[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
కృషి, పట్టుదలతో ఎదిగిన సౌండ్ రికార్డిస్ట్ మంగేష్ దేశాయ్:
కొల్హాపూర్‌లో జన్మించిన మంగేష్, సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కి మేనల్లుడు. కొల్హాపూర్‌లోని రాజారామ్ కళాశాలలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేస్తూ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడంతో, డిగ్రీ పొందలేకపోయారు. వసంత్ దేశాయ్ గారు రాజ్‌కమల్ స్టూడియోలో శాశ్వత ఉద్యోగి కావడంతో పాటు స్టూడియో యజమాని వి శాంతారామ్ గారికి అభిమాన సంగీత దర్శకుడు. తన మేనల్లుడికి సహాయం చేస్తూ, శ్రీ బి ఎమ్ టాటా నేతృత్వంలోని టెక్నికల్ విభాగంలో చీఫ్ రికార్డిస్ట్ పర్మార్ దగ్గర సహాయకుడిగా 1947లో చేర్చారు.
ఉత్సాహవంతుడైన యువ మంగేష్ – ఎలక్ట్రానిక్స్, సౌండ్ ఇంజినీరింగ్, వాటి అనుబంధ రంగంపై ఆసక్తి కారణంగా చలనచిత్ర నిర్మాణంలోని అన్ని విభాగాలలో నిమగ్నమై, ఎన్నో విషయాలు నేర్చుకుని త్వరలోనే పూర్తి స్థాయి సౌండ్ రికార్డిస్ట్ అయ్యారు. ఓసారి జె.బి.హెచ్. వాడియా గారి చిత్రం ‘మధోష్’పై పని చేయాల్సి వచ్చింది. చీఫ్ రికార్డిస్ట్ పర్మార్ గారికి ఒంట్లో బాగోలేదు. అప్పుడు, పర్మార్ గారు ఆ సవాలుని స్వీకరించేలా మంగేష్‌ని ప్రోత్సహించారు. “నేను నా స్వంతంగా ఎప్పుడూ చేయలేదు, కానీ నేను చేయగలనని అనుకుంటున్నాను” అని చెప్పారు మంగేష్. విజయవంతంగా పూర్తి చేశారా పనిని. ఫలితాలతో సంతోషించిన పర్మార్ గారు, తాను పర్యవేక్షక పాత్రకు మారి మంగేష్ గారికి సైట్ ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు.
1951 సంవత్సరంలో మంగేష్ రాజ్‌కమల్ స్టూడియోలో చీఫ్ రికార్డిస్ట్ అయ్యారు. ఆయన ఎప్పుడూ సినిమా ధ్వనికి సంబంధించిన విషయాలలో అప్ టు డేట్‍గా ఉండేవారు. కొల్హాపూర్‌లో దివంగత గాయకుడు వామన్‌రావ్ పాధ్యే వద్ద సంగీతం నేర్చుకున్న మంగేష్, శాంతారామ్ గారి ‘జల్ బిన్ మచ్లీ నృత్య్ బిన్ బిజ్లీ’ (1971) సినిమాతో మొదలుపెట్టి – తొలి దేశీయ స్టీరియోఫోనిక్ ప్రయోగాలతో సంబంధం కలిగి ఉన్నారు అయితే, ఆ టెస్ట్ రికార్డింగ్‌లు గ్రామోఫోన్ రికార్డ్‌ల పాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే, మంగేష్ గారి జీవితాన్ని మలుపు తిప్పినది మాత్రం షోలే సినిమానే. అందులో అన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రికార్డ్ చేయడంతో పాటు, మొత్తం డైలాగ్ ట్రాక్‌ని ప్రామాణికమైన స్టీరియోఫోనిక్ రీప్రొడక్షన్ కోసం డబ్ చేశారు. తర్వాత సాధారణ డబ్బింగ్, రీరికార్డింగ్ కూడా చేశారు.
షోలే విజయం, అందులో ప్రవేశపెట్టిన నవ్యత దేశాయ్ కెరీర్‍ని ఉచ్చస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో, జై మరణానంతరం వీరూ నాణాన్ని గాల్లోకి ఎగరేసినప్పుడు మూడు సెకన్ల తర్వాత తొంభై డిగ్రీలు తిరిగి, నాణెం నేలపై పడినప్పుడు వచ్చే మెటాలిక్ శబ్దం ప్రేక్షకులకు ప్రత్యేకంగా వెనుక వినిపించేది. ఆపై, సినిమా మాయాజాలంతో మోసపోయినందుకు ఇబ్బందికరంగా నవ్వుకునేవారట.
మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో, మంగేష్ దాదాపు 500 చిత్రాలకు పనిచేశారు. ధ్వని కోసం ప్రాణం పెట్టే మంగేష్, “ప్రేక్షకుడికి చలనచిత్ర దృశ్యం సజీవంగా రావాలంటే, అతను తెర నుండి వినే ప్రతి శబ్దం లేదా విజువల్స్‌కు సంబంధించి అతను వినవలసిన ప్రతి శబ్దం ముఖ్యమైనది” అని నమ్మారు.
మంగేష్ హిందీ చిత్ర సీమలోని ప్రతి అగ్ర దర్శకుడితోనూ పని చేశారు. కలకత్తాకి చెందిన నుంచి సత్యజిత్ రే, మృణాల్ సేన్, తపన్ సిన్హా, తరుణ్ మజుందార్ లతో పనిచేశారు. మద్రాసుకి చెందిన, ఆసియాలోనే అతిపెద్ద స్టూడియో కాంప్లెక్స్ అయిన విజయ వాహిని స్టూడియోస్ యజమాని బి. నాగిరెడ్డి గార్లు రీ-రికార్డింగ్ కోసం మంగేష్ వద్దకు తమ దర్శకులను పంపారు.
పనిభారం ఎంతో ఉన్నప్పటికీ, మంగేష్ నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. చిత్తశుద్ధితో తన బాధ్యతలను నిర్వహించారు. చెడ్డ శబ్దాన్ని ఎన్నటికీ అనుమతించలేదు, ఒకవేళ ఆ ధ్వని అత్యవసరమని నిర్మాత పట్టుబట్టినట్లయితే, “మీకు కావాలంటే వేరే చోట చేయించుకోండి, కానీ మీరు నా దగ్గరకు వస్తే, నేను నా వంతుగా అత్యుత్తమ కృషి చేస్తాను” అని ఎప్పుడూ జవాబిచ్చేవారు.
మంగేష్ గారి శిష్యుడు, నేటి ప్రీమియర్ రీ-రికార్డిస్ట్ హితేంద్ర ఘోష్ – మంగేష్ మరణానంతరం రాజ్‌కమల్ స్టూడియోలో బాధ్యతలు స్వీకరించారు. హితేష్ తన గురువు గారి లక్షణాలను గుర్తుచేసుకుంటూ, “సౌండ్ రీ-రికార్డింగ్ సరిగ్గా చేయడానికి, సౌందర్య భావన ప్రాథమికమైనది. దర్శకుడు ఉన్నప్పటికీ, ధ్వనిని ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో ఉంచాలో లేక వదిలేయాలో నిర్ణయం పూర్తిగా రికార్డిస్టులదే. ఆ సన్నివేశానికి ఏమి అవసరమో మంగేష్ గారికి ఖచ్చితంగా తెలుసు. ఆయన డేట్స్ కోసం జనాలు నెలల తరబడి వేచి ఉండేవారు. నేను ఆయన పద్ధతులను, ఆచారాలను కొనసాగిస్తాను” అని చెప్పారు.
మంగేష్ డెబ్బైలలో శిఖర స్థాయికి చేరుకున్నారు. సంవత్సరానికి 60 చిత్రాలకు, సగటున వారానికి ఒకటి చొప్పున రికార్డింగ్ నిర్వహించారు. సినిమా సౌండ్‌కి సంబంధించిన అంశాలతో చిత్ర నిర్మాతలు చాలా అరుదుగా ఆయనతో విభేదించేవారు. రాజ్ కపూర్ గారి ‘రామ్ తేరీ గంగా మైలీ’ మంగేష్ చివరి అసైన్‌మెంట్. గుండె కవాటాలు దెబ్బతినడంతో, మంగేష్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. “ఆపరేషన్ సోమవారం నాడు; ఆయన శనివారం వరకు పని చేస్తునే ఉన్నారు” చెప్పారు ఘోష్. శస్త్రచికిత్స అనంతర సమస్యల వల్ల మంగేష్ కోమాలోకి వెళ్ళారు.
మంగేష్ దేశాయ్ 15 అక్టోబర్ 1985న మరణించారు. ఇప్పటికీ, మంగేష్ దేశాయ్ దేశంలోని అత్యుత్తమ రీ-రికార్డిస్ట్‌గా పరిగణించబడుతున్నారు.