[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రజా కళాకారుడు వల్లం నరసింహారావు:
వల్లం నరసింహారావు తెలుగులో తొలి డబ్బింగ్ ఆర్టిస్ట్. 1950లో తెనాలికి చెందిన వాసిరెడ్డి నారాయణ రావు హిందీ సినిమా ‘నీరా అవుర్ నందా’ని తెలుగులో ‘ఆహుతి’ పేరిట డబ్ చేసినప్పుడు తెలుగు వెర్షన్‌కి శ్రీశ్రీ స్రిప్ట్, పాటలు సమకూర్చారు. ప్రధాన విలన్‌గా నటించిన కైలాశ్‌కి వల్లం నరసింహారావు డబ్బింగ్ చెప్పారు. చదలవాడ కుటుంబరావు, సుందరమ్మ, మాధవపెద్ది సత్యం, ఇంకా రావు బాలసరస్వతి దేవి (క్రెడిట్స్‌లో ఈవిడ పేరు కోలంకి బాలసరస్వతి అని ఉంది) ఈ సినిమాకి పనిచేసిన మిగతా డబ్బింగ్ ఆర్టిస్టులు. మిగతావారు డబ్బింగ్ కెరీర్‌లో కొనసాగకపోయినా, వల్లం నరసింహారావు మాత్రం తన కెరీర్‌లో 200లకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. 100కి పైగా సినిమాలలో పలు పాత్రలు ధరించారు.
1959లో విడుదలైన ‘భక్త అంబరీష’ సినిమాలో ఆయన నారదుడి పాత్ర పోషించారు. ఈ లింక్‌లో వీడియో చూడవచ్చు.
‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కూడా ఆయన నారదుడిగా నటించారు.
వల్లం ప్రస్థానం:
ఆయన కృష్ణా జిల్లా తిరువూరులో జన్మించారు. ఆయన ‘ప్రజా నాట్య మండలి’లో సభ్యులు. ఎన్నో పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బ్రిటీషు వారి పాలనలో ఆయన ఎన్నో దేశభక్తి ప్రబోధ నాటకాలలో నటించి జైలు పాలయ్యారు. ‘ప్రజా నాట్య మండలి’ తరఫున ముందడుగు (స్త్రీ వేషం) లో నటించారు, మా భూమి, అప్పలనాయుడు నాటకాలలో కథానాయకుడిగా నటించారు. సత్తెనపల్లి బాలికోన్నత పాఠశాలలో ఒక ఏడాది పాటు బుర్రకథ శిక్షకుడిగా పనిచేశారు. మద్రాసులో మా భూమి నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు వీక్షించిన ఎల్.వి. ప్రసాద్, బి. నాగిరెడ్డి గారు ఆయనని ‘షావుకారు’ చిత్రంలో నటించమని కోరారు. ఆ సమయనికి ‘ప్రజా నాట్య మండలి’ని నిషేధించడంతో, 1949లో ఆయన మద్రాసుకు వచ్చేశారు. అప్పట్నించి ఆయన విజయ ప్రొడక్షన్స్ వారికి ‘పర్మనెంట్ ఆర్టిస్ట్’ అయ్యారు. 1952 వరకూ చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ సంస్థతో కొనసాగారు. ఉదాహరణకి ‘వగలోయ్’ పాటలో లక్ష్మీకాంతతో కలిసి నాట్యం చేస్తూ కనిపిస్తారు. అలాగే, ‘ఇతిహాసం విన్నారా’ పాటలో టి.జి.కమలాదేవితో “ఉన్నాడుగా తోటరాముడు” అంటూ కనిపిస్తారు. 1952లో ‘దీక్ష’ సినిమాలో పనివాడి పాత్ర వేశారు, ఆ సమయంలో ఆయనకి హీరోయిన్ జి.వరలక్ష్మితో పరిచయం కలిగింది. ఆ తరువాత ఆయనకు ‘ప్రపంచం’ సినిమాలో షావుకారు జానకి సరసన నటించే అవకాశం ఇప్పించారామె, తాను రామశర్మ సరసన నటించారు. విజయ వారి కాంట్రాక్టుతో ఆయన రెండే సినిమాలు చేయగలిగారు. సారథి ఫిల్మ్స్ వారి ‘అంతా మనవాళ్ళే’ సినిమాలో హీరోగా అవకాశం రావడంతో ఆయన విజయ సంస్థని వీడారు. ఆ తరువాత ఆయన బి.ఎస్. రంగా గారి ‘మా గోపి’ సినిమాలో జమున సరసన నటించారు. తర్వాత ‘రోజులు మారాయి’ సినిమాలో ద్వితీయ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాతో తర్వాత వల్లం నరసింహారావు నటన మీద కన్నా డబ్బింగ్ పై ఎక్కువ దృష్టి సారించారు; ఎందుకంటే డబ్బింగ్ ద్వారా నిలకడైన ఆదాయం లభించింది. ఆ ఆదాయంతో ఆయన మద్రాసులో ఇల్లు కూడా కొనుక్కోగలిగారు.
ఆ రోజుల్లో తెలుగు సినిమాలు చాలా తక్కువగా నిర్మితమయ్యేవి. పైగా కాంగ్రెసు పార్టీకి, కమ్యూనిస్టుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఆయన జి.వరలక్ష్మి, శ్రీ శ్రీ చదలవాడ, పెరుమాళ్ళు, వి. మధుసూదనరావులతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. అందుకే తనకి ఎక్కువ అవకాశాలు రాలేదని ఆయన భావించారు. దీనికి భిన్నంగా డబ్బింగ్ వృత్తి ఎంతో ఆదాయాన్నిస్తుందని విశ్వసించారు. ‘ఆహుతి’ తరువాత ‘పరదేశి’ సినిమాకి శివాజీ గణేశన్‌కి డబ్బింగ్ చెప్పారు. అప్పటి నుంచి ఆయన శివాజీ గణేశన్‌కి, ఎంజిఆర్‌కి, కన్నడ రాజ్‍కుమార్‌కి, ప్రేమ్ నజీర్‌లకు పర్మనెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. తెలుగు సినిమా ‘చిలకమ్మ చెప్పింది’లో రజనీకాంత్‌కి కూడా డబ్బింగ్ చెప్పారు.
క్రమంగా డబ్బింగ్ పరిశ్రమలో ఎన్నో కొత్త గొంతులు ప్రవేశించాయి. నిర్మాతలని పక్కనబెట్టి దళారులు ప్రవేశించారు. బంధుప్రీతి, ప్రమాణాల తగ్గుదల వంటి కారణాలు ఆయనకి విచారం కలిగించాయి. దాంతో ఆయన డబ్బింగ్ వృత్తిని విడిచిపెట్టారు. అయితే, ఆయన ఖాళీగా ఉండలేదు. సహాయక పాత్రలకి మళ్ళి, ఎన్నో సినిమాలలో నటించారు. దర్శకుడు వేజెళ్ళ గారి సినిమాలలో అనేక చక్కని పాత్రలలో నటించారు. చిరంజీవి ‘మగమహారాజు’లో కూడా నటించారు.
1950లో మద్రాసులో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు సోవియట్ ప్రతినిధి బృందం హాజరైంది. ఈ ఉత్సవంలో వల్లం నరసింహారావు అల్లూరి సీతారామరాజు పై బుర్ర కథ చెప్పారు. అంతేకాదు, 45 నిమిషాల పాటు ‘శాంతి’ అనే ఏకపాత్ర మూకాభినయం చేశారు. వారికి బాగా నచ్చడంతో ఈ అభినయాన్ని సోవియట్ బృందంలోని వారు చిత్రీకరించారు. దీనికి టి. చలపతిరావు సంగీతం అందించారు. నాగభూషణం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ఫిల్మ్‌ని ‘చైనీస్ వరల్డ్ పీస్ కాంపిటీషన్’కు పంపగా, ప్రథమ బహుమతి గెలుచుకుంది (నాకెంతో ఆశ్చర్యం కలిగింది. దీని గురించి తెలుగువాళ్ళకి అసలేమయినా పట్టింపు ఉందా? ఇటువంటి గొప్ప తెలుగువారి వారి ప్రదర్శనలు మనకి ఇప్పుడు అందుబాటులో లేకపోవడం నాకు విచారం కలిగించింది. ఇటువంటివి ఏ రష్యన్ ఆర్క్వైవ్స్‌లో పడి ఉన్నాయోమో?). దీని తర్వాత వల్లం, దర్శకులు తాపీ చాణక్యలకు రష్యాలో జరిగే వరల్డ్ యూత్ ఫెస్టివల్‍లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. కానీ వాళ్ళు కమ్యూనిస్టులు కావడంతో అప్పటి ప్రభుత్వం వారికి వీసాలు మంజూరు చేయలేదు.
ఇవే కాక వల్లం నరసింహారావు ఎన్నో రేడియో నాటకాలలో పాల్గొన్నారు. మద్రాసు రేడియోలో బుర్రకథలు చెప్పారు. ‘పుట్టిల్లు’ సినిమాలో ధోబీ పాట పాడారు. ‘యువతరం కదిలింది’ సినిమాలో ‘నందనారే లోకమెంత చిత్రం రా’ అనే పాటని కూడా పాడారు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఆయన భార్య కూడా నటే. ‘యువతరం కదిలింది’ సినిమాలో ప్రభాకరరెడ్డి పక్కన నటించారు, ఇంకా ‘నవోదయం’ చిత్రంలో విజయశాంతికి తల్లిగా నటించారు. కోరియోగ్రాఫర్ వేణుగోపాల్‌కు ఆవిడ డాన్స్ అసిస్టెంట్‍గా వ్యవహరించారు. ‘నవోదయం’ సినిమా వీడియోలో 14.30 నిమిషాల వద్ద ఆమెను చూడవచ్చు.
వల్లం నరసింహారావు నటించిన చివరి సినిమా చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’. అందులో ఆసుపత్రిని శుభ్రంచేసే వ్యక్తి పాత్రలో నటించారు వల్లం. అటువంటి గొప్ప నటుడు 2006లో ఈ ప్రపంచాన్ని విడిచారు.
గాయకుడు, స్వరకర్త శ్రీ:
‘శ్రీ’గా ప్రఖ్యాతులైన కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (13 సెప్టెంబరు 1966 – 18 ఏప్రిల్ 2015) ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు. ఆయన మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‍లో బి.ఇ. చేశారు.
శ్రీ మంచి గాయకుడు. మనీ మనీ, లిటిల్ సోల్జర్స్, సిందూరం, అనగనగా ఒక రోజు, ఆవిడా మా ఆవిడే, గాయం, అమ్మోరు, నా హృదయంలో నిదురించే చెలి తదితర సినిమాలకు పాటలు పాడారు. 2005లో వచ్చిన ‘చక్రం’ సినిమాలో ‘జగమంత కుటుంబం నాది’ పాట ఆయనకి ఎంతో పేరు తెచ్చింది.
గాయకుడిగా శ్రీ కి తొలి చిత్రం వేజెళ్ళగారి ‘ఆడపిల్లలే నయం’. ఈ సినిమాలో ఆయన ‘అక్కయ్య పెళ్ళికి అందాల పందిళ్ళు’ అనే పాట పాడారు. ఆ పాట విన్న జంధ్యాల తన సినిమా ‘బాబాయ్ అబ్బాయ్’లో ‘నీ రూపు పారాణి దీపం’ అనే పాట పాడే అవకాశం కల్పించారు. అలాగే ‘అరుణకిరణం’ సినిమాలో ‘అరుణ అరుణ’ అనే పాట పాడే అవకాశం కూడా లభించింది.
స్వరాలు కూర్చడంలో తండ్రిగారి ప్రేరణ, పాటలు పాడడం అమ్మగారి ప్రోత్సాహం ఉన్నాయని శ్రీ భావించేవారు. కాలేజీలో పాటల పోటీలు జరిగితే, అందులో పాల్గొనేలా వాళ్ళమ్మగారు ప్రోత్సహించారట, శ్రీ పాల్గొని బహుమతి గెలుచుకున్నారు. ఈ వార్త విన్న చక్రవర్తి ఆశ్చర్యపోయి, శ్రీ కి వాయిస్ టెస్ట్ చేశారట. ‘సినీరంగంలో ప్రవేశించినందుకు నేనెంతగానో బాధపడుతున్నాను, ఆ బాధలు నీకెందుకు?’ అని అన్నారట చక్రవర్తి కొడుకుతో. శ్రీ చదువు పూర్తయ్యాక, తాను అతనిని సినిమాలకి రికమెండ్ చేయనని చక్రవర్తి అన్నారట. అయితే తన తండ్రి సంగీత దర్శకత్వంలో శ్రీ పాడారు; కానీ ఆ అవకాశాలు తండ్రి వల్ల కాక పలు సినీ యూనిట్ల వల్ల లభించాయి.
శ్రీ వాళ్ళు మొత్తం ఐదుగురు తోబుట్టువులు. అందులో నలుగురు మగపిల్లలు, ఒక అమ్మాయి. చక్రవర్తిగారి సంతానంలో శ్రీ రెండో కొడుకు. తండ్రికి సినిమాలతో తీరిక లేకపోవడంతో శ్రీ కి అమ్మ దగ్గరే చనువెక్కువ. పదవ తరగతి పాసయినప్పటి నుండి తమ పొరుగు అమ్మాయి అరుణపై ఇష్టం పెంచుకున్నారు శ్రీ. పై చదువుల కోసం మణిపాల్ వెళ్ళినా ఆ ప్రేమ కొనసాగింది. కులాలు వేరుకావడంతో, వాళ్ళ వివాహానికి చక్రవర్తి అంగీకరించలేదు. ఫలితం శ్రీ ఇల్లు వదిలి వెళ్ళిపోయి అరుణని పెళ్ళి చేసుకున్నారు. అన్నయ్య చనిపోయాకనే తిరిగి ఇంటికి వెళ్ళారు శ్రీ. ఆయన భార్య అరుణ మంచి మనిషి. మధుమేహంతో బాధపడుతున్న తన ఆడపడుచుని ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. ఇదంతా చూసిన చక్రవర్తి హృదయం కరిగి వారి వివాహాన్ని ఆమోదించారు.
1989 నుంచి శ్రీ తన తండ్రికి అసిస్టెంట్‍గా పనిచేశారు. మోహన్ గాంధి గారి ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో మొదటిసారిగా స్వతంత్ర సంగీత దర్శకుడిగా శ్రీ కి అవకాశం లభించింది. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘అంతం’ సినిమా తీస్తున్నారు. తన రీ-రికార్డింగ్‌తో ఒక రీల్ చేసి చూపాల్సిందిగా ఆయన శ్రీ ని కోరారు. శ్రీ వెంటనే చేసి చూపగా, ఆర్.జి.వి.కి అది బాగా నచ్చేసింది. ఫలితంగా ‘గాయం’, ‘అనగనగా ఒక రోజు’ సినిమాలకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. ‘గాయం’ సినిమాలో శ్రీ పాడిన ‘అలుపన్నది ఉందా’ పాటని మణిరత్నం అభినందించారు.
ఆయన తక్కువ సినిమాలే చేసినా, ఆయన పాటలంటే నాకెంతో ఇష్టం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ‘రుక్మిణి’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చినా, తనకి నటనంటే ఆసక్తి లేదని శ్రీ తిరస్కరించారు. 1995లో జెమినీ టీవీలో ప్రసారమైన అంత్యాక్షరి కార్యక్రమానికి ఆయన ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన గొంతు ఎంతో బాగుండడంతో – ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాలో రమేష్ అరవింద్‌కీ, ‘ఆకాశం’ సినిమాలో హీరో ఆకాశ్‌కీ, ‘134’ సినిమాలో పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్‌కీ డబ్బింగ్ చెప్పే అవకాశం కలిగింది. అమ్మోరు సినిమాకి శ్రీ కి చాలా పేరు వచ్చింది. ఆ సినిమాకి పాటలకి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా, రీ-రికార్డింగ్ శ్రీ చేశారు. జాతర పాటలో రాజమండ్రి నుంచి 15 మంది వాయిద్యకారులని పిలిపించి ప్రయోగం చేశారు. తల్లితో బాగా చనువున్న కారణంగా, 1998 జూలైలో ఆమె మరణంతో శ్రీ మానసికంగా బాగా క్రుంగిపోయారని నాకు తెలిసింది. ఆ కారణంగా ప్రతివారితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడిన శ్రేయోభిలాషులు ఆయనని మార్చడానికి ప్రయత్నించారు, కానీ మార్చలేకపోయారు. కొద్దికాలంలోనే – శ్రీ తాగుడుకీ, మత్తుపదార్థాలకీ బానిస అయ్యారనే వదంతులు వ్యాపించాయి. అయితే ఇవన్నీ తన పాపులారిటీ వల్ల వ్యాపిస్తున్నాయని ఆయన భావించారు. అయితే తన ప్రవర్తన వల్ల మరణించిన తన తల్లికి చెడ్డ పేరు వస్తోందని గ్రహించిన ఆయన మారారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మారినా ఫలితం లేకపోయింది. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆయన 18 ఏప్రిల్ 2015 నాడు హైదరాబాదులో 48 ఏళ్ళ వయసులో మరణించారు. ఎంతటి నైపుణ్యం వృథా అయిపోయిందో! ఆయన పాటలలో నాకేది ఇష్టం అని నన్నెవరైనా అడిగితే నా దగ్గర జవాబు లేదు. ఆయన పాడిన పాటల్లో నేను చివరగా విన్నది ‘నా హృదయంలో నిదురించే చెలి’ అనే పాట.
ఆయన చనిపోయారనే వార్త విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు.