Site icon Sanchika

అలనాటి అపురూపాలు – 222

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్టార్‍డమ్ కోరుకోని అలనాటి మలయాళ నటి:

మిస్ కుమారి అనే వెండితెర పేరుతో ప్రసిద్ధులైన మలయాళ నటి అసలు పేరు థ్రేసియమ్మ థామస్. 50, 60 దశకాల్లో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయిక.

***

వాన జోరుగా కురుస్తూంటుంది. బాగా తడిసిపోయిన నీలి, ఓ ఇంటి వరండాలో ఆగుతుంది. లోపలికి రమ్మని ఇంట్లోని శ్రీధరన్ ఆమెను పదే పదే పిలుస్తాడు. ఇక తప్పక ఆమె ఇంట్లోకి వస్తుంది, తడిసిన తన దుస్తులను ఆరబెట్టుకుంటుంది. అప్పటిదాకా చదువుతున్న పుస్తకంపై దృష్టి నిలపలేక, లేచి నీలి ఉన్న గదివైపు నడుస్తాడు శ్రీధరన్.

~

మిస్ కుమారి ప్రధాన పాత్రలో నటించిన ‘నీలకుయిల్’ చిత్రంలోని ఆరంభ దృశ్యం ఇది. 1954 నాటి ఈ సినిమాకి జాతీయ అవార్డుతో పాటు, రాష్ట్రపతి రజత పతకం లభించింది. అప్పట్లో మిస్ కుమారి వయసు 22 ఏళ్ళు. సుమారుగా 12 సినిమాలకు పని చేసి స్టార్ హోదా పొందారు. ఉరూబ్ వ్రాసిన కథ ఆధారంగా దర్శకులు పి భాస్కరన్, రాము కరియత్ తీసిన ‘నీలకుయిల్‌’లో, సత్యన్ పోషించిన అగ్రవర్ణ నాయర్‌తో సంబంధం ఉన్న దళిత అమ్మాయి పాత్రలో ఆమె నటించారు. కుల వ్యవస్థ యొక్క సామాజిక దురాచారాలను; లింగ వివక్షని ప్రశ్నించే ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది ‘నీలకుయిల్’.

ఈ వివరాలు చదవుతుంటే, మిస్ కుమారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. ఆమె కేవలం 37 సంవత్సరాలు జీవించారు. 15 ఏళ్ళ కాలంలో సుమారు నలభై సినిమాలలో నటించిన మిస్ కుమారి, మలయాళ సినీరంగపు తొలి తరం నటీమణులలో ఒకరు. ‘నీలకుయిల్’, ‘నల్లా తంక’, ‘నవలోకం’, ‘పడతా పైంగిలి’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయినప్పటికీ ఆమె ఎన్నడూ స్టార్‌డమ్‌ని కోరుకోలేదు.

అది మలయాళ చిత్ర పరిశ్రమ అప్పటి మద్రాసు నుంచి కేరళకు తరలిపోతున్న సమయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కేరళలో మొదటి స్టూడియో – ఉదయ – 1949లో ప్రారంభమైంది. రెండవది – మెర్రీల్యాండ్ – రెండు సంవత్సరాల తరువాత వచ్చింది. ఉదయతో కెరీర్ ప్రారంభించిన మిస్ కుమారి, ఆ తర్వాత కొన్నాళ్లకు మెర్రీల్యాండ్‌కు మారారు. మెర్రీల్యాండ్ వ్యవస్థాపకుడు పి సుబ్రమణ్యం, ఆమె కుటుంబంతో సన్నిహితంగా ఉండడంతో; ఆమె మరణం తర్వాత కూడా ఈ అనుబంధం కొనసాగింది.

మిస్ కుమారి సినీ రంగ ప్రవేశంపై భిన్న కథనాలు ఉన్నాయి. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు – అనుకోకుండా సినిమాల్లోకి రావడం జరిగిందని ఒకరన్నారు. అయితే, ఆమె కుమారుడు – జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ అయిన బాబు థాలియాత్; అలాగే, మిస్ కుమారి 50వ వర్ధంతి సందర్భంగా ఆమెపై ఒక వ్యాసం రాసిన ప్రఖ్యాత స్క్రిప్ట్ రైటర్ జాన్ పాల్ ఈ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చారు. అప్పటి ప్రసిద్ధ రంగస్థల నటులలో ఒకరైన సెబాస్టియన్ కుంజుకుంజు భాగవతార్ – మిస్ కుమారికి కుటుంబ మిత్రులు. ఉదయ స్టూడియో వారు నిర్మిస్తున్న ‘వెల్లినక్షత్రం’ (1949) నిర్మాతలకు ఆయన మిస్ కుమారిని పరిచయం చేశారని – బాబు, జాన్ పాల్ తెలిపారు.

“మా తాతగారి స్నేహితుడు, అప్పటి ప్రసిద్ధ రంగస్థల నటులు సెబాస్టియన్ కుంజుకుంజు భాగవతార్ – ‘వెల్లినక్షత్రం’ సినిమాలోని ఓ చిన్న పాత్రకు అమ్మ పేరుని సూచించారు” అని బాబు ఓ పత్రికకి తెలిపారు.

‘దర్శన’ పత్రిక కూడా బాబు చెప్పినదాన్నే రాసింది.

మిస్ కుమారి ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లిందనేది అవాస్తవమని తన కథనంలో జాన్ పాల్ రాశారు. ఆమె అప్పటికే టీచర్ ఉద్యోగం చేస్తున్నారని ఆయన వ్రాశారు.

“మా అమ్మ పాలాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. భరణంగణం లోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా బోధిస్తోంది. కుటుంబానికి ఉన్న రంగస్థల వారసత్వమే మా అమ్మను సినిమాల్లోకి తీసుకొచ్చింది’’ అని బాబు చెప్పారు.

మిస్ కుమారి 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగంలో చేరారు. మొదట్లో ఆమె సన్యాసిని కావాలనే అనుకునేవారు. భరణంగణం లోని సెయింట్ మేరీస్ చర్చిలో సమాధి చేయబడిన సెయింట్ అల్ఫోన్సా ఆమెకు గురువు. సంప్రదాయవాద సిరియన్ క్రిస్టియన్ క్యాథలిక్ వాతావరణంలో పెరిగిన ఆమె ఎన్నడూ సినిమా గురించి కలలు కనలేదు. కానీ ఆమె కోసం దేవుని ప్రణాళిక అలా ఉంది. 1962-63లో ‘సినిమా మాసిక’లో ధారావాహికంగా ప్రచురితమైన తన జ్ఞాపకాలలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు.

ఆమె గురించి ఉన్న విభిన్న కథనాలు – ఆమె సినీరంగ ప్రవేశానికి ఆమె సంప్రదాయ కుటుంబ నేపథ్యం ఆటంకం కాలేదనే పేర్కొన్నాయి. జాన్ పాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె తండ్రితో పాటు మిగిలిన కుటుంబమంతా రంగస్థలం పట్ల ఆసక్తి ఉన్నవారే. ఆ ప్రభావం మిస్ కుమారిపై ఉండి ఉంటుందని జాన్ పాల్ అభిప్రాయపడ్డారు.

జర్మన్ సినిమాటోగ్రాఫర్ ఫెలిక్స్ జె బేస్ దర్శకత్వం వహించిన తన మొదటి చిత్రం, ‘వెల్లినక్షత్రం’లో, ఆమె ఒక పాటలో మాత్రమే కనబడతారు. ‘త్రిక్కోడి’ అనే పాటలో ఆమె త్రివర్ణ పతాకాన్ని చేతబూని కనబడతారు. కానీ ఆ ఒక్క పాటతోనే చాలా జరిగింది. ఉదయ స్టూడియో వారి తదుపరి చిత్రం ‘నల్ల తంక’లో మిస్ కుమారికి ప్రధాన పాత్ర లభించింది. వెండితెరపై ఆమె పేరుని థ్రెసియమ్మ నుండి మిస్ కుమారిగా మార్చారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన కె.వి. కోశి ఆమెకా పేరు పెట్టారు. తరువాత ఆమె ఆ పేరునే కొనసాగించారు. తన పెళ్లి శుభలేఖలో కూడా అదే పేరు ఉపయోగించారు. మెర్రీల్యాండ్ స్టూడియోతో ఆమె సంతకం చేసిన ఒప్పందంలో పేరు ‘మిస్ కుమారి (అలియాస్ థ్రెసియమ్మ)’ అని రాసి ఉందని ‘దర్శన’ పత్రిక పేర్కొంది, ఇది ఒక మలయాళీ నటి కేరళకు చెందిన స్టూడియోతో కుదుర్చుకున్న ఒప్పందానికి మొదటి ఉదాహరణ. అప్పట్లో ఆమెకు 7,000 రూపాయల పారితోషికం లభించింది.

“ఆమె తమ ప్రత్యర్థి మెర్రీల్యాండ్ స్టూడియోకి మారటం – ఉదయ స్టూడియోస్‌ని చాలా నిరాశపరిచింది, మారింది థ్రెసియమ్మ మాత్రమే కాదు, ‘మిస్ కుమారి’ అనే బ్రాండ్ కూడా” అని ‘దర్శన’ లో రాశారు.

మెర్రీల్యాండ్ వారి చిత్రం ‘ఆత్మసఖి’తో నటుడు సత్యన్‌ మలయాళ సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మిస్ కుమారి ఈ చిత్రంలో ఆయన సోదరిగా నటించారు. మిస్ కుమారి మరణించినప్పుడు, ఆమె తనకు నిజ జీవితంలో కూడా చెల్లెలు వంటిదే అని రాశారు సత్యన్.

‘ఆత్మసఖి’ సినిమాలో బి.ఎస్.సరోజ కథానాయికగా నటించారు. కుమారి తన జ్ఞాపకాలలో ఇలా రాశారు, “నేను సరోజతో నటించడానికి భయపడ్డాను. మేము కలిసి నటించేటప్పుడు ఆమె ముందు నేను తేలిపోతే ఎలా?”. అదే విధంగా, మిస్ కుమారి తన ప్రతి పాత్రను తరచుగా విమర్శనాత్మకంగా చూసుకునేవారు – తాను ఆ పాత్రకు సరిపోతానా లేదా అని. ఒకానొక కథనంలో, ముత్తత్తు వర్కీ గారి ‘పడతా పైంగిలి’లో చిన్నమ్మ పాత్రను పోషించడంలో తనకున్న సందేహాలను ఆమె రాశారు. పైంగిలి కళా ప్రక్రియకు ప్రసిద్ధి చెందిన చిన్నమ్మ 17 ఏళ్ల అందమైన అమ్మాయి. మిస్ కుమారి ఆ అమ్మాయిగా మారడంలో తనకున్న భయాందోళనలను వ్యక్తం చేశారు. ఆ పాత్ర కోసం వర్కీ తొలుత – ఆనాటి ప్రముఖ నటీమణులు, ట్రావెన్‌కోర్ సోదరీమణులలో రెండవ వారైన పద్మినిని అనుకున్నారని మిస్ కుమారికి తెలుసు. కానీ సినిమా చూసిన తర్వాత, వర్కీ చిరునవ్వుతో, “ఇక నుండి, నా సినిమాలన్నింటిలో కుమారి ఉండాలి” అని అన్నారట. అంత చిన్న వయస్సులో పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, కుమారి విజయాన్ని తన తలకెక్కించుకోలేదు. అందుకు భిన్నంగా, ఆమె తన విజయాన్ని నిరంతరం తగ్గించి చెప్పేవారు, ‘అదృష్టం’ అనేవారు. అయితే ఆమెపై కటువుగా వ్యవహరించిన విమర్శకులు ఆమె నిరాడంబరమైన వ్యాఖ్యల అంతరార్థాన్ని కాక పదాలనే పరిగణించారు. మెర్రీల్యాండ్ ఆమెను ఒక సినిమా తర్వాత మరో సినిమాలో నటింపజేయడం వల్లనే ఆమె విజయం సాధించిందని ఆమె మాటలు సూచిస్తున్నాయని వారు పేర్కొన్నారు. బాల్యసఖి, నీలకుయిల్ వంటి చిత్రాలలో ఆమె నటనను తీవ్రంగా విమర్శించిన సినిక్ వాసుదేవన్ నాయర్ ఆమె విమర్శకులలో ఒకరు. ఆమె ఏడ్చినప్పుడు నవ్వినట్టుంది, నవ్వినప్పుడు ఏడ్చినట్టుందని ఆయన రాశారు.

‘నీలకుయిల్‌’లో దళిత యువతి నీలిగా నటించడం గురించి, సినిక్ (దర్శన పేపర్‍లో) ఇలా వ్రాశారు, “నిర్మాణ బృందం చుట్టూ చూసినట్లయితే, కుల అసమానతల తీవ్రతను అనుభవించిన, నీలి పాత్రను కుమారి కంటే చాలా బలంగా ప్రదర్శించగల వ్యక్తిని గుర్తించి ఉండవచ్చు.”

ఓసారి థియేటర్ రిహార్సల్‌లో సినిక్ వాసుదేవన్, కుమారి ఇద్దరూ పాల్గొన్న సమయంలో – ఆయన రాసిన కఠినమైన సమీక్షలలో ఒకదాన్ని చదివి కుమారి చాలా బాధపడ్డారట. అది చూసి ఆయన కరిగిపోయారని అంటారు. నిజానికి సినిక్ ఆమెతో కలిసి ఓ నాటకంలో నటించారు. పి భాస్కరన్ వంటి వారితో పాటు కుమారి కూడా నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా మారారు. తన మార్గంలో ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కుమారి చేసిన పనిలో వేలు పెట్టడానికి ఏమీ లేకుండా ఉండేది. ఆమె శిక్షణ పొందిన నర్తకి లేదా గాయకురాలు కాదు. ఆ కాలంలోని ఇతర ప్రముఖ నటీమణులు – ట్రావెన్‌కోర్ సోదరీమణులు లలిత, పద్మిని, రాగిణి – అందరూ నాట్యగత్తెలు. కుమారి సినీరంగంపై పెద్దగా అవగాహన లేని సంప్రదాయవాద నేపథ్యం నుండి వచ్చారు. అందుకే, బహుశా ఇతర నటీనటులు ఇష్టపడని పాత్రలను పోషించడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారేమో. “నీలకుయిల్, రాండిడంగళి (తకళి నవల ఆధారంగా), ముడియనయ పుత్రన్ అనే మూడు చిత్రాలలో ఒక నటి దళిత పాత్రలను పోషించడం బహుశా అదే మొదటిసారి” అని బాబు అన్నారు.

కుమారి మూడవ కొడుకైన బాబు, ఆమె 1969లో మరణించినప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఆయనకి ఆమె గురించి జ్ఞాపకాలు లేవు, కానీ మినీ థియేటర్‌లో తల్లి సినిమాలు చూస్తూ పెరిగారు (‘దర్శన’ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇది 1970లలో మిస్ కుమారి చిత్రాలను మాత్రమే ప్రదర్శించింది).

అప్పట్లో తన తల్లికి చాలా డిమాండ్ ఉందని కూడా బాబుకి తెలుసు. ‘అవకాశి’ అనే చిత్రంలో ఆమె ప్రధాన నటుడి కంటే ఎక్కువ పారితోషికం పొందారు. “నటులు – నటీమణుల కంటే చాలా ఎక్కువ పారితోషికం పొందుతున్న ఈ రోజుల్లా కాకుండా – ఆ రోజుల్లో, ఓ చిత్రానికి పనిచేసే ప్రధాన నటీనటులందరికీ లింగభేదం లేకుండా సమానంగా చెల్లించేవారు. ‘నీలకుయిల్‌’లో సత్యన్‌, కుమారిలకు ఒకే మొత్తం చెల్లించారు’’ అని రేష్మి తెలిపారు. ‘అవకాశి’ సినిమా మిస్ కుమారి కెరీర్‍లో మరో ముందడుగు.

నిరాడంబరతే ఆమె ఆభరణం:

మిస్ కుమారి‍కి భౌతిక వస్తువులపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. బయటకు వెళ్ళేటప్పుడు అత్యంత సాదా చీర ధరించి, అతి తక్కువ నగలతో వెళ్ళేవారు. షూటింగులు లేని రోజుల్లో ఎక్కువగా తెల్ల చీరలు ధరించేవారు. జర్నలిస్ట్ సాజు చెలంగాడ్ ఇలా అంటారు, “మా నాన్న (చరిత్రకారుడు చెలంగాడ్ గోపాలకృష్ణన్), యూసుఫ్ ఆలీ కేచేరి (గీత రచయిత-దర్శకుడు) ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఓ సినిమా గురించి మాట్లాడేందుకు ఆమె ఇంటికి వెళ్ళారు. అప్పుడామె తెల్ల చీర, తెల్ల జాకెట్‌లో ఎటువంటి మేకప్ లేకుండా, ఓ సన్యాసినిలా కనిపించారట”.

జాన్ పాల్‍కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాల్, ఆయన సోదరుడు ఎర్నాకుళంలో ఓ రోడ్ మీద వెళ్తున్నారట. అక్కడ మిస్ కుమారి ఏనుగు దంతపు తెలుపు రంగు చీరలో నిరాడంబరంగా నడుచుకుంటూ వెళ్తున్నారట. “ఆమె మనలాంటి సాధారణ వ్యక్తుల లాంటివారే, చాలా సాదాసీదాగా ఉంటారు” అని పాల్ తన సోదరుడికి చెప్పారు. ఒక సినీ నటి తన పనులు తాను చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతూ ఉండటం చూసి ఆయన సోదరుడు ఆశ్చర్యపోయాడట.

దీనికీ, జాతియోద్యమానికి సంబంధం ఉందని అంటారు బాబు. “అందరూ గమనించినట్లుగా, అమ్మ నిరాడంబరత – నగలు లేకుండా, మామూలు చీరలు ధరించడం వంటివి – భారతదేశ జాతీయోద్యమంలో తన వంతు కర్తవ్యాన్ని పాటించడం లాంటిది” అంటారు బాబు.

అమ్మకి జాతీయోద్యమంపై ఆసక్తి ఉందని తాను కవి బాలచంద్రన్ చుల్లిక్కాడ్ ద్వారా విన్నానని బాబు తెలిపారు. దర్శన పత్రిక సమాచారం ప్రకారం, మిస్ కుమారికి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండేది. ఆంగ్లంపై చక్కని పట్టు ఉండడంతో, ఆమె – కామరాజ్, అశోక్ మెహతా వంటి నాటి రాజకీయ నాయకుల ప్రసంగాలను ఇంగ్లీషు, హిందీ నుంచి మలయాళం లోకి అనువదించేవారు.

వివాహ వయస్సు పై అభిప్రాయాలు:

అప్పటికి మిస్ కుమారి సినిమాలు వదిలేసి భార్య, తల్లి అయ్యారు. మహిళల వివాహ వయస్సుపై ఆమెకు స్పష్టమైన, ప్రగతిశీల ఆలోచనలు ఉన్నాయి. ‘దైవబాయవుం సన్మార్గ బోదవుం తలిరిదున్న సంతోషకరమయ కుటుంబజీవితం’ అనే వ్యాసంలో కుమారి – ఆడపిల్లలైనా, మగపిల్లలైనా 25 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే తన విశ్వాసాన్ని గురించి రాశారు, తద్వారా వారికి జీవితం గురించి స్పష్టమైన ఆలోచన మరియు బాధ్యత ఉంటుందని భావించారు. మిస్ కుమారి 1961లో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు 29 ఏళ్లు.

తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని, పెళ్ళి తరువాత నటన కొనసాగించడం ఇష్టం లేదని ఆమె తెలిపారు. అయితే, సినిమాల్లో నటించడం అనేది పెళ్లి పవిత్రతను ప్రభావితం చేస్తుందని తాను భావించనని వెంటనే అన్నారు. పెళ్లి తర్వాత నటించడం గురించి ఎవరో కుమారిని ఒకసారి అడిగినప్పుడు, “వ్యక్తిగతంగా కుటుంబ జీవితం – నటనా జీవితానికి అననుకూలమని నేను అనుకోను. అయితే పెళ్లయిన మహిళ ప్రధాన పాత్రలో కొనసాగేందుకు పరిశ్రమ సదుపాయం కల్పిస్తుందా అనేది నిర్ణయాత్మక అంశం” అని అన్నారామె.

అనుకోకుండా నటి అయినప్పటికీ, సినిమాల్లో నటించడాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారామె. పెళ్ళి తరువాత నటించడం మానేస్తానని తన రచనల్లో ఆమె పేర్కొనలేదు. పెళ్ళి తరువాత, కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. “1967లో ‘అరక్కిల్లం’ అనే చిత్రంలో ఆమె నటించారు” అని రేష్మి తెలిపారు.

రెండేళ్ళ తరువాత, 37 ఏళ్ళ వయసులో, కుమారి మృతి చెందారు. ఆమె సహనటులు కాని, ప్రేక్షకులు కానీ ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. సాజు చెలంగాడ్ ‘ది హిందూ’ దినపత్రికలో ఆమెకు ఉదర సంబంధమైన వ్యాధి ఉండేదని వ్రాశారు.

ఈ విషాదాన్ని పక్కకు పెట్టి, ఓ నటిగా ఆమె కృషిని సదా మదిలో నిలుపుకుంటామని ఆమె కుటుంబసభ్యులు పేర్కొనడం గొప్ప విషయం.

ఆమె నటించిన ‘అవకాశి’ సినిమాలో ఓ పాట లింక్:

https://www.youtube.com/watch?v=uz_2qJob3Ls

Exit mobile version