అలనాటి అపురూపాలు – 239

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

ప్రముఖ గాయని ఆశా భోస్లే వైవాహిక జీవితం:

ప్రముఖ సినీ నేపథ్య గాయని, ఆశా భోస్లే ఇటీవల 91వ వసంతంలోకి అడుగుపెట్టారు.

దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సినిమాలకు, ఆల్బమ్‍లకు పాడిన సుమధుర గాయని ఆశా భోస్లే.

సంగీతానికి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆమెను దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్‌’ తో సత్కరించింది.

ఆశా 20 కంటే ఎక్కువ భారతీయ, ఇంకా విదేశీ భాషలలో 12,000 పైగా పాటలను రికార్డ్ చేశారు. పర్దే మే రెహ్నే దో, చురా లియా హై, ఉడే జబ్ జబ్ జుల్ఫేం తేరీ వంటి ప్రసిద్ధ పాటలను పాడారు. ఆమె ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చెల్లెలు.

ఒకప్పుడు సినీ నేపథ్య గాయని అవ్వాలనేది ఆమెకి కేవలం ఓ కల కాదు, అత్యంత అవసరం కూడా.

ఇప్పుడామె – అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు.

ఆశా భోస్లే ఇప్పటికీ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన గాయని. అయితే ఆమె వ్యక్తిగత జీవితం ఆమె కెరీర్ వలె విజయవంతం కాలేదు.

ఎవరూ ఊహించని విధంగా, తన జీవితంపై చెడు ప్రభావం చూపిన తప్పుడు వ్యక్తితో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమెది సాంప్రదాయబద్ధమైన కుటుంబం, సంగీత వాతావరణంలో పెరిగారు. కానీ కష్టకాలంలో ఎవరూ ఊహించని అడుగు వేశారు. ఓ వెబ్‍సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె లతా మంగేష్కర్ కార్యదర్శి గణపత్ రావ్ భోస్లేతో బంధాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే.

 

ఆశా తన 31 ఏళ్ల భర్తతో కలిసి జీవించేందుకు మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టారు, ఈ సంఘటన తర్వాత సోదరీమణుల మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఆశాకి కుమారుడు హేమంత్ పుట్టిన తరువాత, ఆమెను మంగేష్కర్ కుటుంబం అంగీకరించింది, కానీ ఆమె భర్త తీవ్రంగా వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 1960లో గణపత్ రావ్ – ఆశానీ, ముగ్గురు పిల్లలను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. దాంతో ఆమె మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించి, ఒకదాని తర్వాత మరొకటి హిట్ పాటలు అందించారు.

తర్వాతి కాలంలో ఆశా తన కంటే 6 సంవత్సరాలు చిన్నవాడైన ఆర్. డి. బర్మన్‌కి దగ్గరయ్యారు. తొలుత ఆర్. డి. బర్మన్ ఆమెకు ప్రపోజ్ చేశారట, కానీ ఆశా మొదట్లో అంగీకరించలేదు. ఆర్. డి. బర్మన్ చాలా సార్లు ప్రయత్నించి ఒప్పించిన తరువాత, ఆశా 80వ దశకంలో ఆయనని వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. ఆర్. డి. బర్మన్ జనవరి 4, 1994న మరణించారు. ఆమె రెండు వివాహాలు విఫలమయ్యాయి.

‘రంగీలా’ సినిమాలో పాటలు పాడటం ద్వారా ఆశా ఘనంగా పునరాగమనం చేశారు. 79 సంవత్సరాల వయస్సులో, 2013లో ఆమె ‘మాయీ’ అనే చిత్రంలో నటిగా అరంగేట్రం చేశారు.

ఈ దిగ్గజ గాయనికి వంట చేయడం చాలా ఇష్టం. ఆమె తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లను నడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here