[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హిందీ చిత్రసీమలో అత్యంత సౌందర్యవతిగా ఫిలింఫేర్ ఎంపిక చేసిన నటి నళినీ జయవంత్
1940-50ల దశకంలో హిందీ సినిమాలో అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నళినీ జయవంత్ 18 ఫిబ్రవరి 1926 నాడు బొంబాయిలో జన్మించారు.
నళినీ మేనత్త ప్రముఖ మరాఠీ గాయని రత్తన్ బాయి (నటి రత్తన్ బాయి కాదు). నళినీకి ఐదేళ్ళ వయసున్నప్పుడు, డిసెంబరు 1931లో రత్తన్ బాయి భర్త – ప్రభాకర్ శిలోత్రి మరణించారు. దాంతో ఆమె, తన 15 ఏళ్ల కుమార్తె సరోజిని వెంటబెట్టుకుని సోదరుని ఇంటికి చేరారు. వారు ముంబైలో ఉండగా, నళిని తండ్రి దాదాసాహెబ్ జయవంత్ గారికి, రత్తన్ బాయికి సమీప బంధువైన కుమార్‌సేన్ సమర్థ్ జర్మనీలో సినిమాటోగ్రఫీని అభ్యసించి భారత్ తిరిగి వచ్చారు. ఆయన ప్రభావంతో సరోజిని సినిమాల్లో నటించాలనుకున్నారు. అందుకు నళినీ తండ్రి నిరాకరించడంతో రత్తన్ బాయి, సరోజిని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.
సరోజిని ‘శోభన’ అనే పేరుతో సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. తరువాతి కాలంలో కుమార్‌సేన్ సమర్థ్‌ని వివాహం చేసుకుని ‘శోభనా సమర్థ్’ పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఈ దంపతుల కుమార్తెలు నూతన్, తనూజలు కూడా నటీమణులే.
***
నళీనీ జయవంత్ కూడా సినిమాల్లో ప్రవేశించేందుకు ఆసక్తి చూపారు. నళినీ జయవంత్ 1940లలో దర్శకుడు వీరేంద్ర దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. తరువాత, ఆయనతో విడిపోయి, నటుడు ప్రభు దయాళ్‌ని పెళ్ళి చేసుకున్నారు. ప్రభు దయాళ్‌తో కొన్ని చిత్రాలలో నటించారు.
***
నళీనీ జయవంత్ నేషనల్ స్టూడియోస్ వారి ‘రాధిక’ అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ పాత్రలో ఆమె సున్నితమైన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి వీరేంద్ర దేశాయ్ దర్శకత్వం వహించారు. ఆమె రెండవ చిత్రం ‘నిర్దోష్’ కి కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నళినీ నేపథ్య గాయకుడు ముఖేష్ సరసన నటించారు.
అయితే మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బహెన్’ (1941) చిత్రంతో ఆమెకు కొంత ప్రాధాన్యత లభించింది. చెల్లెల్ని ప్రేమించిన అన్న కథతో రూపొందిన ఈ సినిమాలో వజాహత్ మీర్జా రచించిన ‘నహీ ఖాతే హై భయ్యా మేరే పాన్’ అనే యుగళగీతాన్ని ఆమె షేక్ ముఖ్తార్‌తో కలిసి ఆలపించారు.
యుద్ధకాలం విజృంభిస్తున్నప్పుడు నళినీ ఒకే ఒక్క చిత్రం ‘ఫిర్ భీ అప్నా హై’ (1946)లో మాత్రమే నటించారు. తరువాత ఆమె తన సొంత నిర్మాణంలో ‘గుంజన్’ (1948)లో నటించారు. ‘అనోఖా ప్యార్’ (1948) చిత్రంలో ఆమె దిలీప్ కుమార్, నర్గీస్‌తో కలిసి నటించారు. ఇందులో ఆమె ప్రేమను త్యాగం చేసే పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన సున్నితమైన నటనతో నర్గీస్‌ను అధిగమించారు.
ఆమె నటించిన మరో ముఖ్యమైన చిత్రం అశోక్ కుమార్ హీరోగా వచ్చిన ‘సమాధి’ (1950). జ్ఞాన్ ముఖర్జీ తీసిన ‘సంగ్రామ్’ (1950), ఇంకా – ‘సమాధి’ (1950) చిత్రాలు – అశోక్ కుమార్, నళినీ జంటను ప్రముఖ వెండితెర జోడీగా నిలిపాయి. తరువాత వారిద్దరూ ‘కఫీలా’, ‘నౌ బహార్’, ‘నాజ్’ వంటి అనేక చిత్రాలలో కలిసి నటించారు. ఆమె ఎ.ఆర్. కర్దార్ మ్యూజికల్ హిట్ ‘జాదూ’లో కార్మెన్ పాత్రను, ‘నౌజవాన్’లో ప్రేమ్‌నాథ్ సరసన ఆధునిక అమ్మాయి పాత్రను, వసంత్ జోగ్లేకర్ గారి ‘నంద్ కిషోర్’లో రాధ పాత్రను, దేవేంద్ర గోయల్ గారి ‘ఆంఖేన్’లో ఓ భావోద్వేగ పాత్రను పోషించారు. ఆమె అత్యుత్తమ నటన ‘నౌ బహార్’ (1952), ‘శికస్త్’ (1953) అనే సినిమాలలో చూడవచ్చు. ‘శికస్త్’ (1953) చిత్రంలో ఆమె దిలీప్ కుమార్ సరసన నటించారు. దిలీప్ ఆమెను తాను పనిచేసిన గొప్ప నటీమణులలో ఒకరిగా పరిగణించారు, ఒక సన్నివేశం సారాంశాన్ని గ్రహించడంలో ఆమె ఎవరికీ తక్కువ కాదని తెలిపారు.
సుబోధ్ ముఖర్జీ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ‘మునిమ్‌జీ’ కూడా అంతే విజయవంతమైన హిట్ చిత్రం. ఫిల్మిస్థాన్ కోసం ఐ.ఎస్. జోహార్ దర్శకత్వం వహించిన ‘హమ్ సబ్ చోర్ హైన్’ చిత్రంలో ఆమె షమ్మీ కపూర్ సరసన నటించారు. తర్వాత ‘రాజకన్య’, ‘రైల్వే ప్లాట్‌ఫాం’ సినిమాలు వచ్చాయి., ‘రైల్వే ప్లాట్‌ఫాం’ సినిమాలో సునీల్ దత్ అరంగేట్రం చేశారు. ‘ఆవాజ్’ చిత్రంలో రాజేంద్ర కుమార్ సరసన నటించారు. రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన నవకేతన్ వారి ‘కాలా పానీ’లో, ఆమె ఒక వేశ్య పాత్రను పోషించి, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు (1958) గెలుచుకున్నారు.
ఆర్.ఎస్. చౌదరి, మెహబూబ్ ఖాన్, మహేష్ కౌల్ (ఉదా: నౌజవాన్) సినిమాలలో ‘వాస్తవిక’ మెలోడ్రామాకు ప్రతిరూపంగా జీవితాన్ని స్వీకరించే వ్యక్తిగా నటించారు నళినీ. తరువాత ఆమె స్వతంత్ర, అపరాధభావం లేని నటనా శైలిని (ఉదా. నవకేతన్ వారి థ్రిల్లర్ ‘కాలాపానీ’) అలవర్చుకున్నారు. వాస్తవికతతో ఆమె అనుబంధాన్ని రమేష్ సైగల్, బిమల్ రాయ్, ముఖ్యంగా జియా సర్హాది గారి ‘ఆవాజ్’ విస్తృతం చేశాయి. కర్దార్ గారి ‘జాదూ’, మహేష్ కౌల్ గారి ‘నౌజవాన్’, (ముఖ్యంగా ‘థండి హవాయిన్’ పాట), సుబోధ్ ముఖర్జీలతో చిత్రాలు ఆమెలో ప్రత్యామ్నాయ సంగీత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేశాయి. దేవ్ ఆనంద్ (ఉదా: ‘మునిమ్‌జీ’) తో 50ల నాటి ఫిల్మిస్థాన్ మ్యూజికల్స్ ఇందుకు దృష్టాంతాలు.
ప్రభు దయాళ్ దర్శకత్వం వహించిన ‘అమర్ రహేఁ యే ప్యార్’ (1961) ఆమె చివరి చిత్రాలలో ఒకటి. బొంబాయిలో ఈ సినిమా విడుదల కాలేదు. తరువాత నళిని ప్రభు దయాళ్‌ను వివాహం చేసుకున్నారు, అసంపూర్తిగా ఉన్న తన పనులను పూర్తి చేసి సినిమాల నుండి విరమించుకున్నారు.
ఆమె 80వ దశకంలో మళ్ళీ నటించాలనుకున్నారు. ‘బందిష్’ (1980), ‘నాస్తిక్’ (1983) సినిమాల తరువాత ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ‘నాస్తిక్’లో అమితాబ్ బచ్చన్‌కి అంధురాలైన తల్లిగా నటించినా, ఆమెకి మరిన్ని అవకాశాలు లభించలేదు.
చివరికి, ఆమె ఎన్నో సంవత్సరాల కష్టపడి సాధించిన సినిమా స్టార్‌డమ్ పోయింది, ఎవరూ పట్టించుకోలేదు. ముంబైలోని చెంబూర్ శివారులోని ఒక చిన్న బంగ్లాలో ఒంటరిగా ఉండే నళిని జయవంత్ 22 డిసెంబర్ 2010 నాడు గుండెపోటుతో మరణించారు. అప్పటికే జనాలు ఆమెను మరచిపోయారు. అక్కడ ఆమె రెండు దశాబ్దాలకు పైగా ఏకాంతంగా జీవించారు. ఆమె పెంపుడు కుక్కలు విపరీతంగా అరవడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు మునిసిపల్ అంబులెన్స్‌ని పిలిచారు. దానిలో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎవరో దూరపు బంధువు అని చెప్పుకునే వ్యక్తి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడు ఆమె వయసు 84 సంవత్సరాలు.
***
ఆమె మృతి తరువాత దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి ఎందరో తోటి నటీనటులు ఆమెని ప్రశంసించారు. తమ తరంలోని అద్భుత నటి అనీ, కళ్ళతోనే అనేక భావాలు ప్రకటించగలరనీ, వ్యక్తిగా సహృదయురాలని, అందరితో సరదాగా ఉంటారనీ చెప్పారు. కానీ ఆమె విశాలమైన కనుల వెనుక, అందమైన పెదాల వెనుక, గాజు వదనం వెనుక ఉన్న నళినీ బాధలెవరూ ప్రస్తావించలేదు. ఆమె విచారగ్రస్థురాలనీ, ఒంటరి మహిళ అని, సినిమాల్లో ప్రవేశించినందుకు – తల్లిదండ్రుల నుంచి, సోదరుల నుంచి తీవ్ర దుర్భాషలనెదుర్కున్నారనీ ఎవరూ వెల్లడించలేదు. నిజానికి నళినీని ఆమె తండ్రి విపరీతంగా కొట్టేవారట. మహారాష్ట్రలోని ఉన్నత వర్గమైన ‘చంద్రసేనియ కాయస్త ప్రభు’ (సికెపి కమ్యూనిటీ) కుటుంబానికి చెందిన అమ్మాయి – హీనమైన సినీరంగంలో ప్రవేశించి పతనమవుతామంటే చూస్తూ ఊరుకుంటామా అని ఆమె కుటుంబం వారు వాదించేవారట. అప్పట్లో సినీరంగంలో కొన్ని మరకలు ఉండేవి. నళినీని కూడా ఆ అగాధం లోకి లాగాలని చూశారు. అయితే, ఆమెకి 1941లో ‘రాధిక’ అనే సినిమాతో తొలి అవకాశం లభించింది. ఆ తరువాత వరుసగా ‘అనోఖా ప్యార్,’ ‘సమాధి’ వంటి క్లాసిక్ సినిమాలు; ‘సంగ్రామ్’, ‘మిస్టర్. X’, ‘కఫీలా’, ‘మెహబూబా’, ‘ముక్కాదర్’, ‘మునిమ్‌జీ’ వంటి సినిమాలు వచ్చాయి. 1958లో వచ్చిన ‘కాలాపానీ’ చిత్రం ద్వారా ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
నటుడు, దర్శకుడు ప్రభు దయాల్‌తో ఆమె రెండవ వివాహం తర్వాత ఆమె కెరీర్ చాలా బాగా దెబ్బతింది. నళినీకి వయసు మీద పడడంతోనూ, బాలీవుడ్ యువ అందగత్తెల వైపు చూడడంతోనూ కథానాయికగా అవకాశాలు తగ్గాయి, ఆయనకు అవకాశాలు లేకపోవడంతో మద్యాన్ని ఆశ్రయించారు. ఆమెది చివరిగా విడుదలైన చిత్రం 1983లో వచ్చిన ‘నాస్తిక్’కి రీమేక్. అది తన ‘కమ్ బ్యాక్’ అని ఆమె చెప్పారు. కానీ ఆమె శరీరం, నైతికత ఆమెకి సహకరించలేదు. ఆమె కాలం ముగిసిపోయింది. క్షమించరాని వర్తమానంలో జీవించిన అద్భుతమైన గతం యొక్క అవశేషం నళినీ. ఆమె దానిని అర్థం చేసుకోలేక, వాస్తవాన్ని ఎప్పటికీ అంగీకరించలేకపోయారు. జీవితపు శరదృతువులో ఆమె మాటలు వినడం మనసులని కదిలిస్తుంది.
***
నళినీ జయవంత్ గురించి ఆమె సమీప బంధువు – ప్రణయ్ గుప్తే ఇలా చెప్పారు:
“నా జీవితంలో నళినీ జయవంత్ ముఖ్య పాత్ర పోషించారు. అప్పటికి అంతగా ప్రసిద్ధి కాని బొంబాయిలో నేను పెరిగాను. పిల్లాడిలా ఉన్నప్పుడే ఆమె సినిమాలన్నీ చూశాను. మా అమ్మానాన్నలతో కలిసి భోజనానికి వాళ్ళింటికి ఎన్నోసార్లు వెళ్లాను.
మా అమ్మ ప్రొఫెసర్ చారుశీల గుప్తే – నళినీ గారికి పిన్ని. నళినీ వాళ్ళమ్మ గారి చిన్న చెల్లెలు మా అమ్మ. ఆ రకంగా నేనూ, నళినీ కజిన్స్. నళినీ నాకు ‘లోలా’ అనే స్కాటిష్ టెర్రియర్ (కుక్కపిల్ల)ని కానుకగా ఇచ్చారు. నా తొలి ప్రేమ దానితోనే. లోలా వృద్ధాప్యంతో 1966లో మరణించింది. దానికి ఒక సంవత్సరం ముందు 1965లో నేను పై చదువుల కోసం అమెరికా వెళ్ళాను. ఆ తరువాత నళినీని కలవడం తగ్గింది. 1978లో నా పెళ్ళి అయ్యాకా, మళ్ళీ కొన్నిసార్లు కలిసాం.
ఆమె తన తరానికి చెందిన ఏకైక మహిళా నటి కాదు; నర్గీస్, మధుబాల, సురయ్య, గీతా బాలి, మీనా కుమారి వంటి నటీమణులు ఉన్నారు. నళినీ నటనా నైపుణ్యం వల్ల ఆమె నటించిన చిత్రాలు అసాధారణమైన కళాత్మక ఉన్నత స్థానాలకి, వాణిజ్యపరమైన విజయాలకి చేరుకున్నాయి. కానీ ఈ నటీమణుల జీవితానికి ఒక నమూనా ఉన్నట్లు అనిపించింది, చాలా వరకు: వారి విజయం ఒంటరితనానికి దారితీసింది. పురుషులు వారి జీవితాలతో ఆడుకున్నారు; ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో వీరు భగ్నహృదయులుగా మిగిలారు.
అప్పుడప్పుడు వివాహమూ జరిగేది – నళినీ జయవంత్ విషయంలో వలె – కానీ ఈ కలయికలు చాలా వరకు బూటకాల లానే ఉన్నాయి.
జీవితంలో నళినీని ఏది బాధించిందో నాకు తెలుసు – అదే ప్రేమ రాహిత్యం, సంతానం లేకపోవడం! అన్ని విషయాలు మా అమ్మకి చెప్పుకునేవారు. నేను టీన్స్ లోకి ప్రవేశించినప్పుడు – కుటుంబ బంధాలను నిలుపుకోవడం, బలోపేతం చేయడం ఎంత ముఖ్యమో నళినీ నాకు చెప్పారు. తన తండ్రి, సోదరులతో ఏర్పడిన ఉన్న దూరం గురించి చెప్పేవారు. దర్శకుడు వీరేంద్ర దేశాయ్‌తో తనకున్న వివాహ బంధం తెగిపోయిందని, ఆ తర్వాత ప్రభు దయాళ్‌తో తనకున్న అసంతృప్తిని గురించి ఆమె నాతో చెప్పారు.
తన కజిన్ శోభనా సమర్థ్ అంటే నళినీకి కాస్త అసూయ ఉండేదేమో! నళినీ తండ్రి, దాదాసాహెబ్ జయవంత్ కూడా తన మేనకోడలు ‘శోభన’ సినిమాల్లోకి వెళ్ళాలనే కోరికను వ్యతిరేకించారు, ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తే ఎవ్వరూ పెళ్లి చేసుకోరని. ఈ క్రమంలో శోభన తమ ‘చంద్రసేనియ కాయస్త ప్రభు’ వర్గానికే (సికెపి కమ్యూనిటీ) చెందిన కుమార్‌సేన్ సమర్థ్‌ను వివాహం చేసుకున్నారు. భారతదేశంలోని ఫిల్మ్స్ డివిజన్ వ్యవస్థాపక బృందంలో ఆయన కూడా ఒకరు. వీరికి నలుగురు పిల్లలు. అయినా, శోభన భర్త నుంచి విడిపోయాక నటుడు మోతీలాల్ తో కలిసి ఉన్నారు, అయితే బహిరంగంగా మాత్రం ఆయన ‘మంచి స్నేహితుడు’ అని మాత్రమే చెప్పేవారు.
కానీ నళినీ జయవంత్‌కి అంత ఆప్త మిత్రులు లేరు. అందుకే ఆమెకు కుక్కలతో అంతగా అనుబంధం ఏర్పడింది. ఆమె పోమెరేనియన్లు, టెర్రియర్ లను పెంచారు. ఆమె వాటి గురించి ఎంతగానో పట్టించుకన్నారు, తాను తినడానికన్నా ముందే తన పెంపుడు కుక్కలకి పెట్టేవారు. తన కుక్కలకు దూరమవుతానే భయంతో చాలా అరుదుగా ప్రయాణించేవారు. మంచి బ్రీడ్ కుక్కలను పెంచుకోవడం చాలా ముఖ్యం అని ఆమె ఎప్పుడూ అనేవారు. ‘చంద్రసేనియ కాయస్త ప్రభు’ వర్గానికే (సికెపి కమ్యూనిటీ) చెందిన మహిళగా, సాంప్రదాయకంగా మేధావులు, నాటక రచయితలు, రచయితలు, పండితులను అందించిన వర్గం నుండి వచ్చిన ఆమె – వాస్తవాన్ని సూక్ష్మంగా నొక్కిచెప్పి ఉండవచ్చు.
పలు విజయాలు సాధించినప్పటికీ, అవి ఎప్పటికీ నిలిచి ఉండవని నళినీ గ్రహించారు. సినిమా స్టార్‌డమ్ ఆమె ఊహించినంత ఎక్కువగా ఉంది. ఇది నా ఊహాగానం కావచ్చు, కానీ ఎక్కడో లోతుగా అనిపిస్తుంది – ‘నళినీ ఆ స్టార్‌డమ్‌ని పట్టించుకోకుండా, తమ వర్గాన్ని నిరాశపరిచింది’ అని. నళినీ మరణం గురించి ఆలోచించినట్లయితే, శిథిలావస్థలో ఉన్న తన సబర్బన్ కమ్యూనిటీ యొక్క ఇరుకైన సందులలో దొరికిన సంకరజాతి కుక్కల సహవాసంలో తన జీవితాన్ని ముగించాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదని కూడా నేను భావిస్తున్నాను.”
***
ఈక్రింది లింక్‍లలో ఆమె అభినయించిన కొన్ని పాటలు చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=1jbSep2GbhE...