అలనాటి అపురూపాలు – 230

0
1

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు:

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 1931లో నెల్లూరులో జన్మించారు. 1948లో మద్రాసుకు వచ్చి, వాహినీ స్టూడియోస్‌లో ‘మాయాబజార్‌’ సినిమాకి సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు. ఆయన అనుభవాలను ఆయన మాటల్లోనే చదవండి –

“నా చిన్నప్పుడు నేను మద్రాసులో పోస్ట్‌మాస్టర్ జనరల్ అయిన మా మావయ్య టి. భీమారావు గారింటికి తరచుగా వచ్చేవాణ్ణి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసులో ఉన్నాను, తాటి చెట్లను యాంటి-ఎయిర్‍క్రాఫ్ట్ గన్స్‌గా ఎలా ఉపయోగించారనే కథ ఇప్పటికీ గుర్తుంది.

నేను 1948లో మద్రాసుకు వచ్చాను. ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎస్.సి.లో చేరాను, విక్టోరియా హాస్టల్‌లో బస. ఈ రెండిటి మధ్య బకింగ్‌హామ్ కాలువ ఉండేది. ఆ కాలవలో పడవలు తిరిగేవి. ట్రిప్లికేన్‌కి సంబంధించి నాకు గుర్తున్న అత్యుత్తమమైన విషయాలలో ఒకటి – రోజూ ఉదయాన్నే పెరుగు అమ్మేవాడొకతను వచ్చేవాడు. అతను ‘తైరూఓఓఓఓఓ’ అని అరిచేవాడు. అది సైరన్ లాగా వినిపించేది.

పోస్టల్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడం మొదలుపెట్టాక సింగరాచారి వీధిలోని గదికి మారాను, ఇక్కడ మరో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండేవాడిని. ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్‌లలో వేర్వేరు కుటుంబాలుండేవి, పోర్షన్‍కీ పోర్షన్‍కీ మధ్య ఒక తలుపు మాత్రమే ఉండేది. 60 ఏళ్ల కూడా తర్వాత ట్రిప్లికేన్‌లో ఎలాంటి మార్పు రాలేదు.

విక్టోరియా హాస్టల్ పక్కనే స్త్రీలు, పిల్లల కోసం ప్రభుత్వ కస్తూర్బా గాంధీ ఆసుపత్రి ఉండేది, కానీ ఆ పేరు ఎవరికీ తెలియదు. జనాలు దానిని గోషా హాస్పిటల్ అని పిలిచేవారు.

మా హాస్టల్‌కి ఒకవైపు ప్రసూతి వార్డు ఎదురుగా ఉండేది. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో ఒక స్త్రీకి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె బాధతో రాత్రంతా అరుస్తూ ఉండడంతో మాకు నిద్ర పట్టలేదు. హాస్టల్ మొత్తం మేల్కొని ఉత్సుకతతో ఎదురుచూసింది. తెల్లవారుజామున 3.30 గంటలకు నవజాత శిశువు ఏడుపు వినగానే హాస్టల్‌లోని అందరూ చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నాం. ‘అభినందనలు’ అని అరిచాం.

ఎంఏ చిదంబరం స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడల్లా – గ్యాలరీలో చోటు దక్కించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూలో నిలబడేవాళ్లం. ఉదయం 7.30 గంటలకు, హాస్టల్ నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చి – వేడి వేడిగా పూరీ, బంగాళదుంప కూర, కాఫీ తెచ్చేవారు. మేమంతా స్నేహితులం.

మేము వెస్టిండీస్ ఆటను చూడటానికి ఇష్టపడేవాళ్ళం! ముగ్గురు Wలు – ఎవర్టన్ వీక్స్, క్లైడ్ లియోపోల్డ్ వాల్కాట్, ఇంకా ఫ్రాంక్ వోరెల్ – లను ఆడుతుండగా ప్రత్యక్షంగా చూశాం. ప్రియర్ జోన్స్ అనే పొడవాటి ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు, అతను బౌండరీ లైన్ దగ్గర నుండి తన రన్-అప్‌ను ప్రారంభించేవాడు. అతను బౌన్సర్ వేసి, బ్యాట్సమన్ డక్ చేసిన ప్రతిసారీ, ప్రేక్షకులు అమ్మయ్య అనుకునేవారు. ముగ్గురు Wల పట్ల మాకు అభిమానం ఉన్నప్పటికీ, మేము ఇండియా గెలవాలనే కోరుకునేవాళ్ళం.

ఒక్కోసారి హాస్టల్ టెర్రస్ మీద నుంచి మ్యాచ్ చూసేవాళ్ళం కానీ ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. మాకు హాస్టల్ రేడియో ఉండేది, మేము అనుమతి తీసుకుని టెర్రస్‌ పైన స్పీకర్లు పెట్టుకుని వినేవాళ్ళం.

మౌంట్ రోడ్‌లోని వల్లజా రోడ్ జంక్షన్‌ను అప్పట్లో ‘రౌండ్‌టానా’ అని పిలిచేవారు (ఇది వృత్తాకారంలో ఉంటుంది), ఎల్ఫిన్‌స్టోన్ థియేటర్ దాని పక్కనే ఉండేది. ప్రధాని నెహ్రూ చెన్నై వచ్చినప్పుడు చూసేందుకు మేం అక్కడ చేరాం. మా వద్ద ఒక బాక్స్ కెమెరా మాత్రమే ఉంది, దానితో ఎనిమిది బ్లాక్ అండ్ వైట్ స్నాప్‌లను తీసుకోవచ్చు. మేము నెహ్రూగారితో ఉండగా ఫోటో తీయమని మా స్నేహితుడికి కెమెరా అప్పగించాం. జనాలు ఆయనను చుట్టుముట్టకుండా ఉండేందుకు చేతులు కలిపి మానవ హారం ఏర్పరిచాం. కానీ ఆయన వచ్చిన నిమిషంలో, జనం ఆయన వైపు దూసుకుపోయారు, మా మానవ హారం చెదిరిపోయింది. మేము నెహ్రూ గారి కారు వెంట నడిచాము. అప్పట్లో స్వాతంత్ర్య స్ఫూర్తి చాలా ఉండేది, ప్రజలు ఆయనని చుట్టుముట్టకుండా పోలీసులు అడ్డంగా నిలుచున్నారు. ఈ గందరగోళంలో మాకు నెహ్రూ గారితో మంచి ఫొటో లభించలేదు.

క్యాసినో థియేటర్‍లో అప్పట్లో ఇంగ్లీషు సినిమాలే ఆడేవి. అందులో ప్రాంతీయ చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించినప్పుడు మేము నిరాశ చెందాం. ఎల్ఫిన్‌స్టోన్ థియేటర్‌లోని సోడా ఫౌంటెన్ – మిత్రులకు జాఫర్ స్పెషల్ సోడా ఇప్పించటానికి ఒక ప్రసిద్ధ ప్రదేశం. గ్లోబ్, మిడ్‌లాండ్స్ థియేటర్లకి కూడా మేము తరచుగా వెళ్ళేవాళ్ళం.

అయితే మాకు బ్రాడ్‌వేలోని మినర్వాకి వెళ్లడం ఇష్టం, అది ఉత్తమ చిత్రాలను ప్రదర్శించే చిన్న, అందమైన థియేటర్. లేట్ నైట్ షో తర్వాత గదికి తిరిగి వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే ఆ సమయంలో రవాణా సౌకర్యం ఉండదు, పైగా నెలాఖరు నాటికి మా వద్ద అంత డబ్బు ఉండేది కాదు.

పైక్రాఫ్ట్స్ రోడ్‌లో, కోయంబత్తూరు కృష్ణయ్యర్ అనే ఒక చిన్న రెస్టారెంట్ ఉండేది, అందులో నాలుగో ఐదో టేబుల్స్ ఉండేవి. అక్కడ ఊతప్పం, మేతి వడ, దోశెలు చాలా రుచిగా ఉండేవి. కొబ్బరి చట్నీ అద్భుతం. మురుగన్ లాడ్జ్‌లో అర్ధ రూపాయకే అరటి ఆకులతో అద్భుతమైన భోజనం దొరికేది, అక్కడ ఒక విచిత్రమైన నియమం ఉండేది: జగ్గుతో నేరుగా నీళ్ళు తాగకూడదు.

మద్రాసులో అన్ని భాషల సినిమాలు నిర్మించబడుతున్నందున నగరంలో అన్ని ప్రాంతీయ భాషల చిత్రాలను ఆదరించారు. తెలుగు సినిమాలు 100 రోజులు ఆడేవి. వాహినీ స్టూడియోస్‌కి ‘సూయజ్‌కి తూర్పున ఉన్న అతి పెద్ద స్టూడియో’గా పేరుంది. నేను అప్రెంటిస్‌గా చేరి 1954లో ‘మాయాబజార్’ సినిమాకి కె.వి. రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను.

నార్మింగ్టన్ నిర్వహించే బ్రిటీష్ కౌన్సిల్ ఫిల్మ్ క్లబ్ 16 ఎం.ఎం. చిత్రాలను ప్రదర్శించేది. అక్కడ నేను అలెక్ గిన్నిస్ క్లాసిక్స్ చూశాను, ‘కైండ్ హార్ట్స్ అండ్ కరోనెట్స్’ చూడటం నాకు గుర్తుంది. దాంట్లో అతను వృద్ధురాలి పాత్రతో సహా ఎనిమిది పాత్రలు పోషించాడు. నేను ప్రముఖ చరిత్రకారిణి, సెర్గీ ఐసెన్‌స్టెయిన్ జీవిత చరిత్ర రచయిత అయిన మేరీ సీటన్‌ని కలిశాను. ఆమె ‘పథేర్ పాంచాలి’ అనే చిత్రాన్ని సగం పూర్తి చేసిన సత్యజిత్ రే అనే వర్ధమాన దర్శకుడి గురించి నాతో మాట్లాడింది.

ఒకసారి మేము లేట్ నైట్ షో చూసి, అర్ధరాత్రి విక్టోరియా హాస్టల్‌కు తిరిగి వస్తుండగా, అంత రాత్రి పూట, అనుమతి లేకుండా బయట తిరుగుతున్నందున – నోట్‌బుక్‌లో మా పేర్లు రాసి సంతకం చేయమని సార్జెంట్ చెప్పాడు. మాకో ఆలోచన తట్టింది. నోటీసు బోర్డులోని నోటీసులలో ఎప్పుడూ వార్డెన్ సంతకం ఉంటుంది. ఆయన సంతకం ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి, మేము ఆయనలా సంతకం చేసి లోపలికి వెళ్ళాం. మర్నాడు ఉదయం, వార్డెన్ ఆ పుస్తకాన్ని పరిశీలించి, ‘సార్జెంట్, మీరు నిన్న రాత్రి నన్ను చూశారా? ఆరు సార్లు?’ అని అడిగాడు. ఆ పుస్తకం మా దగ్గర ఉన్న చివరి రోజు అదే.”

***

తన అద్భుత చిత్రం ‘పుష్పక విమానము’ గురించి:

తను దర్శకత్వం వహించిన ‘పుష్పక విమానము’ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2022లో సింగీతం శ్రీనివాస రావు ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాకి సంబంధించిన పలు అంశాలను పంచుకున్నారు.

~

ఒక నిరుద్యోగి ఉద్యోగానికై ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉంటాడు. టెంపరరీ వేకెన్సీస్ అని వ్రాసిన బోర్డు ముందు కొండవీటి చాంతాడంత పొడవున్న క్యూలో వేచి ఉన్నాడు. అశాంతి, పేదరికంలో కూరుకుపోయి, అతను వరుస తప్పి, వేరొకరి స్థానంలో నిల్చుంటాడు, అప్పుడతన్ని క్యూ లైన్ చివరకి నెట్టేస్తారు. అతను ముందుకు రావడానికి ప్రయత్నిస్తే మళ్ళీ మళ్ళీ వెనక్కి పంపేస్తుంటారు. అతనికి ఒక సంపన్నుడి ఐడి కార్డు దొరుకుతుంది, దాంతో అతను కలలుగన్న విలాసవంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు.

ఈ సినిమాలో కామెడీతో పాటు విషాదం కూడా ఉంది.

ముప్పై ఐదు సంవత్సరాల క్రితం, ఏ భారతీయ చిత్రనిర్మాత కలలు కనే సాహసం చేయలేని విధంగా, ‘పుష్పక్’ (1987) అనే సంభాషణలు లేని సినిమా తీశారు సింగీతం శ్రీనివాసరావు. మూకీల యుగం తర్వాత ఎలాంటి డైలాగులు లేకుండా వచ్చిన మొదటి భారతీయ చిత్రం ఇది. చాలా మంది సరిగ్గా ఊహించినట్లు సింగీతంను నడిపించింది ధైర్యం కాదు. “అది ఒక విధమైన పిచ్చితనం,” అన్నారాయన నవ్వుతూ, ఒక వెచ్చని శీతాకాలపు ఉదయం తన చెన్నై నివాసంలో కలిసిన విలేఖరితో.

“ఒక పిల్లవాడిని మంట దగ్గరికి వెళ్లవద్దని చెప్తాం. కానీ పిల్లవాడు దానిని తాకాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాడు. అలాంటి థ్రిల్ నాలో ఉండేది’’ అన్నారు సింగీతం. ఆ ఫైర్ ‘పుష్పక్’ (కమల్ హాసన్, అమల అక్కినేని నటించిన సినిమా).

డైలాగులు లేకుండా ‘పుష్పక్‌’ని ఎందుకు తీశారని చాలామంది సింగీతంను అడిగారు. “నేను వారందరిని అడుగుతున్నాను, ‘ఒక వ్యక్తి హిమాలయాలను ఎక్కి అక్కడ జాతీయ జెండాను ఎందుకు ఎగురవేయాలి? హాయిగా ఇంట్లో కూర్చుని అల్పాహారం తీసుకోవచ్చుగా. ఎందుకా ఇబ్బంది?’ అని. ఎందుకంటే అది ఒక విజయం” అన్నారు.

దశాబ్దాల అనుభవం, ఇప్పుడు జ్ఞాపకాలుగా ఆయన మెదడులో నిక్షిప్తమై, వారితో మాట్లాడినప్పుడు, ముత్యాల్లా దొర్లుతుంది. నిశ్శబ్దంగా ఉండడం ఎంతో ఉపకరిస్తుందని నమ్మే వ్యక్తి సింగీతం. అందువల్ల సినిమా సెట్స్‌పై గొడవలు చాలా తగ్గాయి. తాము ఎంచుకోకపోయినా, పుష్పక్ షూటింగ్, సింక్-సౌండ్‌తో వచ్చిన మిచెల్ కెమెరాతో చేయాల్సి వచ్చింది. “నటీనటులు వారి డైలాగ్‌లను చెబుతారు మరియు రికార్డింగ్ బూమ్ మైక్‌తో సెట్‌లో జరిగింది,” అని ఆయన గుర్తుచేసుకున్నారు. “మేము టేక్‌కి వెళ్ళే ముందు రిహార్సల్ చేస్తాము. మాయాబజార్‌ షూటింగ్‌ ఇలాగే జరిగింది. కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా డబ్బింగ్ కాన్సెప్ట్ లేదు” చెప్పారు సింగీతం.

మిచెల్ వంటి కెమెరా ‘పుష్పక్‌’లో వారి లాజిస్టికల్ సవాళ్లను చాలావరకు పరిష్కరించి ఉండవచ్చు. అయితే, కెమెరా భారీగా ఉండేది, ఇప్పుడు వాడుకలో లేదు. ఇది Arriflex కెమెరాల కాలం. “అరిఫ్లెక్స్ వచ్చాక సినిమా మేకింగ్ సులువైంది. కెమెరా రోలింగ్ అవుతోంది, నటీనటులు వారి డైలాగులు మాట్లాడుతున్నారు, సౌండ్ ఉంది; పైగా సెట్స్‌లో జనాలు మాట్లాడుకోవచ్చు” అన్నారాయన.

పుష్పక్ సెట్స్‌లో ‘సైలెన్స్’ అని అరిచారట సింగీతం. “అది కష్టమైన వ్యవహారం” అన్నారు నవ్వుతూ, “అప్పట్లో సినిమా పరిశ్రమలో అలాంటి క్రమశిక్షణ ఉంది, నేను ‘సైలెన్స్’ అని అరిచాను. కానీ ఎవరూ నిశ్శబ్దం పాటించలేదు” అన్నారు.

రియల్ యాంబియెన్స్ సౌండ్ కోసం, సన్నివేశాలను రెండుసార్లు చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. “కమల్ ఫ్రిజ్ తెరిచి దానిలోంచి చాక్లెట్లు పడిపోతాయని అనుకుందాం, ఆ సౌండ్‌ని క్యాప్చర్ చేయడానికి కమల్‌తో మరో సారి అలాగే చేయించాం. ఈ సహజమైన ధ్వనిని పునఃసృష్టించడం చాలా కష్టం,” అని ఆయన చెప్పారు. హాస్యం, విషాదం కలగలిసిన ‘పుష్పక్’ సినిమాలో, ఎన్నో పరిహాసాలున్నాయి: సువాసనగల పెట్టెలో ప్యాక్ చేసిన మలం; జేబులో డబ్బు లేని నిరుద్యోగ యువకుడు ఒక బిచ్చగాడిని, అతని వద్ద ఉన్న నోట్ల కట్టను చూసి అసూయగా పడటం; కోల్డ్ బ్లడెడ్ మర్డర్‍లో ఆయుధంగా ఎంచుకున్న ఐస్ నైఫ్; – సంభాషణలు లేని ఈ చిత్రం తమిళంలో ‘పెసుమ్ పదం’ (టాకీ పిక్చర్)గా విడుదలవటం వంటివి ఇందుకు ఉదాహరణలు.

అన్నింటికంటే, విపరీతమైన వ్యంగ్యం – ఒక మెమోరియల్ సర్వీస్‍లో కమల్, అమల మధ్య ప్రేమ వికసించడం; అది సత్యజిత్ రే, రాజ్ కపూర్ వంటి దిగ్గజాలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఒకసారి బెంగుళూరులో సింగీతంని కలిసినప్పుడు “నేను చాలా రొమాంటిక్ సినిమాలు చూశాను, నేనే స్వయంగా చాలా రొమాంటిక్ సినిమాలు నిర్మించాను. ఒక మృతదేహం చుట్టూ ప్రేమ సన్నివేశాన్ని చూడటం ఇదే మొదటిసారి, వావ్,” అని వ్యాఖ్యనించారట రాజ్ కపూర్.

సింగీతం రచనలో మార్క్స్ బ్రదర్స్ ఛాయ ఉంటుంది, ప్రదర్శనలు చాలావరకూ చార్లీ చాప్లిన్ నుండి తీసుకోబడతాయి. “అవును. నా మీద ఖచ్చితంగా [చాప్లిన్‌] ప్రభావం ఉంది. నాలోనే కాదు కమల్‍లో కూడా. దాని నుండి తప్పించుకోలేం” అన్నారు సింగీతం.

“మూకీ యుగంలో చాప్లిన్ దీన్ని 18 ఫ్రేమ్‌లలో చేయాల్సి వచ్చింది. దానివల్ల కాస్త అసహజంగా అనిపించింది. మేం దీన్ని సైలెంట్ ఫిల్మ్‌గా చేయాలనుకోలేదు. డైలాగ్ అవసరం లేని విధంగా స్క్రీన్ ప్లే వర్క్ చేశాం. తాగుబోతు మాట్లాడాలనుకున్నప్పుడు ఇలా డైలాగ్‌కి చోటు ఉందనుకుని కమల్ తన నోటికి ఓ గుడ్డముక్కని అడ్డంగా కట్టుకున్నాడు. అందుకే నటన, అభినయం నిజమనిపించింది.”

‘పుష్పక్‍’లో చాలా ఆసక్తికరమైన ఆలోచనలను ఎన్నింటినో జోడించాలనున్నారు, అవి ఫైనల్ మూవీలో చేరలేకపోయాయి. ఉదాహరణకు, సింగీతం గారు టి.నగర్‌లో నివసించినప్పుడు ఒక దొంగ ఆయన కుమార్తె హ్యాండ్‌బ్యాగ్‌ని దొంగిలించిన ఘటనని సినిమాలో ఉపయోగించాలనుకున్నారట. ఆ సంఘటనని సింగీతం గుర్తుచేసుకున్నారిలా.

“నా భార్య నా కూతురికి ఓ హ్యాండ్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చింది. చూడడానికది భారీగా ఉంది. ఈ వ్యక్తి ఓ ఇనుప కర్రతో లాగి గది నుండి బ్యాగ్‌ని దొంగిలించాడు, పాపం ఎంతో నిరాశ చెంది ఉంటాడు. ఎందుకంటే నా కూతురు ఆ బ్యాగ్‌లో తను సేకరించిన బస్ టిక్కెట్లు, పేపర్లు, చిన్న చిన్న రాళ్లు అన్నీ దాచింది. అయినా ఆ బ్యాగ్‍ని ఓ ఆస్తిలా భావించాడా దొంగ” అంటూ నవ్వారు.

‘పుష్పక్‍’ సినిమాకి సంబంధించిన విజువల్స్, మొత్తం డిజైన్ – సింగీతంగారి మనసులో ఉండేవి; మేకింగ్ సమయంలో అలాంటివి చాలా కలిసొచ్చాయి. కమల్, పిఎల్ నారాయణ (బిచ్చగాడి పాత్ర) మధ్య సన్నివేశంలో – బిచ్చగాడు నగదుతో నిండిన గోనె సంచిని నాటకీయంగా తెరవడం సింగీతం గారి గొప్ప ఆలోచన.

“కొన్ని విషయాలను నేను కాగితం మీద వ్రాయడానికి ఇష్టపడను, ఎందుకంటే అలా చేస్తే వాటిలో జీవశక్తి ఉండదు. అన్నీ యాంత్రికంగా రాస్తే రంగస్థలం అవుతుంది. నా నటీనటులు దానిని సొంతం చేసుకోవాలని నేను కోరుకున్నాను, అప్పుడే జీవశక్తి ఉంటుంది” చెప్పారు సింగీతం. “కమల్, అమల, ఇంకా గౌరీశంకర్ (సినిమాటోగ్రాఫర్) వంటి వ్యక్తులు ఉండటం నాకు చాలా ఉపశమనం కలిగించింది” అన్నారు.

సంభాషణలు లేని సినిమా కోసం, ప్రధాన నటీనటుల ప్రదర్శన స్వచ్ఛంగా ఉండాలని; ప్రేక్షకులను సినిమాలో లీనం చేసి ఉంచడంలో కీలకంగా ఉండాలని సింగీతం అంగీకరించారు. హోటల్‍లో కమల్, అమల వారి వారి గదుల బాల్కనీలో నిలబడి చేతి సంజ్ఞల ద్వారా సంభాషించుకోవడం ఈ సినిమా ఐకానిక్ షాట్‌లలో ఒకటిగా ఇప్పుడు పరిగణింపబడుతోంది.

సాధారణంగా నటీనటుల ఇలాంటి షాట్‌లను విడివిడిగా తీస్తారు, అక్కడ వాళ్ళు ఇతర నటులు ఉన్నారని భావిస్తూ నటిస్తారు. కానీ ‘పుష్పక్’లో అలా జరగలేదు. నటీనటులందరూ వారికి సన్నివేశం ఉన్నా లేకపోయినా అన్ని సమయాలలో షూటింగ్ స్పాట్‍లో ఉన్నారు.

“మేము బాల్కనీలో కమల్ షాట్ తీస్తున్నప్పుడు, అమల ఎదురు బాల్కనీలో ఉండి తన వంతు పాత్రను నటిస్తూ ఉంది. అదంతా మౌలికంగా యాక్టింగ్ అండ్ రియాక్టింగ్”అని ఆయన చెప్పారు.

నటుడు కమల్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు సింగీతం. “అతని నటన గురించి ఇంకా ఏం చెప్పగలను? ఇది చేపలు బాగా ఈదుతాయని చెప్పడం లాంటిది” అన్నారు.

కానీ అమల మాత్రం ఆ సినిమాకి నిజంగానే ఆస్తి.

మొదట ఆమె గురించి సింగీతం ఒక తెలుగు సినిమా ద్వారా తెలుసుకున్నారట, ఆ సినిమాలో ఆమె డైలాగులను మెలోడ్రామాటిక్ పద్ధతిలో చెప్పారట. ఆ సినిమా చూసిన సింగీతం, ఆమె అలాంటి వ్యక్తి కాదు అనుకున్నారట.

“ఆమెకు అందమైన ముఖం, అద్భుతమైన చర్మం ఉంది, ఆమె బుగ్గలపై కాంతి పడినప్పుడు, అది ప్రతిబింబించేది. డైలాగ్స్ లేని సినిమాకి ఆమె బెస్ట్ అనుకున్నాను. రోమన్ హాలిడేలో ఆడ్రీ హెప్‌బర్న్ లాగా స్క్రీన్‌పై ముఖం తాజాగా కనిపించే వ్యక్తిని నేను కోరుకున్నాను” అన్నారు సింగీతం.

సింగీతమంటే ‘అల్లరి’ అని అమల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే. “ఆయన వాక్యంలో సగం నవ్వు ఉంటుంది” అందామె. అదెందుకో ఇప్పుడు మనందరికీ తెలుసు.

నటన మాత్రమే నిలిచిపోతుందని సింగీతం నమ్ముతారు. “నాకు కర్మ మీద నమ్మకం లేదు. కానీ చాలా విషయాలు కలిసి వచ్చినప్పుడు (పుష్పక్ వంటి చిత్రానికి), నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మవలసి వచ్చింది” అన్నారు.

***

ఇవీ సింగీతం గారి గురించి, పుష్పక్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here