అలనాటి అపురూపాలు – 229

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

దర్శకనిర్మాత బి.ఆర్. చోప్రా:

బి.ఆర్. చోప్రాగా సుప్రసిద్ధులైన బల్దేవ్ రాజ్ చోప్రా ఏప్రిల్ 22, 1914న జన్మించారు. భారతదేశంలోని గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరైన బి.ఆర్. చోప్రా, ఒక మార్గదర్శకుడిగా, ట్రెండ్ సెట్టర్‌గా, కొత్త ఆలోచనలను రేకెత్తించి, ఒక సాధారణ చిత్రనిర్మాతకి సాధ్యం కాని ఎన్నో విషయాలను స్పృశించి, గొప్ప సినిమాలను అందించారు. ప్రజలను చైత్యన్యవంతులను చేయాలనుకున్నారు, కానీ పాఠాలు చెప్తున్నట్టో, బోధిస్తున్నట్టో కాకుండా; తను స్థాపించిన సొంత నిర్మాణ సంస్థ బి.ఆర్. ఫిల్మ్స్ క్రియాశీలకంగా ఉన్న అరవై ఏళ్ళల్లో ఆయన – చాలా మంచి సంగీతం, అర్థవంతమైన పాటలు, మంచి కథ, అద్భుతమైన నటనతో కూడిన వినోదభరితమైన సినిమాల ద్వారా ప్రేక్షకులపై ముద్ర వేశారు. ఆ కాలంలో ఇతర నిర్మాణ సంస్థల పోటీని తట్టుకుని, సినీ నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్న సంస్థ బి.ఆర్. ఫిల్మ్స్. భారతీయ సినిమాలున్నంత కాలం ఈ సంస్థ పేరు చిరస్థాయిగా ఉంటుంది.

బల్దేవ్ రాజ్ దేశ విభజనకు ముందు జన్మించారు. చాలా చిన్న వయస్సులోనే – ఇతరులు నడిచే మార్గం కాకుండా, తనదైన స్వీయ పథాన్ని ఎంచుకునే సంకేతాలను ప్రదర్శించారు. యువకులు సివిల్ సర్వీసెస్‌లో ఉండాలని లేదా బ్రిటిష్ రాజ్‌లోని ఏదైనా ఉన్నత కార్యాలయంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకునే ఆ కాలంలో, బల్దేవ్ రాజ్ లాహోర్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ. చేసి, కథలు రాయడం ప్రారంభించారు, తరువాతి రోజుల్లో ‘సినీ హెరాల్డ్’ అనే ఒక ఫిల్మ్ మ్యాగజైన్‌లో సినీ విమర్శకుడిగా పనిచేశారు, వారి సమీక్షల కోసం భారత్, పాకిస్తాన్ లోని చిత్రనిర్మాతలు మరియు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. ఆయన రచయితగా, విమర్శకుడిగా కొనసాగి ఉండవచ్చు, కానీ దేశవిభజన సందర్భంగా జరిగిన విధ్వంసం భారతదేశంలో అడుగుపెట్టేలా చేసింది. చివరకు కలల నగరమైన బొంబాయికి చేరుకున్నారు. ఆయన రచనలు, సమీక్షల వల్ల ఆయన పేరు – ఆయన రాకముందే నగరానికి చేరింది. వివిధ పత్రికలకు రచనలు కొనసాగించారు. కానీ సినీ నిర్మాత అవ్వాలనే కల ఉండేదాయనకు. ఎందుకంటే కథల కంటే, సినిమాలకు ఎక్కువ మందిని చేరుకునే శక్తి ఉందని ఆయన నమ్మారు.

స్నేహితులు, అభిమానులు, బొంబాయిలోని అగర్వాల్ సోదరులు; ఇంకా అప్పటి ప్రముఖ స్టార్  నటుడు అశోక్ కుమార్ అందించిన నిరంతర ప్రోత్సాహంతో బి.ఆర్. చోప్రా దర్శకుడిగా మొదటి అడుగు వేశారు. ఫిల్మ్ మేకింగ్ బేసిక్స్ నేర్చుకోకపోయినా, అశోక్ కుమార్‌తో ద్విపాత్రాభినయం చేసిన ‘అఫ్సానా’ అనే కష్టతరమైన చిత్రం ద్వారా బి.ఆర్. చోప్రా సినీరంగ ప్రవేశం చేశారు (చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్‌తో ‘దాస్తాన్’గా రీమేక్ చేయాలనుకున్నారు). ఈ చిత్రం ఆయనకి ప్రశంసలనీ, మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఆ తర్వాతి రెండు చిత్రాలు ‘షోలే’ మరియు ‘చాందినీ చౌక్’ వారిని రేసులో బలంగా నిలబెట్టాయి. విపరీతమైన యాంత్రీకరణ వల్ల మనిషికి ఎదురయ్యే సమస్యలపై తీసిన సినిమా ‘నయా దౌర్’ తో ఆయన ఉద్దేశాలు, మేధావితనం బహిర్గతమయ్యాయి. ఆ సినిమాలో నాయికానాయకులుగా మధుబాల, దిలీప్‍కుమార్‍లను అనుకున్నారు. అయితే అప్పటికే వారిద్దరూ ప్రేమలో మునిగిఉండడం, తన కూతురు దిలీప్ కుమార్‌కి దగ్గరవడం ఇష్టం లేని మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ సినిమాకి ఆటంకాలు కల్పించడంతో, బి.ఆర్. చోప్రా కోర్టుకు వెళ్ళారు. అది ఓ పెద్ద సమస్యగా మారటంతో చివరకు మధుబాల స్థానంలో వైజయంతిమాలను తీసుకున్నారు. సాహిర్ లుధియాన్వి రాసిన అర్థవంతమైన, కదిలించే గీతాలకు, ఓపి నయ్యర్ అద్భుతమైన సంగీతం జతకాగా ‘నయా దౌర్’  ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దాని కలర్ వెర్షన్‌లో విడుదల చేస్తే, ఆశ్చర్యకరంగా – గత అద్భుతాలు చేయడంలో విఫలమైంది.

‘నయా దౌర్’ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయంలో బి.ఆర్.చోప్రా తమ్ముడు యష్ చోప్రా ICS చదివేందుకు లండన్ వెళ్లాల్సి ఉన్నా, వెళ్ళకుండా అన్నయ్య వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘నయా దౌర్’ విజయం తర్వాత ఎనిమిది విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. స్త్రీ పురుషుల సంబంధానికి సంబంధించిన ‘ఏక్ హి రాస్తా’, ‘సాధనా’, ‘గుమ్రా’, ‘హమ్‌రాజ్‌’ వంటి వాటిలో ప్రముఖమైనవి, అవన్నీ ఇంతకు ముందు సినిమాల్లో ప్రయత్నించని బోల్డ్ సబ్జెక్ట్‌లు. వాటన్నింటికీ బి.ఆర్. చోప్రా దర్శకత్వం వహించారు. తన సొంత బ్యానర్‍పై ప్రసిద్ధి చెందిన చిత్రాలను నిర్మించడం కొనసాగించారు. అత్యాచారాల సంబంధింత వివాదాస్పద చిత్రం ‘ఇన్సాఫ్ కా తారాజూ’; వివాహానికి సంబంధించి కాలం చెల్లిన ముస్లిం చట్టాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన ‘నికాహ్’ వంటి సినిమాలను అందించారు.

తరువాత ఆయన తన జీవితన్ని మలుపు తిప్పిన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం ఆధారంగా మెగా సీరియల్ ‘మహాభారత్’ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ సీరియల్ ఆయనకు సినిమాలు కల్పించలేని ప్రజాదరణను అందించింది. ఆయన ఇప్పుడు కేవలం చిత్రనిర్మాత మాత్రమే కాదు, ‘తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దేవుడు పంపిన దూత’ అని ప్రజలు భావించారు. వృద్ధాప్యం, అనారోగ్యాల కారణంగా ఆయన సంస్థ బాధ్యతలను తన ఏకైక కుమారుడు రవి చోప్రాకు అప్పగించారు. అతను ‘బాగ్‌బాన్‌’, ‘బాబుల్‌’ వంటి చిత్రాలను నిర్మించి తమ సంప్రదాయాన్ని కొనసాగించారు.

హిందీ చిత్రాలకు బి.ఆర్. చోప్రా అందించిన అమూల్యమైన బహుమతి ఏదైనా ఉందంటే, అది వారి తమ్ముడు యష్ చోప్రా అని అంటారు. తండ్రి యష్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకించి – ఐసిఎస్ ఆఫీసర్ కావాలని కోరుకున్నారు. బి.ఆర్. చోప్రా తన తండ్రిని ధిక్కరించి, తన సోదరుడిని ఐసిఎస్‌లో చేరకుండా కాపాడి, భారతీయ సినిమాను రక్షించి ఉండకపోతే భారతీయ సినిమా ఎలా ఉండేదో ఊహించలేం. ఈ అద్భుతమైన వ్యక్తి చేసిన కృషిని విస్మరించడం అంత సులభం కాదు. నిస్సందేహంగా మన కాలంలోని సినిమాల్లో గొప్ప వ్యక్తులలో ఒకరైన వ్యక్తి, ఒక ఆశావాది. ఏదేమైనా ఎప్పటికీ జనాల హృదయాలకి దూరంకాని వ్యక్తి.

మనిషి ప్రతి రంగంలో గొప్ప పురోగతి సాధించవచ్చు, ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు మనిషి సమాధానాలు కనుగొనవచ్చు. మనిషి తన ఆత్మను సాంకేతికకు అమ్ముకోవచ్చు, టెక్నాలజీలో సాధించిన అత్యంత నమ్మశక్యంకాని పురోగతి ఉంది. కానీ ఒక్క వ్యక్తి జీవితంలో ఒక రంగంలో ఇంత పురోగతి సాధించి, సినిమాలను ఎలా అందించగలడు? మనిషిని, అతని ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించిన పూజారులు, సాధువులు, పవిత్ర పురుషులు, ఇంకా ఇతర అద్భుత వ్యక్తులు ఉన్నారు. కొందరు విజయం సాధించారు, ఎక్కుఅవ మంది విఫలమయ్యారు. కొందరు తమ పవిత్ర మార్గాలలో నడవడంలో తామెంత అపవిత్రంగా ఉన్నారో నిరూపించారు. కానీ బి.ఆర్. చోప్రా విజయం సాధించిన ఒక వ్యక్తి.

భారతీయ సినీరంగంలో బి.ఆర్. చోప్రా విశేషమైన కృషి చేశారు. ఆయన సినిమాలు, ఆయన సినిమాల సబ్జెక్ట్‌లు, సాహిత్యం, సంగీతం అన్నింటికి మించి తన సినిమాల ద్వారా ఆయన అందించగలిగిన సందేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

డాక్టర్ బి.ఆర్. చోప్రా అనే వ్యక్తి తనకు తానుగా సాధించిన ఈ గౌరవానికి నిస్సందేహంగా అర్హులు.

దేశవిభజన విధ్వంసపు బాధితుడిగా ఉన్నప్పుడు వారి మనస్సు ఎలా పని చేసిందో ఆలోచించండి, కష్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని; మనుషుల కోసం మార్గాలను కనుగొనాలని నిర్ణయించుకున్నారు. బలదేవ్ రాజ్ చోప్రా తమ కాలం కంటే ముందున్న సినిమాలను తీయడానికి కాలంతో పోరాడుతూ సినిమాలు తీశారు.

ఆయనలో కథలు చెప్పే నేర్పు ఉంది; ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న వెండితెరకు కథలు చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించారు.

ఒక మనిషి మరొకరు అర్థం చేసుకోవడం, పురుషుడు స్త్రీని బాగా తెలుసుకోవడం వంటి వాటి గురించి కథలు చెప్పారు.

మనిషి తన ఆత్మను, స్ఫూర్తిని అమ్ముకుంటూ సాధిస్తున్న అభివృద్ధి గురించి కథలు చెప్పారు.

దేశం గురించి, సామరస్యం గురించి, మానవత్వం గురించి, ప్రేమ, శాంతి మరియు అవగాహన గురించి మాట్లాడారు.

మారుతున్న సంప్రదాయాలు, విలువలు, ఆచారాలు, పద్ధతుల గురించి కథలు, ఎంతో ధైర్యంగా చెప్పారు.

దేశం గర్వించదగ్గ సినిమాలు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన సినిమాలు తీశారు.

ఆయన ఎప్పుడూ రాజీపడలేదు; తమ సంస్థ సాధించిన పురోగతిపై ఎప్పుడూ గర్వపడలేదు.

చీకటిని తరిమివేసేందుకు, వెలుగును చూపించేందుకు సినిమాలు తీశారాయన..

ఆరు దశాబ్దాలకు పైగా బల్దేవ్ రాజ్ చోప్రా, బిఆర్ ఫిల్మ్‌లు ఉన్నత స్థాయికి చేరుతూనే ఉన్నాయి, వారి సినిమాలు ఎక్కువ మందికి చేరువయ్యాయి.

కానీ చిన్నవాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా, మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళయినా కాలం ఎవరినీ విడిచిపెట్టదు. బి.ఆర్. చోప్రా గొప్ప విజయ గాథ నవంబర్ 5, 2008న ముగిసింది. అయితే విషాదాలు బిఆర్ ఫిల్మ్స్ తలుపును తడుతూనే ఉన్నాయి. బి.ఆర్. చోప్రాకు స్ఫూర్తిగా నిలిచిన వారి భార్య ప్రకాష్‌ ఆయన చనిపోయిన కొన్ని వారాలకే మరణించారు. వారి ఏకైక కుమారుడు, తండ్రి తరువాత బిఆర్ ఫిల్మ్స్‌ బాధ్యతలని తీసుకున్న రవి చోప్రా రెండేళ్ల తర్వాత చాలా చిన్న వయస్సులో, ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు.

బిఆర్ ఫిల్మ్స్‌ని ప్రస్తుతం బిఆర్ చోప్రా కోడలు, రవి చోప్రా భార్య శ్రీమతి రేణు చోప్రా, ఆమె కుమారులు అభయ్, కపిల్ నడుపుతున్నారు. వారు బిఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. మరో మూడు సినిమాల ప్లాన్‌లలో బిజీగా ఉన్నారు. ధైర్యవంతుడు, సాహసి అయిన వ్యక్తి సొంత బ్యానర్ అయిన బిఆర్ ఫిల్మ్స్ రాబోయే సంవత్సరాల్లో మరెన్నో సినిమాలను అందిస్తుంది.

డాక్టర్ చోప్రా చివరి రోజులు:

బిఆర్ చోప్రా డెబ్బైల చివరలో ఉండగా, ‘బాగ్‍బన్’ అనే చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు. కథని ఎంతో ఇష్టంగా ఆయనే స్వయంగా రాసుకున్నారు, అది తన వీడ్కోలు చిత్రం కూడా కావచ్చునని అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పట్ల పిల్లలు నిరాదరణ చూపి చెడుగా ప్రవర్తించే కథ. తన అభిమాన నటుడు, దిలీప్ కుమార్‌, రాఖీలతో తీయాలనుకున్నారు. ఈ సినిమాను అంగీకరించమని దిలీప్ కుమార్‌ని ఎన్నో సార్లు అడిగినా, ఎందుకో దిలీప్ కుమార్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూనే వచ్చారు.

ఈ దశలోనే చోప్రా ‘మహాభారతం’ ఆధారంగా టీవీ-సీరియల్‌ని రూపొందించాలని అనుకున్నారు. స్క్రిప్ట్‌పై పని చేయడానికి ఆయనకి రచయితల బృందం ఉంది, కానీ చోప్రా ప్రసిద్ధ ఉర్దూ రచయిత డాక్టర్ రాహి మాసూమ్‌ను ఎంచుకోవడం పెద్ద ఆశ్చర్యం. సంభాషణల రచయితగా డాక్టర్ రజా ఎంపిక కారణంగా ఐ.కె. గుజ్రాల్ నేతృత్వంలోని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దాదాపుగా వెనక్కి తగ్గింది, కానీ చోప్రా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. సీరియల్ ప్రసారం అయినప్పుడు, సీరియల్ లోని డాక్టర్ రజా సంభాషణలు – భారతదేశంలోనే కాకుండా (ఈ సీరియల్ ప్రసారమైనప్పుడల్లా దేశం టీవీ-సెట్‌లకు అతుక్కుపోయేది) పాకిస్తాన్, గల్ఫ్ అంతటా, సౌదీ అరేబియాలో కూడా విపరీతమైన ఆదరణ పొందాయి. ఈ సీరియల్, బి.ఆర్. చోప్రా కజిన్, డాక్టర్ రామానంద్ సాగర్ తీసిన ‘రామాయణం’ విషయంలో ఏ సీరియల్ మంచిదనే దానిపై అంతులేని చర్చ జరిగింది. చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం, డాక్టర్ సాగర్ యొక్క ‘రామాయణం’ అత్యంత ప్రభావం చూపిన సీరియల్. ఇది రాముడు, సీత, రావణుడు మరియు ఇతర హిందూ దేవతలందరిపై ఆసక్తిని పునరుద్ధరించడానికి దారితీసింది.

ముంబయిలోని ఫిలిం సిటీలో ‘మహాభారత్’ షూటింగ్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు, బిఆర్ చోప్రా అనారోగ్యంపై తొలి సంకేతాలు అందాయి, వెంటనే ఆయన తన కొడుకు రవికి సీరియల్ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

కానీ, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, దిలీప్ కుమార్‌తో ‘బాగ్‍బన్’ తీయడం గురించే ఆలోచించేవారు. అదే ఇతివృత్తంతో సంజీవ్ కుమార్, మాలా సిన్హాలతో ‘జిందగీ’; రాజేష్ ఖన్నా, షబానా అజ్మీలతో ‘అవతార్’; జితేంద్ర, మౌసమీ ఛటర్జీలతో ‘సంతాన్’ వంటి ఇతర చిత్రాలు ఉన్నాయని ఆయనకు తెలియదు.

తానే ప్రధాన పాత్రలో నటిస్తూ, ‘కళింగ’ అనే తన సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాలని దిలీప్ కుమార్ నిర్ణయించుకున్నప్పుడు బి.ఆర్. చోప్రాకు పెద్ద షాక్‍గా తగిలింది. ఆరోగ్యం, జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నందున ఈ పరిణామాల గురించి ఆయనకు తెలియదు, కానీ ఆరోగ్యం బాగున్నప్పుడూ, ఉత్సాహంగా ఉన్నప్పుడూ, ఆయన దిలీప్ కుమార్‌తో ‘బాగ్‍బన్’ తీయడం గురించే మాట్లాడేవారు. వారి కుమారుడు రవి తన తండ్రి పడుతున్న వేదనను భరించలేక చివరకు తన స్నేహితుడైన అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడారు. అమితాబ్ ఫ్లాప్ నటుడిగా పరిగణించబడుతున్నప్పుడు, రవి ఆయనని తాను దర్శకత్వం వహించిన ‘జమీర్’ సినిమాలో తీసుకున్నారు. తరువాతి కాలంలో మిలీనియం స్టార్‍గా మారిన అమితాబ్, హేమ మాలిని తన భార్యగా ‘బాగ్‍బన్’ సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించి, బిఆర్ ఫిల్మ్స్‌కు మరో గొప్ప పునరుజ్జీవనానికి మార్గం చూపింది. అయితే 12 ఏళ్ళకు పైగా ఈ సినిమా గురించే ఆలోచించిన బి.ఆర్. చోప్రా ఈ సినిమా విజయాన్ని చూసే పరిస్థితి లేకపోయింది.

బి.ఆర్. చోప్రా పరిస్థితి మరింత దిగజారడంతో డాక్టర్లు అతని కుటుంబాన్ని ఏ కార్యకలాపంలో పాల్గొనడానికి అనుమతించవద్దని, కార్యాలయానికి కూడా పంపవద్దని సూచించారు. బి.ఆర్. చోప్రా దాదాపు కోమా స్థితిలో ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా ప్రతీ రోజూ ఉదయం పదకొండు గంటలకు స్వస్థతకొచ్చేవారు. కారులో తమ ఆఫీసుకు తీసుకెళ్లే వరకు ఎవరి మాటా వినేవారు కాదు. ఒక్కోసారి ఒకటి రెండు గంటలు కూర్చుని, తన రచయితలు, సిబ్బందితో (వారిని గుర్తించలేకపోయినా) భోజనం చేసాకా, అప్పుడు తనని ఇంటికి తీసుకెళ్లమని తన కోడల్ని అడిగేవారు.

నమ్మడం కష్టమే అయినా, ఆఫీసులో జీతాలిచ్చే రోజైన ప్రతి నెలా ఏడో తేదీన అకస్మాత్తుగా చైతన్యం వచ్చేదాయనకి. ఆఫీసుకు తీసుకువెళ్ళమని కుమారుడిని బ్రతిమాలి – నూట డెబ్బై చెక్కులపై సంతకాలు చేసి ఇంటికి తిరిగి వచ్చేవారు.

అయితే, జీవితం కొనసాగుతుంది! బి.ఆర్. చోప్రా చేసిన మంచి పనుల విలువను తెలుసుకోవాలంటే, ఆనంద్ విల్లాలోని బిఆర్ ఫిల్మ్స్ కార్యాలయాన్ని సందర్శించాలి, ఇది షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ కార్యాలయం పక్కన, 60, 70 దశకాల ప్రముఖ నటి సాధన ఒకప్పటి తమ భవనం స్థానంలో కట్టించిన సంగీతా అపార్టు‍మెంట్ల పక్కన ఉంది. శ్రీమతి రేణు చోప్రా అనుమతి ఉంటే, శ్రీమతి చోప్రా, ఇంకా ఆమె కుమారులు ఒక దశాబ్దం పాటు నిర్వహిస్తున్న మ్యూజియాన్ని చూడవచ్చు. ఇది డాక్టర్ బి.ఆర్. చోప్రా వైభవాన్ని చాటుతుంది.

బి.ఆర్. చోప్రా తీసిన, వారి సోదరుడు యశ్ చోప్రాకి మార్గదర్శకాలు ఉపకరించిన సినిమాల గురించి చెప్పుకుందాం:

దూరదృష్టి గల చిత్రనిర్మాత.. బల్దేవ్ రాజ్ చోప్రా పట్ల కాలం దయ చూపలేదు. ఆయన తన తమ్ముడు యష్‌కి చాలా మేలు చేశారు. నిజానికి బిఆర్ చోప్రా తన తోబుట్టువులకు సినిమా నిర్మాణానికి సంబంధించి ప్రతిదీ నేర్పించారు. బి.ఆర్. చోప్రా తన కాలం కంటే ముందున్న నిజమైన బ్లూ రిఫార్మిస్ట్ ఫిల్మ్ మేకర్, ప్రజలను అలరిస్తూ సమస్యలను పరిష్కరించే సినిమాలు తీశారు.

1973లో దాగ్‌తో స్వతంత్ర నిర్మాత-దర్శకుడిగా మారడానికి ముందు యష్ చోప్రా తన అన్నయ్య బ్యానర్‌లో ధర్మపుత్ర, ధూల్ కా ఫూల్, వక్త్, ఇత్తెఫాక్ వంటి ల్యాండ్‌మార్క్‌ హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమ్ముడు తన నుండి విడిపోవడం బి.ఆర్. చోప్రాగారికి పెద్ద దెబ్బ, అయినప్పటికీ ఆయన తన సోదరుడు లేకుండా చాలా విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

బి.ఆర్. చోప్రా దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఉత్తమ చిత్రాలు:

  1. అఫ్సానా (1951): ద్విపాత్రాభినయ చిత్రాల పితామహుడు, అశోక్ కుమార్‌ను ఇద్దరు సోదరులు రతన్ మరియు చమన్‌గా పూర్తిగా భిన్నమైన ఆకాంక్షలతో చూపించారు. ఆ రోజుల్లో ద్విపాత్రాభినయం చేయడం ఈనాటిలా అంత సులువు కాదు. బి.ఆర్. చోప్రా మొదట ఒక అశోక్ కుమార్‌తో షూట్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత మరొకరితో షూట్ చేసి, రెండు షాట్‌లను కలిపి ఒకదానిలా కనిపించేలా చేశారు. ‘రామ్ ఔర్ శ్యామ్’, ‘సీతా ఔర్ గీతా’, ‘హసీనా మాన్ జాయేగీ’, ‘జుడ్వా’ వంటి అన్ని ప్రసిద్ధ ద్విపాత్రాభినయ చిత్రాలకు ‘అఫ్సానా’ మార్గదర్శనం చేసింది. అశోక్ కుమార్ – బి.ఆర్. చోప్రాకి ఇష్టమైన నటుడు. వారు తర్వాత కానూన్ (1960లో పాటలు లేని కోర్ట్‌రూమ్ డ్రామా), ఏక్ హి రాస్తా, గుమ్రా మొదలైన సినిమాలకు పనిచేశారు.
  2. నయా దౌర్ (1957): భారతీయ సినిమా యొక్క అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటి, ‘నయా దౌర్’ గ్రామీణ భారతదేశంపై పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావాన్ని ప్రస్తావించింది. ఈ సినిమాకి చోప్రా గారు ఎంతో శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. కానీ, ఈ సినిమా హీరో దిలీప్ కుమార్ చెప్పినట్లుగా – నాయికగా మధుబాలను తొలగించాల్సి రావడం, ఆమె స్థానంలో వైజయంతి మాల రావడం వంటి వివాదాలే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాయి. తమ రొమాంటిక్ అసోసియేషన్ ముగిసిన తర్వాత దిలీప్ కుమార్ మధుబాలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. ఇతర ముఖ్యమైన అంశాలతో పాటు ఓపి నయ్యర్ అందించిన సూపర్ హిట్ పాటల వల్ల ‘నయా దౌర్’ ఈనాటికీ గుర్తుండిపోతుంది.
  3. సాధన (1958): ఒక వేశ్య యొక్క పునరావాసం గురించి సంస్కరణ దృక్పథంతో తీసిన సినిమా ఇది. జెండర్ ఎంపవర్‍మెంట్ ఓ ఫ్యాషన్‌గా మారడానికి చాలా కాలం ముందే లింగ సాధికారత గురించి మాట్లాడింది ఈ సినిమా. ‘ఔరత్ నే జనమ్ దియా మర్దో కో, మర్దో నే ఉస్సే బజార్ దియా’ అనే గొప్ప పాటని ఈ సినిమాకి సాహిర్ లుధియాన్వీ రాశారు. మన సమాజంలో స్త్రీల స్థితిగతులపై సాహిర్ లుధియాన్వీ చెప్పిన ఈ మాటలు నేటికీ నిజం. సంస్కరణవాద చిత్రనిర్మాతగా బి.ఆర్. చోప్రా కీర్తి – ఆకట్టుకునే పనితనంపై ఆధారపడింది.

సాధన ఒక వేశ్య పునరావాసం గురించిన సినిమా ఐతే, మరో సంవత్సరం తర్వాత బి.ఆర్. చోప్రా నిర్మించిన ‘ధూల్ కా ఫూల్’ మరో శక్తివంతమైన ఇతివృత్తానికి సంబంధించినది. ఓ అవివాహిత మాతృత్వం అనే అంశంతో తీసిన సినిమా. చాలా కాలం తర్వాత తీసిన ‘నికాహ్’ ఇస్లామిక్ చట్టాలపై దృష్టి సారించింది, అవి స్త్రీ వైవాహిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపింది. సంస్కరణవాద ప్రగతిశీల సినిమాల పట్ల బి.ఆర్. చోప్రా యొక్క నిబద్ధతను గుర్తుచేసుకుంటూ, వారి సినిమాలు – ‘నయా దౌర్’, ‘సాధన’ లలో నాయికగా నటించిన వైజయంతి మాల మాట్లాడుతూ, “సాధన, ఇంకా నయా దౌర్ చిత్రీకరణ సమయంలో నేను వారి నుండి చాలా నేర్చుకున్నాను. రెండూ ప్రగతిశీల సామాజిక సంబంధిత సబ్జెక్టులు. అతని సినిమాలో అతిశయోక్తులు, దేన్నైనా అతిగా చూపించడాలు ఉండవు. ‘నయా దౌర్‌’లో పల్లెటూరి అమ్మాయిగా నటించాను. కానీ ఎక్స్‌పోజర్‌ రాలేదు. ఈరోజు హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలుగా నటిస్తే, దర్శకులు వారి వేషధారణలను, హావభావాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను చోప్రా సాబ్‌తో నా రెండు ఉత్తమ సినిమాలు చేసినప్పుడు మేము ఒక పెద్ద కుటుంబంలా ఉండేవాళ్లం. ఆయన గొప్ప సినిమా నిర్మాత మాత్రమే కాదు, అద్భుతమైన మనిషి కూడా. వారి అత్యుత్తమ, అత్యంత విజయవంతమైన రెండు చిత్రాల్లో నటించడం నా అదృష్టం” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here