అలనాటి అపురూపాలు – 234

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

విజయాలు వేదనలు కలబోసిన జీవితం – శశికళా సైగల్:

ప్రముఖ నటి శశికళ జవాల్కర్ 4 ఆగస్టు 1932 న సోలాపూర్‍లో జన్మించారు. బాల్యంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి స్థానికంగా జరిగే వార్షిక గణేశ పూజోత్సవాలలో బాలకృష్ణుని వేషం వేయించారు. పేదరికం కారణంగా కుటుంబ సభ్యులు పస్తులుండేవారట. శశికళకు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించమని ఎవరో సలహా ఇవ్వటంతో, కూతురుని తీసుకుని బొంబాయి చేరారా తండ్రి. అయితే అంత సులువుగా అవకాశాలు లభించకపోవటంతో సోలాపూర్‍కే చెందిన ఓ కుటుంబంలో ఇంటిపనుల్లో సహాయకురాలిగా శశికళను చేర్చారు. అక్కడ అనేక రకాల ఇబ్బందులనెదుర్కున్నారు శశికళ. ఓ అర్ధరాత్రి ఇంట్లోంచి గెంటేశారు.

అప్పుడో ముస్లిం కుటుంబం శశికళకు ఆశ్రయమిచ్చారు, గౌరవంగా చూశారు. ఆ సమయంలోనే ప్రభాత్ స్టూడియోస్ వారి దృష్టిలో పడ్డారు శశికళ. మకాం పూనేకి మారింది. Tota Yache Banna  అనే మరాఠీ చిత్రం కోసం నెలకు వంద రూపాయల జీతంతో పనిచేశారు. కానీ తర్వాత మళ్ళీ అవకాశాలు తగ్గిపోయాయి. అనుకోకుండా ఓ రోజు సెంట్రల్ స్టూడియోలో నటి నూర్జహాన్‍ని కలవడం తటస్థించింది. శశికళలో తన పోలికలు కనబడగా నూర్జహాన్ ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని భర్త షౌకత్ హుస్సేన్‍తో చెప్పారట. తాను తీస్తున్న ‘జీనత్’ అనే సినిమాలో నూర్జహాన్ చిన్నప్పటి పాత్ర కోసం సరైన నటిని వెతుకున్న ఆయనకి శశికళ ఆ పాత్రకి సరిగ్గా సరిపోతారని అనిపించింది. కానీ శశికళకు ఉర్దూ రాకపోవడంతో ఆ వేషం తప్పిపోయింది. అయితే, ఆ సినిమాలో ఓ ఖవ్వాలి పాట ఉందనీ, అందులో ముగ్గురు అమ్మాయిలు నృత్యం చేస్తారనీ, వారిలో ఒకరిగా ఎంపిక చేస్తానని ఆయన చెప్పారు. అలా శ్యామా, షాలినిలతో కల్సి ఆ ఖవ్వాలిలో నృత్యం చేశారు శశికళ. ముగ్గురిలోనూ బాగా ప్రతిభ చూపిన శశికళకు పాతిక రూపాయల నగదు బహుమతి ఇచ్చారాయన.

అంతే కాదు, నెలకు 400 రూపాయల జీతంతో నాలుగేళ్ళు వారితో పనిచేసేలా శశికళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దిలీప్ కుమార్, నూర్జహాన్‍ ప్రధాన తారాగణంగా ఆయన తీసిన ‘జుగ్ను’లో శశికళకు ముఖ్యమైన పాత్రనిచ్చారు. జ్వార్ భాటా సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా దిలీప్ గారి నటనను అభినందించిన శశకళకు – ఈ సినిమాలో ఆయనతో సన్నివేశాలు లభించాయి. అయితే రిహార్సల్స్‌లో అద్భుతంగా నటిస్తున్న శశికళ – అసలు సన్నివేశాల చిత్రీకరణకి వచ్చేసరికి బాగా తడబడేవారట. ఎందుకలా జరుగుతోందో కారణం గ్రహించిన షౌకత్ హుస్సేన్‍ గారు – అసలు షూటింగ్ అని చెప్పకుండా, రిహార్సల్సే అని చెప్పి – చిత్రీకరణ పూర్తి చేశారట.

జుగ్నూ సూపర్ హిట్ అయింది. కానీ దేశవిభజన తర్వాత షౌకత్ హుస్సేన్, నూర్జహాన్‍ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. దాంతో మళ్ళీ శశికళకు అవకాశాలు తగ్గిపోయాయి. పి.ఎన్. అరోరా గారి సినిమా ఒకటి, అమియ చక్రవర్తి గారి గర్ల్స్ స్కూల్, గీతాబాలితో తరంగ్ వంటి సినిమాల్లో నటించారు. 18 ఏళ్ళ వయసులో తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా, ఓం ప్రకాశ్ సైగల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

పెళ్ళి, వెంటనే తల్లి కావడంతో అవకాశాలు మరింత క్షీణించాయి. ఆమె భర్త ఆమెతో ఓ సినిమాని ప్రారంభించారు. అది పూర్తవడానికి ఆరేళ్ళు పట్టింది. అది తన దురదృష్టమని వ్యాఖ్యానించారామె.

అయితే వి. శాంతారామ్ గారి ద్వారా అనుకోని అవకాశం లభించింది. ఆయన తాను తీస్తున్న ‘తీన్ బత్తీ చార్ రాస్తే’ సినిమాలో అవకాశం ఇచ్చారు. స్మృతి బిస్వాస్, షీలా రమణి, నిరుపా రాయ్ లతో పాటుగా కీలకమైన పాత్ర అది. స్మృతి బెంగాలీ, నిరుపా గుజరాతీ, షీలా సింధీ, శశికళ మరాఠీ – నలుగురు తమ తమ భాషీయుల పాత్రలు పోషించి – సినిమాలో హాస్యం పండించారు. ఈ సినిమా విజయవంతమైనా, శశికళకు ఆశించిన అవకాశాలు దక్కలేదు. తర్వాత రంజీత్ స్టూడియో వారి ‘నజరేఁ’ అనే సినిమాలో నటించారు.

అయితే, తాను తీస్తున్న ‘ఝనక్ ఝనక్ పాయెల్ బాజే’లో ఓ పాత్ర కోసం వి. శాంతారం శశికళను ఎంచుకోవడంతో మళ్ళీ ఆమెలో ఆశలు చిగురించాయి. అయితే ఆ సినిమా సంగీతం ఆలస్యం కావడంతో, ఆయన ముందుగా ‘సురంగ్’ అనే సినిమా మొదలుపెట్టారు. కథానాయిక పిచ్చిదైన ఆదివాసి మహిళ. శశికళను ఎనిమిది రోజుల పాటు పరీక్షించి, చివరికి ఎంపిక చేశారు. షూటింగ్ సందర్భంగా ఆమె తడబడుతుంటే, తాను ఓ రాతి శిల్పం నుంచి కూడా నటనని రాబట్టుకోగలని ధైర్యం చెప్పారట శాంతారాం. ఆ సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోవటంతో, ‘ఝనక్ ఝనక్ పాయెల్ బాజే’లో శశికళకు వేషం పోయింది.

మళ్ళీ దురదృష్టం వెంటాడింది.

కిషోర్ సాహు గారు తీస్తున్న ‘సౌదా’ అనే సినిమాలో జానీ వాకర్ సరసన ఓ పాత్రకి ఎంపికయ్యారు శశికళ. కానీ ఆ చిత్రం సగంలో ఆగిపోయింది. అదే సమయంలో ఆమె భర్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. దాంతో శశికళ స్టంట్ సినిమాల వైపు మొగ్గి, డబుల్ షిఫ్ట్స్ పని చేశారు. హీరాలాల్ మాస్టర్ వద్ద నృత్యంలో మెలకువలు నేర్చుకుని, తర్వాతి సినిమాల్లో వైజయంతి మాలతోనూ, సైరా బాను తోనూ పోటీపడ్డారు.

ఫూల్ ఔర్ పత్థర్ సినిమా షూటింగ్ సందర్భంగా రాబర్ట్ మాస్టర్ చెప్పిన చిట్కాతో – శృంగార నృత్యంలో హెలెన్‍తో పోటీపడ్డారు. చాలా ఏళ్ళ తరువాత, ఆమెకి 45 ఏళ్ళ వయసులో, హృశీకేశ్ ముఖర్జీ గారి ‘ఖూబ్‍సూరత్’ సినిమాలో కథక్ నృత్యం కోసం మూడు రోజుల పాటు గోపీ కిషన్ వద్ద శిక్షణ పొంది – నాల్గవ రోజున షూటింగ్‍లో అద్భుతంగా నర్తించి దర్శకుని ప్రశంసలు పొందారు.

‘ఖూబ్‍సూరత్’ తర్వాత – అశోక్ కుమార్ గారి ద్వారా మరికొన్ని సినిమాలకు ప్రయత్నించారు. వసంత్ జోగ్లేకర్ గారి సినిమాలో చిన్న పాత్ర దొరికితే, తన నటనతో ఆయనను మెప్పించారు.

అదే సమయంలో తనతో పాటు సినీరంగంలోకి వచ్చిన శ్యామాకి ఎక్కువ అవకాశాలు రావడం, కుటుంబంలో ఇబ్బందులతో ఆమె విసిగిపోయారు. ఇద్దరు కూతుళ్ళను బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు.

దర్శకుడిగా విజయ్ ఆనంద్ తొలి సినిమా ‘నౌ దో గ్యారా’ లో వ్యాంప్ పాత్ర పోషించారామె. తరువాత తారాచంద్ బర్జాత్యా గారి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి మెప్పించారు. తరువాత వరుసగా జంగ్లీ, భీగీ రాత్, దాదిమా, నీల్ కమల్, గుమ్రాహ్  వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. తరువాత ‘పైసా ఔర్ ప్యార్’ అనే సినిమా షూటింగ్‍లో మాలా సిన్హా నుంచి అద్భుతమైన సలహాను పొందారు శశికళ.

ఈ సమయంలో వృత్తిపరంగా ఉచ్చస్థితిలో ఉన్నా, వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులో ఉన్నారామె. భర్తతో విభేదాలు పెరిగిపోయాయి. దాంతో భర్తని, పిల్లల్ని, సినిమాలని వదిలేసి, మరో వ్యక్తితో విదేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలకి లోనై, ఒంటరిగా స్వదేశం తిరిగొచ్చారు. పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతూ, ఫుట్‍పాత్‍ల మీద నిద్రపోతూ, దొరికిన చోట తింటూ గడిపారు. మానసిక ప్రశాంతత కోసం హృశీకేశ్, పాండిచ్చేరి లోని ఆశ్రమాలకు వెళ్లారు.

కొన్నాళ్ళు ఒంటరిగా పూనేలో గడిపారు. చివరికి చిన్న కుమార్తె శైలజ సాయంతో మదర్ తెరిసాని ఆశ్రయించారు. మదర్ తెరిసా శశికళకు ధైర్యం చెప్పి, బ్రతుకు మీద భరోసా కల్పించారు. సూరత్‍లో కొన్నాళ్ళు తల్లిదండ్రుల దగ్గర గడిపారు. ఈలోపు పెద్ద కుమార్తె రేఖ కేన్సర్ కారణంగా మరణానికి దగ్గరైందని విని, ఆమెను చూడ్డానికి వెళ్ళారు. చివరి దశలో తాను తన తల్లితో సహా అందరినీ క్షమించానని చెప్పి కన్నుమూశారు రేఖ. దాంతో జీవితం మళ్ళీ దుఃఖమయం అయింది.

మదర్ తెరీసాతో విన్నవించుకుంటే ఆమె పంపిన ఓ సందేశంతో తేరుకుని – వృత్తిజీవితాన్ని కొనసాగించారు. సినిమాలలోనూ, సీరియల్స్ లోనూ నటిస్తూ వేదనని మరచిపోయారు. 4 ఏప్రిల్ 2021 నాడు 88 ఏళ్ళ వయసులో మృతిచెందారు శశికళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here