[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హీరోల సమ స్థాయి పొందిన నటుడు జానీ వాకర్:
ఆయన పేరు స్టార్‌ల సరసన ఉంటుంది, తెర మీదకి ఆయన పాత్ర ప్రవేశించిగానే హీరోలకి చేసినట్టు చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు ప్రేక్షకులు. తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆనాటి ప్రముఖ హీరోలు ఎంత డబ్బు తీసుకునేవారో, జానీ వాకర్ కూడా అంతే మొత్తం తీసుకునేవారుట. హిందీ సినిమాలను నిర్ధారిత మూసలలోనే తీస్తున్నప్పుడు, చాలా ట్రాజెడీ సినిమాలనీ, మెలో డ్రామాతో నిండిన సాంఘిక సినిమాలనీ ఆయన హాస్యమే కాపాడింది. దిలీప్ కుమార్ సినిమాలలో కావచ్చు, లేదా గురు దత్ సినిమాలలో కావచ్చు, శోక దృశ్యాల హోరులో కొట్టుకుపోతున్న ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించారు జానీ వాకర్. మత్తుపదార్థాలకు దూరంగా ఉండే వ్యక్తైన ఆయన తాగుబోతు పాత్రలకు ప్రసిద్ధి గాంచడం వైచిత్రి. ఆయన నటన ఎంత సహజంగా ఉండేదంటే, చాలామంది ఆయన్ని పచ్చి తాగుబోతు అనుకునేవారు. ఆయన పాత్ర చిన్నదైనా, పెద్దదైనా తనదైన శైలిలో సులువుగా నటించి రక్తి కట్టించేవారు. మొదట్లో హిందీ సినిమాల్లో హాస్యనటులను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు తీసే రివాజు లేదు. కానీ జానీ వాకర్ ప్రజాదరణ దృష్ట్యా, ‘ఛూ మంతర్’ (1956), ‘జానీ వాకర్’ (1957), ‘మిస్టర్ కార్టూన్ ఎం.ఎ.’ (1958) వంటి సినిమాలను ఆయన కోసమే తీశారు. ఆయన దిలీప్-రాజ్-దేవ్ త్రయంతో పోటీ పడలేకపోయి ఉండచ్చు, కానీ ఆయన సినిమాలు లాభాలే తెచ్చిపెట్టాయి.
జానీ వాకర్ 11 నవంబరు 1920 నాడు ఇండోర్‌లో బద్రూద్దిన్ జమాలుద్దీన్ కాజీ అనే పేరుతో జన్మించారు. వాళ్ళ నాన్న ఓ మిల్లులో పనిచేసేవారు, ఆయన 1942లో బొంబాయికి మకాం మార్చారు. తొలి సంతానం కావడంతో చిన్ననాటి నుండే జానీ తండ్రితో కలిసి కుటుంబ బాధ్యతలలో పాలు పంచుకున్నారు. ఆరో తరగతి వరకే చదివిన ఆయన ఐస్ క్రీం, స్టేషనరీ, పండ్లు, కూరగాయలు అమ్మడం వంటి రకరకాల పనులు చేశారు. చివరికి బెస్ట్ సంస్థలో బస్ కండక్టర్‌గా ఉద్యోగం సాధించారు. బెస్ట్ సంస్థలో ఉద్యోగం సాధించడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఆ ఉద్యోగానికి కంటి పరీక్ష ఉంటుందని ఆయన తెలుసుకున్నారట. ఆయనకి హ్రస్వదృష్టి ఉండేది. అందుకని కంటి పరీక్షకి ఒక రోజు ముందుగా ఒక కంటి వైద్యుని వద్దకు వెళ్ళి అక్కడి ఐ-ఛార్ట్‌ని బట్టీ బట్టారట. మర్నాడు కంటి పరీక్ష జరుగుతున్నప్పుడు వాటిని చదువుతున్నట్టుగా నటించి, తాను గుర్తుంచుకున్నవి చెప్పేశారట. జానీ ఎప్పటి నుంచో సినిమాల్లో నటించాలని కోరుకున్నారు, అయితే ఆయనకి చిన్నా చితకా పాత్రలు రావడం 1947 నుంచి మొదలయింది. ఓ కండక్టర్‌గా రాబోయే స్టాప్‌ల పేర్లు పలకడంలోనూ, టికెట్లు ఇవ్వడంలోనూ ఆయనకో ప్రత్యేకమైన శైలి ఉండేది. ఓనాడు బెస్ట్ బస్‌లో ప్రయాణిస్తున్న బాల్‌రాజ్ సహానీ గారు దాన్ని చూసి గురు దత్ సినిమాలో అవకాశం ఇప్పించారట. అయితే, ‘హల్‌చల్’ (1951) సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తూ, తోటి నటీనటులను నవ్విస్తూ జానీ వాకర్ బాల్‌రాజ్ సహానీ గారి దృష్టిలో పడ్డారనేది మరో కథనం. వాస్తవం ఏదైనా, ‘బాజీ’ (1951) సినిమా రచయితగా, గురు దత్ ఓ హాస్యనటుడి కోసం చూస్తున్నారని సహానీగారికి తెలుసు. అందుకని ఆ సినిమాలో తాగుబోతు పాత్రకి జానీ నప్పుతారని ఆయనికి అనిపించి, గురు దత్‌తో ఒక సమావేశం ఏర్పర్చారట. జానీ అచ్చం తాగుబోతులానే ప్రవర్తించేసరికి గురు దత్‌కి కోపం వచ్చి బయటకి పొమ్మన్నారట… అప్పుడు సహానీ జోక్యం చేసుకుని అది నటన అనీ, ఆయన తాగి రాలేదని చెప్పారట. దాంతో గురు దత్ సంతృప్తి చెంది ఆ సినిమాలో ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయనే ప్రసిద్ధ విస్కీ బ్రాండ్ పేరిట ఆయనకి జానీ వాకర్ అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం జీవితాంతం కొనసాగింది, జానీ దాదాపుగా గురు దత్ ప్రతీ సినిమాలోనూ నటించారు, ఒక్క ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962) లో తప్ప. ఎందుకంటే, ఏ నవల ఆధారంగా అయితే, ఆ సినిమాని తీశారో, ఆ నవలకి కట్టుబడి ఉండాలని గురు దత్ అనుకున్నారు. జానీ అంటే గురు దత్‌కి ఎంత నమ్మకం అంటే, ఎటువంటి ముందస్తు సన్నద్ధత లేకుండానే జానీని తన సీన్స్‌లో నటించేందుకు అనుమతించారట. ఇది అప్పటి ప్రముఖ నటులకు కూడా లభించని భాగ్యం! హిందీ సినిమాలో హాస్య నటులపై పాట చిత్రీకరణకి ఆద్యులు గురు దత్. అది – ‘ఆర్ పార్’ (1954) సినిమాలోని “అర్రె నా నా రే తౌబా తౌబా” అనే పాటతో మొదలైంది. తరువాత ‘సిఐడి’ (1956) చిత్రంలోని ప్రసిద్ధ గీతం ‘యే హై బొంబాయ్ మేరీ జాన్’ తో ఇది ఒక సంప్రదాయమైపోయింది. మిగతా నిర్మాతలు కూడా ఈ పద్ధతిని అనుసరించారు. ‘ఆర్ పార్’ సినిమా సెట్స్ మీద తన తోటి నటి, కాబోయే భార్య నూర్‌ని మొదటిసారి కలిసారు జానీ. తనలోని ఉత్తమ నటనని తనకిష్టమైన దర్శకుల కోసం జానీ దాచి ఉంచేవారని అంటారు. వాళ్ళ సూచనల మేరకు, బొంబాయి నగరంలోని సామాన్యులను తాను గమనించినంత మేరకు – జానీ తన నటనను ప్రదర్శించేవారు. ఉదాహరణకి ‘ఆర్ పార్’లో నియమాలని పాటించని తెలివైన పార్సీ వ్యక్తిగా రుస్తుం పాత్ర కావచ్చు, ‘సిఐడి’లో జేబులు కత్తిరించలేని జేబుదొంగగా మాస్టర్ పాత్ర కావచ్చు. 1955 నాటి ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ హీరో గురు దత్ వెంటే ఉండే స్నేహితుడు జానీగా పూర్తి నిడివి పాత్ర పోషించారు. ‘ప్యాసా’ చిత్రంలో అబ్దుల్ సత్తార్ మాలిష్‌వాలా అనే ఆయన పాత్ర – ప్రతీ ఒక్కరూ విడిచివెళ్ళిపోయినపుడు కవి విజయ్‌కి సాయం చేసే పాత్ర, ఆయనకి బాగా పేరు తెచ్చింది. రోడ్డు మీద పోయే సామాన్యులను గమనించి వారి హావభావాలను అనుకరించడం జానీ వాకర్‌కి అలవాటు. అయితే, ఆయన కేవలం ముంబయ్యా తరహా పాత్రలే పోషించలేదు. ‘చౌదవీ కా చాంద్’ (1960) చిత్రంలో ఆయన ముస్లిం పెద్దమనుష్యులలో ఒకరిగా నటించి, లక్నవీ వాతావరణంలో ఇమిడిపోయారు.
అయితే గురు దత్ బ్యానర్ బయట చిత్రాలలో జానీ రాణించలేదనేది నిజం కాదు. ఆయన దాదాపుగా 300లకు పైగా చిత్రాలలో నటించారు. ఇతర దర్శకులు, నిర్మాతలతో వారికి తగ్గ విధంగా నడుచుకున్నారు. బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ‘మధుమతి’ (1958) చిత్రంలో జానీ ‘చరణ్‌దాస్’ పాత్రలో సినిమా నడుస్తున్నంత సేపు తాగుతూనే వుంటారు. మత్తుకి బానిసైన వ్యక్తిగా తెరపై ఆయన కనబరిచిన నటనకు గాను ‘ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ అవార్డు లభించింది. ‘షికార్’ (1968) చిత్రంలో ధర్మేంద్ర నౌకరు ‘తేజూ’గా ఆయన కనబరిచిన నటనకు ఆయనకు దశాబ్దం తర్వాత రెండవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఆయన కామెడీ టైమింగ్, బేలా బోస్‌తో రొమాంటిక్ సీన్స్, ఆయన ఉచ్చారణ మెచ్చుకోదగ్గవి. ఈ సినిమాని గురు దత్ సోదరులు ఆత్మారామ్ దర్శకత్వం వహించారు. బి.ఆర్. చోప్రా దర్శకత్వం వహించిన ‘నయా దౌర్’ (1957) చిత్రంలో జానీ బొంబాయికి చెందిన పాత్రికేయుడిగా నటించారు. ఒక మోటారు కారుకి, టాంగాకీ జరిగిన పోటీపై ఆయన వ్యాఖ్యానం చేస్తారు. తొలుత ఆయనకి పల్లెటూరి వస్తువులేవీ నచ్చేవి కావు, కాని గ్రామీణుల ఉద్దేశం అర్థం చేసుకున్నాకా, ఆయన వారి పక్షాన అద్భుతంగా వ్యాఖ్యానం చెప్తారు. ‘మెరే మెహబూబ్’ (1963) చిత్రంలో ఆయన తిరిగి లక్నవీ సంస్కృతిని గొప్పగా ప్రదర్శించి, ఈ ముస్లిం సాంఘిక చిత్రంలో ఉర్దూలో కవితలు కూడా చదివారు. 60వ దశకంలో ఆయనకి ‘షెహనాయి’ (1964), ‘సూరజ్’ (1966), ‘మేరే హుజూర్’ (1968) వంటి చిత్రాలలో కొన్ని గొప్ప పాత్రలు లభించాయి. అక్కడ్నించి అయన ప్రభ మసకబారసాగింది. కాలక్రమంలో నవ్వించే విధానం మారింది, జానీ నటన ప్రేక్షకుల ఊహలకి అందిపోయేది. అదే సమయంలో 1964లో గురు దత్ అకాల మరణం జానీని బాగా క్రుంగదీసింది. గురు దత్ మరణం అంటే జానీకి చక్కని పాత్రలు దూరమవడమే. అయినా ఆయన నటన కొనసాగించారు, ‘గోపి’ (1970), ‘ఆనంద్’ (1970) వంటి సినిమాల్లో రాణించారు. ‘ఆనంద్’ సినిమాలో ఇస్సా భాయ్ సూరత్‌వాలా పేరుతో నాటకాలు వేసే వ్యక్తిగా చిన్న పాత్రను అద్భుతంగా రక్తి కట్టించారు. ఆ పేరుతో నిజజీవితంలో ఒక సౌండ్-రికార్డిస్ట్ ఉండడం విశేషం. ఈ పాత్ర చిన్నదైనప్పటికీ, జానీ అద్భుతమైన టైమింగ్, తల పంకింపు, కన్నుగీటుతో ప్రసిద్ధి చెందింది. బింద్యా గోస్వామి బంధువుగా నటించిన ‘షాన్’ (1980) చిత్రం తర్వాత జానీ సినిమాలు బాగా తగ్గించుకున్నారు. ఈ సినిమాలో ఆయన ‘యమ్మా యమ్మా’ అనే పాటలోనూ కనబడతారు. చాలా ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ నటించిన ‘చాచీ 420’ (1997) చిత్రంలో కమల్‌కి మేకప్ వేసి మహిళగా మార్చే పాత సినీ మేకప్‌మాన్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఆయనకెంతో పేరు తెచ్చింది, ఆయనను మర్చిపోయిన వాళ్ళందరికి ఆయనని తిరిగి గుర్తు చేసింది. సుదీర్ఘకాలం కొనసాగిన వ్యాధి వల్ల ఆయన 29 జూలై 2003 నాడు మరణించారు. ఆయనకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు, అశేషమైన అభిమానులున్నారు. గురు దత్ సినిమా ‘సిఐడి’లోని ‘అయే దిల్ ముష్కిల్ జీనా యహాఁ… యే హై బొంబయ్ మేరీ జాన్’ పాట ఎందరో ముంబయివాసుల స్వప్నాలను ఆవిష్కరించడమే కాకుండా, చనిపోయిన చాలా కాలం తర్వాత కూడా జానీ వాకర్ ప్రాసంగిత ఆ నగరానికి ఎంత ఉందో చెప్తుంది. గురు దత్‌కి అభిమాన నటుడైన జానీ వాకర్ – సినిమా స్క్రీన్‌ప్లేల లోనూ, బాక్సాఫీస్ నెంబర్లలోనూ హాస్యనటులకు స్థానం కల్పించిన అగ్రగామి.
కుటుంబమే ప్రపంచం, ప్రపంచమే కుటుంబం:
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన కూతురు తస్నీమ్ ఖాన్ తండ్రిని గుర్తు చేసుకుంటూ తమ తండ్రికి కుటుంబమే ప్రపంచమనీ, ప్రపంచమే కుటుంబమనీ అన్నారు. “ఆయన ఓ ట్రెక్కర్… అయినా శిఖరాలంటే వ్యామోహం లేదు. హాస్యం అపహాస్యమైన వెంటనే స్వయంగా విరమించుకున్నారు. ‘నేను శిఖరాగ్రానికి చేరాను. ఎవరెస్ట్ పర్వతం అధిరోహించాను, దిగాలి కదా, మరొకరెవరో ఎక్కుతారు’ అని అనేవారు” అని చెప్పారు తస్మీన్. “ఇల్లుంది, కారు ఉంది, పిల్లలున్నారు, టెలిఫోన్ ఉంది… ఇంకేం కావాలి మనకి అనేవారు నాన్న” అని చెప్పారామె. తన తండ్రి జీవితంలో అసంతృప్తి గాని బాధ గాని లేవని, సంతృప్తికరమైన జీవితం గడిపారని ఆమె చెప్పారు. “ఆయన తృప్తి చెందిన మనిషి, కుటుంబం కోసం, అభిమానుల కోసం సంతోషకరమైన జ్ఞాపకాలనే మిగిల్చారు” అన్నారామె. ఇంకా ఆమె మాటల్లోనే… “హాస్యం అశ్లీలమైన రోజుల్లో నాన్న సినిమాలు మానేశారు. మేము పెరుగుతున్నప్పటికే నాన్న బాగా పేరుపొందారు. అమ్మా నాన్నలకి ముగ్గురు మగపిల్లలు – నజీం, కజీం, నాసిర్. ముగ్గురు ఆడపిల్లలం – కౌసర్, ఫిర్‍దౌస్, నేను. బడిలో అందరికీ మేం జానీ వాకర్ పిల్లలమని తెలుసు. కానీ ఇంట్లో మాత్రం మమ్మల్ని అందరు పిల్లల్లానే చూసేవారు. అందుకు మా అమ్మకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అమ్మ (నటి నూర్, మరో నటి షకీలా చెల్లెలు) నాన్నని ‘ఆర్ పార్’ (1954) సినిమా సెట్స్ మీద కలిసారు. వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి, 1955లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత అమ్మ సినిమాలు మానేసి, ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. ‘ఆ కాలం ముగిసిపోయింది’ అనేవారు. ఇంట్లో సినిమాల ప్రస్తావన వచ్చేదే కాదు. మమ్మల్ని ఎన్నడూ సెట్స్‌కి తీసుకువెళ్ళలేదు, పార్టీలకు పంపలేదు. మాకు కుటుంబమే ముఖ్యం. నాన్నకి తన తోబుట్టువులంటే ఎంతో ఇష్టం, వాళ్ళకి వీలైనంత సాయం చేసేవారు. మా కజిన్స్ వచ్చినప్పుడు రాత్రంతా వాళ్ళతో హాయిగా గడిపేవాళ్ళం. అమ్మ చక్కని ఆతిథ్యం ఇచ్చేది. ఎప్పుడూ బల్ల మీద రుచికరమైన పదార్థాలు సిద్ధంగా ఉండేవి. మొదట్లో మేం బాంద్రా లోని ప్యారీ క్రాస్ రోడ్‌లో ఉన్న నూర్ విల్లాలో ఉండేవాళ్ళం. సమీపంలో బస్ స్టాండ్‌కి ‘జానీ వాకర్ స్టాప్’ అని పేరు. నాన్న ఆ కూడలిలో నిల్చుని తన అభిమానులకు అభివాదం చేసేవారు. నేను కాలేజీకి బస్‌లో వెళ్ళొచ్చేదాన్ని. ఇంటికి వచ్చేడప్పుడు కండక్టర్ విజిల్ వేసి ‘జానీ వాకర్ స్టాప్’ అని అరవడం నాకు అబ్బురంగా ఉండేది. నాన్నకి నడవటం, తోటపని లాంటి సరళమైన జీవన విధానం అంటే ఇష్టం. ఒకసారి నేను ఆయనకి కతార్ నుంచి ఆలీవ్ మొక్క తెచ్చాను, ఆయనెంతో ఇష్టంగా పెంచారు దాన్ని. మా తోటలో పెరిగిన బొప్పాస చెట్టు నుంచి పండు కోసి మమ్మల్ని తినమనేవారు. ఆయనకి ఛాట్, పానీ పూరీ, భేల్ పూరీ అన్నా ఇష్టమే. మా ఇంటి దగ్గర సమోసాలు అమ్మే పెద్దాయన ‘సమోసావాలా చాచా’ దగ్గరే సమోసాలు కొనమని నాన్న చెప్పేవారు, అది అతనికి ఉపకరిస్తుందని నాన్న భావన. నాన్నకి ఫిషింగ్ రాడ్స్, టోపీలు సేకరించడం అలవాటు. వాటిని తన సినిమాల్లో వాడేవారు. నాన్నకి స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడల్లా – ఆయన కంటే ముందుగా ఓ పెద్ద టోపీల బాక్స్ కనబడేది, ఆయనే దాన్ని మోసేవారు. నాన్న లైసెన్స్‌డ్ గన్స్ కూడా సేకరించారు. నౌషాద్ గారితో కలిసి వేటకి వెళ్ళేవారు. స్విమ్మింగ్, స్కేటింగ్, సైక్లింగ్ వంటి క్రీడలంటే నాన్నకి బాగా ఇష్టం. సైకిల్ తొక్కుతూ ట్రిక్స్ చేయడం ఆయనకి అలవాటు, వాటిని తన సినిమాల్లో ఉపయోగించేవారు. సీ రాక్ వద్ద రిషీ కపూర్‌తో కలిసి బిలియర్డ్స్ ఆడేవారు. కార్లలో ఆయనకి మెర్సిడెజ్ కాప్రి అంటే ఇష్టం. అదెంత బాగుండేదంటే – ‘మీరెప్పుడైనా దాన్ని అమ్మాలనుకుంటే నాకే అమ్మండి’ అని రాజేష్ ఖన్నా అడిగేంత!
నాన్న ప్రశాంతమైన వ్యక్తి. తన మనుమలు, మనవరాళ్ళతో ఆడుకునేడప్పుడు ఆయనలోని హాస్యం తొంగి చూసేది. ‘అర్రె తేరీ’ అనేది ఆయన ఊతపదం. ఎవరైనా పిలిస్తే వెంటనే పలికేవారు. ‘ఫబీనా కీ మెహ్‌ఫిల్’ అనే రేడియో షోలో ఆయన చతురోక్తులు అభిమానులకి ఇష్టం. అభిమానుల ఉత్తరాల సంగతి నేనే చూసేదాన్ని. నాన్న చెప్తుంటే – ఆయన లెటర్ హెడ్ మీద నేను జవాబులు రాసేదాన్ని. దానికి జోడించిన ఆయన ఫోటో మీద ఆయన సంతకం చేసేవారు. ఆయన గురించి ఎవరైనా రాస్తే, చదవడానికి ఉత్సాహపడేవారు, ‘నా కళ్ళద్దాలు అందుకో’ అని జాగ్రత్తగా చదివేవారు. పాత పాటలను ఇష్టపడేవారు, కొత్త పాటలు అశ్లీలంగా ఉన్నాయనేవారు. టీవీలో కొత్త పాటలొస్తే, వెంటనే టీవీ ఆపేయమనేవారు. మేమేమో వాటి బీట్ బావుందని అనేవాళ్ళం.
ఈద్ పండుగని ఘనంగా జరుపుకునేవాళ్ళం. నాన్న సెట్స్‌కి బిర్యానీ, ఖిచ్‌డీ తీసుకువెళ్ళేవారు. ఒకసారి మధుబాల ఆంటీ, ధర్మేంద్ర గారు, రాజేంద్ర కుమార్ గారు మా ఇంటికొచ్చారు. నాన్న ఖవ్వాలి ఏర్పాటు చేశారు. ఒక్కోసారి ప్రొజెక్టర్ తెచ్చి స్పూల్స్ పై తన పాత సినిమాలు చూసేవారు. ఒక్కోసారి 30-40 టికెట్లు కొని పంపించి, తనవి ఆడుతున్న సినిమాలు చూడమనేవారు. మేమొకసారి ‘ఛూ మంతర్’ (1956) సినిమాకి వెళ్ళాము. ‘గరీబ్ జాన్ కే హమ్ కో’ అనే నాన్న పాట రాగానే ప్రేక్షకులు విపరీతంగా చప్పట్లు కొట్టడంతో మాకేమీ వినబడలేదు. ‘నయా దౌర్’ (1957) చిత్రం ప్రీమియర్ సందర్భంగా సినిమాలో నాన్న కనబడడం ఆలస్యమైందని జనాలు గొడవ చేశారట. ఇంటర్వెల్ తర్వాత ‘మై బంబయ్ కా బాబు’ అనే పాటతో నాన్న కనబడడంతో జనాలు శాంతించారట.
ఒకసారి నాన్న జోకులు చెప్తుండడం విన్న బాల్‌రాజ్ సహానీ గారు, గుర్ దత్ గారిని కలవమన్నారట. ఓ తాగుబోతులా ప్రవర్తించమని చెప్పారట. ఆ విధంగా నాన్నకి గురు దత్ గారి ‘బాజీ’ (1951) సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తాగుబోతు పాత్ర ద్వారా అప్పటి ప్రముఖ విస్కీ బ్రాండ్ పేరిట నాన్నకి ‘జానీ వాకర్’ అని పేరొచ్చింది. నిజ జీవితంలో మద్యం ముట్టని వ్యక్తికి ఆ పేరు రావడం విచిత్రమే. నాన్న అంటే గురు దత్ గారికి ఎంత నమ్మకం అంటే, ఎటువంటి ముందస్తు సన్నద్ధత లేకుండానే తన సీన్స్‌లో నటించేందుకు అనుమతించారట. ఇది అప్పటి గొప్ప నటులకు కూడా లభించని అదృష్టం! ‘జానీ, నువ్విప్పుడు ఈ సీన్ చేసేయ్’ అనేవారట ఆయన. గురు దత్ గారు చనిపోయినప్పుడు నాన్నెంతో క్రుంగిపోయారు. తిరిగి మామూలు మనిషవడానికి చాలా కాలం పట్టింది.
రచయిత అబ్రార్ అల్వీ సాబ్ ప్రతీ సాయంత్రం మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. నాన్నా ఆయనా వాదించుకునేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవారు. దిలీప్ (కుమార్)గారు, మహమ్మద్ రఫీ అంకుల్, నౌషాద్ గారు, మజ్రూహ్ సుల్తాన్‌పురి గారు నాన్నకి ఆప్తమిత్రులు. నౌషాద్ గారి కుటుంబంతోనూ, మజ్రూహ్ సుల్తాన్‌పురి గారి కుటుంబంతోనూ కలిసి మేం పోవై సరస్సులో చేపలు పట్టేవాళ్ళం. రఫీ గారిని నాన్న పాటలు పాడమంటే, ఆయన ఎంతో సంతోషంగా పాడేవారు. ప్రపంచానికి వాళ్ళంతా దిగ్గజాలు కావచ్చు, కానీ మాకు మాత్రం వాళ్ళెంతో నిరాడంబరమైన మనుషులు. ‘వావ్’ అనిపించేది కాదు! నేను రాజేష్ ఖన్నాకి వీరాభిమానిని. ఒకసారి స్కూల్లో ఏదో ఛారిటీ ప్రోగ్రామ్ జరిగితే, విరాళాలు వసూలు చేసేందుకు రాజేష్ ఖన్నా గారిని కలిపించమని నాన్నని అడిగాను. రాజేష్ ఖన్నా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మాకు నచ్చిన మొత్తం రాసుకోమన్నారు. నేనెంతో థ్రిల్ అయి, ఆ చెక్కుని దాచుకుంటానని అన్నాను. కానీ నాన్న, ‘వద్దు! ఒక చిన్న మొత్తం రాసి స్కూల్లో ఇచ్చేయ్’ అన్నారు.
ప్రపంచం దృష్టిలో నాన్నా, మహమూద్ గారు ప్రత్యర్థులు అయి ఉండవచ్చు. కాని నిజానికి వారికి ఒకరంటే మరొకరికి బాగా ఇష్టం. మహమూద్ అంకుల్‌కి నాన్నే ‘సిఐడి’ (1956) చిత్రంలో ఒక చక్కని పాత్ర ఇప్పించారు. కాలక్రమంలో ఆయన ముందుకు దూసుకుపోయారు. మహమూద్ అంకుల్ సినిమాల రిహార్సల్స్‌కి మేం వెళ్ళేవాళ్ళం. ‘పతీ పత్నీ’ (1966) సినిమాలో నాన్న మహమూద్ అంకుల్‌తో కలిసి నటించారు. ఇతర హాస్యనటులు ముక్రీ అంకుల్, ఆఘా అంకుల్ కూడా మా కుటుంబ సభ్యుల వంటి వారే. మారుతి అంకుల్ పిల్లలు మా అన్నయ్యలతో కలిసి చదువుకున్నారు. నూర్ మహ్మద్ చార్లీ గారిని ఆదర్శంగా భావించే నాన్న అశ్లీల హాస్యాన్ని అభినయించలేక, ద్వందార్థాల డైలాగులు చెప్పడం ఇష్టంలేక నటన మానుకున్నారు. అదే సమయంలో ఆయన కెరీర్ మందగించడంతో, హుందాగా విరమించుకున్నారు. కానీ ఆయనలో ఎటువంటి నిస్పృహ లేదు. ‘చాచీ 420’ (1997) చిత్రంలో నటించేందుకు నాన్నని ఒప్పించేందుకు కమల్ హాసన్‌కి చాలా సేపు పట్టింది. నాన్నని ఒప్పించేందుకు ఆయన చెన్నై నుంచి వచ్చారు. 14 ఏళ్ళ విరామం తర్వాత నాన్న మళ్ళీ కెమెరా ముందుకి వచ్చారు.
నాన్నకి మధుమేహం ఉండేది, దానివల్ల నాన్న కిడ్నీలు పాడయ్యాయి. దాంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ‘ఈ యంత్రాలన్నీ నాకు పెట్టి నన్ను మరో పదేళ్ళు బ్రతికించద్దు. ఇంట్లోనే ఉంటూ ఒక్క ఏడాది బ్రతికినా అది చాలు నాకు’ అన్నారు నాన్న. నాన్నని ఇంటికి తీసుకొచ్చేసాక, ఎంతో సంబరపడ్డారు. శరీరం బలహీనమైనా, నాన్న హాస్య స్వభావాన్ని వదలలేదు. ‘నాన్నా, కళ్ళు తెరవండి’ అంటే, ఒక కన్ను మాత్రమే తెరిచి, ‘రెండో కన్ను విశ్రాంతి తీసుకుంటోంది’ అని చెప్పేవారు.
నాన్న మతాచారాలు ఎక్కువగా పాటించేవారు కాదు. ‘నా బదులుగా నా భార్య నూర్ వాటిని పాటిస్తోంది’ అనేవారు. ‘రోజా’ (ఉపవాసం) ఉన్నారా అని ఎవరైనా అడిగితే, ‘రోజూ లానే ఉన్నాను’ అని తమాషా చేసేవారు. 29 జూలై 2003 నాడు ప్రశాంతంగా మరణించారు. ‘అన్నగారు మా అందరికీ నీడనిచ్చిన వృక్షం లాంటి వారు’ అని మహమూద్ గారు నాన్న మరణం తర్వాత అన్నారు.”
“నాన్నే నా హీరో! నాన్నే నా బలం! ఆయనని తలచుకుంటే నాకు విచారం కలగదు. నేను కళ్ళు మూసుకుంటే నాన్న అందమైన జ్ఞాపకాలే మెదలుతాయి…” అంటూ ముగించారు తస్మీన్.