అలనాటి అపురూపాలు-35

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

‘మామ’ మహదేవన్ తొలినాటి జీవితం:

సినీరంగంలో ‘మామ’గా చిరపరిచితులైన ప్రముఖ స్వరకర్త కె.వి. మహదేవన్ తొలినాటి రోజులను ఈ వారం తెలుసుకుందాం.

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం మహదేవన్ (14 మార్చి 1918 – 21 జూన్ 2001) కె. వి. మహదేవన్‌గా సుప్రసిద్ధులైన సంగీత దర్శకులు. వీరు స్వరకర్త, గాయకులు, గీత రచయిత, మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్ర సీమలలో పనిచేశారు. కె. వి. మహదేవన్‌ 1918లో కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లోని కృష్ణన్‌కోయిల్ అనే ప్రాంతంలో జన్మించారు. తండ్రి వెంకటాచలం భాగవతార్, తల్లి పిచ్చయ్యమ్మాళ్. వెంకటాచలం భాగవతార్ స్వయంగా ఓ గొప్ప సంగీత విద్వాంసుడు. తన తండ్రి సంగీత వారసత్వపు ఛాయలో మహదేవన్ పెరిగారు. అప్పట్లో వారుండే నాగర్‌కోయిల్ ప్రాంతం ట్రావెన్‌కోర్ రాజ సంస్థానంలో భాగంగా ఉండేది. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక సంగీత కార్యక్రమం జరుగుతూనే ఉండేది. అది ఏ సంగీత కార్యక్రమమైనా, మహదేవన్ అక్కడికి నడిచి వెళ్ళి శ్రద్ధగా విని, ఆ సంగీతాన్ని మనసులో నిలుపుకునేవారు. నడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేడప్పుడు ఆ సంగీతన్ని హమ్మింగ్ చేస్తూ వచ్చేవారట. భవిష్యత్తులో ఒక స్వరకర్తగా స్థిరపడేందుకు ఈ అలవాటు దోహదపడింది. ఓ సందర్భంలో మహదేవన్ గారే స్వయంగా చెప్పారు – ‘థిల్లానా మోహనాంబళ్’ చిత్రానికి ఆయన అందించిన పాటలలోని నాదస్వరానికి ప్రేరణ చిన్నతనంలో తాను పలు సంగీత కార్యక్రమాలలో విన్న టి.ఎన్. రాజారత్నం పిళ్లయ్, సుబ్రహ్మణ్యం పిళ్లయ్ గార్ల నాదస్వరమేనని!

మహదేవన్ గారి తొలినాటి జీవితం నిజంగానే హృదయాన్ని తాకుతుంది. సినీ పరిశ్రమలో చేరేందుకు ఆయన మద్రాస్ వెళ్లారు. నెలకి 15 రూపాయల జీతంతో వేల్ పిక్చర్స్ వారి వద్ద జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరారు. నాటకాలలో ఆయన ఆడవేషాలు వేస్తూ, కోరస్‌లో పాడుతూ కొద్దిగా డబ్బు సంపాదించేవారు. కానీ త్వరలోనే ఈ రకమైన ఆదాయమూ పోయింది. ఆయన ఒక హోటల్‌లో వెయిటర్‌గా చేరారు… అక్కడ పని చేస్తున్నప్పుడు కేవలం ఒక నిక్కర్, బనీన్ ధరించేవారు. సైకిల్‌పై వెళ్ళి పలు లారీ సర్వీసులకు సమాచారం అందించే ‘మెసెంజర్ బోయ్’గా కూడా పనిచేశారు. ఇవన్నీ కేవలం కడుపు నింపుకోడానికే! తన తొలినాటి జీవితం పట్ల తానెన్నడు సిగ్గు పడనని ఆయన ఓసారి చెప్పారు. అబద్ధాలు చెప్పనంత వరకు, ఒకరిని దోచుకోనంత వరకూ, ఆహారం అడుక్కోనంత వరకూ ఏ పని చేసినా పర్వాలేదు అనేవారు. ఇదే సమయంలో ఒక గ్రామఫోన్ కంపెనీ వారి కోసం టైమింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వాయించేందుకు 12 అణాల జీతంలో ఓ చిరు ఉద్యోగం దొరికింది. ఇలాగే కొలంబియా కంపెనీకి, హెచ్.ఎం.వి. కంపెనీలకి కూడా పనిచేస్తూ పలు వాయిద్యాలు వాయించారు. స్వరకర్త యస్.వి. వెంకటరామన్ వద్ద సహాయకుడిగా పనిచేసే హాస్యనటుడు కొళత్తుమణితో పరిచయం కలిగింది. తరువాత ఆయన టి. ఎ. కళ్యాణ్ గారి వద్ద, తెలుగు సంగీత దర్శకులు ఓగిరాల రామచంద్రరవు వద్ద సహాయకుడిగా పనిచేశారు. అప్పట్నించి సేలం మోడరన్ థియేటర్ల వారి పలు సినిమాలకు సంగీత విభాగంలో పనిచేశారు. ఆయన మొదటి సినిమా ‘మనోన్మణి’ (1942). ఐతే పేర్లలో – సంగీతం – ‘కల్యాణం ఆర్కెస్ట్రా’ పేరిట వేశారు. వారి తదుపరి సినిమా ఆనందన్/అగ్ని పురాణ మహిమ. ఈ సినిమా సంగీతపు క్రెడిట్ జి. రామనాథన్‌తో పాటు ‘కల్యాణం ఆర్కెస్ట్రా’కి దక్కింది. మహదేవన్ అక్కడ్నించి వెనుదిరిగి చూసుకోలేదు.

తమిళ చిత్ర రంగంలో మహదేవన్‌ని ‘తిరై ఈసై తిలగమ్’ (సినీ సంగీత దర్శకుల గర్వకారణం Pride of Cine Music Directors) అనేవారు. 1942 నుంచి 1993 వరకు దాదాపు 50 ఏళ్ళకు పైగా ఆయన సినిమాలకు సంగీతం అందించారు. కె.వి. మహదేవన్ సంగీతంలో లయ (రిథమ్) ప్రధానంగా ఉండేది. అందుకే ఆయన్ను ‘udukkadi mannan’ అనేవారు. ఆయన ఉపయోగించే వాటిలో ఘట సంజరి వంటి సమాఘాతపు వాయిద్యాలు (percussion instruments) ఎక్కువ ఉండేవి. ఆయన వద్ద ఓ అద్భుతమైన తబలా కళాకారుడు రామలింగం అని ఉండేవారు. ఈయన తర్వాత ఎం.ఎస్. విశ్వనాథన్ వద్ద, ఇళయరాజా వద్ద పనిచేశారు. ఒకసారి మద్రాసులో మహమ్మద్ రఫీ కచేరి జరిగింది. ఆ కచేరీలో రామలింగం తబలా వాయించారు. ఆయన ప్రతిభకి ముగ్ధులైన రఫీ రామలింగాన్ని తనతో బొంబాయి తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ రామలింగం ‘మామ’తోనే ఉంటానన్నారు.

ఓ గొప్ప సంగీతదర్శకుడి ప్రతిభకి చిహ్నం – ఏ పాటకైనా బాణీలు కట్టడం. కె. వి. మహదేవన్ ఏ గీత రచయితనీ పాటని తిరిగి రాయమని అడగలేదు. ప్రతీ గీతంలోనూ ఒక బాణీ ఉంటుందని, దాన్ని గుర్తించడమే స్వరకర్త పని అని ఆయన ఎం.ఎస్. విశ్వనాథన్ గారితో అనేవారట.

మహదేవన్ సహాయకుడు పుహళేంది. ఆర్కెస్ట్రాని నిర్వహించడం, గాయనీ గాయకులకు పాట నేర్పించడం పుహళేంది చూసుకునేవారు. పుహళేందికి, మహదేవన్‍కి మధ్య గొప్ప అవగాహన ఉండేది.

ఓసారి ఓ వ్యక్తి మహదేవన్ వద్దకు వచ్చి, “మీరు కేవలం బాణీ కడతారనీ, మిగతావన్నీ పుహళేంది చూసుకుంటారని విన్నాను. నిజమేనా?” అని అడిగితే, “తప్పు. నేనేమీ చేయను…. అంతా పుహళేందే చేస్తాడు” అని మాటకి మాట అందించారట.

ఒకానొక కాలంలో సినీసంగీతం వల్ల శాస్త్రీయ సంగీతం నష్టపోతుందని భావించేవారు. ఆ సమయంలో మహదేవన్ ‘శంకరాభరణం’ సినిమాకి సంగీతం అందించి, ఎందరినో శాస్త్రీయ సంగీతం వైపు మళ్ళించారు.

స్వరకర్త గంగై అమరన్ (ఇళయరాజా సోదరుడు) ఓ ఫంక్షన్‌లో ఇలా చెప్పారు – “జి. రామనాథన్, కె.వి.మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ వంటి ఘనులు తారు రోడ్డు వేశారు. దానిపై డైవర్ల వంటి మాలాంటి సంగీత దర్శకులం వేర్వేరు కార్లను నడుపుతున్నాం” అని.

మహదేవన్ సంగీతం సమకూర్చిన చిత్రాల పాక్షిక జాబితాను వికీపీడియాలో చూడవచ్చు.

https://en.wikipedia.org/wiki/K._V._Mahadevan


భక్తిరస డాక్యుమెంటరీ ‘శ్రీ వెంకటేశ్వర వైభవం’ రూపకర్త:

తిరుమల అనేకమంది ఆరాధ్య ప్రదేశం… స్వామివారి భక్తులకు కొంగు బంగారం. తిరుమలలో జరిగే కార్యక్రమాల గురించి, స్థల పురాణం గురించి, దేవస్థానంలో జరిగే నిత్య, విశేష పూజల గురించి, పలు రకాల ఉత్సవాల గురించి భక్తులకు తెలియజెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ‘శ్రీ వెంకటేశ్వర వైభవం’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ భక్తిరస డాక్యుమెంటరీ రూపకర్త శ్రీ పాలడుగు దుర్గా ప్రసాద్ గురించి ఈ వారం తెలుసుకుందాం.

పాలడుగు దుర్గా ప్రసాద్ స్వస్థలం బెజవాడ. ఆయన ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనను ఓ డాక్టరుగానో, ఇంజనీరుగానో చూడాలనుకున్నారు. అయితే ఆయన మనసంతా సినీ పరిశ్రమ మీదనే ఉండేది. ప్రముఖ నటులు ఎన్.టి.రామారావుని కలుసుకుని, సినిమాల మీద తన అభిప్రాయాలను, తానేం చేయాలనుకుంటున్నది వెల్లడించారు దుర్గా ప్రసాద్. ఆయన అభిప్రాయాలు, ఉద్దేశాలు ఎన్.టి.రామారావుకి నచ్చడంతో, తన సినిమా ‘సీతారామ కల్యాణం’కు సహాయ దర్శకునిగా పనిచేసేందుకు అవకాశమిచ్చారు. దర్శకులు ప్రత్యగాత్మ వద్ద సహాయకుడిగా చేరి, ఆయనకు ‘చిలకా గోరింక’, ‘అత్తగారు కొత్త కోడలు’ సినిమాలకు సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ‘ప్రేమకానుక’, ‘తాళిబొట్టు’ చిత్రాలకు కూడా దర్శకత్వ విభాగంలో సహాయమందించారు. ఆ సమయంలో డాల్టన్ ఫిల్స్మ్ అధినేత గుళ్ళపల్లి నాగేశ్వరరావు తితిదే వారి నుంచి నాలుగు రీళ్ళ ‘వెంకటేశ్వర వైభవం’ తీసుకుని, దానిని పూర్తి స్థాయి డాక్యుమెంటరీగా రూపొందించవల్సిందిగా దుర్గా ప్రసాద్‌ను కోరారు. ఆ పవిత్రమైన ఆలయం గురించిన సంపూర్ణ సమాచారం కోసం, అక్కడి సేవలపై అవగాహన కోసం ప్రసాద్ విస్తృతమైన పరిశోధన జరిపారు, పలు గ్రంథాలు అధ్యయనం చేశారు.

ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్టు కోసం మహామహులు పనిచేశారు.

రచన: శ్రీపతి దత్తాత్రేయ శర్మ

వ్యాఖ్యాత: కొంగర జగ్గయ్య

సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, ఏడిద కామేశ్వరరావు

నేపథ్య గానం: ఘంటసాల, బాలమురళీకృష్ణ, పి. సుశీల, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.లీల, వసంత, గోపాలరత్నం

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

సినిమాటోగ్రఫీ: కె.ఎస్. ప్రసాద్

ఎడిటింగ్: నరసింహా రావు

పబ్లిసిటి డిజైన్స్: ఈశ్వర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుళ్ళపల్లి నాగేశ్వరరావు

పర్యవేక్షణ: యం. చంద్రమౌళి రెడ్డి

దర్శకత్వం: పి. దుర్గా ప్రసాద్

సమర్పణ: తిరుమల తిరుపతి దేవస్థానం

విడుదల: 1 ఆగస్టు 1971

ఈ డాక్యుమెంటరీ ఘన విజయం సాధించింది. దర్శకుడిగా దుర్గా ప్రసాద్‌కి చక్కని గుర్తింపు వచ్చింది. ఆ రోజుల్లో ఈ డాక్యుమెంటరీనీ ఎంతో మంది భక్తి శ్రద్ధలతో వీక్షించేవారు. బాగా హిట్ కావడంతో దీనిని విసిఆర్ రూపంలో కూడా తెచ్చారు. ప్రస్తుతం ఇది యూ-ట్యుబ్‌లో అందుబాటులో ఉంది. మొదటి భాగం లింక్ ఇస్తున్నాను.

https://www.youtube.com/watch/WB1Ts7g0CUo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here