Site icon Sanchika

అలనాటి అపురూపాలు-29

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

వెండి తెర ‘అనార్కలి’ కాలేకపోయిన షెహ‌నాజ్:

సినీరంగంలో కొందరికి కొన్ని పాత్రలు చేజారి, మరొకరికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెడతాయి. ఒక నటికో, నటుడికో అనుకున్న పాత్ర మరొకరికి దక్కి వారు గొప్ప పేరు తెచ్చుకున్న సందర్భాలు అనేకం. అలాగే ‘మొఘల్-ఎ-అజామ్’ చిత్రంలో ‘అనార్కలి’ పాత్ర తన తల్లికి ఎలా దక్కలేదో వివరిస్తున్నారు షెహనాజ్ కూతురు, కవయిత్రి సోఫియా నాజ్.

***

అనార్కలి నాటకం గొప్పగా విజయవంతమైంది. నాటకంలో షెహనాజ్ ప్రదర్శించిన తీవ్ర భావోద్వేగం, అభిలాష గురించే బొంబాయి నగరమంతా మాట్లాడుకుంటున్నారు.  ఆమె అందం, ఆమె సమక్షంలోని ఆకర్షణ అందరినీ కట్టిపడేశాయట. గొప్ప కళాకారులైన తోటి నటీనటులు కూడా వెలవెలబోయారట.  అయితే ఈ నాటకంలో నటించేందుకు అనుమతి ఇవ్వడంలో ఆమె భర్త ఎంతో దూరం ఆలోచించారట. భార్య కీర్తి ప్రతిష్ఠల ద్వారా తనూ ఓ వెలుగు వెలగవచ్చని అనుకుని, నాటకం నడుస్తున్నంత కాలం, ప్రజా కార్యక్రమాలలో పాల్గొనాలనీ భార్యని ఆదేశించారట.

నాటకం ప్రదర్శితమవుతూ అప్పటికి దాదాపు మూడు వారాలు గడిచాయి. అస్సలు తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు ఆమె బాగా అలసిపోయారు. ఆమె డ్రెస్సింగ్ రూమ్ తలుపునెవరో తట్టారు. చేతుల్లో బొకేలు, పూలదండలు పట్టుకుని, ఆటోగ్రాఫు కోసం తలుపుతట్టే అభిమానుల ఆగడాలు ఆమెకు తెలుసు. అన్ని రోజుల పాటు నాటకం ఆడడం ఆమెకి అలసట కలిగించింది, అందుకని డ్రెస్సింగ్ రూమ్ బయట ఎవరున్నా, వారిని పలకరించే మూడ్‌లో లేరామె.

బయట తలుపుని మరింత గట్టిగా తట్టసాగారు. అప్పుడే ఆమె బయట నుంచి ఎహసాన్ రిజ్వీ గొంతు, థియేటర్ యజమాని విజయ్ దాల్మియా స్వరం విన్నారు.

“మేడమ్, దయ చేసి తలుపు తెరవండి. ఆసిఫ్ సాబ్ వచ్చారు. మీతో అత్యవసరంగా మాట్లాడాలట”.

చివరికి షెహనాజ్ తలుపు తెరవగానే ఆమెకి ఎదురుగా – తీక్షణమైన చూపులతో, పెన్సిల్ గీత లాంటి మీసంతో, చెదిరిన కుచ్చు లాంటి జుట్టుతో, ఆందోళనగా సిగరెట్ తాగుతున్న వ్యక్తి కనిపించారు. అమెను చూడగానే, ఆయన సిగరెట్‌కి నేలకి రాసి, దాని పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని చేతులు బాగా చాసి, “అనార్కలీ! ఎట్టకేలకు నిన్ను కనుగొన్నాను… ఇక నిన్ను దేశంలో కెల్లా అందగత్తెగా మారుస్తాను. ‘మొఘల్-ఎ-అజామ్’లో ఆమెకు నువ్వు ప్రాణం పోస్తావు…” అని అరిచారట.

షెహనాజ్ విస్తుపోయారు. ఈ పరిణామాన్ని ఆమె అస్సలు ఊహించలేదు. అయితే కె. ఆసిఫ్ ఎవరో ఆమెకు తెలుసు. అప్పటికే ఆయన సుప్రసిద్ధ దర్శకుడని బొంబాయంతా తెలుసు. చాలా మంది ఉద్దేశంలో ఆ ప్రాజెక్టు మూలన పడింది. మెల్లిగా ఆమె తేరుకుని, “ఆసిఫ్ సాబ్, నేను ఆ సినిమాలో నటించలేను” అని తన అనంగీకారం తెలిపారు.

“నువ్వు చెయ్యగలవు… నాటకంలో నటించావుగా, కాదా? రంగస్థలం దిగ్గజాలు చాలామంది కంటే మెరుగనిపించావు.”

“కానీ సినిమాలంటే… అవి పూర్తిగా భిన్నమైనవి…”

సమాజంలోని తమ శ్రేణుల్లో సినిమాల్లో నటించడం ఆమోదనీయం కాదనే తన మాటను ఆమె పూర్తి చేయలేదు. కానీ ఆమె ఉద్దేశాన్ని ఆసిఫ్ గ్రహించారు. “నన్ను నమ్ము. నిన్ను నా చెల్లెల్లా చూసుకుంటాను. నీ మీద ఏ మచ్చా పడనీయను” అంటూ నాటకీయంగా తన హృదయం మీద తన చేయుంచుకున్నారాయన. ఆమె అంగీకారం తెలిపి, తర్వాత సోమవారం నాడు మోహన్ స్టూడియోస్‌లో స్క్రీన్ టెస్ట్‌కి హాజరవుతానని చెప్పేదాకా ఆయన బ్రతిమాలుతునే ఉన్నారు.

అది జూన్ నెల మధ్య కాలం. ముఖ్యంగా ఆ రోజు బాగా ఉక్కగా ఉంది. అందుకని ఆమె తేలికపాటి షిఫాన్ చీర ధరించారు. అది 1952. ఆమెకి పెళ్ళయి సుమారు ఏడాది కావస్తోంది. తన పొడవాటి కేశాలను ఫ్యాషనబుల్‌గా కురచగా కత్తిరించుకున్నారు. ఉదయాన్నే లేచి కేశాలను ముఖంపై పడేలా ఉంగరాల్లా అమర్చుకున్నారు. ఫోటో సెషన్, స్క్రీన్ టెస్ట్ జరుగుతున్న సమయమంతా ఆసిఫ్ బాగా కంగారుగా ఉన్నారు, ఆమెని సౌకర్యవంతంగా ఉండేలా చూశారు. షూట్ పూర్తయ్యాకా, ఆయన నవ్వి, “బాగా వచ్చింది. ఈసారి ఫుల్ కాస్ట్యూమ్ వేసి మళ్ళీ షూట్ చేద్దాం” అన్నారు.

ప్రొడక్షన్ అసిస్టెంట్ అయిన సోహ్రాబ్ రంగూన్‌వాలా నిరసన తెలిపారు, “ఆసిఫ్ సాబ్, అది సాధ్యం కాదు! పూర్తి స్థాయి కాస్ట్యూమ్ కుట్టించేందుకు సమయం సరిపోదు!” అన్నారు.

దర్శకుడు ఏమీ బాధ పడలేదు. “ఆమె నాటకంలో ధరించిన దుస్తులనే వేసుకోమనండి” అంటూ ఉదాసీనంగా భుజాలెగరేశారు.

“నిజానికి అది కాస్ట్యూమ్ కాదు. అది నా భోపాలి జోడా. దాని పోగులన్నీ నిజమైన వెండి, బంగారంతో తయారైనవి…” అంటూ అభ్యంతరం చెప్పారు షెహనాజ్.

“మరీ మంచిది…. అసలైనవాటికి మరేవి సాటిరావు” అన్నారు ఆసిఫ్.

సెట్‌లో భారీగా ఏర్పాటు చేసిన మొఘలాయి ఆర్చ్‌లు కృత్రిమమైనవే అయినా, తనకి అనుకూలమైన దుస్తులలో ఆమె తళుక్కున మెరిసారు, రాచఠీవితో బాటు సూక్ష్మమైన విషయాసక్తత ప్రదర్శించారు. నాటకంలో తాను పలికిన స్వగతం మాటలని మళ్ళీ అన్నారు. ఆమె మాట్లాడిన స్వచ్ఛమైన ఉర్దూకు, లోపాలు లేని వాక్సరణికి ఆసిఫ్ ముగ్ధులయ్యారు. ఈ రెండు లక్షణాలే ఆమెని అనార్కలి పాత్రకు సరైన ఎంపికగా మార్చాయి..

అయితే మరో పరీక్ష… స్టూడియో పోర్ట్రయిట్స్‌లో ఆమె తన ఫోటోజెనెసిటీని నిరూపించుకోవాల్సి ఉంది. ఆమె క్లోజ్-అప్స్ చూసినప్పుడు, మృదువైన బుగ్గ మీద పక్షిఈకలు ఉంచిన ఫోటో చూసినప్పుడు – ఆసిఫ్ పొంగిపోయారు. ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత తనకు బంగారం దొరికిందని ఆనందించారు.

తన మాగ్నమ్ ఓపస్ కోసం సరైన కథానాయిక కోసం ఆసిఫ్ చేసిన ప్రయత్నాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఆ ప్రాజెక్టు 1946లో స్వాతంత్ర్యం రాక ముందు ప్రారంభమైంది. తొలుత అక్బర్‌గా చంద్రమోహన్, సలీంగా డి.కె.సప్రూ, అనార్కలిగా నర్గీస్‌ను ఎంచుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రవర్తిస్తారనీ, పిచ్చివాడిలా ఉంటారని పేరుపొందిన ఈ దర్శకుడు – చేతిలో కాస్త చిల్లర పైసలతో తిరుగుతూ – వేలాదిమందితో భారత ఉపఖండంలోనే అత్యంత ఖరీదైన సినిమాని తీస్తున్నారప్పుడు.

అప్పటికి కొద్దిరోజుల ముందే ఆయన స్నేహితుడు నాటక రచయిత ఎహసాన్ రిజ్వీ – నాటకంలో అనార్కలిగా నటిస్తున్న షెహనాజ్ నటనని చూడమని ఆసిఫ్‌ని ఆహ్వానించారు. తరువాతి కాలంలో రిజ్వీని ‘మొఘల్-ఎ-అజామ్’ సినిమా రచయితల్లో ఒకరిగా నియమించుకున్నారు. అప్పుడే ఆసిఫ్ కథానాయిక పాత్రకి ‘సురయ్యా’ని ఎంచుకున్నారు. అయితే నాటకంలో షెహనాజ్ ప్రదర్శన చూడగానే – తన సినీ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి సరైన వ్యక్తి దొరికారని ఆయన నమ్మారు.

సెట్స్ మీద తీసిన ఫోటోలను తమ నిర్మాత షాపూర్జీ పల్లోంజీకి చూపించి, షెహనాజ్ కిచ్చేందుకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ సొమ్మును జేబులో ఉంచుకుని, షెహానాజ్ ఇంటికి వెళ్ళి గొంతు సవరించుకుని తలుపు తట్టారు.

విధి విచిత్రం, ఆ రోజే షెహనాజ్ సోదరులు అన్నయ్య అలీం మియా, తమ్ముడు ఘనీ మియా అనుకోకుండా బొంబాయి వచ్చారు. తమ ఊరి జట్టు ‘ది భోపాల్ వాండరర్స్’ ఆడుతున్న హాకీ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. తమ స్టూడియోలో తీసిన ఫోటోలను ఊపుతూ, ఆసిఫ్ లోపలికి ప్రవేశించినప్పుడు వారిద్దరూ టీ తాగుతున్నారు.

పాపం, ఆసిఫ్ గారికి అంతకన్నా దారుణమైన సమయం మరొకటి ఉండి ఉండదు.

ఆమె సోదరుల దిగ్భ్రాంతిని పట్టించుకుకోకుండా, ఊపిరి బిగపట్టి “నువ్వు దేశంలో కెల్లా గొప్ప నటివి అవుతావు” అంటూ ఆమె ఫోటోలను టేబుల్‌పై పరిచారు ఆసిఫ్. సినిమా సెట్‌మీద తమ సోదరి యొక్క వివిధ భంగిమలలో ఫోటోలు చూసేసరికి వారిద్దరూ ఉద్రేకం పట్టలేకపోయారు.

అలీం మియా ఒక ఫోటోని చేతిలోకి తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. నిర్ఘాంతపోయిన ఆసిఫ్ కేసి చూస్తూ, “నీకెంత ధైర్యం” అని అరిచాడు. భీతిల్లిన దర్శకుడి వైపు దూసుకువస్తూ, ఆ సోదరులు “బయటకు పో” అని అరిచారు.

మరో మాట మాట్లాడకుండా ఆసిఫ్ బయటకి నడిచారు.

***

ఈ విధంగా తన తల్లికి ‘మొఘల్-ఎ-అజామ్’ చిత్రంలో ‘అనార్కలి’ పాత్ర ఎందుకు చెయ్యలేదో వివరించారు సోఫియా నాజ్.

జవహర్‌లాల్ నెహ్రూతోనూ, దిలీప్ కుమార్ తోను షెహనాజ్

Exit mobile version