అలనాటి అపురూపాలు – 240

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త కీరవాణి – కొన్ని ఆసక్తికరమైన సంగతులు:

తమిళం, మలయాళంలో మరగతమణి; హిందీలో ఎం.ఎం. క్రీం అని పిలవబడే కీరవాణి దాదాపు 250లకు చిత్రాలకు సంగీతం అందించారు. 1990లో ‘మనసు మమత’తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు, కానీ ఆ మరుసటి సంవత్సరంలో వచ్చిన రామ్ గోపాల్ వర్మ బ్లాక్ బస్టర్ ‘క్షణ క్షణం’, కీరవాణి కెరీర్‌ నిజంగా మొదలైందనే చెప్పాలి. శ్రీదేవి, వెంకటేష్‌ నటించిన ఆ చిత్రంలోని దాదాపు ప్రతి పాటా సూపర్ హిట్టే.

మహేష్ భట్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘క్రిమినల్’ చిత్రం ద్వారా కీరవాణి హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘తూ మిలే’ పాట ఇన్‍స్టెంట్ హిట్ అయింది. అప్పుడే కీరవాణి, మహేష్ భట్‌లు సన్నిహితమయ్యారు. తరువాత, తన స్వీయ జీవితం ఆధారంగా ‘జఖ్మ్‌’ను రూపొందించడానికి సిద్ధమైనప్పుడు, మహేష్ భట్ ఆ సినిమాకి కీరవాణినే ఎంచుకున్నారు. ఆ సినిమాలోని ‘గలీ మే చాంద్ నిక్లా’ పాటని తనకు ఇష్టమైన వాటిలో ఒకటిగా పరిగణించారు భట్. తరువాత వారిద్దరూ అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేశారు. కొన్నేళ్ళ క్రితం, కీరవాణిని సత్కరించే ఓ టాక్ షోలో పాల్గొనడానికి భట్ హైదరాబాద్‌ వచ్చారు. “అతను ఒక ప్రత్యేక వ్యక్తి,” అని అన్నారు భట్, “అతను జాతీయ సంపద. చిత్రనిర్మాతగా నా ఉద్వేగభరితమైన భావోద్వేగాలకు దగ్గరగా వచ్చిన వ్యక్తి అతను” అన్నారు.

కీరవాణి, రాజమౌళి గార్లు పెద్ద ఉమ్మడి కుటుంబంలో భాగం. తెలుగు సినీ పరిశ్రమ లోని ఇతర ప్రసిద్ధ కుటుంబాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ప్రతి ఆదివారం, కుటుంబంలోని 15 నుండి 20 మంది సభ్యులు ఎవరో ఒకరింట్లో కలుస్తారు – వారిలో ఎక్కువ మంది ఫ్లాట్స్‌లో ఉంటారు; కలిసినప్పుడు అందరూ పేకాట ఆడతారు, జోక్స్, కబుర్లు చెప్పుకుంటారు. సున్నితమైన హాస్యాన్ని ఇష్టపడే కీరవాణి ఈ సమావేశాలకు తరచూ హాజరవుతారు.

ఈ కుటుంబం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందినది, కానీ తరువాతి కాలంలో కర్ణాటకలోని తుంగభద్ర సమీపంలోని అమరేశ్వర క్యాంపుకు వెళ్లి వ్యవసాయం చేయడానికి 300 ఎకరాలు కొనుగోలు చేసింది. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మరో కలను పండించారు. సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చెన్నై వెళ్లారు. అక్కడికి వెళ్లగానే డబ్బు అయిపోయింది. వారి ఆశయం కోసం వారు తమ భూమిని కొంచెం కొంచెంగా అమ్మవలసి వచ్చింది.

‘దత్తా బ్రదర్స్’ అనే పేరుతో తెలుగు నిర్మాతలకు కథలు అందించేవారు. కీరవాణి ఆ కాలంలోని అగ్రశ్రేణి సంగీతకారులకు సహాయకుడిగా వ్యవహరించడం ప్రారంభించారు. నెమ్మదిగా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. కుటుంబానికి స్థిరత్వాన్ని తెచ్చిపెట్టారు. తరువాత రాజమౌళి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు.

మృదుస్వభావి, నిరాడంబరుడు, వినయశీలి అయిన కీరవాణి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. “మానవ సంబంధాలు అతనికి చాలా ముఖ్యమైనవి” – అన్నారు జెమినీ రావు. ఆయన ఓ పెర్క్యూషనిస్ట్, కీరవాణి వద్ద చాలాకాలంగా సహాయకుడిగా ఉంటున్నారు. “ఆయన తన కుటుంబ, వృత్తిపరమైన పరిచయాలను జాగ్రత్తగా చూసుకుంటారు, సంబంధాలను ఎన్నడూ వదులుకోరు. తన విజయాలకు పొంగిపోరు” చెప్పారు జెమినీ రావు.

1990ల తర్వాత కీరవాణితో కలిసి పనిచేయని థంపి ఇలా అన్నారు: “ఆయన వర్క్ ఎథిక్స్ చాలా గట్టివి. తన క్రాఫ్ట్‌ పట్ల అంకితభావంతో ఉంటారు. నేటికీ, మేము మా బంధాన్ని కొనసాగిస్తున్నాం, వాట్సప్ ద్వారా సందేశాలు పంపుకుంటాం. ఆయన సంబంధాలకు విలువనిచ్చే వ్యక్తి, సంబంధాలను కొనసాగించడానికి కష్టపడి పనిచేస్తారు”.

కీరవాణికి అనేక లేబుల్స్ ఉన్నాయి: మేధావి, లోతైన ఆలోచనాపరుడు, అసాధారణమైన వ్యక్తి, ఒంటరి, భక్తుడు. శివభక్తుడైన ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, మంత్రాలయం ఆలయాలని క్రమం తప్పక సందర్శిస్తారు. కన్నడంలో శివ బసవ, తెలుగులో ఓం నమః శివాయ వంటి భక్తి ఆల్బమ్‌లను కూడా విడుదల చేశారు.

టెలివిజన్‌లో టాలెంట్ షోలలో న్యాయనిర్ణేతగా యువ ప్రతిభను పెంపొందించడంలో కీరవాణి దోహదం చేశారు. తన కుమారుడు కాల భైరవకి గాయకుడిగా శిక్షణ ఇచ్చారు. అతను ‘నాటు నాటు’ పాటను రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి పాడాడు. ఆస్కార్ అవార్డుల వేడుకలో లైవ్‍లో ప్రదర్శించారు.

కీరవాణిని పుస్తకాల పురుగు అనవచ్చు. ఎన్నో నవలలు చదివారు. ప్రస్తుతం ఈబుక్స్‌కి మారారు. సాంకేతికతని అందిపుచ్చుకున్న కీరవాణి పరిశ్రమలోని అన్ని తాజా పోకడలను అనుసరిస్తారు. “చక్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు, కీరవాణి స్వయంగా పోర్టబుల్ కీబోర్డ్‌ను తెచ్చుకున్నాడు” అని కీరవాణి స్నేహితుడు, తెలుగు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. “అప్పటి వరకు, సంగీతాన్ని సృజించేందుకు అనేక రకాల వాయిద్యాలు ఉపయోగించేవారు. కీరవాణి సాధారణంగా టెక్నాలజీ పరంగా చాలా ముందుంటాడు” అన్నారు ప్రసాద్.

సంగీతం కాకుండా, రోజంతా కీరవాణి దృష్టిని పట్టుకోగలిగేది ఆహారమేనని ఓ బంధువు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ‘రుచిగా ఉండేది ఏదైనా కీరవాణికి నచ్చుతుంది’ అని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒకసారి, ఒక దర్శకుడు బరువు పెరగకుండా ఉండేందుకు డైట్ చేయమని కీరవాణికి సూచించారట. పెసరట్టులా అనిపించే – ఒక రకమైన తేలికపాటి దోశెని పచ్చి శనగ పిండితో తయారుచేసేది తినమని చెప్పారట. సమస్య ఏమిటంటే, కీరవాణికి అది బాగా నచ్చింది, దాంతో ఆయన బరువు తగ్గే ప్రణాళికలే వదిలేశారట.

స్నేహితుడైన ఓ నిర్మాతతో సమావేశమయ్యారట కీరవాణి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో ఐస్ క్రీం తెచ్చారు. దాని రుచి కీరవాణికి బాగా నచ్చేసిందట. మిగిలిన రోజంతా ఆ ఐస్ క్రీమ్‍నే తిన్నారట.

కీరవాణికి మరో ఆసక్తికరమైన అభిరుచి ఉంది. తన దైనందిన జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తారు. 1979 నుండి, తన వ్యక్తిగత డైరీలో ఒక రోజులో జరిగే ప్రతి చిన్న వివరాలను రాస్తున్నారాయన. ప్రస్తుతం, తన వ్యక్తిగత, వృత్తిపరమైన ట్రాక్‌లను కవర్ చేస్తూ వివరాలను డిజిటల్‌గా రికార్డ్ చేస్తున్నారు. తన జీవితంలో ఎదురైన వివిధ క్షణాలను మూడు లేదా నాలుగు బ్యాకప్‌లలో భద్రపరిచారు, ఏది ఏమైనా వాటిని పోగొట్టుకోవాలని ఆయన అనుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here