Site icon Sanchika

అలనాటి అపురూపాలు – 227

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అర్దేశిర్ ఇరానీ:

తొలి భారతీయ టాకీగా ‘ఆలమ్ అరా’ సూపర్ హిట్ సినిమాని ఓ మైలురాయిగా నిలిపిన అర్దేశిర్ ఇరానీ గారి మార్గదర్శక స్ఫూర్తికి ప్రణామం.

ఖాన్ బహదూర్ అర్దేషిర్ ఇరానీ (5 డిసెంబర్ 1886 – 14 అక్టోబర్ 1969) రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, చలనచిత్ర పంపిణీదారు, చలనచిత్ర ప్రదర్శనకారుడు మరియు సినిమాటోగ్రాఫర్. భారతీయ సినిమా మూకీ, టాకీ యుగాలకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

అర్దేశిర్ ఇరానీ 5 డిసెంబర్ 1886న బొంబాయి ప్రెసిడెన్సీలోని పూనాలో జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. 1905లో, ఇరానీ యూనివర్సల్ స్టూడియోస్‌కు భారతీయ ప్రతినిధిగా వ్యవహరించారు. అబ్దుల్లా ఈసూఫల్లీతో కలిసి బొంబాయిలో ‘అలెగ్జాండ్రా సినిమా’ అనే థియేటర్‌ని నలభై సంవత్సరాలకు పైగా నడిపారు. ఈ థియేటర్‍లో అర్దేశిర్ ఇరానీ చిత్రనిర్మాణ కళ నియమాలను నేర్చుకున్నారు, సినిమా మాధ్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. 1917లో, ఇరానీ చలనచిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు, తన మొదటి మూకీ ‘నల దయమంతి’ని నిర్మించి 1920లో విడుదల చేశారు.

1922లో, ఇరానీ – దాదాసాహెబ్ ఫాల్కే గారి హిందుస్థాన్ ఫిల్మ్స్ సంస్థ మాజీ మేనేజర్ భోగిలాల్ దవేతో చేతులు కలిపి స్టార్ ఫిల్మ్స్‌ సంస్థని స్థాపించారు. వారి మొదటి మూకీ, ‘వీర్ అభిమన్యు’ 1922లో విడుదలైంది, దీనిలో ఫాతిమా బేగం ప్రధాన మహిళా పాత్రలో నటించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీలో గ్రాడ్యుయేట్ అయిన దవే, ఇరానీ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‍గా పనిచేశారు. వాళ్ళిద్దరూ విడిపోయే ముందు వరకు స్టార్ ఫిల్మ్స్ పదిహేడు చిత్రాలను నిర్మించింది.

1924లో, ఇరానీ మెజెస్టిక్ ఫిల్మ్స్‌ని స్థాపించారు, ఇందులో బిపి మిశ్రా, నావల్ గాంధీ అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకులు చేరారు. ఈ బ్యానర్‍పై తీసిన సినిమాలకు ఇరానీ నిర్మాతగా వ్యవహరించగా మిశ్రా లేదా గాంధీ దర్శకత్వం వహించారు. విజయంతమైన సంస్థగా పేరుపొందినా, పదిహేను చిత్రాల తర్వాత, మెజెస్టిక్ ఫిల్మ్స్ మూతబడింది. ఇది రాయల్ ఆర్ట్ స్టూడియోస్‌ స్థాపనకు దారితీసింది. అయితే, ఈ సంస్థ ఓ శృంగార చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. కొత్త ప్రతిభని ఉపయోగించి ఇరానీ ఈ సంస్థని మెరుగుపరిచారు.

1925లో, ఇరానీ ఇంపీరియల్ ఫిల్మ్స్‌ని స్థాపించారు, ఈ బ్యానర్‍పై అరవై రెండు సినిమాలు తీశారు. నలభై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, ఇరానీ భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకనిర్మాతగా స్థిరపడ్డారు. 14 మార్చి 1931న ‘ఆలమ్ అరా’ విడుదలతో టాకీ చిత్రాలకు ఆద్యులయ్యారు. ఆయన నిర్మించిన అనేక చిత్రాలు తరువాత అదే తారాగణం, సిబ్బందితో టాకీ చిత్రాలుగా వెలువడ్డాయి.  భారతీయ మొదటి ఆంగ్ల చలనచిత్రం, ‘నూర్ జహాన్’ (1931) తీసి గుర్తింపు పొందారు ఇరానీ. అలాగే భారతదేశపు తొలి కలర్ ఫీచర్ ఫిల్మ్ ‘కిసాన్ కన్య’ (1937)ని రూపొందించి మూడు అంశాలలో ప్రథముడిగా హ్యాట్రిక్ ఖ్యాతి పొందారు. చలనచిత్ర పరిశ్రమలో వారి సేవలు – మూకీ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం, నలుపు-తెలుపు చిత్రాలకు రంగులనద్దడానికి పరిమితం కాలేదు. భారతదేశంలో చిత్రనిర్మాణానికి కొత్త దృక్పథాన్ని అందించారు, చిత్రాల కథల కోసం విస్తృత ఎంపికను అందించారు. ఇరానీ తీసిన నూట యాభై ఎనిమిది చిత్రాలలో ఏదో ఒకదానికి సంబంధించిన ఇతివృత్తంతో నేటి సినిమాలు నిర్మించబడుతున్నాయి.

1933లో, ఇరానీ మొదటి పర్షియన్ టాకీ ‘దోఖ్తర్-ఎ-లోర్‌’ను నిర్మించి దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను అబ్దోల్‌హోస్సేన్ సెపంతా రాశారు, ఆయన స్థానిక పార్సీ కమ్యూనిటీ సభ్యులతో కలిసి చిత్రంలో నటించారు కూడా.

ఇరానీ గారి ఇంపీరియల్ ఫిల్మ్స్ సంస్థ – పృథ్వీరాజ్ కపూర్, మెహబూబ్ ఖాన్‌లతో సహా అనేకమంది కొత్త నటులను భారతీయ సినిమాకు పరిచయం చేసింది. అలం ఆరా సెట్స్‌లో తమిళంలో, తెలుగులో పాటలతో ‘కాళిదాస్‌’ అనే సినిమాని నిర్మించారు ఇరానీ. ‘ఆలమ్ అరా’ తీయకుముందు ఇరానీ లండన్ వెళ్ళి పదిహేను రోజుల పాటు సౌండ్ రికార్డింగ్ అధ్యయనం చేసి, ఆ జ్ఞానంతో ‘ఆలమ్ అరా’కు సౌండ్ రికార్డింగ్ చేశారు. ఈ క్రమంలో ఆయన, తనకు తెలియకుండానే ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ రోజుల్లో ఔట్ డోర్ షూటింగ్ లను రిఫ్లెక్టర్ల సాయంతో సూర్యకాంతిలో చిత్రీకరించేవారు. అయినప్పటికీ, బయటి నుండి వెలువడే అవాంఛనీయ శబ్దాలు బాగా ఇబ్బంది పెట్టేవి, అందువల్ల ఆయన స్టూడియోలో భారీ లైట్ల క్రింద మొత్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీంతో కృత్రిమ కాంతి కింద షూటింగ్ చేయడమనే పద్ధతికి ఆద్యులయ్యారు.

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన, అద్భుతమైన కెరీర్‌లో ఇరానీ నూట యాభై ఎనిమిది చిత్రాలను రూపొందించారు. 1945లో తన చివరి చిత్రం ‘పూజారి’ తీశారు. ఇరానీ దాదాసాహెబ్ ఫాల్కేలా జీవించాలని అనుకోలేదు, ఎందుకంటే యుద్ధ కాలం సినిమా వ్యాపారానికి తగిన సమయం కాదని ఆయన గ్రహించారు, ఆ సమయంలో అతను తన సినిమా వ్యాపారాన్ని నిలిపివేసారు. ఇరానీ ఎనభై రెండు సంవత్సరాల వయసులో 14 అక్టోబరు 1969 నాడు బొంబాయిలో మరణించారు.

భారతదేశపు తొలి టాకీ ‘ఆలమ్ అరా’ విశేషాలు:

అర్దేశిర్ ఇరానీ యొక్క ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఆలమ్ అరా’ భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. ఇది వెండితెరపై ధ్వనిని తీసుకువచ్చింది, మూకీ యుగానికి ముగింపు పలికింది. తొలి భారతీయ టాకీ చిత్రం ‘ఆలమ్ అరా’ దాదాపు 93 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ గొప్ప సినిమా గురించి ఇంతకు మించిన అవగాహన మనలో చాలా మందికి లేదు. దురదృష్టవశాత్తు, మనలో చాలామంది ఈ సినిమాని చూడలేదు.

దర్శకుడు అర్దేశిర్ ఇరానీ 1929లో అమెరికన్ చలనచిత్రం షో బోట్‌ని వీక్షించిన తర్వాత భారతదేశపు తొలి మూకీ సినిమా రూపొందించడానికి ప్రేరణ పొందారు. ‘ఆలమ్ అరా’ విశేషం కేవలం ధ్వనిని కలిగి ఉండటం మాత్రమే కాదు, అంత మించిన కారణాలతో ఓ అద్భుతం అని చెప్పచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు, భారతదేశంలో కేవలం మూకీ చిత్రాలే (1913లో రాజా హరిశ్చంద్రతో ప్రారంభించి) ఉన్నాయి, అవి కూడా పురాణాల నేపథ్యంగా ఉండేవి. జనాదరణ పొందిన ఇతివృత్తాన్ని ఎంచుకునేందుకు ఇరానీ అన్నింటినీ పణంగా పెట్టారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూసేందుకు ‘ఆలమ్ అరా’లో హిందీ, ఉర్దూ మిశ్రమాన్ని ఎంచుకున్నారు.

‘ఆలమ్ అరా’, ‘ది ఆర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్’ గా అనువదించబడింది, మూలకథని జోసెఫ్ డేవిడ్ రాసిన పార్సీ నాటకం నుండి తీసుకున్నారు. ఒక యువరాజు (ఆదిల్ జహంగీర్ ఖాన్), ఒక జిప్సీ యువతి (ఆలమ్ అరా) మధ్య ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది. మాస్టర్ విఠల్, జుబేదా ప్రధాన పాత్రలు పోషించారు. విఠల్ పేలవమైన డిక్షన్ కారణంగా, యువరాజు పాత్రని సవరించాల్సి వచ్చింది. ఆయనకి డైలాగ్‌లు లేకుండా చూసేందుకు ఎక్కువగా సగం స్పృహలో లేదా మత్తులో ఉన్నట్లు చూపారు. నిజమే, ఇక్కడి యువరాజు, ‘ఆలమ్ అరా’ కథానాయకుడి మాటలు లేవు!

ఆసక్తికరమైన విషయమేమిటంటే, కపూర్ కుటుంబానికి మూలపురుషుడైన పృథ్వీరాజ్ కపూర్ ‘ఆలమ్ అరా’లో జనరల్ ఆదిల్ ఖాన్ పాత్రను పోషించాడు.

అప్పటికి రికార్డింగ్ పరికరాలు లేకపోవడంతో, ‘ఆలమ్ అరా’ను నిజమైన ధ్వనిని ఉపయోగించి చిత్రీకరించాల్సి వచ్చింది, నటీనటులు తమ డైలాగ్‌లను క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్‌లను జేబులో పెట్టుకుని ఉండేవారు. గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, బొంబాయిలోని మెజెస్టిక్ టాకీలో ‘ఆలమ్ అరా’ ఎలా చిత్రీకరించబడిందన్నది! స్టూడియో రైల్వే ట్రాక్ పక్కనే ఉండేది. దాంతో రైళ్ల రాకపోకలు అత్యంత తక్కువగా ఉండే సమయంలో అంటే అర్ధరాత్రి ఒంటిగంట నుండి తెల్లవారుజామున 4 గంటల వరకూ షూటింగ్ చేశారు.

ఈ చిత్రంలో తానార్ సౌండ్ సిస్టమ్‌లో పాటలు రికార్డయ్యాయి, ఇందులో టనర్ సింగిల్-సిస్టమ్ కెమెరాను ఉపయోగించారు, ఇది నేరుగా ఆడియో, వీడియోలని ఒకే ఫిల్మ్ నెగటివ్‌లో ఒకే సమయంలో రికార్డ్ చేసింది. ‘దే దే ఖుదా కే నామ్ పే ప్యారే’ పాట కేవలం తబలా మరియు హార్మోనియం ఉపయోగించి రికార్డ్ చేయబడింది, ఇది భారతీయ సినిమాలలో మొదటి ప్లేబ్యాక్ పాటగా నిలిచింది. వాస్తవానికి, నేపథ్య సంగీతం మరియు పాటలు నిజమైన ధ్వనిని ఉపయోగించి సృష్టించబడ్డాయి, సంగీతకారులు చెట్ల వెనుక మరియు సెట్ మూలల్లో దాక్కున్నారు.

నటీనటులు తమ స్వరాలతో ‘మాట్లాడటం’ ప్రేక్షకులు చూస్తారనే కారణంతో, ‘ఆలమ్ అరా’ టిక్కెట్ ధరలు ఊహకు అందనంతగా పెరిగిపోయాయి, నాలుగు ఆణాల (25 పైసలు) నుండి రూ. 5కి చేరుకున్నాయి.

‘ఆలమ్ అరా’ మార్చి 14, 1931న విడుదలైంది. సినిమా ప్రమోషన్లు మరియు ప్రకటనల సమయంలో, నిర్మాతలు “All living. Breathing. 100 percent talking” అని ఆంగ్లంలో, “78 ముర్దే ఇన్సాన్ జిందా హో గయే. ఉన్‌కో బోల్తే దేఖో?” అని హిందీలోనూ ట్యాగ్‌లైన్స్ ఉపయోగించారు. ఎందుకంటే ‘ఆలమ్ అరా’ కోసం 78 మంది నటులు తమ గాత్రాలను రికార్డ్ చేశారు.

మొదటి భారతీయ టాకీ చిత్రం ‘ఆలమ్ అరా’ కథ కుమార్‌పూర్ రాజు యొక్క ఇద్దరు రాణులు – నవబహార్,  దిల్ బహార్ – చుట్టూ అల్లబడింది. ఇద్దరూ సంతానం లేనివారు. నవబహార్‌కు కొడుకు పుడతాడు అని ఒక ఫకీరు అంచనా వేయడం, తన రెండవ రాణి పట్ల అధిక ప్రేమని చూపే రాజును ద్వేషించే దిల్ బహార్‌ను అసూయకు గురి చేస్తుంది. దిల్ బహర్‌కు సైన్యాధికారి ఆదిల్‌పై కోరిక ఉంటుంది. అతను తిరస్కరించగా, ఆమె అతనిని ఖైదు చేయిస్తుంది. అతని భార్యని రాజ్యం నుంచి బహిష్కరిస్తుంది. ఆదిల్ భార్య ‘ఆలమ్ అరా’కు జన్మనిచ్చి చనిపోతుంది.

‘ఆలమ్ అరా’ మెడలో ఉన్న తాయెత్తు ఆమె ఆదిల్ కుమార్తె అని తెలుపుతుంది. ఒక రాత్రి ఆమె తాను పెరిగినన సంచారజీవుల శిబిరాన్ని విడిచిపెట్టి, తన తండ్రిని విడిపించేందుకు రాజభవనానికి రహస్యంగా వెళుతుంది. రాజభవనంలో యువరాజు (నవబహార్ కుమారుడు) ఆమెతో ప్రేమలో పడతాడు. ఆఖరి నాటకీయ సన్నివేశంలో, ఆలమ్ అరాను వెతుకుతూ, ఆమె తండ్రిని విడిపించేందుకూ సంచార జాతులవారు నగరానికి చేరుకుంటారు. వారి నాయకుడు అస్లాం – ఆదిల్ ఖైదు చేయబడిన చెరసాలలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో, దిల్ బహార్ తన పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి ఆదిల్‌కి చివరి అవకాశం ఇవ్వాలని అనుకుని అక్కడికి వస్తుంది. ఆదిల్‌ ఆమె కోరికని తిరస్కరించడంతో, ఆమె ఆగ్రహానికి గురై, ఆదిల్‍ని చంపబోగా – అస్లాం తను దాక్కున్న ప్రదేశం నుండి బయటకు అడ్డుకుంటాడు. అదే సమయానికి రాజు, అతని పరివారం కూడా అక్కడికి చేరుకుంటారు. దిల్ బహార్ కుట్ర బహిర్గతమవుతుంది. చివరికి, ఆదిల్ విడుదలవుతాడు, యువరాజు ఆలమ్ ఆరాను వివాహం చేసుకుంటాడు.

‘ఆలం అరా’ సాధించిన అద్భుతమైన విజయం – 1937లో భారతదేశపు మొట్టమొదటి కలర్ ఫీచర్ ఫిల్మ్, ‘కిసాన్ కన్య’తో సహా అనేక చిత్రాలను రూపొందించడానికి అర్దేశిర్ ఇరానీకి ప్రేరణనిచ్చింది.

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం, దురదృష్టవశాత్తు, నేడు, ‘ఆలమ్ అరా’ కాపీ ఏదీ అందుబాటులో లేదు. ఒక అగ్నిప్రమాదంలో అది ధ్వంసమయిందట. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించినప్పుడు, ‘ఆలమ్ ఆరా’ను ప్రదర్శించారు.. హైదరాబాద్‌కు వచ్చిన భారతదేశపు మొదటి టాకీ అని మీడియా విస్తృతంగా కవర్ చేసింది అప్పట్లో.

***

అర్దేశిర్ ఇరానీతో బి.డి. గర్గ నిర్వహించిన రెండు ఇంటర్వ్యూల నుండి క్రింది ప్రశ్నలు-జవాబులు చదవండి. మొదటిది 1949లోనూ, రెండవది దాదాపు 15 సంవత్సరాల తర్వాత 1964లో జరిగింది. మొదటి ఇంటర్వ్యూ సమయంలో, ఆలం అరా పాటలు మరియు డైలాగ్‌లను రికార్డ్ చేయడంలో ఇరానీకి సహాయం చేసిన రుస్తోమ్ భారుచా (తరువాత ఇంపీరియల్ స్టూడియోస్‌ను నిర్వహించే బహుముఖ న్యాయవాది) కూడా ఉన్నారు.

గర్గ: టాకీ సినిమా చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?

ఇరానీ: ‘ఆలమ్ ఆరా’ను నిర్మించడానికి ఒక సంవత్సరం ముందు, నేను ఎక్సెల్షియర్‌లో 40% టాకీ అయిన యూనివర్సల్ పిక్చర్స్ వారి ‘షో బోట్‌’ చూశాను. దీంతో నాకు ఇండియన్ టాకీ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ మాకు అనుభవం లేదు, పైగా అనుసరించడానికి ఎటువంటి పూర్వాపరాలు లేవు. ఎలాగైనా, మేము ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము.

గర్గ: మీ మొదటి చిత్రానికి కథాంశాన్ని ఎలా ఎంచుకున్నారు?

ఇరానీ: ‘ఆలమ్ ఆరా’ అనేది బొంబాయి నాటకకర్త జోసెఫ్ డేవిడ్ గారి ప్రముఖ రంగస్థల నాటకం, ఆయనే దానిని వెండితెరకు అనుకూలంగా మలిచారు.

గర్గ: ఆ రోజుల్లో టాకీ సినిమా షూటింగ్‌లో ఎలాంటి సమస్యలు ఉండేవి?

ఇరానీ: సౌండ్ ప్రూఫ్ స్టేజ్‌లు లేవు, మేము స్టూడియోలో రాత్రి సమయంలో చిత్రీకరించేవాళ్ళం. మా స్టూడియో రైల్వే ట్రాక్‌కు పక్కనే ఉండేది, ప్రతి కొన్ని నిమిషాలకు రైళ్లు వెళ్తుండేవి. కాబట్టి, రైళ్ళ రాకపోకలు అతి తక్కువగా ఉండే గంటల మధ్య షూటింగ్ చేసేవాళ్ళం. పిక్చర్ అండ్ సౌండ్ కోసం ప్రత్యేక నెగటివ్ సిస్టమ్‌ని అనుమతించే నేటి డబుల్ సిస్టమ్‌లా కాకుండా, మేము సింగిల్ సిస్టమ్ టనర్ రికార్డింగ్ పరికరాలతో పని చేసాము. బూమ్స్ కూడా లేవు. కెమెరా పరిధికి దూరంగా ఉండటానికి మైక్రోఫోన్‌లను నమ్మశక్యం కాని ప్రదేశాలలో దాచవలసి వచ్చింది.

గర్గ: ‘ఆలమ్ అరా’ కోసం సౌండ్ రికార్డింగ్ చేయడానికి ముందు ఏదైనా శిక్షణ తీసుకున్నారా?

ఇరానీ: మా కోసం మెషిన్‌ను అసెంబుల్ చేయడానికి బొంబాయికి వచ్చిన మిస్టర్ డెమింగ్ అనే విదేశీ నిపుణుడి నుండి రుస్తోమ్ భారుచా, నేను రికార్డింగ్ యొక్క మౌలికాంశాలను తెలుసుకున్నాము. అతను రోజుకు 100 రూపాయలు వసూలు చేశాడు, ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం, మాకు చాలా పెద్ద ఖర్చు, అందుకని  భరుచా సహాయంతో సినిమా రికార్డింగ్‌ను నేనే స్వయంగా నిర్వహించాను.

గర్గ: సినిమా క్రెడిట్స్‌లో సంగీత దర్శకుడు ఎవరూ లేరని నేను గమనించాను.

ఇరానీ: ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరూ లేరు. సాహిత్యం, ట్యూన్స్‌ని నేనే ఎంచుకున్నాను. కెమెరా పరిధికి దూరంగా ఉన్న హార్మోనియం, తబలా వాద్యకారుడిని మాత్రమే ఉపయోగించాము, గాయకుడు దాచిఉంచిన మైక్రోఫోన్‌లో పాడారు.

గర్గ: సినిమా పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది?

ఇరానీ: ఆ రోజుల్లో మూకీ సినిమాని నెల రోజుల్లో పూర్తి చేశాం. కానీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో సౌండ్ రికార్డింగ్ సమస్యల కారణంగా ‘ఆలమ్ అరా’కు నెలల సమయం పట్టింది. అంతేకాదు టాకీ తీస్తున్నామనే విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా కాపాడిన రహస్యం.

గర్గ: సినిమా నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చయ్యింది?

ఇరానీ: ఈ సినిమా మాకు కేవలం రూ.40,000 ఖర్చయ్యింది. మొదటి భారతీయ టాకీని రూపొందిస్తున్నామన్న నా ఉత్సాహాన్ని పంచుకున్న కళాకారులు, సాంకేతిక నిపుణుల సహకారానికి నా ధన్యవాదాలు. మార్చి 14, 1931న మెజెస్టిక్ సినిమాలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. థియేటర్ వద్ద ప్రేక్షకులు గుంపులు గుంపులుగా ఉండడంతో వారంరోజులు పాటు టిక్కెట్లు దొరకలేదు. బ్లాక్ టికెట్ల వాళ్ళు పండుగ చేసుకున్నారు. దాదాపు అన్ని పాటలు ముఖ్యంగా W M Khan (ఫకీర్ పాత్రధారి) పాడిన పాటలు హిట్ అయ్యాయి.

దే దే ఖుదా కే నామ్ పర్ ప్యారే తాకత్ హై గర్ దేనే కీ కుఛ్ చాహే అగర్ తో మాంగ్ లో ముఝ్‍ సే పాట జనాదరణ పొందింది.

~

ఇవీ అర్దేశిర్ ఇరానీ గారి గురించి, ఆలమ్ అరా సినిమా గురించిన కొన్ని విశేషాలు!

Exit mobile version