Site icon Sanchika

అలనాటి అపురూపాలు – 210

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త రోషన్

1931లో విడుదలైన ‘ఆలం ఆరా’ సినిమా రంగంలో పెను మార్పుకి కారణమయింది. టాకీలు రావడంతో వినోద సన్నివేశాలలో ఒక విప్లవం వచ్చి భారతీయ సినిమాల్లో పాటలు, డాన్సులు అంతర్భాగమయ్యాయి.

న్యూ థియేటర్స్ కోల్‌కతాకు చెందిన ఆర్.సి. బోరల్‌ను భారతీయ చలనచిత్ర సంగీతపు పితామహుడిగా గుర్తిస్తారు. తొలినాటి టాకీలకు స్వరాలందించిన వారిలో పంకజ్ మల్లిక్, సి రామచంద్ర, అనిల్ బిస్వాస్, ఖేమ్‌చంద్ ప్రకాష్, గులాం హైదర్, నౌషాద్ ప్రముఖులు. అవి కె.ఎల్. సైగల్, కనన్‌బాల, ఖుర్షీద్, సురేంద్రనాథ్ వంటి నటగాయకుల రోజులు.

1940వ దశకం చివరిలో నేపథ్య గాన విధానం అందుబాటులోకి రావడంతో నటగాయకుల ప్రభ క్షీణించింది.

ఈ సమయంలోనే రోషన్ ఒక వినూత్న సంగీత స్వరకర్తగా తెరపైకి వచ్చారు. 1917 జూలై 14న నేటి పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలాలో జన్మించిన రోషన్, లక్నోలో సంగీతంలో తన ప్రారంభ శిక్షణ పొందారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు అల్లావుద్దీన్ ఖాన్ నుండి పాఠాలు నేర్చుకున్న తర్వాత రోషన్ – సరోద్ లోనూ నిష్ణాతులయ్యారు. 1940లో, ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో స్వరకర్తగా చేరారు, కానీ సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, 1948లో ఆ ఉద్యోగాన్ని వదిలి బొంబాయి చేరారు. అక్కడ రోషన్ అనుకోకుండా అప్పటి ప్రముఖ నిర్మాత-దర్శకుడు కిదార్ శర్మను కలుసుకున్నారు. తన సంగీత నేపథ్యం, అనుభవంతో కిదార్ గారిని ఆకట్టుకున్నారు. కిదార్ శర్మ సినిమా పరిశ్రమకు కొత్త ప్రతిభావంతులను పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందారు. రాజ్ కపూర్, గీతా బాలి, మధుబాల వంటివారిని ప్రముఖ తారలుగా తీర్చిదిద్దింది కిదార్ గారే. ఆయన తను తీస్తున్న ‘నెకీ ఔర్ బదీ’ (1949) సినిమాకి సంగీత దర్శకుడిగా రోషన్‌కు అవకాశం ఇచ్చారు, అయితే ఆ చిత్రం పరాజయం పాలైంది. రోషన్ క్రుంగిపోయారు. కానీ కిదార్ శర్మ రోషన్ ప్రతిభను గమనించి, వారికి అన్ని ప్రోత్సాహాలను అందించి, రాజ్ కపూర్ – గీతా బాలి నటించే తన తదుపరి చిత్రం ‘బావరే నైన్’ సినిమాకి స్వరాలందించే బాధ్యతని అప్పగించారు. ఈ సినిమాలో అన్ని పాటలు విజయవంతమై – నేపథ్య గాయకులు గీతా రాయ్, రాజ్ కుమారి, ముఖేష్‌లకు గొప్ప పేరునీ, ప్రజాదరణను సంపాదించిపెట్టాయి.

ఈ సినిమాలోని ‘ఖయాలోన్ మే కిసికే’, ‘సున్ బేరీ బలమ్ సచ్ బోల్ రే’, ‘తేరీ దునియా మే దిల్ లగ్తా నహీఁ’ వంటి ఆల్ టైమ్ హిట్ మెలోడీస్‌‌గా నిలిచాయి. దాంతో ఒక వినూత్న స్వరకర్తగా రోషన్‌కు ఖ్యాతి దక్కింది. తరువాత 1951లో ‘హామ్ లోగ్’, ‘మల్హర్’ చిత్రాలకు చక్కని బాణీలందించి బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యేందుకు కారణమయ్యారు.

రోషన్ గారి స్వరాల విషయంలో ప్రస్తావించుకోదగ్గ మరొక సినిమా – కె.ఎ. అబ్బాస్ దర్శకత్వంలో రాజ్ కపూర్, నర్గీస్ నటించిన ‘అన్‍హోనీ’. అలీ సర్దార్ జాఫ్రీ గీతాలకు రోషన్ చక్కని బాణీలందించారు. ఈ సినిమాలోని ‘మై దిల్ హూఁ ఏక్ అర్మాన్ భరా’, ‘ఇస్ దిల్ కీ హలత్ క్యా కహియే’ అనే పాటలు బాగా ప్రజాదరణ పొందాయి.

రోషన్ అవకాశాల కోసం ఎన్నడూ నిర్మాతల వెంటబడలేదు, చిన్న నిర్మాతల చిత్రాలలో కూడా తన మేధను, ప్రతిభను ప్రదర్శించారు. ఆయన సారంగి, సరోద్, వేణువు వంటి సంగీత వాయిద్యాలను సమర్ధవంతంగా ఉపయోగించారు. అతని బాణీలు ఎల్లప్పుడూ ఏదో ఒక రాగం మీద ఆధారపడి ఉండేవి.

లతా మంగేష్కర్ నుంచి అత్యుత్తమ ప్రతిభని రోషన్ రాబట్టుకున్నారనడానికి గొప్ప ఉదాహరణ – మీరా భజన్ ‘ఏ రీ మై తో ప్రేమ్ దివానీ’ (నౌబహర్, 1952). లత తన స్వంత చిత్రం ‘భైరవి’కి స్వరాలందించటానికి 1950ల నాటి ప్రముఖ సంగీత దర్శకుల నుండి రోషన్‌ను ఎంచుకున్నారు, అయితే ఆ సినిమా మొదలవనే లేదు. రోషన్ 1950లలో చాలా తక్కువ చిత్రాలకు సంగీతం అందించారు. ‘అజీ బస్ షుక్రియా’ (1958)లో లత గళంలో ‘సారీ సారీ రాత్ తేరీ యాద్ సతాయే’ హిట్ మినహా మిగతావన్నీ ఒక మోస్తరు విజయాన్ని సాధించాయి.

రోషన్ గారి ఆల్-టైమ్ గ్రేట్ హిట్ ‘బర్సాత్ కీ రాత్’ (1960) సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో రఫీ ఆలపించిన ‘జిందగీ భర్ నహీఁ భూలేగీ’తో పాటు ప్రతి పాట విజయవంతమైంది. ఈ సినిమాలోని ఖవ్వాలీ పాట ‘నా తో కర్వాన్ కీ తలాష్ హై – యే ఇష్క్, ఇష్క్’ చాలా విశిష్టమైనది. తరువాతి కాలంలో రోషన్ ఖవ్వాలీల మాస్టర్‌గా ప్రశంసించబడ్డారు. సినిమాలలో ఖవ్వాలి పాటలను గౌరవప్రదంగా మార్చడానికి బాధ్యత వహించారు.

1960వ దశకంలో, రోషన్ ‘తాజ్ మహల్’ (1963) వంటి చిత్రాలతో గొప్ప కీర్తిని పొందారు, ‘జో వాదా కియా’, ‘పాన్ ఛూ లేనే దో’, ‘జుల్మ్-ఎ-ఉల్ఫత్ కి హమే లోగ్ సజా’ వంటివి జనాదరణ పొందిన హిట్‌లు. దీంతో రోషన్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అదే సంవత్సరంలో, రోషన్ ‘దిల్ హీ తో హై’ చిత్రంతో మరో విజయాన్ని సాధించారు. ఈ చిత్రంలో ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ పాట ‘లగా చునారీ మే దాగ్’ లో శాస్త్రీయ సంగీతంలో మన్నా డే ప్రతిభను ఉపయోగించుకున్నారు. ఇదే సమయంలో, ప్రసిద్ధ కవి-గీత రచయిత సాహిర్, రోషన్‌తో జతకట్టారు. తన సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆయన  – కొన్ని అద్భుతమైన బాణీలతో తన పదాలను అలంకరించగల స్వరకర్తను కనుగొన్నారు. ‘చిత్రలేఖ’ (1964)లో ‘మన్ కహే న ధీర్ ధరే’, ‘సంసార్ సే భాగే ఫిర్తే’ వంటి పాటలు ఇందుకు ఉదాహరణలు. రోషన్ ప్రతిభ వ్యక్తమయ్యే ఇతర ముఖ్యమైన చిత్రాలు/పాటలు – ‘భీగీ రాత్’ (1965) లోని ‘దిల్ జో నా కహ్ నా సకా’, ‘దేవర్’ (1966) లోని ‘రూఠే సయియాఁ హమారే సయియాఁ’, ‘మమత’ (1966) లోని ‘రెహతే థీ కభీ జిన్‍కే దిల్ మే’, ‘బహు బేగం’ (1967) లోని ‘హమ్ ఇంతజార్ కరేంగే’.

రోషన్ చివరి చిత్రం ‘అనోఖి రాత్’ (1968), ఇది నవంబర్ 1967లో ఆయన మరణం తర్వాత విడుదలైంది. ఇందీవర్ రాసిన ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ అయింది. ‘మిలే నా ఫూల్ తో కాంటోం సే దోస్తీ’, ‘ఓ రే తల్ మిలే నదీ కే జల్ మే’, ‘మహలోంకా రాజా మిలా కే రాణి బేటీ’ పాటలు లక్షలాది మంది సంగీత ప్రియులను ఆనందపరుస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలోని ‘ఓ రే తల్ మిలే నదీ కే జల్ మే’ పాటలోని “క్యా హోగా కౌన్ సే పల్ మే కోయి జానే నా” అనే పదాలు రోషన్‌కు అనూహ్యంగా వర్తించాయి. ఓ సమావేశానికి హాజరైన ఆయన అక్కడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.

రోషన్ బహుముఖ స్వరకర్త మాత్రమే కాదు, భారతీయ సినిమాలో గజల్ తరంగాన్ని పరిచయం చేసినందుకు పూర్తి ఘనతకు అర్హులు. అకాల మరణం కారణంగా ఆయనకి దక్కాల్సినన్ని కీర్తిప్రతిష్ఠలు దక్కలేదు. ఏది ఏమైనప్పటికీ, కలకాలం నిలిచిపోయే వారి అనేక మధుర గీతాలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.

రోషన్ 20 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలిక గుండె సమస్యతో బాధపడ్డారు. 16 నవంబర్ 1967న గుండెపోటుతో మరణించారు. వారి అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకి భార్య,  కుమారులు రాకేష్ రోషన్, రాజేష్ రోషన్‌ ఉన్నారు.

70వ దశకంలో రాకేష్ నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టగా, రాజేష్ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 90వ దశకం చివరిలో రోషన్ మనవడు హృతిక్ రోషన్ – తన తండ్రి రాకేష్ రోషన్ తీసిన ‘కహో నా ప్యార్ హై’తో చిత్ర పరిశ్రమలో విజయవంతమైన అరంగేట్రం చేశారు.

హృతిక్ రోషన్ కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన నటనా ప్రదర్శనతో పరిశ్రమలో తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ తన తాత గారి వంశ గౌరవం పట్ల గర్విస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version