[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
బహుముఖ ప్రజ్ఞాశాలి కిషోర్ కుమార్ స్మరణలో..
విజయవంతమైన కెరీర్‍లో గాయకుడిగా, నటుడిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించినా, వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన వ్యథని అనుభవించారు. అయితే, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా హుందాగా జీవించారు.
ఈ దిగ్గజ నట-గాయకుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఒకసారి చూద్దాం:
- చిన్నతనంలో, కిషోర్ కుమార్ స్వరం చాలా కీచుగా ఉండేది. ఆయన ఎప్పుడైనా పాడటానికి ప్రయత్నిస్తే కుటుంబ సభ్యులు బాగా నవ్వుకునేవారు లేదా చెవులు మూసుకునేవారు. అప్పట్లో ఆయనకి అతి పెద్ద సమస్య ఏమిటంటే, తన స్వరాన్ని శ్రుతి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆ స్వరం ముతక, చీదర శబ్దంగా మారిపోయేది. వెదురు రెండుగా చీలిపోయినట్లుగా ఆ స్వరం వినిపిస్తోందని కిషోర్ కుటుంబ సభ్యులు తరచుగా హాస్యమాడేవారు! తరువాత, ఆయన స్వరం మాధుర్యం సంతరించుకుని నేటికీ మనలని ఆస్వాదింపజేస్తోంది.
- కిషోర్ కుమార్ 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి గణితం పరీక్షలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తెలియలేదు. కానీ, ఆయన తన టీచర్ కోసం జోకులు, చిన్న పద్యాలు, డూడుల్స్, ఇంకా స్మైలీ ఫేస్‌లతో తన జవాబు పత్రాన్ని నింపారు!
- ‘పాంచ్ రూపయ్య బారా అణా’ అనే ప్రసిద్ధ పాట ఆయన జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 4, 1929న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో అభాస్ కుమార్ గంగూలీగా జన్మించిన కిషోర్ మెట్రిక్యులేషన్ తర్వాత పై చదువుల కోసం ఇండోర్ లోని క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అల్లరిగా, సరదగా ఉండే చిలిపి కిషోర్‍ని ఆ కళాశాల ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ కాలేజ్ క్యాంటిన్‍కి కిషోర్ దా ఇప్పటికీ ఐదు రూపాయల 12 పైసలు బాకీ ఉన్నారని కొందరికే తెలుసు (1958లో వచ్చిన హిందీ సినిమా ‘చల్తీ కా నామ్ గాడీ’లోని ప్రసిద్ధ గీతం ‘పాంచ్ రూపయ్య బారా అణా’ ద్వారా ఈ వాస్తవాన్ని చిరస్థాయిగా నిలిపారు).
- కాలేజీ రోజుల్లో, కిషోర్ తరచుగా తరగతి గదిలో తన బెంచీని తబలాగా ఉపయోగించేవారు. ఇది వారి సివిక్స్ లెక్చరర్‍కి అసంతృప్తి కలిగించింది, ఆయన కోపంగా ఇలాంటి చేష్టలతో సమయాన్ని వృథా చేసుకోవద్దని కిషోర్‌కు చెప్పారు. కిషోర్ చిరునవ్వుతో సమాధానమిస్తూ, సంగీతంతోనే జీవనోపాధి కల్పించుకోదలచానని గురువుగారికి చెప్పారు.
- కాలేజీలో, యువ కిషోర్ కుమార్ తన పొడవాటి నల్లటి ఓవర్ కోట్‌ని ఎప్పుడూ విడవకుండా ధరించేవారు. ఆయన తన ట్రేడ్‌మార్క్ దుస్తులకు ప్రసిద్ధి చెందారు: నలుపు ఓవర్‌కోట్, తెల్ల పైజామా, మఫ్లర్, ఇంకా లెదర్ శాండల్స్. ఆయన ఎప్పటికీ కోటు తీసేవారు కాదు, ఎందుకంటే తన బక్కపలచని శరీరం పట్ల ఆయనలో చాలా అభద్రతా భావం ఉండేది.
- కిషోర్ కుమార్‍కి వేదికలంటే భయం ఉండేది. ఏదైనా సంగీత కచేరీలో పాడమని పిలిచినప్పుడు పారిపోయేవారని చాలా మందికి తెలియదు. ఒకసారి ప్లేబ్యాక్ సింగర్ అసోసియేషన్ వారి ఫండ్ రైజింగ్ స్టేజ్ షో సందర్భంగా, ప్రతి గాయకుడు తప్పనిసరిగా హాజరుకావాలని నిర్ణయించారు. కిషోర్ కుమార్‌కి ఉన్న స్టేజ్ ఫోబియా గురించి తెలుసుకున్న అసోసియేషన్ ఆయనని ఎలాగైనా షోకి తీసుకురావాల్సిన బాధ్యత తలత్ మెహమూద్‌కి అప్పగించింది. అయితే, కిషోర్ కుమార్‍ని తీసుకెళ్ళేందుకు తలత్ మెహమూద్ ఆయన ఇంటికి వెళ్ళేసరికి, కిషోర్ తలుపు తాళం వేసి పారిపోయారట! కిషోర్ ఈ ఫోబియా నుండి బయటపడటానికి నటుడు సునీల్ దత్ 1970లో ఒక ఈవెంట్‌కు ముందు సహాయం చేశారు.
- ఏ తరంలోనైనా, దేశంలోని అత్యంత అసాధారణ నటులలో కిషోర్ కుమార్ ఒకరు. ఆయన తన విపరీత మనస్తత్వానికి ప్రసిద్ధి చెందారు. ఒకసారి తన వార్డెన్ రోడ్ ఫ్లాట్ తలుపు మీద ‘బివేర్ ఆఫ్ కిషోర్’ అని సైన్ బోర్డు పెట్టారు. మరొక సందర్భంలో, తన మొత్తం పారితోషికాన్ని నిర్మాత చెల్లించే వరకు తన మీసాలు, కేశాలను షేవ్ చేస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని తన ఇంటి గుమ్మం వద్ద ఒకప్పుడు ఫ్యామిలీ నేమ్ ప్లేట్‌కు బదులుగా ‘మెంటల్ హాస్పిటల్’ అని బోర్డు పెట్టారు!
- దర్శకులు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే! ..ఒకసారి, సినిమా సెట్స్‌లో తన సూచనలను పాటించనందుకు ఒక దర్శకుడు కిషోర్ కుమార్‌ను కోర్టుకు లాగారు, దాంతో కిషోర్ ఆయనతో చాలా సీరియస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. తను కారు నడుపుతున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, దర్శకుడు ‘కట్’ చెప్పడం మర్చిపోయారు కాబట్టి కిషోర్ దా పన్వేల్ చేరుకునే వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నారు!
- కిషోర్ కుమార్ తన పారితోషికం విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు, అయితే ఆయన 1964లో ‘చారులత’ అనే బెంగాలీ చిత్రంలో పాడినందుకు సుప్రసిద్ధ దర్శకులు సత్యజిత్ రాయ్ నుండి పారితోషికం తీసుకోవడానికి నిరాకరించారని చాలా తక్కువ మందికి తెలుసు. కిషోర్ దా కు రాయ్ పట్ల అపారమైన గౌరవం ఉండేది, పైగా చిత్రనిర్మాత ఈ చిత్రానికి చాలా పరిమిత బడ్జెట్‌ని కలిగి ఉన్నారని తెలుసు. ‘చారులత’లో ఒక పాటను రికార్డ్ చేసిన తర్వాత, కిషోర్ దా ను – పిలిచి, పాట కోసం ఎంత తీసుకుంటారని సత్యజిత్ రాయ్ అడిగినప్పుడు, ఆయన కేవలం వారి పాదాలను తాకి, పారితోషికం తీసుకోడానికి నిరాకరించారు. అలాగే, ‘పథేర్ పాంచాలి’ చిత్ర నిర్మాణ సమయంలో రాయ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, ఆ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని కూడా ఆలోచిస్తున్నప్పుడు, రూ. 5000 సహాయం చేసి కిషోర్ కుమార్ ఆ సినిమాని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చారు.
- కిషోర్ కుమార్ ముగ్గురిని అమితంగా గౌరవించేవారు. వారే గాయకులు కె.ఎల్.సైగల్, కవి, సంగీతకారులు రవీంద్రనాథ్ ఠాగూరు, ఇంకా హాలీవుడ్ నటుడు-గాయకుడు డానీ కాయే. తమ నివాసం ‘గౌరీకుంజ్’ లో ఈ ముగ్గురి చిత్రపటాలను ఉంచి ప్రతీరోజూ నియమంగా వారిపై గౌరవం వ్యక్తం చేస్తూ నమస్కరించేవారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తన తోటలోని చెట్లను తన సన్నిహిత మిత్రులుగా భావించి, వాటికి పేర్లు కూడా పెట్టారు కిషోర్ కుమార్.
- కిషోర్ ‘పాత్ర’ గాయకుడు! 1970లలో అమితాబ్ బచ్చన్, కిషోర్ దా మధ్య నటుడు-గాయకుల గొప్ప భాగస్వామ్యం ఏర్పడింది. ‘ఖైకే పాన్ బనారస్ వాలా’ అనే అమర గీతం కోసం, కిషోర్ దా తన గానంలో కావలసిన అనుభూతిని పొందడానికి బెనారసీ పాన్‌ని నమిలి నేలపై ఉమ్మారట. రాజేష్ ఖన్నా కోసం కిషోర్ కుమార్ చాలా పాటలు పాడారు. రాజేష్ ఖన్నా ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని పట్టుకోవడంలో నైపుణ్యం సాధించారు కిషోర్. తరువాత ఒకసారి “ఒకే గొంతు కలిగిన ఇద్దరు వ్యక్తులం మేము” అని వ్యాఖ్యానించారు.
- కిషోర్ దా ప్రత్యేకమైన యోడెలింగ్ శైలి – జిమ్మీ రోడ్జర్స్, ఇంకా టెక్స్ మోర్టన్‌లచే ప్రేరణ పొందింది. యోడెలింగ్ శైలి గానం అంటే సాధారణ మరియు అసాధారణ రీతుల మధ్య వేగంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే పద్ధతిలో పాడటం! అందాజ్ చిత్రంలోని ‘జిందగీ ఏక్ సఫర్’, హాథీ మేరే సాథీ చిత్రంలోని ‘చలా జాతా హూఁ కిసీ కి ధున్ మే’ ఇంకా మరెన్నో పాటలను కోసం యోడెలింగ్ శైలిలో పాడారు. సంగీతంలో ఎలాంటి శిక్షణ లేనప్పటికీ, కిషోర్ కుమార్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికి 19 సార్లు నామినేట్ అయ్యారు, 8 సార్లు గెలుచుకున్నారు!
- తన జీవితకాలంలో, కిషోర్ కుమార్ నలుగురిని వివాహం చేసుకున్నారు – రుమా గుహా ఠాకుర్తా, మధుబాల, యోగితా బాలి, లీనా చంద్రవర్కర్. వారందరూ బాంద్రాలో నివసించినందున ఆయన వారిని ‘బాందారియాలు’ అని పిలిచేవారు!
- రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆనంద్’ చిత్రానికి మొదట కిషోర్ కుమార్, మెహమూద్‌లను అనుకున్నారు. చిత్రనిర్మాత హృషికేశ్ ముఖర్జీ కిషోర్ కుమార్ ఇంటికి వెళ్ళగా, వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. హృశీకేశ్ గారిని – కిషోర్ ఇంటికి రానివ్వద్దని చెప్పిన మరో బెంగాలీ నిర్మాతగా వాచ్‌మెన్ పొరబడ్డాడు. తరువాత ఆ సినిమా రాజేష్ ఖన్నా వద్దకు వెళ్లిందని అంటారు.
- హృషికేశ్ ముఖర్జీ తీసిన ‘అభిమాన్’ అనే సినిమా కథాంశం – కిషోర్ కుమార్, ఆయన మొదటి భార్య రుమా జీవితం ఆధారంగా రూపొందింది.
- తను నమ్మిన విషయాలు తన కెరీర్‌ను ప్రభావితం చేసినప్పటికీ, తన నమ్మకాల కోసం నిలబడే వ్యక్తి కిషోర్. 1975-1977 ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ యొక్క 20-సూత్రాల కార్యక్రమాన్ని ఆమోదించడానికి ఆయన నిరాకరించడంతో వివిధ్ భారతి, ఆల్ ఇండియా రేడియో లలో కిషోర్ పాటలపై నిషేధం విధించారు.
- మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోని తమ ఇల్లంటే ఆయనని మమకారం ఎక్కువ, యాదృచ్ఛికంగా అది బాంబే బజార్ అనే వీధిలో ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఈ ఇంటిని సందర్శించేవారాయన. తన మృతదేహాన్ని ఖాండ్వాకు తీసుకెళ్లి, తని పాత బంగ్లా వెలుపల దహనం చేయాలనేది కిషోర్ చివరి కోరిక, అది నెరవేరింది.
పిచ్చిని ఫ్యాషన్‌గా మార్చిన సంగీత మేధావి, కిషోర్ కుమార్ సాటిలేని వారసత్వాన్ని మిగిల్చారు. వారి జీవిత చరిత్రను ఈ వీడియోలో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=H-hkJa-KU8U