అలనాటి అపురూపాలు – 249

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అలనాటి ప్రముఖ దర్శకుడు డి. యోగానంద్:

యోగానంద్ గారు 16 ఏప్రిల్ 1922 న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి, వెంకట దాసు – బందర్ నవాబ్ అని పిలువబడే రజా అలీ ఖాన్ బహదూర్‌ గారి ఎస్టేట్ మేనేజర్. వారు మద్రాసులోని మైలాపూర్‌లోని శాంతోమ్ ప్రాంతంలో నివసించేవారు. వెంకట దాసు మృదంగం వాద్యకారుడు, చక్కని గాయకుడు. యోగానంద్ తల్లి లక్ష్మీబాయి ఉన్నత విద్యను పూర్తి చేశారు, సంస్కృతంలో పండితులు. ఆమె భారతదేశ ప్రాచీన చరిత్రను కూడా అధ్యయనం చేశారు. వివాహం తర్వాత ఆమె బందరులోనూ, బాపట్ల లోనూ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే యోగానంద్ పుట్టకముందే వారు మద్రాసులో స్థిరపడ్డారు. ఈ దంపతులకు 5 మంది పిల్లలు పుట్టారు, కానీ ముగ్గురు మాత్రమే జీవించారు. పెద్ద కుమారుడు కోటేశ్వర రావు భరణి స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా స్థిరపడ్డారు.

యోగానంద్ 2వ కుమారుడు. బాల్యంలో చాలా అల్లరి చేసేవారు. ఎవరూ అదుపు చేయలేకపోయేవారు. ఐదేళ్ల వయసులో, అమ్మగారు చనిపోయారు. తరువాత యోగానంద్‍ను దత్తత తీసుకున్న సుబ్బయ్య అనే వ్యక్తి వద్దకు తిరిగి బందరుకు పంపారు. సుబ్బయ్యకు బందరులో వాచ్ షాపు ఉండేది. ఆయన ధనవంతుడు, పైగా స్వంత ఫోటోస్టూడియో కూడా ఉండేది. ఫోటోగ్రఫీ కూడా చేసేవారు. యోగానంద్ తన 15 సంవత్సరాల వయస్సు వరకు బందరులో ఉన్నారు. అప్పటికి స్కూల్ ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించారు, ఆ తర్వాత రేడియోలో శిక్షణ పొందేందుకు బెంగళూరు వెళ్లారు. ఈ కోర్సు కోసం వెళ్ళేముందు కొన్నాళ్ళు ఫోటో స్టూడియోను నడిపారు. అద్భుతమైన ఫోటోలను, పోర్ట్రెయిట్‌లను ప్రింట్ చేసేవారు.

పాఠశాలలో ఆయన తన స్నేహితులను సమీకరించి ప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. ఆయన భయంకరమైన నరసింహ అవతారం వేసేవారు.  బెంగళూరులో కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగానంద్ తన తండ్రి వెంకట దాసు వద్దకు తిరిగి వెళ్ళారు. 1939లో, ఆయన జెమినీ స్టూడియోకి వెళ్లి సౌండ్ రికార్డిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జీతం తక్కువగా ఉందని, ఉద్యోగంలో చేరలేదు. పైగా తాను సినిమా రంగంలోకి వెళ్లడం తండ్రికి ఇష్టం లేదు, అందుకే తండ్రి జీవించి ఉన్నంత కాలం యోగానంద్ గారు సినిమా రంగంలోకి వెళ్లలేదు.

తన తండ్రి మరణం తరువాత, న్యూ టోన్ స్టూడియోలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా చేరారు. జీత్ బెనర్జీ, రెహమాన్, పురుషోత్తమ్‌లతో కలిసి పని చేశారు. 1943లో గూడవల్లి రామబ్రహ్మం గారు – యోగానంద్ గారి ప్రతిభ ఇక్కడ వృథా అవుతోందని భావించారు. తాము ‘మాయాలోకం’ సినిమా తీస్తున్నప్పుడు ఎడిటర్ మాణిక్యం దగ్గర అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. యోగానంద్‌కి మంచి జీతం కూడా ఇచ్చారు. సినిమా రంగంలో ఇది ఆయన మొదటి జీతం. షూటింగ్ ముగిసే సమయానికి యోగానంద్ మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, అందరిచే ప్రశంసలు పొందారు.

దీని తర్వాత, లంకా సత్యం, లంకా కామేశ్వర రావు గార్లు – ‘తులసిదాస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా యోగానంద్ గారిని సేలం తీసుకెళ్లారు. మూడు సంవత్సరాలు అక్కడే ఉండి వివిధ తెలుగు, తమిళ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఇంకా ఎడిటర్‌గా పనిచేశారు. 1947లో సేలం వదిలి మళ్లీ మద్రాసు వచ్చారు. రేణుక స్టూడియోలో కథా విభాగంలో చేరారు [ఫిల్మ్ మేకింగ్‌లోని వివిధ విభాగాలలో అద్భుతమైన కృషిని గమనించండి]. 1949 వరకు ఇక్కడ పనిచేశారు.

ఆ సమయంలోనే సాధన అనే నిర్మాణ సంస్థ వారు లింగమూర్తి దర్శకత్వంలో ‘సంసారం’ అనే సినిమా తీయాలని అనుకున్నారు. రేణుక స్టూడియో అనుమతి తీసుకుని, యోగానంద్ గారిని లింగమూర్తి దగ్గర అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. సినిమా నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయి, లింగమూర్తి స్థానంలో ఎల్.వి. ప్రసాద్ దర్శకుడిగా వచ్చారు. యోగానంద్‌కి ఎల్‌వి ప్రసాద్‌ బాగా తెలుసు. ‘సంసారం’ సినిమా కోసం పలు విభాగాల్లో చాలా సంతోషంగా పనిచేశారు యోగానంద్. ‘సంసారం’ 1950లో విడుదలై పెద్ద విజయం సాధించింది. దీని తర్వాత యోగానంద్ తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం ‘చంద్రిక’ కోసం అసోసియేట్ డైరెక్టర్‌గా; జగమణి వారి చిత్రాలలో ఎడిటర్‌గా బుక్ అయ్యారు. ‘సంసారం’ పెద్ద హిట్ అయి, దాని నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. అప్పటికి ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించబడింది. తనతో చేరమని ఎల్‌వి ప్రసాద్ యోగానంద్‌ని ఆహ్వానించారు. కృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌లో తమిళం, తెలుగు సినిమాకి పని చేయవలసి ఉన్నందున యోగానంద్ రెండు నెలల సమయం అడిగారు. ఈ చిత్రానికి తనని దర్శకుడిగా సిఫారసు చేయమని ఎల్‌వి ప్రసాద్‌ని అభ్యర్థించారు. ఎల్‌వి ప్రసాద్ వారి కెరీర్‌లో నిస్వార్థంగా చాలా మంది ప్రతిభావంతులను సిఫార్సు చేసారు. యోగానంద్ కోసం అదే చేశారు. దాంతో డి. యోగానంద్ – ఎన్. టి. రామారావు, పద్మిని నటించిన ‘అమ్మలక్కలు’ (తమిళంలో మరుమగల్) అనే తెలుగు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీనిని 1953లో లీనా చెట్టియార్ రూపొందించారు. ఆయన కృష్ణ పిక్చర్స్‌కు అంతరంగిక నిర్మాతగా మారారు. మదురై వీరన్ (1956)తో సహా అనేక బాక్సాఫీస్ హిట్స్ అందించారు, ఈ సినిమా ఎమ్. జి. రామచంద్రన్‌ను కేవలం – అందగాడిగా కనిపించే హీరో కన్నా – ఎక్కువగా అంచనా వేయడానికి బీజాలు వేసింది.

‘అమ్మలక్కలు’ సినిమాలో యోగానంద్ చేసిన పనిని ఇష్టపడి ఎన్టీఆర్ తన ‘తోడు దొంగలు’ సినిమాకు దర్శకుడిగా బుక్ చేసుకున్నారు. ఈ చిత్రంతో యోగానంద్ తక్కువ బడ్జెట్‌లో, చాలా తక్కువ సమయంలో ఒక చిత్రాన్ని ఎలా నిర్మించవచ్చో చూపించారు. భారత రాష్ట్రపతి నుండి మెరిట్ సర్టిఫికేట్, చైనా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్న ఈ చిత్రానికి ఆయన కథ కూడా రాశారు. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘జయసింహ’ లో యోగానంద్‌కి రెండవ అవకాశం ఇచ్చారు, అది బ్లాక్ బస్టర్ అయింది. దీనితో జనాలు వివిధ శాఖలలో యోగానంద్ పనిని గుర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత తమిళంలో కావేరిగా వచ్చిన విజయగౌరికి దర్శకుడిగా మారారు. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. అతను తెలుగు, తమిళ భాషలలో దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు; వాటిలో ఎన్. టి. రామారావు 17 చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. అతని చిత్రాలలో తోడు దొంగలు, ఇలవేల్పు, కోడలు దిద్దిన కాపురం, ఉమ్మడి కుటుంబం, మూగ నోము, జై జవాన్, వేములవాడ భీమ కవి, కథానాయకుని కథ, డబ్బుకు లోకం దాసోహం, జయసింహ, వాడే వీడు, తిక్క శంకరయ్య మొదలైనవి ఉన్నాయి.

యోగానంద్ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి వంటి కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యారు. అదే సంవత్సరం హనుమాయమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు.

డి. యోగానంద్ 28 నవంబర్ 2006 నాడు గుండెపోటుతో మద్రాసులో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here