సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
బహుముఖ ప్రజ్ఞాశాలి సుశీలా రాణి పటేల్:
సుశీలా రాణి పటేల్ (1918-2014) శాస్త్రీయ సంగీత కళాకారిణి, నటి, గాయని, వైద్యురాలు, పాత్రికేయురాలు.
~
సుశీలా రాణి 1918లో, సంస్కృతిని ఇష్టపడే కొంకణి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆనంద్ రావ్ క్రిమినల్ లాయర్. కళ, సినిమా, నాటకరంగం, సాహిత్యం, తత్వశాస్త్రంలో చాలా ఆసక్తిని కనబరిచారు. తనకి రచనా నైపుణ్యం తండ్రి నుంచే అబ్బిందని సుశీలా రాణి చెప్పారు. ఆమె తల్లి, కమలాదేవి ఆమెకు సంగీతాన్ని కానుకగా ఇచ్చారు – ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ ఆ బహుమతి విలువ పెరుగుతూ వచ్చింది. తన ఏడవ ఏట, సుశీల అధికారికంగా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. పండిత మొగుబాయి కుర్దికర్, ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వంటి ఉద్దండుల వద్ద సంగీతం అభ్యసించారు. మొగుబాయి కుర్దికర్ తనను ‘ఏక్ పట్టి’ అని పిలిచేవారని, అంటే ‘వన్ టేక్’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో గర్వంగా గుర్తుచేసుకున్నారు. దశాబ్దాల పాటు కచేరీలు, రేడియో కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇంకా రికార్డింగ్‌ల తర్వాత 2002లో సుశీలా రాణికి సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
సుశీలా రాణి కేవలం సంగీతంలోనే పలు విజయాలు సాధించలేదు. ఆమె సైన్స్ లోనూ, న్యాయశాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందారు. తన 60వ ఏట బొంబాయి హైకోర్టులో న్యాయవాది అయ్యారు. సుశీలా రాణికి సినిమా జర్నలిస్ట్‌గా, హీరోయిన్‌గా, ఇంకా బాబూరావు పటేల్ భార్యగా సినిమాలతో అత్యంత సన్నిహిత అనుబంధం ఉంది.
సుశీలా రాణి జనవరి 15, 1942న అనుకోకుండా బాబూరావు పటేల్‌ను కలిశారు. ఆమె బొంబాయి సందర్శిస్తూ ఓ మిత్రుడితో కలిసి డిన్నర్ కోసం – ట్రెండీ వేసైడ్ ఇన్ (కలాఘోడ)కి వెళ్ళారు. వారిద్దరూ ఫిల్మ్‌ఇండియా పత్రికని ఆసక్తిగా చదివే పాఠకులు. దగ్గరలో ఉన్న మరో టేబుల్ వద్ద కూర్చున్న బాబూరావు పటేల్‌ని వెంటనే గుర్తించారు. బాబూరావు పటేల్ మెన్స్ రూమ్‌కి వెళ్ళే మార్గంలో – వారి టేబుల్ దాటినప్పుడు, ఆయన సుశీలా రాణి మిత్రుడిని చూశారు. ఆయన నిజంగానే గొప్ప సినీ విమర్శకుడు, సంపాదకుడు – బాబూరావు పటేల్ అని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. సుశీలా రాణి మిత్రుడు సంకోచించకుండా వెళ్లి పటేల్‌ని తమ టేబుల్‌కి ఆహ్వానించారు.
మర్నాడు ఉదయం బాబూరావు – సుశీలా రాణి ఇంటికి వచ్చి, ఆమెను కారులో ఎక్కించుకుని ఫిలింఇండియా ఆఫీసులు చూపించారు. మధ్యాహ్న భోజన సమయంలో మాటల మధ్యలో, సుశీలా రాణి తాను శిక్షణ పొందిన శాస్త్రీయ గాయకురాలినని బాబూరావుతో చెప్పారు. ఇంత అందమైన యువతికికి ఇన్ని రంగాలలో ప్రతిభ ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసి, తన కోసం ఏదైనా పాట పాడమని అభ్యర్థించారు. సుశీలా రాణి తన సమకాలీనురాలు జ్యోతిక రాయ్ ద్వారా ప్రాచుర్యం పొందిన ‘ఘుంఘట్ కే పట్ ఖోల్’ అనే భజనను ఎంచుకున్నారు. ఆ స్వర మాధుర్యానికి బాబూరావు తన్మయులయ్యారు. అప్పుడు సుశీలా రాణికి 24 ఏళ్లు. బాబూరావు వయసు 38. అప్పటికే ఆయనకి పెళ్లయింది, ముగ్గురు ఎదిగిన పిల్లలున్నారు. అయినా, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు.
తరువాత, ఫిల్మ్‌ఇండియా పత్రిక బాధ్యతని సుశీలా రాణి తీసుకున్నారు కవర్, పజిల్ పోటీలు, సమీక్షలు, ప్రత్యేక కథనాలు, స్టాండ్-అలోన్ ఫోటో ప్లేట్లు, ఇంకా బైలైన్‌లలో కూడా ఆమె తన ముద్ర వేశారు. బాబూరావు పటేల్ – సుశీలా రాణిని అమితంగా ప్రోత్సహించారు. సుశీలా రాణిని నాయికగా పెట్టి, ద్రౌపది (1944), గ్వాలన్ (1946) అనే సినిమాలను తీశారు. సుసాన్ అలెగ్జాండర్‌ను ఒపెరా సింగర్‌గా నిలబెట్టేందుకు – చార్లెస్ ఫోస్టర్ కేన్ చేసిన తప్పుడు, ఆడంబరమైన ప్రయత్నాల వలె ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. అయితే, సుశీలా రాణి ప్రతిభ తక్కువేమీ కాదు. ఈ రెండు చిత్రాలకు బాబూరావు పటేల్ దర్శకత్వం వహించారు.
జూన్ 1942లో సుశీలా రాణి ఫిలింఇండియాలో సబ్-ఎడిటర్‌గా మరియు అనధికారిక ‘జేన్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’గా చేరారు. ఆమె 1981 వరకు బాబూరావుతో కలిసి ఎడిట్ చేయడం, రాయడం కొనసాగించారు, కొన్నాళ్ళకు ‘ఫిలింఇండియా’ (1935-1961) పత్రిక, రాజకీయ అంశాలను చేర్చుకుని ‘మదర్ ఇండియా’ (1961-1981) గా మారింది.
డా. సుశీలా రాణి పటేల్ జూలై 24, 2014న గుండెపోటుతో మరణించారు. చనిపోయే నాటికి ఆమె వయస్సు 96 సంవత్సరాలు, అప్పటికీ చక్కగా పాడుతూనే ఉండేవారు.