేదు. కానీ థ్యాంక్ యూ అమ్మా! నాకు జీవితం పట్ల ప్రేమ, ఆసక్తి నువ్వు కలిగించినవే. నీ ఆత్మకు శాంతి కలుగుగాక… మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం!…”
***
ఆమె సంబంధీకులు, అభిమానులు – బేబీ సరోజని అమితంగా ఆరాధించారు, ప్రేరణ పొందారు… ఇప్పుడు తనని బాగా మిస్ అవుతున్నారు… ఆమె ఎన్నటికీ జ్ఞాపకముంటారు…
సోఫియా లోరెన్ జీవితం నుంచి నేర్చుకోదగ్గ పాఠాలు:
1. మూలాలకి కట్టుబడి ఉండాలి:
తానే ఏ పని చేసినా తానొక ఇటాలియన్ ననే గర్వంతో చేస్తారామె. అది ఆమెలో భాగం. ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకుని, దానికి గర్వంగా భావించడం ఒకరి మొత్తం శైలి, స్థిమితత్వంలో భాగం. సెట్టింగ్ ఎలాంటిదైనా సోఫియా లోరెన్ తన పట్ల, తన విలువల పట్ల విశ్వాసంగా ఉన్నారు. ఇది మనకొక పాఠం.
2. నడకలో నిదర్శనం:
ఎక్కడికి వెళుతున్నా, ఎప్పుడూ ఒక లక్ష్యంతో నడిచేవారామె. లోరెన్‍లో ఆత్మవిశ్వాసపు భావన ఉండేది, అది ఆమె నడకలో వ్యక్తమయ్యేది. ఎక్కడికి వెళ్ళినా, మనమేం ధరించినా – హుందాగా నడవడం, నడకలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం మనం ఆమె నుంచి నేర్చుకోవచ్చు. వైఖరిలోనే అంతా ఉంటాయి!
3. తక్కువే ఎక్కువ:
ఈ ఫొటోలో సోఫియా లోరెన్, జేన్ మేన్‌స్‌ఫీల్డ్ ఉన్నారు. ఇది 1957 నాటి ఫొటో. లోరెన్ వదనంలోని తిరస్కారపు భావన ఎన్నో చెబుతోంది. మేన్స్‌ఫీల్డ్ దుస్తులు కాస్త ఎక్కువగా బహిరంగపరచేలా ఉండగా, లోరెన్ దుస్తులు వినయంగా కనిపించేలా ఉన్నాయి, సొగసుగా ఉన్నాయి, ఆధునికంగా ఉన్నాయి. నేర్చుకోవాల్సిన పాఠం – కొంత గుప్తంగా ఉండాలి!
4. కొత్తదనాన్ని ప్రయత్నించేందుకు భయపడకూడదు:
సోఫియా లోరెన్‌కి ఆమెకే సొంతమైన పిల్లికళ్ళూ, తీర్చిదిద్దిన కనుబొమలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆమె కాలంతో పాటు తన రూపాన్ని మార్చుకున్నారు. కేశ అలంకరణ నుండి దుస్తుల వరకు కాలానికి అనుగుణంగా మార్చేవారు. కాలం గడిచే కొద్దీ ఎన్నో ట్రెండ్‍లు వస్తుంటాయి, పోతుంటాయి. కొత్త దుస్తులతో వార్డ్‌రోబ్‍ని ఆధునికీకరించడం, కొత్త మేకప్‍ని ప్రయత్నించడం సరదాగా ఉంటుంది. అయితే అన్ని ట్రెండ్లూ అందరికీ నప్పవు. అయితే ఓ స్టైల్ వాడుకలో ఉన్నప్పుడు దానిని ప్రయత్నించడానికి భయపడకూడదు.