[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి, గాయని టంగుటూరి సూర్యకుమారి
సినిమాల్లో స్త్రీలు కేవలం తమ నటనా ప్రతిభ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రోజుల్లో, టంగుటూరి సూర్యకుమారి – మూసలను బద్దలుకొట్టి – తెలుగు సినిమాలలో నిజమైన మొదటి ‘హీరోయిన్’గా అవతరించారు. తన నటనా నైపుణ్యాలకు మాత్రమే కాకుండా, ఆమె అద్భుతమైన గాన, నృత్య నైపుణ్యాలకు కూడా ప్రజాదరణ పొందారు.
1925లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన రాజమండ్రిలో జన్మించిన సూర్య కుమారి (సూర్యకుమారి అని కూడా వ్రాస్తారు) తొలుత తన అద్భుతమైన సంగీత ప్రతిభతో గుర్తింపు పొందారు. యువ సూర్యకుమారి తన పెదనాన్న, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం (తరువాత ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి) గారితో కలిసి సభలలో పాల్గొని దేశభక్తి గీతాలను పాడేవారు. ఆమె పాటలని తమిళ చిత్ర పరిశ్రమలోని వారెవరో విన్నారు, ఆపై సినిమాల్లో ఆమెచే పాడించవల్సిందిగా సిఫార్సులు చేయడంతో సినీరంగంలోకి ప్రవేశించారు సూర్యకుమారి.
1950ల ప్రారంభంలో ఆమె దిశను మార్చుకున్నారు. మిస్ మద్రాస్ టైటిల్‌ను గెలుచుకుని, మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచిన తర్వాత, మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వారి ఆహ్వానంపై 14 మంది సభ్యుల భారతీయ చలనచిత్ర ప్రతినిధి బృందంలో భాగంగా ఆమె అమెరికాలో పర్యటించారు. ఇతర ప్రతినిధులలో నటులు ప్రేమ్ నాథ్, డేవిడ్ అబ్రహం, నర్గీస్, బీనా రాయ్ ఉన్నారు.
ఈ ప్రతినిధి బృందం సభ్యులు ఎలియనోర్ రూజ్‌వెల్ట్, సిసిల్లే డెమిల్లే, ఫ్రాంక్ కాప్రా, సీజర్ రొమెరో వంటి ప్రముఖులను కలుసుకున్నారు. ఒక కథనం ప్రకారం, సూర్యకుమారి సౌందర్యం, ఆంగ్ల నైపుణ్యాలకు ఆకర్షితులైన దర్శకనిర్మాత ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ఆమెకు, ప్రేమ్ నాథ్‌కి ఓ సినిమా అవకాశం కల్పించాలని తలచారట. కానీ అప్పట్లో సినిమాల నిర్ణయాలను స్టూడియోలు, నటీనటుల సంఘాలు నిర్ణయిస్తూండేవి. ఆయన అనుకున్నట్టుగా వాళ్ళకి అవకాశం దక్కలేదు. అయినప్పటికీ, సూర్యకుమారి హిచ్‌కాక్‌తో సన్నిహితంగా ఉంటూ, అమెరికాలో రెండవసారి, సుదీర్ఘ కాలం ఉన్నప్పుడు, ఆయన కథా పరిశోధన బృందంలో పని చేశారు.
ఇదిలా ఉండగా, 1952 నుండి 1960 వరకు, ఆమె మరిన్ని సినిమాల్లో నటించారు, ముఖ్యంగా ‘వతన్’ (1954, హిందీ), ‘ఉడన్ ఖటోలా’ (1955, హిందీ) వంటి సినిమాల్లో దిలీప్ కుమార్, జీవన్, నిమ్మితో కలిసి నటించారు. ‘ఉడన్ ఖటోలా’లో, ఆమె స్త్రీల ఆధిపత్యం ఉన్న రహస్య రాజ్యానికి గర్విష్టి రాణిగా నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈస్ట్-వెస్ట్ ఫిల్మ్స్, ఫిల్మిస్థాన్‌కు చెందిన శషధర్ ముఖర్జీ, హంగేరిలో జన్మించిన దర్శకుడు అలెగ్జాండర్ పాల్ భాగస్వామ్యంలో నిర్మించిన ‘బాంబే ఫ్లైట్ 417’ అనే సినిమా, భారతీయ చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌తో వివాదానికి గురై, వెలుగు చూడలేకపోయింది. ఇందులో అలెక్స్ డి ఆర్సీ, సూర్యకుమారి, వైజయంతిమాల, అశోక్ కుమార్ తదితరులు నటించారు.
తరువాత, సూర్యకుమారి నాటకరంగానికి వెళ్లారు. ‘సూర్యకుమారి: ఎ మెమోరియల్ ట్రిబ్యూట్’ అనే పుస్తకానికి సంపాదకత్వం వహించిన జి. కృష్ణమూర్తి వ్రాసినట్లుగా, టాగూర్ గారి ‘అర్జున-చిత్ర’లో ఆమె నటనకు దక్కిన ప్రశంసలు ఆమెను విదేశాలకు వెళ్లడానికి ప్రోత్సహించాయి. తన రంగస్థల ప్రతిభను ప్రదర్శించాలని; అభివృద్ధి చెందుతున్న టెలివిజన్ ప్రపంచంలో అవకాశాలను అన్వేషించాలని ఆమె కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మేనల్లుడు దేవగుప్తాపు రావు గుర్తు చేసుకున్నారు. ఆమె రంగస్థలం యొక్క ‘తక్షణత’ పట్ల ఆకర్షితులయ్యారు. “వెండి తెర యొక్క సుదూరత ఆమెకు అంతగా నచ్చలేదు” అని అన్నారాయన.
1960ల ప్రారంభంలో కొంతకాలం, సూర్యకుమారి న్యూయార్క్‌లో నివసిస్తూ, మరో ఇద్దరు పని చేసే మహిళలతో అపార్ట్‌మెంట్‌ను పంచుకున్నారు. ‘ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రెజెంట్స్’ అనే దీర్ఘకాల టివి సిరీస్ కోసం హిచ్‌కాక్ పరిశోధనా బృందంలో పని చేయడంతో పాటు, ఆమె కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతీయ రంగస్థలం, ఇంకా నృత్యంపై పాఠాలు బోధించారు. స్టాన్లీ వోల్పెర్ట్ నవల ఆధారంగా మార్క్ రాబ్సన్ తీసిన ‘నైన్ అవర్స్ టు రామా’ అనే సినిమా పరిశోధనా బృందంలో ఆమె కూడా సభ్యురాలు.
అది ఆమెకి అలవాటు లేని చాలా కఠిన జీవితం. కానీ త్వరలోనే కృష్ణ షా దర్శకత్వం వహించిన ‘ది కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’లో ఆమె పాత్ర ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘యునైటెడ్ ఆర్టిస్ట్స్’ అనే కళా సంస్థ ఆహ్వానం మేరకు ఆమె – షా, ఇంకా నాటకం కొరియోగ్రాఫర్ భాస్కర్ రాయ్ చౌదరితో కలసి వర్ణవివక్ష కాలంలో దక్షిణాఫ్రికాకు వెళ్లారు.
‘కైండ్లీ మంకీస్’ పేరుతో, షా దర్శకత్వం వహించిన రెండవ నాటకం, సూర్యకుమారిని 1965లో లండన్‌కు వెళ్లేలా చేసింది. ఈ నాటకంలో ఆమె సయీద్ జాఫ్రీతో కలిసి నటించారు. అమెరికన్ నాటక రచయిత మిల్టన్ హుడ్ వార్డ్ రచించిన ఈ నాటకంలో ఓ భారతీయ దేవాలయం, ఊహించని విధంగా. అమెరికన్ సందర్శకుల తాకిడికి గురవుతుంది. అయితే ఈ నాటకానికి పెద్దగా ప్రజాదరణ దక్కకపోవడంతో, అమెరికాలో ప్రదర్శించే అవకాశాలు సన్నగిల్లాయి. సూర్యకుమారి లండన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఆమె కొత్త విజయాలను, ప్రేమను కూడా పొందారు.
హిందీ సినిమాల్లో పని చేస్తున్నప్పటి స్నేహితురాలు, రష్యాలో జన్మించిన కాస్ట్యూమ్ డిజైనర్ లుడ్మిల్లా ప్రిమాకోఫ్, ఆ సమయంలో సూర్యకుమారికి సహాయం చేశారు. ఆమెకు ఒక ఫ్లాట్ ఇప్పించారు, బిబిసి నాటకాలు, ఇంకా టీవీ సీరియల్స్‌లో పాత్రలు దొరికేలా చేశారు. వీటిల్లో – ఇ. నెస్బిట్ యొక్క ‘ది ఫీనిక్స్ అండ్ ది కార్పెట్’ అనుసరణ అయిన నాటకంలో మహారాణి పాత్ర, ఇంటర్‌పోల్ కాలింగ్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్‌లో దొంగిలించబడిన కలరా వ్యాక్సిన్‌ని కలిగి ఉండే డాక్టర్ పాత్ర ముఖ్యమైనవి. ‘డ్రమ్స్ అలాంగ్ ది అవాన్’, ‘హార్డ్ లేబర్’ వంటి టివి నాటకాలలో కూడా ఆమె చిన్న పాత్రలు పోషించారు.
1973లో, ఆమె తన కంటే 18 ఏళ్లు పెద్ద అయిన రచయిత, కవి, చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్‌ను వివాహం చేసుకున్నారు. 1940ల ప్రారంభంలో, ఎల్విన్ మాస్కోలోని బ్రిటీష్ ఎంబసీలో నైట్ వాచ్‌మెన్‌గా ఉండేవారు. ఆయన తన పాత రాలీ సైకిల్‌పై సోవియట్ యూనియన్‌లో కొంత కాలం పర్యటించి – ఆ అనుభవాలలో ‘ఎ కాక్నీ ఇన్ మాస్కో’ అనే పుస్తకం రచించారు. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ సైబీరియా’, ‘ది జెంటిల్ రష్యన్’, ‘ఎల్విన్స్ రైడ్స్: లావోస్, కంబోడియా అండ్ థాయిలాండ్’, ఇంకా ‘ది రైడ్ టు చండీగఢ్’ (ఇది 1950ల మధ్యకాలంలో భారతదేశంలో చేసిన ప్రయాణాలకు సంబంధించినది) ఆయన ఇతర రచనలు.
భారతదేశంలో లభించిన విజయాల వల్ల లండన్‍లో సూర్యకుమారి బ్రిటిష్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. 1971లో, ఆమె విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి; కూచిపూడి మరియు భరతనాట్యం సాధన చేయించేందుకు ‘ఇండియా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సొసైటీ’ అనే సంస్థని స్థాపించారు. 1990 వరకు, లండన్‌లోని సౌత్‌బ్యాంక్ సెంటర్‌లో సూర్యకుమారి వార్షిక ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఆమె బృందంలో కేశవ్ సాఠే (తబలా), వేము ముకుంద (వీణ), ఆనంద్ పిళ్ళయ్ (సితార్) ఉన్నారు. 1973లో, సూర్యకుమారి ‘సాంగ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఒక ఆల్బమ్‌ను విడుదల చేశారు, అందులో ఆమె టాగోర్ పాటలు, త్యాగరాజ కృతులను ఆలపించారు. ఆమె తన భర్త హెరాల్డ్ రాసిన పద్యాలకు కూడా దృశ్యరూపం కల్పించారు.
‘ది జ్యువెల్ ఇన్ క్రౌన్’ (1984) ఆమె చివరి టెలివిజన్ ప్రదర్శన. ఆమె దాదాపు 80 సంవత్సరాల వయస్సులో 2005లో మరణించారు. జీవిత చరమాంకంలో, ఆమె మతాల మధ్య సారూప్యతను అన్వేషించిన; ఎన్ని భేదాలున్నా మానవులంతా ఒక్కటే అని నమ్మిన మధ్యయుగపు సూఫీ సాధువు కబీర్‌కు సంబంధించిన విషయాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు.
***
https://www.youtube.com/watch?v=uqivXUY9teo