[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
పెర్సిస్ ఖంబట్టా – అసలు కథ!
ఇటీవలి కాలంలో భారతీయ నటీమణులు అంతర్జాతీయ సినిమాలలో నటించడం సాధారణం అయిందేమో గాని, కానీ ఈ ఘనతని అప్పటి బొంబాయిలో పుట్టి పెరిగి హాలీవుడ్‌లో ప్రవేశించిన మోడల్, నటి ఎప్పుడో సాధించారు. గొప్ప అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ సిరీస్ అయిన ‘స్టార్ ట్రెక్’ మొదటి భాగంలో ‘యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజస్’ అనే డెల్టన్ స్టార్‌ఫ్లీట్‌పై ఆఫీసర్‌గా నటించి హృదయాలను కొల్లగొట్టారు ఆమె.
ఆ పార్సీ మహిళ ఎవరో కాదు, సుకుమారి పెర్సిస్ ఖంబట్టా! అయినప్పటికీ తమ కాలంలో విశేషంగా రాణించి మరుగున పడిన ఎందరో నటీమణుల వలె పెర్సిస్ కూడా చరిత్ర పేజీలలో మిగిలిపోయారు. ఇది ఆమె కథ.
పెర్సిస్ స్వతంత్ర్య భారతదేశంలో ఓ పార్సీ జంటకి బొంబాయి నగరంలో 2 అక్టోబరు 1948 నాడు జన్మించారు. అయితే తనకి రెండేళ్ళ వయసులోనే తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. పెర్సిస్‌ని వాళ్ళమ్మగారు పెంచారు. “అదెంతో కష్ట కాలం. మాలో (పార్సీలలో) కుటుంబానికి విలువెక్కువ. నేను హాస్య ప్రియత్వాన్ని, తోలు మందాన్ని అలవర్చుకున్నాను. కానీ విభిన్నంగా ఉండడం వల్ల నేను బాధపడ్డాను” చెప్పారామె.
అయితే 13వ ఏట ఆమె జీవితం మలుపు తిరిగింది. కీర్తి ప్రతిష్ఠలు వచ్చిపడ్డాయి. అప్పటి బొంబాయికి చెందిన ఒక సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ ఆమె నిష్కల్మషమైన రూపాన్ని ఫొటోలు తీయగా, వాటిని ప్రముఖ సబ్బు రెక్సోనా ప్రకటనలో ఉపయోగించుకున్నారు. దీంతో ఆమె చిరు అడుగులు మోడలింగ్ వైపు పడ్డాయి. 17 ఏళ్ళ లేత వయసులో, వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్న మిస్ ఇండియా పీజెంట్ పోటీలలో ఆమె ర్యాంప్‌పై నడిచారు. న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మెప్పించి, విజేతగా నిలిచారు. ఈ యువ అందగత్తె 1965లో మిస్ యూనివర్స్ పీజెంట్ పోటీలో పాల్గొన్న మూడవ భారతీయ యువతిగా గుర్తింపు పొందారు. అదీ కూడా చివరి నిమిషంలో లభించిన ఇతరుల దుస్తులతోనే! భారతదేశంలో కొత్తగా పేరు ప్రఖ్యాతులు లభించడంతో, నేషనల్ కారియర్ ఎయిర్ ఇండియా, కాస్మెటిక్ బ్రాండ్ రెవలాన్, ప్రఖ్యాత చీరల కంపెనీ గార్డెన్ వరేలీ వంటివాటికి మోడల్‌గా వ్యవహరించారు. కామసూత్ర ప్రకటనలోనూ ఎంతో అందంగా కనబడ్డారు. దీంతో సినీ అవకాశాలు లభించాయి. కె.ఎ. అబ్బాస్ గారి 1968 సినిమా ‘బంబయి రాత్ కీ బాహోం మే’ లో క్యాబరే డాన్సర్ లిల్లీ పాత్ర పోషించారు. టైటిల్ సాంగ్ ఆమెపై చిత్రీకరించారు. ఈ సినిమాకి సినెమాటోగ్రఫీకి గాను జాతీయ అవార్డు లభించింది. అయితే ఇక్కడి సినీ పరిశ్రమలో ప్రొఫెషలిజం లోపిస్తోందని భావించి ఆమె బ్రిటన్‌లో మోడలింగ్ కెరీర్ కొనసాగించేందుకు లండన్ వెళ్ళిపోయారు. ఆమెకు 1975లో హాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు లభించాయి. ‘కండక్ట్ అన్‌బికమింగ్’ సినిమాలో రిచర్డ్ ఆటెన్‌బరో, మైఖేల్ న్యూయార్క్, ట్రెవర్ హోవార్డ్‌ల సరసన నటించారు. ‘ది విల్బీ కాన్స్పిరసీ’ చిత్రంలో మైఖేల్ కైన్ సరసన, సిడ్నీ పోయిటియెర్ తోను నటించారు. అయితే ‘స్టార్ ట్రెక్: ది మోషన్ పిక్చర్’లో మానవులు తట్టుకోలేని సెక్స్ ఫెరోమెన్‌లను విడుదల చేసే ‘లెఫ్టినెంట్ ఇలియా’ పాత్రలో ‘యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజస్’ అనే డెల్టన్ నావిగేటర్‌గా నటించడం ఆమెకు మరిన్ని అవకాశాలు కల్పించింది. అప్పుడామె వయసు 29 ఏళ్ళు. స్టార్ ట్రెక్ సృష్టికర్త జీన్ రాడెన్‌బెర్రీతో జరిగిన ఆడిషన్‍లో ఆమె 1.99 డాలర్ల విలువైన ‘బాల్డ్ క్యాప్’ ధరించడం ఆమెకు మేలయింది, ‘లెఫ్టినెంట్ ఇలియా’ పాత్ర ఆమెకి దక్కింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం గుండు గీయించుకున్నందుకు గాను ఆమె ప్రఖ్యాతి గాంచారు. తొలుత ఐదేళ్ళ పాటు కొనసాగే టీవీ సీరిస్‌గా ఈ సినిమాని తీద్దామనుకుని ఆమె చేత ఐదేళ్ళకు ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఐదేళ్ళ పాటు వేరే పని లేకపోయినా, ఇది టీవీ సీరిస్ కాకుండా సినిమాగా మారినందుకు ఆమె ఎంతో సంతోషించారు. తన సినీ జీవితంపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. ఇక తరువాతది అంతా చరిత్రే. స్టార్ ట్రెక్‌లో తన నటనకు గాను ఆమెకు ‘శాటర్న్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్’ లభించింది. దీంతో ఆమెకు సిల్వెస్టర్ స్టాలోన్ సరసన ‘నైట్ హాక్స్’ (1981) సినిమాలోనూ, ఇంకా మెగాఫోర్స్ (1982), ‘వారియర్ ఆఫ్ ది లాస్ట్ వరల్డ్’ (1983), ‘ఫీనిక్స్ ది వారియర్’ (1988) సినిమాలలో నటించే అవకాశాలు లభించాయి. జేమ్స్ బాండ్ సినిమా ‘ఆక్టోపుస్సీ’ (1983)లో కథానాయిక పాత్రకి పెర్సిస్‍ని అనుకున్నా చివరికి ఆ అవకాశం మౌడ్ ఆడమ్స్‌కి లభించింది. తన హాలీవుడ్ ప్రవేశం గురించి ఒకసారి మాట్లాడుతూ, “నాతో నటించిన అందరూ నాకెంతో సహాయం చేశారు, బహుశా నేను వేరే దేశానికి చెందినదాన్నయినందుకేమో! నాకెంతగానో రక్షణగా నిలిచారు” అన్నారు పెర్సిస్. సినిమాలలో తన పని, నటన పట్ల ప్రేమ, ఆరాధన, గౌరవం కారణంగా 1980లో ఆమెకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాతగా అవకాశం లభించేలా చేశాయి. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయురాలు ఆమె. నటిగా అవకాశాలు తగ్గినా, తన భారీ లక్ష్యాన్నెన్నడూ విస్మరించలేదామె. మళ్ళీ అమెరికా వచ్చి, తన స్టార్ ట్రెక్ సినిమా విజయాన్ని ఉపయోగించుకుంటూ శ్వేతజాతేతర పాత్రలను శ్వేతజాతేతర మైనారిటీ నటులే పోషించాలి తప్ప, తెల్లవారు కాదనే ఉద్యమంలో పాల్గొన్నారు.
1980లో జర్మనీలో కారు ప్రమాదం జరిగి తలకి పెద్ద గాయం కావడం, 1983లో గుండెకి బైపాస్ సర్జరీ జరగడం ఆమెకి క్లిష్ట పరిస్థితులను కల్పించాయి. 1985లో ఆమె బొంబాయికి తిరిగి వచ్చి, హిందీ టీవీ సిరీస్ ‘షింగోరా’లోనూ, హాలీవుడ్ టీవీ సీరిస్‌లు… ‘మైక్ హామర్’, ‘మాక్ గయ్యర్’ లోనూ నటించారు. మహిళలను శృంగార నాయికలుగా చూపించే అందాల పోటీలకి వ్యతిరేకంగా 90లలో మహిళా ఉద్యమాలు జరిగినప్పుడు – ఆమె బొమ్మలతో కూడిన ‘ఆంత్రోపాలజీ ఆఫ్ ఫార్మర్ మిస్ ఇండియా’ అనే పుస్తకం రాసి, అంతర్జాతీయ అందాల పోటోలలో పాల్గొన్న మహిళల అభిప్రాయలను ముందుకుతెచ్చారు. నటిగా ఆమె చివరి ప్రదర్శన 1993లోని ‘లూయిస్ అండ్ క్లార్క్: ది అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్‌మ్యాన్’ పైలట్ ఎపిసోడ్‌లో ‘కాంగ్రెస్ ఆఫ్ నేషన్స్’ చైర్‍పర్సన్ పాత్ర పోషించడమే. ఆ తరువాత ఆమె స్వల్పకాలం కోసం ఇండియా వచ్చారు. అప్పుడు సినీ, టీవీ సీరిస్‍ల నిర్మాతలు తమ సినిమాలు/టీవీ సీరిస్‌లలో పాత్రలు పోషించవలసిందిగా ఆమెను వెంటాడారు. ఆమె సంతకాలు పెట్టిన ఒప్పందాలు/చేయబోయే పాత్రలు – అమెరికాలో ఉన్న తన ఏజెంటుకు తాను కనీసం రెండేళ్ళపాటు భారతదేశంలోనే ఉండాల్సి వస్తుందని అర్థమయ్యేలా చేశాయంటారు. అయితే దేశంలో అడుగుపెట్టాకా – ఈ ప్రాజెక్టులన్నీ ఆలస్యమయ్యాయి, కొన్ని ఆపేసారు, కొన్నింటిని మార్చేసారు. దాంతో పరిస్థితి తారుమారయ్యింది. అయితే గుండె ధైర్యం గల యువతి కాబట్టి, తాను ఇప్పుడు ఖాళీయే అని తన ఏజంటుకు చెప్పలేదు. బదులుగా ప్రత్యామ్నాయ కెరీర్‍లను పరిశీలించారు. ఒక మోడలింగ్ ఏజన్సీ ప్రారంభించాలనుకున్నారు, కానీ ఇక్కడి ఫ్యాషన్ సర్కిల్స్ యొక్క విశ్వసనీయత ఆమోదం కాకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ‘ఒక వేళ నేనొక అమ్మాయికి అన్నీ నేర్పి, ఆమెని ఫేమస్ చేశాకా, ఆమె వెళ్ళిపోతే?’ అని కూడా అనుకున్నారు. తన స్నేహితుడు, పుస్తక ప్రచురణ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ‘మాగ్నా పబ్లికేషన్స్’కి చెందిన ‘నరి హీరా’ను సలహా అడిగారుట – “ప్రస్తుత, మాజీ మిస్ ఇండియాలపై ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది?” అని. అద్భుతమైన ఆలోచన కావడంతో, ఓ పబ్లిషర్‌ని వెతుక్కుని వెంటనే రాయడం మొదలుపెట్టమని ఆయన చెప్పి ఉండాలి. అయితే తగిన పబ్లిషర్‌ని వెతుక్కోవడానికి సమయం పట్టింది, చివరగా ఆమె పారిజాత్ మీడియా లిమిటెడ్‍ను ఎంచుకున్నారు. ఈ పుస్తకానికి పేరు పెట్టడంలో ఓ మాజీ ప్రధాని పాత్ర ఉంది. గతంలో పెర్సిస్ ఇండియాకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీని కలిశారు. ఆమెని ఇందిరకి పరిచయం చేయబోతే, “పెర్సిస్ ఎవరికి తెలియదు… ఆమె ప్రైడ్ ఆఫ్ ఇండియా” అన్నారుట ఇందిర. అందుకని పెర్సిస్ తన పుస్తకానికి ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని పేరు పెట్టారు.
ఆమె వారసత్వానికి గుర్తుగా 1999లో పెర్సిస్ ఖంబట్టా మెమోరియల్ అవార్డును ఏర్పరిచారు. ఈ అవార్డు క్రింద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ అయి వచ్చే ఉత్తమ విద్యార్థికి ప్రతీ ఏడాదీ స్కాలర్‌షిప్‌తో పాటుగా స్టార్ ట్రెక్ సినిమాలో ఆమె పాత్రని ప్రతిబింబించే ట్రోఫీ ఇస్తారు. ముంబయిలోని కెనడా కాన్సులేట్‌లో మాజీ ‘వైస్-కాన్సుల్ ఆఫ్ కెనడా’గా పని చేసిన పెర్సిస్ స్నేహితుడు సంజీవ్ చౌధురీ ఈ అవార్డును స్థాపించి నిధులు సమకూర్చుతున్నారు. పెర్సిస్ చనిపోయే ముందు చివరిగా కలిసి భోంచేసిన మిత్రుడు ఆయనే.
పెర్సిస్ మరణంతో భారత్ ఒక మణిని కోల్పోయింది. ఆమె భౌతికంగా దూరమైనా, ఆమె స్ఫూర్తి రాబోయే కాలంలో మహిళకు ప్రేరణిస్తుంది, ఇచ్చింది కూడా! ఎందుకంటే ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ వంటివారు అంతర్జాతీయ రంగంలో పలు విధాలుగా తమకంటూ గొప్ప పేరు తెచ్చుకున్నారు.
ప్రియమైన ‘లెఫ్టినెంట్ ఇలియా’, మీ ఆత్మకు శాంతి కలుగుగాక! మీ ప్రకాశవంతమైన కాంతి కిరణాలతో ఈ విశాల విశ్వంలో మీరు వెలుగొందు గాక!
***
***
1980లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ వ్యాఖ్యాతగా:
***
పెర్సిస్ ఖంబట్టా గుండు చేయించుకుంటున్న వీడియో (సినిమా మార్కెటింగ్ కోసం ఉపయోగించుకున్న వీడియో):