[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
రామానంద సాగర్:
రామానంద సాగర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది – 1987-88 లో దూరదర్శన్‍లో ప్రసారమైన రామాయణం సీరియల్. కానీ అంతకు మునుపే హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు ఆర్జూ, ఘూంఘట్, జిందగీ, ఆంఖేం వంటి సినిమాలకు ఆయన రచయితగా, దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఇవే కాకుండా అయనకు మరో ఘనత కూడా ఉంది. ఉర్దూ భాషలో గొప్ప నిష్ణాతులు. ఆనాటి ప్రసిద్ధ ఉర్దూ రచయితలలో ఒకరు.
రామానంద్ సాగర్ రాసిన ఉర్దూ నవల ‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’కి రాసిన ముందుమాటలో “అదృష్టవశాత్తో, లేదా దురదృష్టవశాత్తో, రామానంద్ సాగర్ ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యులు కాదు. ఆయన మానవుల పార్టీకి చెందినవారు. మానవత్వపు పతాకాన్ని మోసే కళాకారులలో ఉన్నత స్థాయికి ఎదిగారు” అని వ్యాఖ్యానించారు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్.
రామానంద్ సాగర్ పర్షియన్, ఉర్దూ భాషలలో గొప్ప పండితుడు. వారి కుమారుడు ప్రేమ్ సాగర్, “1942లో, (నాన్నకి) పంజాబ్ విశ్వవిద్యాలయం ‘మున్షీ ఫజల్’ (పర్షియన్‌లో పిహెచ్.డి.) అనే ప్రతిష్ఠాత్మక పట్టాను ప్రదానం చేసింది. నాన్న రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఉర్దూ, పర్షియన్ భాషలలో అత్యున్నత డిగ్రీ పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచి ‘అదిబ్-ఎ-ఆలం’ బిరుదు పొందారు” అని వ్రాశారు.
రామానంద్ సాగర్ లాహోర్ నుండి ప్రచురితమైన డైలీ మిలాప్ అనే ఉర్దూ దినపత్రికలో విలేఖరిగా కెరీర్ ప్రారంభించి, ఆ పత్రిక సంపాదకునిగా ఎదిగారు. 1941లో, ఆయన క్షయవ్యాధి (TB)తో కాశ్మీర్‌లోని శానిటోరియంలో చేరారు. ఆ రోజుల్లో క్షయ ప్రాణాంతకమైన వ్యాధి. రామానంద్ సాగర్ బతకలేరని వైద్యులు నమ్మారు. కానీ, “ఆ మనిషిని ఓడించలేము”.
రామానంద్ సాగర్ – శానిటోరియంలో తన అనుభవాలను రచించసాగారు.
“నాన్న తన రచనలను 1940లలో లాహోర్‌లోని ప్రసిద్ధ ఉర్దూ సాహిత్య పత్రిక అయిన అదాబ్-ఎ-మష్రిక్‌కి ‘మౌత్ కే బిస్తర్ సే’ లేదా ‘డైరీ ఆఫ్ ఎ టిబి పేషెంట్’ పేరుతో పంపడం ప్రారంభించారు. ఈ రచనలను చదివి చలించిపోయారు ఆ పత్రిక సంపాదకుడు. తాను మరణానికి చేరువవుతూ ఇతరులకు జీవించే మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లోని వైరుధ్యాన్ని చూసి కదిలిపోయారు.” అని ప్రేమ్ తెలిపారు. ఈ ధారావాహిక చాలా ప్రజాదరణ పొందింది. రామానంద్ సాగర్ కోలుకుని శానిటోరియం నుండి బయటకు వచ్ఛే సమయానికి, ఉర్దూ రచయితగా స్థిరపడ్డారు.
విపత్తులు, వేదన, బాధలు గొప్ప సాహిత్య రచనలకు స్ఫూర్తినిస్తాయి. భారతదేశ విభజన రామానంద్ సాగర్‍ను కలత పెట్టింది. ఆయన లాహోర్‌లోని తన ఇంటిని వదిలి శ్రీనగర్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ సమయంలోనే ఆయన మానవులలోని దుర్మార్గపు పార్శ్వాన్ని చూశారు. ద్వేషం ఎవరినీ వదలదని సమాజానికి చెప్పాలనుకున్నారు. ‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’ నవల ఇతివృత్తం, ఆయన హృదయంలో జనించిది. ఇది ఆనాటి విషాదంపై వ్రాసిన, అత్యంత ప్రశంసలు పొందిన ఉర్దూ నవలలలో ఒకటిగా నిలిచింది.
రామానంద్ సాగర్ తన కుటుంబంతో శరణార్థిగా, శ్రీనగర్‌లో నివసిస్తున్నప్పుడు, 27 అక్టోబర్ 1947న, కాశ్మీర్‌పై పాకిస్తాన్ దాడి చేసింది. దాంతో వారు మరోసారి శరణార్థుల శరణార్థిగా మారవలసి వచ్చింది.
అక్కడ చిక్కుకుపోయిన పౌరులను తరలించడానికి డకోటా DC-3 విమానాన్ని ఉపయోగించారు. విమానంలో ఎక్కువ మంది ఉండేందుకు వీలుగా సామాను తీసుకెళ్లవద్దని ప్రజలను కోరారు. బిజూ పట్నాయక్ పైలట్. తల మీద పెట్టే పెట్టుకున్న వ్యక్తిని చూసి కోపోద్రిక్తులైన బిజూ పట్నాయక్, “నువ్వు అత్యాశపరుడివి! మనిషిని పణంగా పెట్టి నీ సంపదను నీతో తీసుకెళ్తున్నావు” అంటూ పెట్టిని కిందకి దింపించి, దాన్ని కాలితో తన్నారట. ఆ పెట్టె నిండా రాతప్రతులు ఉన్నాయట. పెట్టిని తల మీద పెట్టుకున్న ఆయనే రామానంద్ సాగర్. అప్పుడాయన కన్నీళ్లు పెట్టుకుని, “ఇవి నా నవల ‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’ రాతప్రతులు, నా నలిగిన భావాలు, నిరర్థకమైన యుద్ధం, శాంతి ఆవశ్యకత గురించి నా భావాలు. నేను నా వెంట తీసుకువెళ్తున్న ఏకైక సంపద ఇదే!” అన్నారట. బిజూ పట్నాయక్ వెంటనే ఆయనను ప్రముఖ రచయితగా గుర్తించి ఆయన పాదాలను తాకారట. వారి కుటుంబం సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంది.
రామానంద్ పడకుర్చీ మేధావి కాదు. కాశ్మీరుపై దాడి జరిగింది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. అలాంటప్పుడు ఆయన ప్రశాంతంగా ఢిల్లీలో కూర్చుని ఏం రాయగలరు? అందుకే, ఢిల్లీలోని తన ముస్లిం మిత్రుడుకి తన కుటుంబాన్ని అప్పజెప్పి, ఆయన మళ్ళీ కాశ్మీర్ వెళ్ళిపోయారు. కొద్ది నెలల క్రితం, మతఘర్షణల కారణంగా లాహోర్ నుంచి తరిమివేయబడిని వ్యక్తి.. తన కుటుంబ సభ్యుల భద్రత కోసం తన ముస్లిం మిత్రుడిని విశ్వసించడం ఎంత గొప్ప విషయం!
అయితే ఆ సమయంలో కాశ్మీరుకు వెళ్ళింది రామానంద్ సాగర్ ఒక్కరే కాదు, ఎందరో సాహితీవేత్తలు కూడా ఆయనతో పాటు కదం తొక్కారు. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, రాజిందర్ సింగ్ బేడీ, చంద్రకిరణ్ సోన్రెక్సా, నవతేజ్ సింగ్, షేర్ సింగ్, రాజ్ బాన్స్ ఖన్నా వంటి ప్రముఖ రచయితలు సాగర్‌తో పాటు యుద్ధ క్షేత్రానికి చేరుకున్నారు. “అక్కడి వాతావరణం స్పెయిన్‌నీ, ఇంటర్నేషనల్ బ్రిగేడ్‌ని గుర్తు చేసింది, అక్కడికి రచయితలు తమ పుస్తకాలలోని పాత్రలయిపోయారు, కవులు తమ కవిత్వం కోసం చనిపోవడానికి సిద్ధమయ్యారు!” అని అబ్బాస్ గుర్తుచేసుకున్నారు.
ఈ యుద్ధక్షేత్రంలోనే ‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’ నవల పూర్తయింది. “నేను ఆ గదిలోకి వెళ్ళేసరికి ఎవరో ఓ కథని చదివి వినిపిస్తున్నారు. చదువుతున్నది రామానంద్ సాగర్. ఉత్సాహవంతుడు. కొద్ది రోజుల క్రితమే ఏమీ లేని నిరుపేదగా ఢిల్లీ చేరుకున్నారు. భార్యాపిల్లల్ని అక్కడ ఉంచేసి, తాను మళ్ళీ యుద్ధక్షేత్రానికి చేరుకున్నారు. అప్పుడాయన తన నవలలోని మొదటి అధ్యాయాన్ని చదువుతున్నారు. ఆయన చదివి వినిపిస్తుంటే – ఆశ, మానవత్వం నిండిన కాంతిమయ వ్యక్తిత్వం గోచరించింది. అంధకారంలో దారి చూపే చిరు దివ్వె ఆయన. ఇకపై అక్కడ చీకటి లేదు, ఎందుకంటే నాకు ప్రకాశవంతమైన మణి దొరికింది” అన్నారు ఖ్వాజా అబ్బాస్.
“ప్రేమ – ద్వేషం అంత బలంగా లేదు. నేను ఈ నవల ద్వారా మీలో ద్వేషాన్ని ప్రేరేపించాలనుకుంటున్నాను. అందువల్ల మీ మనోభావాలు మరింత దృఢమవుతాయి. ఈ హత్యలు, అత్యాచారాలు, హింస పట్ల మీ హృదయపు లోతుల నుండి ద్వేషం వెలువడితే, నన్ను నేను నమ్ముతాను; నవల విజయవంతమవుతుంది” అన్నారు రామానంద్ సాగర్.
“దేశ విభజనపై అత్యంత మానవత్వం కనబరిచిన, రాజకీయంగా తటస్థంగా ఉన్న నవలగా ‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’ ఖ్యాతిని పొందింది” అని వ్యాఖ్యానించారు ప్రొ. ఇష్తియాక్ అహ్మద్.
‘ఔర్ ఇన్సాన్ మర్ గయా’ నవలకు జూలై 1948లో వ్రాసిన తన పరిచయంలో, “నా నుండి రచన రూపంలో బయటకు రావాలనుకునేవి నాలో చాలా ఉన్నాయి. కానీ, చాలా కాలం వరకు, సాహిత్య ప్రయోజనాల కోసం మాత్రమే ఏదైనా వ్రాయలేనని నేను గ్రహించాను. ఎందుకంటే నా ఆత్మకు, మేధకు ఆహారం ఇవ్వడం కంటే నా కడుపు నింపాల్సిన అవసరం చాలా బాధాకరంగా మారింది” అని అన్నారు రామనంద్ సాగర్.