[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
కపూర్ కుటుంబపు విస్మృత హీరో:
కపూర్ కుటుంబపు హీరో ఒకరు – తన కాలంతో అత్యధిక పారితోషికం తీసుకుని, రాజ్ కపూర్, రణ్‌బీర్ కన్నా ఎక్కువ హిట్స్ ఇచ్చి కూడా – విస్మృతికి గురయ్యాడని తెలుసా?
కపూర్ కుటుంబాన్ని భారతీయ సినీ పరిశ్రమ యొక్క తొలి కుటుంబంగా పేర్కొంటారు. కపూర్ల కంటే అధిక సంపద, అత్యధిక విజయాలు పొందిన కుటుంబాలు మరికొన్ని పరిశ్రమలలో ఉన్నాయి. కానీ కపూర్లు కొనసాగినంత సుదీర్ఘ కాలం మరే కుటుంబమూ కొనసాగలేదు, ఎనిమిది దశాబ్దాలుగా భారతీయ పాప్ కల్చర్ పై వారు చూపించిన ప్రభావానికి ఎవ్వరూ సాటి రారు. కపూర్ కుటుంబంలో చాలామందికి గుర్తింపు లభించి, ప్రసిద్ధులయ్యారు కానీ కొందరు మాత్రం కొద్ది కాలమే ఓ వెలుగు వెలిగి, తర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు. ఆ కుటుంబానికి చెందిన అలాంటి ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
కపూర్ కుటుంబం బాలీవుడ్‌లోకి ప్రవేశించడానికి పృథ్వీరాజ్ కపూర్ దారి చూపారు. ఆయన మొదట 1920ల తొలినాళ్ళలో లాహోర్‌లో, 1928 నుంచి బొంబాయిలో నటించడం ప్రారంభించారు. అయితే, ఆయన తమ్ముడు త్రిలోక్ కపూర్ 1933లో అన్నగారిని అనుసరించి సినిమాల్లో నటించాడని చాలామందికి తెలియదు. 21 ఏళ్ల త్రిలోక్ అదే సంవత్సరం ‘సీత’ అనే సినిమాలో తన అన్నతో కలిసి నటించడానికి ముందు ‘చార్ దర్వేష్’ అనే సినిమాలో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. అది ఆయన మొదటి హిట్. 1930లు మరియు 40వ దశకంలో, ఆయన హిందీ చిత్రసీమలో ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు. కె.ఎల్. సైగల్, అశోక్ కుమార్, కరణ్ దేవాన్, పృథ్వీరాజ్‌లతో పాటు అత్యధిక పారితోషికం పొందిన తారలలో ఒకరు. 1947లో, నూర్ జెహాన్ సరసన నటించిన సూపర్ హిట్ సినిమా ‘మీర్జా సాహిబాన్’తో పరిశ్రమలో నిస్సందేహంగా అగ్ర కథానాయకుడిగా స్థిరపడ్డారు త్రిలోక్ కపూర్.
1930లు, 40లలో ఆయన సాధించిన విజయాలు ఓ స్టార్‌గా ముద్ర వేయడానికి సరిపోతాయి, అయితే త్రిలోక్ కపూర్ తన కెరీర్‌లో మరో విజయవంతమైన దశను 50లలో చూశారు. కానీ విజయం సాధించినప్పటికీ స్టార్‌డమ్ తగ్గింది. 1948 తర్వాత, త్రిలోక్ కపూర్ పౌరాణిక చిత్రాలకు మారారు, అనేక చిత్రాలలో శివునిగా కనిపించారు. రామాయణ్, హర్ హర్ మహాదేవ్, వామన్ అవతార్, శివ పార్వతి వంటి హిట్ సినిమాలలో భాగమయ్యారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన లో-బడ్జెట్ చిత్రాలే. అంటే తన కెరీర్‌లో త్రిలోక్ కపూర్ 30కి పైగా హిట్స్‌లో నటించారు. ఈ సంఖ్య రాజ్ కపూర్ (17), రణబీర్ కపూర్ (11) కంటే ఎక్కువ. కానీ అవి చాలా చిన్న సినిమాలు కావడంతో, త్రిలోక్ కపూర్ తన అన్న కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు సాధించిన స్టార్‌డమ్‌ను పొందలేకపోయారు.
1960ల తర్వాత, త్రిలోక్ కపూర్ సహాయక పాత్రలకి, అతిథి పాత్రలకు మారారు. జై సంతోషి మా, మై తులసీ తేరే ఆంగన్ కీ, దోస్తానా, గంగా జమున సరస్వతి వంటి హిట్ చిత్రాలలో ఆయన చిన్న పాత్రలు పోషించారు. ఆర్.కె. ఫిల్మ్స్ వారి ‘రామ్ తేరి గంగా మైలీ’లో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించారు.
త్రిలోక్ కపూర్ తన 76వ ఏట 1988లో ముంబైలో మరణించారు. వారి చివరి చిత్రం ‘ఆకాంక్ష’, ఆయన మరణానంతరం విడుదలైంది. దానికి ఆయన కుమారుడు విజయ్ కపూర్ దర్శకత్వం వహించారు.
అందాల నటుడు శోభన్ బాబు:
తాను హీరో కాలేకపోయినా, కనీసం చిన్న పాత్రలైనా వస్తాయని ఆశించారు, అలా జరగకపోవడంతో బాధపడ్డారు. లా కోర్సు పూర్తి చేసి ఉంటే బాగుందేదోమో, కానీ మనసు చదువుపై లేదు. మరుసటి సంవత్సరంలో ‘గూఢచారి 116’ లో అతిథి పాత్ర చేశారు. మద్రాసు నుండి వెళ్ళిపోవాలని అనుకున్నారట, కానీ అప్పటికే చాలా డబ్బు పోగొట్టుకున్నామని వారి భార్య ఆపి, ఆయనపై ఆయనకి నమ్మకం కలిగించారు. పోగొట్టుకున్న చోటే, తిరిగి సంపాదించుకోవాలని అన్నారట. తన వంతు కోసం ఓపికగా ఎదురుచూశారు. ‘మనుషులు మారాలి’ (1969) సినిమాలో హీరోగా నటించినా, ఆయన కంటే హీరోయిన్ శారదకు ఎక్కువ పేరు లభించింది.
1971లో ‘తహశీల్దార్ గారి అమ్మాయి’ చిత్రంలో నటించారు. ఈ సినిమానే తనను నటుడిగా, హీరోగా నిలబెట్టిందని ఎప్పుడూ చెబుతుండేవారు. మరుసటి సంవత్సరం 1972లో సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు చిత్రాలను చేశారు. దీని తర్వాత మంచి కథకు ప్రాధాన్యతనిచ్చి మంచి టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. దీని తర్వాత ఆయన నటించిన చిత్రాలు 5 హిట్ కాగా, ఒక చిత్రం ఫ్లాప్ అయింది. అదే ‘అందరు మంచివారే’. ఇది ఓ కన్నడ చిత్రానికి రీమేక్. వీరాభిమన్యు నిర్మాతలే దీన్ని నిర్మించారు. వారి మీద నమ్మకంతో, శోభన్ బాబు కథ ఏమిటో కూడా వినలేదట, సినిమా చేయడానికి అంగీకరించారట. ఆయన నిబద్ధత అలాంటిది. అయితే దీని తర్వాత మాత్రం – భావోద్వేగాలకు లోనుకాకుండా తన వైపు నుండి స్పష్టతతో సినిమాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నారు.
1976 నుంచి తన కుటుంబంతో గడపడానికి ఆదివారం సెలవు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితులతో కలిసి ఉండేందుకు శనివారం కూడా సెలవు తీసుకున్నారు. ఆయనకి మంచి చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. వారిని కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. వారిని వివిధ వృత్తుల్లో కుదురుకునేలా చేసి తనలాగే భూమిపై పెట్టుబడి పెట్టేలా చేశారు. శోభన్ బాబు తన కెరీర్‌లో వెనుదిరిగి చూడలేదు.. మద్రాస్‌లో అత్యంత ధనవంతుడిగా మారారు. నటన విరమించుకున్నాకా సినిమాలకు కూడా దూరంగా జీవించారు. అత్యంత క్రమశిక్షణ కలిగిన ఈ నటుడికి వందనాలు.