Site icon Sanchika

అలనాటి అపురూపాలు – 215

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అలనాటి ప్రతిభామూర్తి నటి దేవికా రాణి:

సుప్రసిద్ధ నటి, నిర్మాత దేవికా రాణి 1908లో మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తండ్రి సర్జన్ కల్నల్ ఎం.ఎన్. చౌదరి. తల్లి లీలా దేవి చౌదరి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ బంధువు.

దేవికా రాణి లండన్‌లోని సౌత్ హామ్‌స్టేట్ స్కూల్‌లో చదువుకున్నారు. పాఠశాల రోజుల్లో ఆమె నటనకు, రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ నుండి ఆమెకు ప్రత్యేక అవార్డు లభించింది. పద్దెనిమిదేళ్ల వయసులో, ఆమె లండన్‌లోని ఒక ప్రసిద్ధ స్టూడియోలో టెక్స్‌టైల్ డిజైనర్‌గా చేరారు.

1928 సంవత్సరంలో, ఆమె (తర్వాతి కాలంలో వివాహం చేసుకున్న) హిమాంశు రాయ్ ప్రొడక్షన్ యూనిట్‌లో చేరారు. 1929లో ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వం వహించిన సంచలనాత్మక చిత్రం ‘ఎ త్రో ఆఫ్ డైస్’ విడుదలైంది. హిమాంశు రాయ్ ఆ చిత్రానికి నిర్మాత. దానిలో నటించారు కూడా. హిమాంశు రాయ్, దేవికా రాణి కలిసి మొదట ఇండో ఇంటర్నేషనల్ టాకీస్ లిమిటెడ్‌ని స్థాపించారు. తరువాత 1934లో సుప్రసిద్ధమైన బాంబే టాకీస్ ఆవిర్భవించింది. 1940లో హిమాంశు రాయ్ మరణానంతరం, దేవికా రాణి ప్రత్యేకంగా నిర్మాణ పనుల్లో లీనమయ్యారు. దాంతో బాంబే టాకీస్ సంస్థ నుండి ఒకదాని తర్వాత ఒకటిగా ‘పునర్మిలన్’ (రీయూనియన్), ‘బంధన్’, ‘భావి’, ‘బసంత’, ‘హమారీ బాత్’ మొదలైన సినిమాలు విజయవంతంగా విడుదలయ్యాయి. ఈ సంస్థ రూపొందించిన ‘కిస్మత్’ అనే సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది. 1945లో, ఆమె ప్రసిద్ధ రష్యన్ పెయింటర్ స్వెటోస్లావ్ రోరిచ్‌ను వివాహం చేసుకున్నారు. 1946 సంవత్సరం నుండి ఆమె చిత్ర పరిశ్రమను శాశ్వతంగా విడిచిపెట్టారు.

భారతీయ సినిమా ప్రప్రథమ నాయిక, ‘ఇండియన్ గార్బో’గా ప్రసిద్ధులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తొలి గ్రహీత అయిన దేవికా రాణి చౌదరి (1908-1994) వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సమాజానికి సవాలు విసిరారు. కాలానికన్నా ఎంతో ముందున్న మహిళ ఆమె. ఆమె జీవిత చరిత్ర రచయిత కిశ్వర్ దేశాయ్ “తిరుగుబాటు స్వభావం, అసాధారణ ప్రతిభ, సౌందర్యం, గొప్ప నటనా చాతుర్యం కల్గిన మహిళ; స్టూడియో అధినేత్రి అయిన దేవికా రాణి, తీవ్రమైన వ్యక్తిగత బాధలు ఉన్నప్పటికీ – భారతీయ సినిమా గమనాన్ని అనేక విధాలుగా మార్చారు” అని పేర్కొన్నారు.

హిమాంశు రాయ్ 1933లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘కర్మ’లో (భారతదేశంలో వెండితెరపై మొదటి ముద్దు సన్నివేశానికి ప్రసిద్ధి) నటించిన తర్వాత దేవికా రాణి లండన్ లోని ఉన్నత వర్గాల్లో సంచలనంగా మారారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, హిమాంశు రాయ్, దేవికా రాణి బొంబాయిలో 1934లో బాంబే టాకీస్ స్టూడియోస్‌ను స్థాపించారు. అది రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన టాకీ స్టూడియోలలో ఒకటిగా మారింది; అనేక విజయాలను సాధించింది. భవిష్యత్తులో పేరుపొందబోయే ఎందరో నటీనటులను అందించింది.

ఈ స్టూడియో నిర్మించిన మొదటి చిత్రం ‘జవానీ కీ హవా’ (1935). దేవికా రాణి, నజ్మ్-ఉల్-హసన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, పూర్తిగా రైలులో చిత్రీకరించబడింది. దేవికా రాణి గురించి చెప్పుకునేటప్పుడు 1936 నాటి ‘అఛూత్ కన్య’ (ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వం) ప్రస్తావన లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించిన అట్టడుగు కులానికి చెందిన పల్లెటూరి యువతి కథ ఇది. అశోక్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సామాజిక దురచారమైన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవాత్మక చిత్రంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ గ్లామరస్ స్టార్ దేవికా రాణి, తాను సాంప్రదాయ బ్రాహ్మణ వివాహిత అయినప్పటికీ – నిస్వార్థ దళిత యువతిగా మనోహరమైన పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందారు. బాంబే స్టూడియోస్ వారి సామాజిక, ఆర్థిక, సంస్థాగత భవిష్యత్తుకు కీలకమైన ‘జీవన్ నయ్యా’ (1936), ‘ఇజ్జత్’ (1937), ‘జీవన్ ప్రభాత్’ (1937), ‘దుర్గా’ (1939) వంటి చిత్రాలకు పనిచేశారు.

బాంబే టాకీస్‌కి చెందిన దేవికా రాణి దృష్టిలో పడిన ఓ పిరికి, నిస్సహాయ యువకుడు  తర్వాతి కాలంలో హిందీ చలనచిత్ర సీమని ఏలాడు. దీని గురించి అశోక్ రాజ్ తను రచించిన ‘Hero: The silent era to Dilip Kumar’ అనే పుస్తకంలో ఇలా వ్రాశారు: “దేవికా రాణి స్థానిక మార్కెట్‌కి షాపింగ్ కోసం వెళ్ళారు. ఒక పండ్ల దుకాణం వద్ద, అమ్మడంలో నిమగ్నమైన యువకుడిని ఆమె ఆసక్తిగా గమనించారు. తన తండ్రికి బదులుగా కొట్లో ఆ రోజు ఆ సిగ్గరి యువకుడు ఉండడం విధి లీల. దేవికా రాణికి ఆ యువకుడి సున్నితమైన ముఖం, కళ్ళలోని వ్యక్తీకరణ అసాధారణంగా తోచాయి. ఆమె అతనికి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి స్టూడియోలో కలవమని చెప్పారు.

బాంబే టాకీస్ అతని తలరాతని మార్చడమే కాకుండా అతని పేరును కూడా మార్చింది – యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్ అయ్యారు. ‘జ్వార్ భాటా’ (1944)తో బాలీవుడ్‍లో అరంగేట్రం చేశారు.”

***

1958లో పద్మ శ్రీ అవార్డు పొందిన దేవికా రాణి సినీరంగానికి విశిష్ట సేవలు అందించారు.

Exit mobile version