సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
బి.ఎన్.రెడ్డి గారికి సన్మానం:
సినీ ప్రముఖులకు సన్మానాలు జరగడం సాధరణమే. అయితే ఓ సినీ ప్రముఖుడికి సినీతారలంతా కలిసి సత్కారం చేయడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన ఘటనలలో ఒకదానిని గురించి ఈ వారం తెలుసుకుందాం.
1958లో దర్శక నిర్మాత శ్రీ బి.ఎన్.రెడ్డి అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇందుకు మొత్తం సినీ పరిశ్రమ సంతోషించింది. బి.ఎన్.రెడ్డి గారిని గౌరవించడం కోసం మద్రాసులోని విజయ గార్డెన్స్ వేడుక జరిపారు, టీ పార్టీ ఏర్పాటు చేశారు (అయితే బి.ఎన్.రెడ్డిగారి ఈ సన్మానం గురించి ఆయన జీవిత చరిత్రలలో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం). అదే ఏడాది రచయిత నార్ల వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యులయ్యారు. ఆయనే ఈ సన్మాన సభకి అధ్యక్షత వహించారు. నటులు నాగయ్య అందరినీ ఆహ్వానించి స్వాగతోపన్యాసం చేశారు. నాగయ్య బి.ఎన్. రెడ్డి గారి ప్రతిభని ప్రశంసించి, చిత్రపరిశ్రమకు ఆయనందించిన సేవలను కొనియాడారు. రెడ్డి గారు కవీ, నటుడు లేదా గాయకుడు కాకపోయినప్పటికీ, ఆయన కృషి వీరందరి కృషి కంటే గొప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపికకి ఆయన అన్ని విధాలు అర్హులని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్.టి.రామారావు సన్మాన పత్రం చదివి, తెలుగు చలన చిత్ర రంగానికి బి.ఎన్.రెడ్డి జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. ఆ తరువాత ఎస్.వి.రంగారావు గారి సన్మాన పత్రాన్ని రెడ్డిగారికి అందజేసి, అందుకు ఆయన పూర్తిగా అర్హులని ప్రకటించారు. బి.ఎన్.రెడ్డి గారికి సావిత్రి తిలకం దిద్దగా, అంజలీదేవి గంధం పూశారు. జి. వరలక్ష్మి పన్నీరు జల్లగా, అక్కినేని కశ్మీరు శాలువా కప్పి సత్కరించారు.
తాపీ ధర్మారావు, సముద్రాల, కె. సుబ్రహ్మణ్యం, ఖాసా సుబ్బారాఅవు తదితరులు ప్రసంగించారు.
రాజకీయాలు తనకంతగా గిట్టవని బి.ఎన్.రెడ్డి అన్నారు. విలువలని మరువకుండా ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని, ఉన్నత విలువలని కలిగి ఉండాలని ఆయన అన్నారు. వాహిని స్టూడియో నిర్మాణానికి దోహదం చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణ స్వామిని; ఎ. కె. శేఖర్, రామనాథ్, కె.వి. రెడ్డి, నాగయ్యలను ప్రశంసలలో ముంచెత్తారు. తన విజయాలకు వారే కారణమని అన్నారు. రేలంగి వందన సమర్పణ చేయడంతో సభ ముగిసింది. తర్వాత అందరూ టీపార్టీకి హాజరయ్యారు.
అందాల బాల నటుడు మాస్టర్ బాబు:
కొందరు బాల నటులు పెరిగి పెద్దవారైనప్పటికీ, వారి చిన్ననాటి రూపం ప్రేక్షకుల మనసులో నిండిపోతుంది. వాళ్ళని తలచుకోగానే ఆ చిన్నారి రూపమే గుర్తొస్తుంది. అలాంటి బాలనటులలో ఒకరు మాస్టర్ బాబు.