[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
భారతీయ సినీ దిగ్గజాలు:
భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలందించిన ఇద్దరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
***
దర్శకనిర్మాత బిమల్ రాయ్:
బిమల్ రాయ్ సినిమాల గురించి, ఆయన సినిమాల్లోని స్త్రీల గురించి, ఆయనపై ఉన్న ఇటాలియన్ నియో-రియలిస్ట్ ప్రభావం గురించి, మానవత్వం గురించి, వారి సినిమాలలో అంతర్లీనంగా ఉండే పురోగమన దృక్పథం గురించి, సమాంతర సినిమాపై ఆయన చూపిన ప్రభావం గురించి చాలా మంది రాశారు, చాలామందికి తెలుసు. అయితే బిమల్ రాయ్ గురించి అంతగా తెలియని ఆరు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బిమల్ రాయ్ తన తొలి చలన చిత్రం ‘ఉదయేర్ పతే’ పేరుతో బెంగాలీలో 1944లో తీశారు. ఈ సినిమా పేరుని రవీంద్రనాథ్ ఠాగూర్ కవితా శీర్షిక నుండి స్వీకరించారు. తరువాత ఈ సినిమా హిందీలో ‘హమ్‍రాహీ’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన మూడు పాటలు ఉన్నాయి, వీటిలో ముఖ్యమైనది ‘జన గణ మన’ పూర్తి వెర్షన్, ఇది తరువాత భారతదేశ జాతీయ గీతంగా మారింది. 3.2 నిమిషాల వ్యవధి ఉన్న ఈ గీతాన్ని ఆర్. సి. బోరల్ స్వరపరచగా, బృందం ఆలపించింది. సినిమా ఆరంభపు క్రెడిట్స్‌లో దీనిని ఉపయోగించారు. చాలా సంవత్సరాల తర్వాత నిర్మాత ప్రమోద్ చక్రవర్తి ఈ చిత్రం ఆధారంగా ధర్మేంద్రతో ‘నయా జమానా’ అనే సినిమా తీశారు.
- రాయ్ ‘దో బీఘా జమీన్’ సినిమాతో ప్రసిద్ధ స్వరకర్త సలీల్ చౌదరిని హిందీ సినిమాకి పరిచయం చేశారు. అంతే కాదు కనీసం మూడు చిత్రాలలో వారి రచనా నైపుణ్యాన్ని ఉపయోగించుకున్నారు. 1940వ దశకంలో సలీల్ రాసిన ‘రిక్షావాలా’ కథ ఆధారంగా ‘దో బీఘా జమీన్’ చిత్రం రూపొందించబడింది. ‘పరఖ్’ చిత్రానికి కూడా కథ సలీల్ చౌదరియే అందించారు. ఇంకా ‘ప్రేమ్ పత్ర్’ సినిమాకి సలీల్ స్క్రీన్ ప్లే రాశారు.
- భారతీయ చలనచిత్ర రంగానికి ఎందరో ఉద్దండులని అందించారు బిమల్ రాయ్. హృషికేష్ ముఖర్జీ, గుల్జార్, నాబెందు ఘోష్, సలీల్ చౌదరి, బసు భట్టాచార్య వంటి అనేక మంది గొప్ప దర్శకనిర్మాతలను, రచయితలను పరిచయం చేశారు. బిమల్ రాయ్ మరణానంతరం విడుదలైన తన చిత్రం ‘అనుపమ’ను హృషికేష్ ముఖర్జీ బిమల్ రాయ్‍కి అంకితం చేశారు. ఈ చిత్రంలోని అనేక పాత్రలు, వాటి మధ్య సంఘర్షణలు – ముఖ్యంగా సుజాత పాత్ర – బిమల్ దా సినిమాల్లోని పాత్రలను పోలి ఉంటాయి.
- రాయ్ సినిమాలో ఒక ప్రత్యేక లక్షణం – క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇంకా జనాలకి అంతగా తెలియని నటీనటులపై పాటల చిత్రీకరణ. నృత్య దర్శకులు సచిన్ శంకర్ – ఒక పాట అతిథి పాత్రలో (పరఖ్, క్యా హవా చలీ)లో కనబడతారు. తమ ప్రొడక్షన్ మేనేజర్ భార్య శ్రీమతి కపూర్‌ని ‘బందినీ’లోని ప్రసిద్ధ గీతం ‘అబ్ కే బరస్ భేజ్ భయ్యా కో బాబుల్’లో చాలాసార్లు చూపించారు బిమల్ దా. ఈ చిత్రంలోని మరో పాట ‘మత్ రో మాతా లాల్ తేరే బహుతేరే’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజ్‌దీప్ కనిపిస్తారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి.. ఆయనే WM ఖాన్! హిందీ సినిమా చరిత్రలో మొట్టమొదటి సినిమా పాట -’ఆలం అరా’ లోని ‘దే దే ఖుదా కే నామ్’ పాడిన వ్యక్తి. బిమల్ దా ‘కాబూలీవాలా’ చిత్రంలోని ‘ఏ మేరే ప్యారే వతన్’ పాటని WM ఖాన్‌పై చిత్రీకరించారు. మరొక చిన్న నటుడు MV రాజన్ ఇదే సినిమాలో ‘గంగా ఆయే కహాన్ సే’ పాటని అభినయించారు.
- బిమల్ దా రూపొందించిన అతిపెద్ద కమర్షియల్ హిట్ ‘మధుమతి’ కోసం ఎందరో దిగ్గజాలు పనిచేశారు, తరువాతి కాలంలో ఇంతమంది ప్రసిద్ధులు ఒకే సినిమాకి పనిచేయడం ఎన్నడూ సాధ్యపడలేదు. ‘మధుమతి’ సినిమాకి రచయితగా రిత్విక్ ఘటక్, ఎడిటర్‌గా హృషికేష్ ముఖేజీ, స్వరకర్తగా సలీల్ చౌదరి, నటుడిగా దిలీప్ కుమార్ పనిచేశారు. ఈ సినిమాలోని చాలా భాగాన్ని నైనిటాల్‌లో అవుట్‌డోర్‌లో చిత్రీకరించారు బిమల్ దా. అయితే రష్‍లు చూసి నిరాశ చెంది, చిత్రీకరించిన వాటిలో ఎక్కువ భాగాన్ని తొలగించి – చాలా సన్నివేశాలను మళ్లీ బొంబాయిలో చిత్రీకరించారు. కానీ దిలీప్ గుప్తా కెమెరా పనితనం అద్భుతం చేయడం వల్ల, ప్రేక్షకులు ఈ తేడాను గుర్తించలేరు.
- తన మరణానికి ముందు రాయ్ – తన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటైన, సమేష్ బసు యొక్క నవల ఆధారంగా రూపొందించబడుతున్న ‘అమృత్ కుంభ్ కి ఖోజ్ మే’ అనే ద్విభాషా చిత్రంపై పని ప్రారంభించారు. 60వ దశకం ప్రారంభంలో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆయన తన యూనిట్‌తో కలిసి ఒక షెడ్యూల్‌ని షూట్ చేశారు. షూటింగ్ సమయంలో, స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకోనందున అతని మొత్తం యూనిట్‌ను అలహాబాద్ పోలీసులు ఒకసారి అదుపులోకి తీసుకున్నారు. కానీ అది బిమల్ రాయ్ సినిమా కోసం అని తెలుసుకున్న అధికారులు షూటింగ్ కోసం నిబంధనలను సడలించి అవసరమైన అనుమతులు ఇచ్చారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను గుల్జార్ రాశారు; ధర్మేంద్ర కథానాయకుడిగా నటించాల్సి ఉంది, కథానాయికలను ఖరారు చేయలేదు. చాలా సంవత్సరాల తరువాత, బిమల్ దా కుమారుడు జాయ్ బిమల్ రాయ్ 11 నిమిషాల ఫుటేజీని పునరుద్ధరించి విడుదల చేశారు.
~
‘ఉదయేర్ పతే’ లోని ‘జన గణ మన’ పూర్తి వెర్షన్ లింక్:
https://www.youtube.com/watch?v=nI9ekVH-HVo…
రచయిత పింగళి నాగేంద్ర:
‘మాటల మాంత్రికుడు’ అని తొలుత పేరుపొందిన రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు. వీరు పింగళి అని ఇంటిపేరుతో ప్రసిద్ధి చెందిన స్క్రీన్ రైటర్, గేయ రచయిత, నాటక రచయిత. తెలుగు నాటక రంగానికి, సినీరంగానికి విశేష సేవలందించారు.
తమ బంధువులు చాలా మంది మచిలీపట్నంలో స్థిరపడినందున, వారి కుటుంబం అక్కడికి వలస వెళ్ళింది. నాగేంద్ర మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.
భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు నాగేంద్ర. కాంగ్రెసు ఆర్గనైజరుగా నాగేంద్రరావుకు దేశమంతా విస్తృతంగా పర్యటించారు. సబర్మతి ఆశ్రమంలో కొన్నాళ్ళున్నారు. కొన్ని దేశభక్తి గీతాలతో ‘జన్మభూమి’ అనే పుస్తకం వెలువరించగా, ప్రభుత్వం అరెస్టు చేసింది.
కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశాకా, ఖరగ్‍పూర్‍లో బెంగాల్ నాగపూర్ రైల్వేలో రెండేళ్ళపాటు పనిచేశారు. ఈ సమయంలో ఆయన ఆ సంస్థ కార్మిక సంఘానికి నేతగా వ్యవహరించారు. అక్కడ పని చేస్తుండగా ద్విజేంద్రలాల్ 1922లో రచించిన ‘మేవాడ్ పతన్’ను ‘మేవాడు రాజ్యపతనం’ అనే పేరుతో అనువదించారు. 1923లో బెంగాలీ భాష నుంచి ‘పాషాణి’ని తెలుగులోకి అనువదించారు. అదే సమయంలో సొంతగా ‘జేబున్నీసా’ అనే నాటకాన్ని రచించారు. ఈ మూడు రచనలు సుప్రసిద్ధ ‘కృష్ణా పత్రిక’లో ప్రచురితమయ్యాయి.
1924లో బందరులో దేవరకొండ వెంకట సుబ్బారావు గారు నడిపిన ‘ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ’లో రచయితగా, సెక్రటరీగా చేరారు నాగేంద్ర. 1928లో ఆస్కార్ వైల్డ్ యొక్క ‘డుబోయిస్ ఆఫ్ పాడువా’ ఆధారంగా ‘వింద్యారాణి’ నాటకాన్ని రచించారు పింగళి. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఆధారంగా ‘నా రాజు’ నాటకాన్ని, ‘మరో ప్రపంచం’ అనే సాంఘిక నాటకాన్ని, ‘రాణి సంయుక్త’ అనే చారిత్రక నాటకాన్ని రచించారు.
ఎన్నో సినిమాలకు మాటలు పాటలు అందించారు పింగళి. పాతాళ భైరవి (1951), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), చాణక్య చంద్రగుప్త, నీతి నిజాయితీ, సిఐడి, సత్యహరిశ్చంద్ర, అప్పు చేసి పప్పుకూడు వంటివి ప్రసిద్ధమైనవి. పింగళివారు తెలుగు సినిమాల్లో కొత్త, తమాషా పదాలు, పదబంధాలను ప్రవేశపెట్టారు. వారు 6 మే 1971న స్వర్గస్థులయ్యారు.
వారి జ్ఞాపకాలు, నాటకాలు ‘పింగళీయం’ అనే పుస్తకంగా వెలువడ్డాయి.
~
‘మాయాబజార్’ చిత్రంలో ఘటోత్కచుడిగా ఎస్.వి.రంగారావు పాత్ర ప్రవేశించినప్పుడు పలికే సంభాషణలు ఈ లింక్‍లో