అలనాటి అపురూపాలు – 237

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

హిందీ చలనచిత్ర రంగంలో తండ్రీ కొడుకులు: రాయ్ బహాదూర్ చునీలాల్ – మదన్ మోహన్:

ఆర్.బి. చునీలాల్ ఇరాక్ పోలీసు విభాగంలో అకౌంటెంట్ జనరల్‌గా పనిచేసేవారు. మదన్ మోహన్ తన జీవితపు తొలి ఐదు సంవత్సరాలు మధ్యప్రాచ్యంలో గడిపారు. రెండు సంవత్సరాల వయసులోనే, మదన్ మోహన్ గంటల కొద్దీ గ్రామఫోన్ రికార్డులు వినేవారు. వందలాది గ్రామ్‍ఫోన్ రికార్డుల కుప్ప నుండి ఏ రికార్డ్‌ను తియ్యమన్నా, తీయగల అసాధారణ సామర్థ్యం ఉండేదాయనకి. అంత చిన్న పిల్లవాడు, చదువు లేని బాలుడు అంత ఖచ్చితంగా రికార్డుని ఎలా బయటకు తీయగలిగేవాడో ఎవరికీ అంతుపట్టేది కాదు. మదన్ మోహన్‍కి చిన్నప్పటి నుంచే డ్రమ్స్ వాయించటం పట్ల ఆసక్తి కలిగింది.

బ్రిటిష్ పాలన నుండి ఇరాక్ స్వాతంత్ర్యం పొందడంతో రాయ్ బహదూర్ చునీలాల్‌ను ఇరాకీ జాతీయత తీసుకోమన్నారు లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇరాక్‌ని విడిచిపెట్టమన్నారు. అప్పుడాయన రెండవదాన్ని ఎంచుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు. కుటుంబాన్ని తమ స్వస్థలమైన పంజాబ్‌లోని జీలం జిల్లాలోని చక్వాల్‌కు (నేటి పాకిస్తాన్‌) తీసుకువెళ్లారు. కొన్నాళ్ళు అక్కడ ఉండి, భార్యని కుమారుడిని అక్కడే ఉంచి చునీలాల్ ఉద్యోగం కోసం చక్వాల్ వదిలిపెట్టారు. అక్కడ తల్లి, తాత సాంగత్యంలో మదన్ మోహన్‍కు సంగీతంలో పునాదులు పడ్డాయి. ఏడేళ్ళు వచ్చేసరికి బాల మేధావిగా గుర్తింపు వచ్చింది. మతపరమైన వేడుకలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ చిన్నారి మదన్ మోహన్ చేత పాటలు పాడించేవారు.

చక్వాల్ చిన్న ఊరు కావడం వల్ల, సరైన విద్యా సంస్థలు లేనందువల్ల చునీలాల్ కుటుంబాన్ని లాహోరుకు మార్చారు. కానీ తరువాతి కాలంలో చునీలాల్ హిమాంశురాయ్ తో కలిసి ‘బాంబే టాకీస్’ సంస్థను స్థాపించటంతో, బొంబాయిలో స్థిరపడ్డారు. పాఠశాలలో ఉండగా, మదన్ – ఆకాశవాణి బొంబాయి కేంద్రంలో బాలల కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆకాశవాణి కేంద్రంలో చిన్నారి రాజ్ కపూర్‍తో కలిసిన స్నేహం పెద్దయ్యాకా కూడా కొనసాగింది. చిన్నారి సురయ్యాను ఆకాశవాణిలో పాడించినది కూడా బాల మదన్ మోహనే. తర్వాతి కాలంలో సురయ్యా ప్రసిద్ధ గాయని అయ్యారు.

***

బొంబాయి లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ నుండి సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మదన్ – తండ్రి ఒత్తిడితో డెహ్రాడూన్‌లోని కల్నల్ బ్రౌన్ మిలిటరీ హైస్కూల్‌లో చేరారు. సైనిక శిక్షణ పూర్తయిన తర్వాత, 1943లో సైన్యంలో చేరారు. ఆర్మీలో సేవాకాలం పూర్తయ్యాకా, సినిమాల్లోకి రావాలని ఆశించారు మదన్. కానీ సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్న తండ్రి చునీలాల్ – అందుకు అంగీకరించలేదు.

1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగియడంతో, మదన్ మోహన్ ఆర్మీకి రాజీనామా చేసి, లక్నో ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్‌గా చేరారు. అప్పుడాయన వయస్సు 21 సంవత్సరాలే. ఆకాశవాణిలో సంగీత విద్వాంసులు, వాయిద్యకారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకుని వారి నుంచి సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. అలీ అక్బర్ ఖాన్, అబ్దుల్ వాహిద్ ఖాన్, పండిట్ రాంనారాయణ్, బేగం అక్తర్, విలాయత్ ఖాన్, రోషనరా బేగం, తలత్ మెహమూద్, ఫయాజ్ ఖాన్ వంటి ప్రసిద్ధ సంగీత విద్వాంసులకు దగ్గరయ్యారు. అయితే లక్నో నుంచి ఢిల్లీ కేంద్రానికి బదిలీ కావడం, అక్కడ కాగితపు పని ఎక్కువగా ఉండడంతో ఆయనకి ఉద్యోగం పట్ల ఆసక్తి పోయింది. శేఖర్, రాజ్ మెహ్రాలు పరిచయం కావడంతో, ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ ఇద్దరితో పాటు తాను కూడా సంగీత రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బొంబాయి చేరారు.

***

రాయ్ బహాదూర్ చునీలాల్‍ గారికి అప్పటికే సినీ పరిశ్రమలో ఖ్యాతి లభించింది. కుమారుడు ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి చేరారని తెలియగానే, ఆయన కోపం పట్టలేకపోయారు. మదన్‍ని ఇంట్లోకి రానివ్వలేదు. పైగా ఆయన మరో పెళ్ళి చేసుకోవడంతో – మదన్ తండ్రి పేరు చెప్పుకోకుండా – మూడేళ్ళ పాటు బొంబాయిలో పరిస్థితులతో పోరాడవలసి వచ్చింది. ముందు నటుడిగా ప్రయత్నిద్దామనుకున్నారట. అప్పట్లో కె.ఎల్. సైగల్ వంటి గాయక నటుల రాజ్యం నడిచేది. కానీ అవకాశాలు లభించలేదు. తన గొంతులోని విశిష్టత కారణంగా హెచ్.ఎం.వి. కోసం ప్రైవేటు గజల్స్ పాడి రికార్డు చేశారు. ఫిల్మిస్తాన్ వారి ‘షహీద్’ (1948) అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేస్తున్నప్పుడు, లతా మంగేష్కర్‌తో కలిసి ‘పింజరే మే బుల్బుల్ బోలే, మేరా ఛోటాసా దిల్ దోలే’ అనే ఓ యుగళగీతం పాడే అవకాశమొచ్చింది. చిత్రంలో ఈ పాటని ఆయనపైనా, ఆయన చెల్లెలి పాత్రధారిణి పైనా చిత్రీకరించాల్సి ఉంది. దిగ్గర స్వరకర్త గులాం హైదర్ సంగీత దర్శకుడు. కానీ ఎందుకో ఈ పాట సినిమాలోనూ లేదు, డిస్క్ లోనూ లేదు.

లత పాట పాడే పద్ధతి తెగ నచ్చేసిన మదన్ మోహన్ – తాను సంగీత దర్శకుడయ్యాకా, వీలైనంత ఎక్కువగా ఆమె చేత పాడించాలనుకున్నారు.

తాను సంగీత దర్శకుడయ్యాకా, నేపథ్య గాయకుడిగా రాణించాలనుకుని – కొన్ని పాత్రల పాటలు తానే పాడారు. అంఖేఁ (1950), షబిస్తాన్ (1951), ధూన్ (1953), ఫిఫ్టీ ఫిఫ్టీ (1956) అనే నాలుగు సినిమాలలో ఒక్కొ పాటను పాడారు. పాటలన్నింటినీ బాగా పాడినప్పటికీ, ప్లేబ్యాక్ సింగర్‌గా ఎలాంటి గుర్తింపు రాలేదు. దురదృష్టవశాత్తు నటుడిగానూ పేరు రాలేదు.

ఫిల్మిస్తాన్ వారి ‘షహీద్’ (1948) అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాకా, ‘పర్దా’లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆయన మిత్రుడు శేఖర్ కూడా చిన్న పాత్రలో నటించారు. తరువాత, ఆంశూ (1953), మునిమ్జీ (1955) వంటి చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో సంగీత దర్శకత్వానికే పరిమితమయ్యారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా మారకముందు ఆయన ఎస్.డి. బర్మన్‍కి, శ్యామ్ సుందర్‍కి సహాయకుడిగా పనిచేశారు. వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మదన్‍కి కవిత్వంలోనూ ప్రవేశం ఉండడంతో సినీ గీతాలు కూడా రాసేవారు. అయితే కన్నతండ్రితో సహా చాలామంది ఆయన ప్రతిభాపాటవాలపై నమ్మకం ఉంచేవారు కాదు.

‘ఆంఖేఁ’ (1950 )సినిమాకి సంగీతం సమకూరుస్తున్నప్పుడు నిర్మాత దర్శకుడికి అదే తొలి సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపలేదట. అప్పుడు మదన్ వారిని సాయంత్రం పూట చర్చ్‌గేట్ రెస్టారెంట్‌లో టీ కి పిలిచి, తరువాత మెరైన్ డ్రైవ్ వద్ద కూర్చుని – తాను స్వరపరిచిన పాటలను పాడి వినిపించారట. పాటలు నచ్చిన డిస్ట్రిబ్యూటర్లు సినిమాని విడుదల చేసేందుకు ముందుకు వచ్చారట. సినిమా చిత్రీకరణ్ పూర్తయ్యాకా, చునీలాల్ గారికి ప్రైవేట్ ప్రివ్యూ వేసి చూపించారట. సినిమా చూశాకా ఆయన చాలా సేపు మౌనంగా ఉండి, వెళ్ళిపోయేటప్పుడు కొడుకుని అభినందించి, సరైన కెరీర్‍నే ఎంచుకున్నావని మెచ్చుకుని వెళ్ళిపోయారట. ఇది జరిగిన రెండు నెలలకు చునీలాల్ స్వర్గస్థులయ్యారు.

***

1953 జనవరిలో మదన్ – స్వతంత్ర సమరయోధుడు మదన్ లాల్ ధింగ్రా మేనకోడలు షీలా ధింగ్రాను వివాహం చేసుకున్నారు.

‘ఆంఖేఁ’ విజయవంతం కావడంతో మధోష్ (1951), ఆషియానా (1952) చిత్రాలకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. ఇదే కాలంలో సోదరుడు ప్రకాశ్ కోహ్లీ మరణం, షీలా గారికి గర్భస్రావం జరగడం వంటివి మదన్‍ను క్రుంగదీశాయి.

‘ఆషియానా’ సంగీతం రాజ్‍కపూర్‍కు విశేషంగా నచ్చింది. అలాంటి సంగీతం తన సినిమాలకి లభిస్తే, తన సినిమాలు ఎల్లకాలం ఆడతాయని అన్నారు.

ఆషియానా తర్వాత, నిర్మోహి (1952), బాఘీ (1953), ధూన్ (1953), మస్తానా (1954), రైల్వే ప్లాట్‌ఫారమ్ (1955), ఫిఫ్టీ ఫిఫ్టీ (1956), పాకెట్ మార్ (1956) వంటివి మదన్ సంగీతం అందించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. భాయ్ భాయ్ (1956) చిత్రం వాణిజ్యపరంగా ఘన విజయం సాధించింది, దాని పాటలు కూడా చాలా ప్రజాదరణ పొందాయి. భాయ్ భాయ్ విజయంతో మదన్ మోహన్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా ఆయన సగటున సంవత్సరానికి మూడు సినిమాలే చేసేవారు. 1957లో మదన్ ‘దేఖ్ కబీరా రోయా’ అనే లో-బడ్జెట్ చిత్రానికి సంగీతం అందించారు. అందరూ కొత్తవాళ్ళతో తీసిన ఈ సినిమా హిట్ అయింది, హమ్ సే ఆయా నా గయా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే, మేరీ వీణా తుమ్ బిన్ రోయే వంటి పాటలు ఆ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో నిలిచాయి.

‘దేఖ్ కబీరా రోయా’ తర్వాత, ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ (1957) సినిమా సంగీతానికి కూడా ప్రశంసలు దక్కాయి. ‘అదాలత్’ (1958) చిత్రంతో మదన్ మోహన్ శైలి స్థాపించబడింది. జానా తా హమ్ సే దూర్, యూన్ హసరాతోఁ కే దాఘ్, ఉన్ కో యే షికాయత్ హై, జా జా రే జా సాజానా, జమీన్ సే హమేన్ ఆస్మాన్. పర్.. వంటి చాలా గొప్ప మెలోడీలు ఆ సినిమాలో ఉన్నాయి. దీని తర్వాత ఆయన ఎన్నో గజల్స్‌ని స్వరపరిచారు.

ఆ కాలంలో, ఓ.పి. నయ్యర్, శంకర్-జైకిషన్‌లు సినీ సంగీత సమ్రాజ్యాన్ని ఏలుతున్నారు. నిర్మాతలు అటువంటి సంగీతాన్నే మదన్ మోహన్ నుంచి ఆశించేవారు. కొన్నాళ్ళు వాళ్ళ శైలిలో పాటలు రూపొందించినా, చివరికి తన సొంత శైలికే కట్టుబడి తన పద్ధతిలోనే పాటలను సృజించారు మదన్.

సంజోగ్ (1961) చిత్రంలో – వో భూలీ దాస్తాన్, భూలీ హుయీ యాదోన్, చలా హై కహాన్, బదలీ సే నికలా హై చాంద్.. వంటి మెలోడీలను తనదైన శైలిలో సృజించారు.

అన్‍పఢ్ (1962), మన్‍మౌజీ (1962), ఆప్ కి పర్‌ఛాయాయేఁ (1964), గజల్ (1964) – సినిమాల తరువాత మిగతా సంగీత దర్శకులు మదన్ శైలిని అనుకరించసాగారు.

1964లో వచ్చిన ‘హకీకత్’ సినిమాలో సంగీతానికి పెద్దగా స్కోప్ లేదు. కానీ – మై యే సోచ్ కర్ ఉస్కే డర్ సే ఉఠా థా, జరా సీ ఆహత్ హోతీ హై, ఖేలో నా మేరే దిల్ సే, హోకే మజ్బూర్, అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియోఁ – వంటి అద్భుతమైన పాటలను అందించారు.

1964లో ఆయన సంగీతం అందించిన ఎనిమిది సినిమాలు – ఆప్ కి పర్‌ఛాయాయేఁ (లవ స్టోరీ), గజల్ (మ్యూజికల్), హకీకత్ (వార్ ఫిల్మ్), జహనారా (కాస్ట్యూమ్ డ్రామా), పూజా కే ఫూల్ (ఫ్యామిలీ డ్రామా), సుహాగన్ (సోషల్ థీమ్), షరాబీ, వో కౌన్ థీ? (మిస్టరీ) – విడుదలయ్యాయి. ఈ అన్ని సినిమాలోనూ పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘వో కౌన్ థీ?’ లోని ‘నైనా బర్సే రిమ్‌జిమ్ రిమ్‌జిమ్’ ఓ సంచలనం.

తరువాతి సంవత్సరాల్లో రిస్తే నాతే (1965), దుల్హన్ ఏక్ రాత్ కీ (1966), మేరా సాయా (1966), నౌనిహాల్ (1967) సినిమాలలో విలక్షణమైన మెలడీలను అందించారు మదన్ మోహన్.

నౌనిహాల్ (1967) సినిమా కోసం అప్పటి ప్రధాని నెహ్రూగారి అంతిమ యాత్రను చిత్రీకరించి దానికి నేపథ్యంగా మహమ్మద్ రఫీతో పాడించిన ‘మేరీ ఆవాజ్ సునో’ ఒక గొప్ప పాటగా చరిత్రలో నిలిచిపోయింది. మరణానంతరం నెహ్రూ గారి సందేశాన్ని అందించిన పాటగా పరిగణిస్తారు.

1970లో మదన్ మోహన్ స్వరాలందించిన చిత్రం ‘దస్తక్’ విడుదలైంది. తన ప్రతిభను ప్రదర్శించడానికి స్వరకర్తకు పూర్తి అవకాశం ఉన్న మ్యూజికల్ ఆర్ట్ మూవీ అది. బయ్యాన్ నా ధారో, మై రి మైన్ కాసే కహూఁ, హమ్ హై మాతాయ్-ఎ-కుచావో పాటలకి గాను ఆ సంవత్సరానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టాయి.

‘దస్తక్’ – చేతన్ ఆనంద్ గారి ‘హీర్ రాంఝా’ మరో గొప్ప అవకాశం. కైఫీ అజ్మీ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు. కవితాత్మకంగా ఉండే ఈ సినిమాకి సంగీతం అందించడంలో మదన్ ప్రతిభ ద్యోతకమవుతుంది. సంభాషణలు కూడా కవితల్లా ఉంటాయి. మిలో నా తుమ్ తో హమ్ గబరాయే, మేరీ దునియా మే తుమ్ ఆయీ వంటి రొమాంటిక్ పాటలతో పాటు – దో దిల్ టూటే, డోలీ చదలే హీ, యే దునియా యే మెహ్‍ఫిల్ – వంటి మనోహరమైన పాటలను సృజించారు మదన్.

యే దునియా యే మెహ్‍ఫిల్ పాటలో కేవలం నాలుగే చరణాలుంటాయి. ఒక్కో చరణానికి విభిన్నమైన సంగీతాన్ని కూర్చి, వేర్వేరు ఇంటర్‌లూడ్ లను అందించారు. అదొక ప్రయోగమని ఆయన అన్నారు.

కొత్తదనానికి మరో ఉదాహరణ ‘హస్‍తే జఖ్మ్’ (1973). టాక్సీ డ్రైవర్ అయిన హీరో, వ్యభిచారిణి అయిన హీరోయిన్‌ని తన ప్రేమ లోని నిజాయితీ గురించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ‘మ్ జో మిల్ గయే హో’ అనే ఈ పాటని మదన్ వైవిధ్యంగా బాణీ కట్టగా, అత్యద్భుతంగా గానం చేశారు రఫీ.

చివరి రోజుల్లో, మౌసమ్ (1975). లైలా మజ్ను (1976) సినిమాలకి సంగీతం అందించారు. రెండు చిత్రాల కథలు ఆయన శైలికి నప్పాయి. ‘లైలా మజ్ను’లో లత పాడిన ‘హుస్న్ హాజీర్ హై మొహబ్బత్ కీ సజా పానే కో’ చక్కని రొమాంటిక్ మెలోడీ. ‘మౌసమ్’లో, ‘దిల్ ఢూంఢ్‌తా హై’ (హ్యాపీ – సాడ్ – వెర్షన్స్); ‘రూకే రూకే సే కదమ్’ అత్యంత ఆదరణ పొందాయి.

ప్రజాదరణ ఉచ్చస్థాయిలో ఉండగా, కింగ్ ఆఫ్ మెలోడీస్ అనిపించుకున్న మదన్ మోహన్, 51 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. సోదరుడు, అమ్మ లానే ఆయన కూడా జూలై నెలలోనే స్వర్గస్థులయ్యారు. భౌతికంగా దూరమైనా, పాటల రూపంలో ఆయన జనుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here